1930 లో జన్మించిన రాఫెల్, వెనిజులా లో ప్రఖ్యాత కవి. వెనిజులా విశ్వవిద్యాలయంలో స్పానిష్, నార్త్ అమెరికన్ కవిత్వాలను బోధించి అక్కడే ఉద్యోగ విరమణ చేసిన ప్రొఫెసర్. కవిత్వం, సాహిత్య సాంస్కృతిక వ్యాసాలతో డజనుకు పైగా పుస్తకాలు రచించాడు. ఫ్రెంచ్, ఇటలీ, ఇంగ్లిష్ వంటి అనేక భాషలలో అతని రచనలు అనువాదం అయ్యాయి. ఆయా దేశాల ఆహ్వానాలు మేరకు యూరప్, నార్త్ అమెరికా దేశాలు అన్నింటిలో కవిత్వం చదివాడు. వెనిజులా దేశ జాతీయ సాహిత్య పురస్కారంతో పాటు, అమెరికా, మెక్సికో వంటి అనేక దేశాలు యిచ్చే అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నాడు.
వెనిజులా దేశ కమ్యూనిస్టు పార్టీలో చురుకుగా ఉండేవాడు రాఫెల్. వెనిజులా దేశం మార్కోస్ నియంతృత్వంలో నలిగిపోయిన కాలంలో జైలు జీవితం గడపడమే కాకుండా, దేశబహిష్కరణ శిక్షకు గురై, 1957 వరకు ట్రినిడాడ్ లో తలదాచుకున్నాడు.
శుద్ధి చేసిన మాంత్రిక భాషతో వాస్తవ ప్రపంచపు రహస్యాలని కవిత్వంలో ఆవిష్కరించే కవిగా రాఫెల్ ని పేర్కొంటారు అతని విమర్శకులు
//కవిత్వ కళ //
ప్రతి పదం తనను తాను వ్యక్తం చేసుకోవాలి
అది ఒక భూకంపాన్ని తట్టుకుని నిలబడినట్టు ఉండాలి
హృదయ స్పందనను సొంతంగా నమోదు చేస్తున్నట్టు ఉండాలి
నేను దానికి అందమైన అబద్ధాల నగలను అలంకరించలేను
సందేహాస్పద వర్ణాలను అద్దలేను
మెరుపులను జోడించలేను
ప్రతి పదం నన్ను నేను వినేలా చేయాలి
మనం ఇక్కడ నిజం చెప్పడానికే బతికున్నాము
నిజంలా ఉందాము – నిజమే చెబుదాము
నాకు భయంకరమైన నిజాలు కావాలి
నేను తప్పు చేశానని తెలిసినపుడు వొణికిపోతాను
నేను నా మాటల బరువును భరించాలి
నేను వాటిని ఎంతగా స్వాధీనం చేసుకుంటే
అవి నన్ను అంతగా స్వాధీనం చేసుకుంటాయి
నేను మీకు తెలిసి ఉంటే
నేను గమనించని నా అబద్ధాన్ని నాకు చెప్పండి
నా మోసాన్ని వేలెత్తి చూపించండి
నా ద్రోహాన్ని కొట్టి చెప్పండి
నేను మీకు రుణపడి వుంటాను
నా నేత్రంగా మారండి
రాత్రులలో నా కోసం కాపు కాయండి
నా మీద నిఘా పెట్టండి
నన్ను పరీక్షించండి
నన్ను కదిలించండి
//శాంతి ఒప్పందం //
కవితా ! మనం ఒక ఒప్పందానికి వొద్దాము
నీకు యిష్టం లేని దానిని చెప్పమని ఒత్తిడి చేయను నిన్ను
నేను కోరుకున్నది చేయడానికి నీవు వెనుకాడవు
మనం చాలా గొడవపడ్డాము
నేను సందేహించనివన్నీ నీకు తెలిసికూడా
నా ప్రతిరూపంగా వుండాలని ఎందుకు అంత పట్టుదల ?
నా నుండి విడివడి స్వేచ్ఛగా వుండు
పరుగెత్తు – వెనక్కు తిరిగి చూడకుండా
మరీ ఆలస్యం కాకముందే పారిపో
ఎప్పుడూ నన్ను దాటిపోతావు నువ్వు
నిన్ను నడిపించేదానిని ఎట్లా చెప్పాలో నీకు తెలుసు
నాకు తెలీదు
ఎందుకంటే, నీవు నీకంటే గొప్పదానివి
నేను కేవలం నీలో గుర్తింపును వెదుక్కునే సామాన్యుడిని
నేను నా వాంఛాస్థలిని తీసుకుంటాను
నీకు అటువంటిదేమీ లేదు
నీవు కదిలించే చేయి వంక చూడకుండా
నీ గమ్యం వైపు సాగిపోతావు
గమ్యంలో నీవు నిటారుగా మొలకెత్తినపుడు
నిన్ను తన సొంతమని భ్రమిస్తుంది ఆ చేయి
నీ దారిలో వెళ్లేలా కవిని ఒత్తిడి చెయ్యి
వాడికి ఎట్లా దాక్కోవాలో
కొత్త దానిని దాచిపెట్టి పేదవాడిగా
ఎట్లా మిగిలిపోవాలో మాత్రమే తెలుసు
వాడు అరిగిపోయిన రికార్డులనే వినిపిస్తాడు
కవితా !
నన్ను నీ నుండి దూరంగా పెట్టు
**