1.
కరగాలి, కరిగి నీరవాలి!
నీరు నదవ్వాలి లోపలి మలినాలన్నీ
ప్రవాహంలో కొట్టుకుపోవాలి!!
ఈ ప్రవాహం చేరవలసింది చివరికి
స్నేహ సముద్రంలో కి!2
కలత తో తడి నిండిన,
కంటిని తుడవడానికి
మెత్తని పత్తి లాంటి
చేయి ఒకటి కావాలి!!3.
నీలాంటి వాళ్ళ వల్లే
నేనూ ఉన్నానిపిస్తుంది
మట్టితో తయారైన దేశంలో
మనసుతో తయారైన మనుషుల మధ్య
నేనున్నట్టు అనిపిస్తుంది
ఆ మట్టి సువాసనే నాలో హృదయం లా
కొట్టుకుంటున్నట్టు అనిపిస్తుంది
బతుకు బండికి ఇరుసు స్నేహమే !4.
నేను నిలబడ్డ
నేలమీదే నువ్వూ నిలబడ్డావు
ఒకే వసంతం పలకరిస్తుంది నిన్నూ నన్నూ-
తొలకరిలో భూమి విడిచే మట్టి సుగంధం
స్నేహం5
నాలాంటి వారి మీద నిజానికి వసంతం
కూడా గాయాలనే వర్షిస్తుంది
బతుకు పోరాటానికి కాలం ఉంటుంది కానీ
రుతువులెలా ఉంటాయి?!
గాయపడిన నా రుతరహిత కాలం
నొప్పిని దేహంగా తొడిగినప్పుడు
చికిత్స చేసే వైద్యం స్నేహం6
నీవూ నేనూ
ఒకే గూటి పక్షులం
ఒక లాంటి రెక్కలతో
ఒకే ఆకాశం కింద ఎగురుతున్న వాళ్ళం
ఒకే దేశపు నేల వెన్నెలని
ప్రాణంగా ధరించిన వాళ్ళం
నన్ను ఒకలాంటి ద్వైదీభావంలోకి నెట్టి
నన్ను నేనే అపనమ్మకంగా చూసుకునేలా
నిలబెట్టిన ద్వేష దర్పణంలో మాయమై పోతున్న
నా జీవన దృశ్యకాలాల్నీ స్పష్టంగా చూడాలంటే
నిస్పాక్షికమైన దృష్టి ఉన్న
నీలాంటి స్నేహితుడి తోడు కదా కావాలి
మిత్రుడి చూపు దృశ్యంలోపలి దు:ఖాన్ని
చూడగలిగే టెలిస్కోపు
7
నీ స్నేహపు పేషిలో
నా అస్థిత్వానికి గౌరవం లభిస్తుంది
సహజ మిత్రత్వం మలయమారుతంలా
నీ నుండి నాలోకి
ప్రసరించినపుడు మాత్రమే
నేనూ మనిషినన్న భావన కలిగి
మనసు సంతోషపు రెక్కల
పంకాలను విసురుకుంటూ
చల్లబడుతుంది.
ఈ గుండె తడి సముద్రం అవుతుంది
అలలు అలలుగా నా మూర్తిమత్వం
నీ మూర్తిమత్వం లోకి ప్రవహిస్తుంది8
కలుషితమైన మత వాతావరణం
మానవకంకాళాలతో గోడలు నిర్మిస్తూ
మనిషి రుధిరాన్ని పానీయంలా పీల్చుతూ
చేయని నేరపు బోనులలో ఒక జాతిని నిలబెడ్తూ
భయవిహ్వాలతను ఇంకో జాతి యువకుల చేతిలో ద్వేషాయుధంగా పెడుతున్న
విధ్వంసకర సందర్భం కదా మిత్రుడా ఇది
ఈ దేశానికో భవిష్యత్తునిచ్చే
భూమిక మన స్నేహమే కావాలి
నిప్పుల వర్షం కురుస్తున్నపుడు
వానగొడుగై అడ్ఢుపడే సహచరుడు కదా కావాలి
నీ మతమూ నా మతమూ
వ్యక్తిగతాలుగా మిగిలి
మైత్రి ఒక్కటే
ఈ దేశపు శిరస్సు మీద
నెలవంకలా చేరిపోవాలి…
ఈ దేశపు
వైవిధ్యాన్ని వైభవంగా చూడగల
నేత్రాలం…
ద్వేష దాహంతో వివేచన కోల్పోయిన
వారందరికీ ఆదర్శం కావాలి మన స్నేహం
Excellent
థ్యాంక్యూ
అవును, కరగాలి. కరిగి నీరవాలి.