నా భాషలో ఇక నామవాచకం లేదు!

ఇది యుద్ధం కదా ! అంతా కనురెప్ప పాటే
ముంచెత్తిన మౌనం, ఉబికిన దుఃఖం
ఊపిరాడనివ్వని జ్ఞాపకం. సమస్తం!
నేనిప్పుడు తుఫానుల దగ్ధ నిష్క్రమణను చూస్తున్నాను.


ఇది ద్రోహకాలం కదా ! ఓ విశ్వాసం పిగులుతుంది. నిలువెల్లా నమ్మక ద్రోహం చేసిన గాయాలతో చరిత్ర సొమ్మసిల్లిపోతుంది. ఏ క్షణంలోనైతే సంభాషణ చిట్లిపోయి మాట మూగబోయి విషాదమై పోతుందో, ఏ క్షణంలోనైతే జీవితం నల్లబారి రాత్రవుతూ నడుస్తుందో – ఖచ్చితంగా ఆ క్షణంలోనే ఓ కరకు గాయాన్ని ఈ నేల మీద సంతకం చేసి పోతుంది నెత్తుటి మరక. నాదైనదేదో నానుంచి తెగిపోయింది. అదిప్పుడు నా శ్వాస మీద రేపటి వెలుతురు శాసనాన్ని చెక్కుతుంది.

నేనిప్పుడు వేయి తుఫానుల మౌన ఆవిష్కరణను చూస్తున్నాను.

అసలక్కడేం కాదనకుంటాం కానీ వాస్తవానికి అంతా అక్కడే వుంది. పూలు, వాన, కన్నీళ్ళూ, కవిత్వం, నెత్తుటి మడుగుల్లో విరబూసిన జీవితం తాలూకు సజీవ స్పర్శ – అంతా అక్కడే వుంది. వాళ్ళ బిగి కరచాలనాల కౌగిళ్ళలోనే, కళ్ళల్లో సుడి తిరిగిన కలల తడి చెమ్మల్లోనే, త్యాగాల చాళ్ళు తీసి ఊపిరిని విత్తనాలు చేసి విరజిమ్మిన బ్రతుకు సేద్యంలోనే సమస్తం వుంది. అదీ జీవితం. అసలదే జీవితం. ఆ జీవితం ముందు శిరసెత్తిన ఈ మట్టి వినమ్రంగా ప్రణమిల్లుతుంది.

బహుశా ఇక్కడకు వాళ్ళు గాలిలా వచ్చుచుంటారు. కలగాపులగంగా పెనవేసుకుపోయిన సముద్రపు హోరు, కొండల నునుపు, కంఠ నాళాలు విరజిమ్ముతున్న యుద్ధ పరిమళం. బహుశా ఇక్కడకు వాళ్ళు గంధక గానంలా వచ్చుచుంటారు. వాళ్ళ రాకతో నా పురాతన భాష శిథిలమైపోయింది. వాళ్ళ అడుగుల చప్పుడు పర్వత పాదాల్లో మొలకెత్తిన లేత పచ్చికకు ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. వాళ్ళ వొలికిన ఊపిరి వొడలిన నేలకు ఉక్కు ఋతువునిచ్చింది. బహుశా ఇక్కడకు వాళ్ళు సామాన్య జనపు అసమాన్య సాహసంలా వచ్చుంటారు. వాళ్ళిప్పుడు సర్వనామం. నేనిప్పుడు నా భాష నుండి నామవాచకాన్ని రద్దు చేస్తున్నాడు.

నేనిప్పుడు లక్ష తుఫానుల ప్రచండ పురోగమనాన్ని చూస్తున్నాను.
ఇప్పుడిక్కడ ఎవరూ ఏమి పాడటం లేదు. కానీ అంటుకున్న పదాల నిశబ్దం పోరు పాటల్ని పంచి పెడుతుంది. ఇప్పుడిక్కడ ఎవరూ ఏమీ మాట్లాడటం లేదు. కానీ రగులుకుంటున్న వాక్యాల ఉద్విగ్నత ప్రతీ ఒక్కరినీ వెంటాడుతుంది. ఈ నిశబ్దం విద్రోహం వెన్నులో వణుకును నాటుతుంది.


ఇది యుద్ధం కదా!
అంతా కనురెప్పపాటే మరీ ముఖ్యంగా ఓటమి!
ఒరే కుక్కల్లారా !
మాకు చావడమే కాదు చంపడమూ తెల్సు !
కలల్ని నిషేధించిన రాజ్యానికి ఓ పీడకలని బహుమతిగా ఇచ్చిన
ఆ వీరుల వీరత్వాన్నే తిరిగి ఇప్పుడీ నేల వెచ్చగా కలగంటుంది.
అవును – నా వీరులారా!
మీరు కలలుకన్న నేలింకా బతికే వుంది.
మిమ్మల్ని కన్నఈ నేలింకా బతికే వుంది!

(డిసెంబర్ 2, 1999లో ‘పీపుల్స్ వార్’ కేంద్ర కమిటీ సభ్యులు నల్లా ఆదిరెడ్డి, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి, శీలం నరేష్, పశువుల కాపరి లక్ష్మీరాజంలను పోలీసులు కొయ్యూరులో కాల్చి చంపారు. ఆ నలుగురి స్మృతిలో ‘విరసం’ కర్నూలు యూనిట్ ప్రచురించిన ‘శ్యాం మహేష్ నరేష్ అరుణ్’ పుస్తకం(26 ఏప్రిల్ 2000) నుంచి…)

కవి, రచయిత, అనువాదకుడు, విమర్శకుడు. విప్లవ రచయితల సంఘం సభ్యుడు. రచనలు: 1. గెరిల్లా గుండె లయలు(1994), 2. నెత్తుటి రుతుపవనాలు. దీర్ఘ కవితలు: 1. ముఫ్పయి వసంతాాలు ముఫ్పయి శిశిరాల మీదుగా, 2. చరిత్ర రహదారుల్లో మొచిలిన పిచ్చి జిల్లేడు మొక్క, 3. కాసిని పద్యాల్ని మూటగట్టుకొని జిప్సీలా అతడు మనల్ని దాటిపోతాడు, 4. తెలంగాణా! ఈ యుద్ధ గానాన్ని ఆపొద్దు, 5. అతడు సామాన్యుల ప్రవక్త, 6. ఈ మౌనం ఖచ్చితంగా యుద్ధనేరమే, 7. తెలంగాణా! నీ గాయాలు వర్థిల్లనీ, 8. కొన్ని సీతాకోక చిలుకలు ఎగరగలవు. 9. ఇదేదో చాటుమాటు  వ్యవహారమే. అనువాదాలు:  1. నైరుతి రుతుపవనాల కాలమిది, 2. తుఫానులకెదురు నడవరా! , 3.  దఓిణ తూర్పు పవనాలతో ముఖాముఖం, 4. గంధకపు వాగొడ్డు ముసలోడా! నువు చెప్పిందే నిజం.

Leave a Reply