జ్వలిత చేతుల్లో ఆల్బం వణుకుతోంది. అరచేతులు చమటతో తడిసిపోయాయి. గొంతు తడారిపోయింది. భర్త రాజ శేఖర్, చిన్న కూతురు సౌమ్య, పెద్ద కూతురు ఫీనిక్స్ నిద్రపోతున్నారు. వాళ్ల గదుల నుంచి సన్నని వెలుతురు వస్తున్నది. జ్వలిత మెల్లిగా ఆల్బం సోఫాలో పెట్టి వంటింటి వైపు నడిచి గ్లాసెడు నీళ్లు గబాగబా తాగింది. ఏదో గాభరాని ఆపుకుంటున్నట్లు. అప్పటిదాకా తన ఫ్రెండ్ రాజశ్రీ తో మాట్లాడుతూనే ఉంది ధైర్యం తెచ్చుకోవడానికి.
మళ్లీ హాల్లోకి వచ్చి కూర్చుని ఆల్బం చేతిలోకి తీసుకుంది. ఇరవై ఏళ్ల దృఢమైన యువకుడు ప్రతీ పేజీలో నవ్వుతూన్నాడు. రాజ శేఖర్ భుజంపై చేతులు వేసి హుందాగా నిలబడి, అమ్మ జ్వలిత మెడ చుట్టూ చేతులేసి వెనకనించి భుజంపై గడ్డం ఆనించి నిలబడి, చెల్లి సౌమ్య జడలు లాగుతూ చిలిపిగా నవ్వే అన్నాడు జ్వలిత కొడుకు కార్తీక్. ఐదడుగుల ఎనిమిది అంగుళాల పొడవుతో దృఢంగా గడ్డం మీసాలలో ఆడపిల్లల కలల రాకుమారుడిలా ఉన్నాడు. ఇప్పుడు వీడు ఎక్కడున్నాడు? కనపడడేం? ఇంతలో తలుపులు తీసిన చప్పుడు. తెరిచిన తలుపు సందుల మధ్య బంగారు రంగు బల్బు వెలుతురులోంచి జ్వలిత పెద్దకొడుకు ఫీనిక్స్ వస్తున్నాడు, కాదు కాదు వస్తోంది. ఎర్రటి నైటీ చిన్న పోనీ టైల్. ముక్కుకి చిన్న ముక్కుపుడక, చెవులకు కమ్మలు లిప్‌స్టిక్ రంగుపోయి పాలిపోయిన పెదాలు, నుదుటన చిన్న బొట్టు. చేతికి రెండేసి సన్నగాజులు ముఖంలో ఒకింత వెరపు దిగులు, వీటిని మించి ఒక త్రుప్తి ఆ చిరు వెలుగులో కనపడ్డాయి.
దాహంగా ఉంది మమ్మీ తడబడుతూ ఫీనిక్స్ కాదు కార్తీక్ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్లాడు. నీళ్లు గటగటా తాగి జ్వలిత వైపుగా వచ్చి వంగి నుదుటి మీద ముద్దిచ్చి “అమ్మా సారీ నీకు నిద్ర లేకుండా చేశానా?” తడి కళ్లతో ఫీనిక్స్ .
“అబ్బే లేదురా ఫో పోయి పడుకో పో ఏవో ఆలోచనలు” అంది జ్వలిత. ఫీనిక్స్ చేతులు గట్టిగా నిమురుతూ.మొరటు చేతులు, మగ చేతులు. ఇంకా పూర్తిగా ఆడ చేతులుగా మారని గరుకు చేతులు. ఫీనిక్స్‌కి ఏం అర్థం అయిందో చటుక్కున చేతులని వెనక్కి తీసేసుకుంది.గాజులు ఖంగారుగా కదిలాయి.కళ్ళల్లో ఏదో విషాదపు అల పాలిపోతున్న వెలుగు రేఖ నీరసంగా మెరిసింది. ఏదో అసహజత్వం. మొగ చేతులకి గాజులు, నెయిల్ పాలిష్.కళ్ళకి కాటుక. ఒకలాంటి బాధ అలలా కదిలింది జ్వలితలో.”గుడ్ నైట్ అమ్మా పడుకో” ఫీనిక్స్ మెల్లిగా తన గదిలోకి వెళ్లి తలుపేసుకుంది. తన గది వైపుగా వెళుతున్న ఫీనిక్స్ అడుగుల సవ్వడిలో ఏదో అలజడి.”లేదు లేదు ఫీనిక్స్ బాగుంది, సౌమ్య అంత అందంగా ఉంది” అనుకుంటూ మనసులోనే చేదు చేదుగా సర్ది చెప్పుకుంది.
జ్వలిత మనస్సు మళ్ళీ కలత బారింది. భరించలేని వేదనతో కన్నీళ్లు కారిపోసాగాయి. ఊహూ,తనిట్లా ఏడవకూడదు,బలహీనం కాకూడదు.కార్తీక్, ఊహూ ఫీనిక్స్‌కి ధైర్యాన్నివ్వాలి. తను తీసుకున్న నిర్ణయం సరైదనే నమ్మకాన్నివ్వాలి. తనలో అతనిపట్ల ప్రేమ అలాగే ఉందని అనిపించగాలగాలి. దానికి తను ముందుగా దాన్నినమ్మాలి. ఒక రోజు “అమ్మా నీతో ఒక విషయం చెప్పాలి. నువ్వు కాస్త ధైర్యంగా వినాలి. నేను అబ్బాయి గా ఉండడం నాకే విచిత్రంగా అనిపిస్తుంది. ఐ యాం ట్రాప్పేడ్ ఇన్ ఏ మేల్ బాడీ మామ్. నాకు నేను అబ్బాయిని కాదు అమ్మాయిని అని బలంగా అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచీ చూస్తున్నావు కదా అమ్మా నన్ను? ఎన్నిసార్లు చెల్లి లంగాలు ,గౌన్లు ,గాజులు వేసుకునే నన్ను పట్టుకుని కొట్టలేదు నువ్వు ,నాన్నా? నిజం చెప్పమ్మా!ఇప్పటికీ నేను అంతే అమ్మా.ఐ యాం ఏ వుమన్.ఈ మగవాడి శరీరం అంటే నాకిష్టం లేదమ్మా. అమ్మా ఇక నాది కాని ఈ శరీరంలో నేనుండలేను ఇది నాది కాదు. నేను వేరు అమ్మా. ఎలా మమ్మీ ప్లీజ్ హెల్ప్ మీ! అదర్‌వైజ్ ఐ విల్ డై మమ్మీ” మంచం మీద లుంగలు చుట్టుుపోతూ విలవిలలాడుతూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఫీనిక్స్. “అమ్మా చూడు స్పష్టంగా చెప్తున్నా నాన్న నన్ను చంపితే చంపనీ, నేను లోపల నుంచి స్త్రీని. బయట మాత్రం మగవాడిని. అది నాకు తెలుస్తూ ఉంది. అమ్మా నాకు మగవాడి మీదే కోరికలు పుడుతున్నాయి. మొన్న నా ఫ్రెండ్ నన్ను ముద్దు పెట్టుకుంటే స్త్రీలా నా శరీరం అంతా పులకరించింది అమ్మా. నీకు నా ఫీలింగ్స్ తెలియాలని చెపుతున్నాను. నువ్వు నన్ను అసహ్యించుకున్నా సరే. నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి అమ్మా. నేనింక ఈ మగ శరీరం లో బతకడాన్ని ఒక్క క్షణం కూడా భరించలేను. అమ్మా నువ్వు నాన్న వోప్పుకోకపోతే ఇక నాకు లైఫ్ లేదు ఆత్మ హత్య చేసుకుంటాను. లేదా ఇంట్లోంచి వెళ్ళిపోతాను. మొన్న నా పీజీ కాలేజీ లో కంప్లైంట్ వస్తే నాన్న నన్ను కొట్టి, ఇంట్లోంచి తరిమేస్తే మళ్ళి తెచ్చుకోవడం కాదమ్మా. మళ్ళీ మళ్ళీ నన్ను ఇలా శిక్షించడం కాదమ్మా పని చేయని సైకొతేరపి, కౌన్సిలింగ్ ఇప్పించడం కాదమ్మా నాకేం కావాలో తెల్సుకోండమ్మా. నేను అమ్మాయినమ్మా, నీకు పెద్ద కూతురుని. ఐ యాం ఇన్ ద హెల్ అమ్మా ప్లీస్ సేవ్ మీ”
కార్తీక్, నా బిడ్డా… ఎలా చనిపోతావు నన్ను విడిచి? నీకిలా ఉండాలని లేకపోతే మరోలా నీకు నచ్చినట్టుగానే తయారవుదువు ఎలాగోలా కార్తీక్ !
మై సన్! నాకు దక్కు కొడుకుగానో, కూతురుగానో కానీ చనిపోకు ! దు:ఖంతో కంపిస్తున్న కార్తీక్‌ను జ్వలిత పొదువుకుంది గుండెల్లోకి ఆనాడు. ఆ ముందురోజే కార్తీక్ ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. తనది కాని పరాయి శరీరంలో తానిక ఒక క్షణం కూడా ఉండలేనని తన చావుకి ఎవరూ కారణం కాదనీ ఆ లేఖ రాసి మరీ.
సమయానికి సౌమ్య చూసి గావుకేకలు వేస్తే అంతా కలసి రక్షించుకున్నారు. కార్తీక్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు అతను రాసిన డైరీ చూసింది జ్వలిత. అలా మరొకరు డైరీ చదవడం తప్పని తెలిసినా. కొడుకుని మరింత బాగా అర్థం చేసుకోవాలని. ఏవైనా ఖాళీలు ఉన్నాయేమో అతని మనసులో, తను మాత్రమే అర్థం చేసుకోవలసినవి అని. ఓహ్, తెలీనే లేదు. కార్తీక్ గొప్ప కవి, భావకుడు. తను ప్రేమించిన సిద్ధార్థకి ఎంత గొప్ప ప్రేమలేఖలు రాసాడనీ? పోస్ట్ చేయని ఉత్తరాలు కవర్ లలో దాచుకున్నాడు. ఎంత అద్భుతమైన ప్రేమ కవిత్వం రాసాడనీ? చాలా పేజీల్లో ‘‘సిద్ధార్థా! ఐ లవ్ యు” అని రాసుకున్నాడు. సిద్ధార్థ పాస్స్పోర్ట్ సైజు ఫోటో కాగితాల మధ్యలో అంటించుకున్నాడు. ఫోన్ లో ఫోటో గాలరీ లో కూడా సిద్ధార్థ ఫోటోలు చూసింది తను. సిద్ధార్థ కూడా ప్రేమిస్తున్నాడా కార్తీక్ ని? ఏమో తెలీదు. కార్తీక్ క్వీర్ కమ్యూనిటిలో మెంబెర్ గా ఉన్నట్లు అర్థం అయింది జ్వలితకి. మళ్ళీ ఆమె చూపు కార్తీక్ రాసిన ప్రేమ కవిత మీదికి వెళ్ళింది.
తనది కాని ఋతువు!
ఫీనిక్స్
…
విరిగి పోయిన వంతెన ఒకటి,
నీ పాదాల కోసం దుఃఖిస్తున్నది.
చెప్పలేని ప్రేమ ఒకటి,
కాలుతున్న గుండె వాసన వేస్తున్నది.
పిలవలేని నీ గొంతు అణుచుకున్న ప్రేమతో లోలోపలే చిద్రమవుతున్నది.
నిన్ను పొందలేని రాత్రి ఒకటి.,
ఏకాంతాన విరహపు ఆవిరిలో కౌగిలిస్తున్నది.
మంచు గడ్డలాంటి చలిలో, కాగుతున్న మంట లాంటి అతగాడి పాట,
స్మృతుల బూడిదను నిద్ర లేపుతున్నది.
మోహంతో వణుకుతున్న ఆమె మోటు పెదాలు,
అతని రాతంచు గరుకు ముద్దు కోసం తపిస్తున్నవి.
కలలో కూడా అతన్ని రానివ్వని రాత్రిని ఆమె వెలివేసింది.
ఏమి కల ఇది ?పోనీ ఏమి వాస్తవం ఇది?
అతను కావాలి, వద్దు,దొరకదుల మధ్యని నిరీక్షణా సమయాల్లో,
పిగులుతున్న అకాల ప్రేమ ఒకటి ఊపిరి అందక పెనుగు లాడుతున్నది.
తనదికాని రుతువుని ఆమె గుమ్మం బయటే ఆపేసి
దుఃఖంతో తలుపులు మూసేసుకుంది.
ఇక,మెలకువని భరించలేని ఆమె వొంటరి నావలా సముద్రాన్ని మద్యంలా తాగేసి నిద్రపోయింది!
ఎంత అద్భుతంగా రాసుకున్నాడు?
అతన్ని పొందలేని ఆమె సముద్రాన్నీ మద్యంలా తాగేసి నిద్రపోయిందట!
సిద్ధార్థకి ఇచ్చి ఉంటాడా ఈ ప్రేమ కవిత? ఒట్టి ఒక వైపు ముగా ప్రేమ మాత్రమేనా?
జ్వలిత్ కళ్ళు ఫీనిక్స్ అనే పేరు మీద పడింది. తాను స్త్రీగా మారాక పెట్టుకోవాలనుకున్న పేరు. అసలు ఫీనిక్స్ అనే ఎందుకు పెట్టుకోవాలనుకున్నాడో ఏమో?
“అవును నాకు ఫీనిక్స్ పేరు అంటే చాలా ఇష్టం. ఎంత బలంగా, ధృడంగా కోరుకుంటుంది ఆ ఫైర్ బర్డ్ ఇష్టం లేని జీవితాన్నో, దేహాన్నో త్యజించి మళ్ళీ జన్మించాలని? ఎంత బలంగా దీక్షతో, సంకల్పంతో మరణించాలని కోరుకుని, అగ్నికి ఆహుతవుతుంది? నేను ఈ పురుష దేహాన్ని ఇలాగే త్యజిస్తాను. కొత్త మనిషిగా మానుషిగా, గొప్ప వ్యక్తిత్వం ఉన్న స్త్రీగా మళ్ళీ జన్మిస్తాను. అప్పుడు నా పేరు ఫీనిక్స్ అని ఉంటుంది. అమ్మకి, సౌమ్యకి చెప్పాలి ఎస్! ఐ యాం ఫీనిక్స్! మై న్యూ నేమ్ వుడ్ బి ఫీనిక్స్! మొన్న క్వీర్ కమ్యునిటీ లో కుడా నువ్వు సెక్స్ చేంజ్ చేసుకున్నాక ఫీనిక్స్ అన్న పేరు ఎందుకు పెట్టుకుంటావు ? అది పక్షి కదా పైగా ఉహాజనితమైనది మాత్రమే. నువ్వు మనిషివి కదా కార్తీక అన్న పేరు పెట్టుకోవచ్చుకదా? మీ వాళ్లకు పిలుచుకోవడానికి సులువుగా కూడా ఉంటుంది. అలవాటైన పేరు కదా అన్నారు.ఉహూ నాకెందుకో ఈ పేర్లు నచ్చలేదు. ఎందుకో నాలో ఫీనిక్స్ పక్షి దాగి ఉంది అనిపిస్తుంది. కుత కుత లాడే మంటల్లో దగ్ద మై, మళ్ళీ తను కావాలనుకున్నట్లు పుట్టాలనే కాంక్షతో రగిలిపోయే ఫీనిక్స్ పక్షి గుండెల్లో, రక్తంలో, నా రక్త నాళాల్లో లావాలా పరిగెడుతూ, ప్రవహిస్తూ ఉంటుంది. అవును ఈ పక్షి ఉహా జనితమే వాస్తవంలో లేదు.
గ్రీకు పురాణాల ప్రకారం, ఫీనిక్స్ పక్షిని అమర పక్షి, లేదా మాయా పక్షి అని కూడా అంటారు. ఫీనిక్స్ సూర్యునితో సంబంధం కలిగి ఉంటుంది. అన్ని సాధారణ పక్షుల కంటే పూర్తిగా భిన్నమైనది కూడా. భూమితో కాదు భగ భగా మండే సూర్యునితో సంబంధంలో ఉంటుంది. తన జీవిత చక్రం ముగిసినప్పుడు, జన్మ నచ్చనప్పుడు సూర్యున్ని డీకొట్టి, డీకొట్టుకుని బాగా భగలాడే జ్వాలల్లో కాలి బూడిద అయిపోతుంది. మళ్ళీ ఆ బూడిదలోంచే పునరుత్థానం చెందుతుంది. పునర్జన్మ తీసుకుంటుంది. నేను కుడా నా ఈ పాత దేహం నుంచే కొత్త స్త్రీ దేహాన్ని సృష్టించుకుని పునరుత్థానం చెందుతాను. దానికోసం మరనించడానికైనా వెనకాడను. అదే చెప్పాను నా క్వీర్ స్నేహితులకి.”
ఆ పేజిలలో అన్నీ ఎర్రని జ్వాలలు రెక్కలుగా తొడుక్కున్న ఫీనిక్స్ బొమ్మలు అగ్ని రెక్కలా అవి? ఫోన్ డిస్ప్లే మీద కూడా ఫీనిక్స్ పక్షి బొమ్మే!
ఇంకో చోట తనకి వెంకట్ కి జరిగిన సంభాషణ రాసుకున్నాడు.
ఈ రోజు వెంకట్ అడిగాడు.”అమ్మా నాన్న నీసెక్స్ చేంజ్ కి ఒప్పుకోకపోతే ఏం చేస్తావు కార్తీక్” అని. “ఇంట్లోంచి వెళ్ళిపోయి ఏదో ఒకటి చేసుకుని సెక్స్ చేంజ్ చేసుకుంటాను” అన్నాను వెంకట్ తో.
“మొన్న క్రాస్ రోడ్స్ దగ్గరి బ్రిడ్జి కింద మన ట్రాన్స్ జెండర్ ని రేప్ చేసి హత్య చేసినప్పటి నుంచి అమ్మ,నాన్న భయపడుతున్నారు. కానీ నా జాగ్రత్తలో నేను ఉంటానని ధైర్యం చెబుతున్నా వాళ్ళల్లో ఆందోళన తగ్గడం లేదు. అయినా నేను మాత్రం ఖచ్చితంగా సెక్స్ చేంజ్ చేసుకుంటా”అని చెప్పాను.ఒహ్హ్ ఈ రేప్ కేసులోనే ధర్నాలో పాల్గొనడానికి ఒక రోజు హడావుడిగా వెళ్ళిపోయాడు అన్నం కూడా తినకుండా. టీవీ లో ధర్నాలో వాడ్ని చూసింది. ప్లకార్డు తో న్యాయం కోసం మిగతా క్వీర్ కమ్యూనిటి వాళ్ళతో కలిసి నినాదాలు ఇస్తున్నాడు.
తను తీసుకున్న నిర్ణయంతో చాలా స్పష్టతతో, ఖచ్చితంగా ఉన్నాడనిపిస్తుంది.
ఇంకో చోట దుఃఖ కవిత రాసుకున్నాడు ఇలా ….
ఎవరుచూస్తారు?
— | ఫీనిక్స్ |
వెచ్చని గాలి పరదాల్లాంటి, ,
అమ్మ లాంటి చీరని కట్టుకోవాలనుకుంటాను.
గాజులు నిండిన చేతులతో ,
నీ మోముని నా హృదయానికి హత్తుకోవాలనుకుంటాను.
మనుషులు నా చీరని తొలగించి,
నా వెంట్రుకలు నిండిన ఛాతీనీ,
రెండు కాళ్ళ మధ్య ఉన్న పురుష అవయవాల్ని చూపిస్తూ భళ్ళుమని నవ్వుతారు!
నా లోపలి స్త్రీ హృదయాన్ని ,
నా ప్రియుడి కోసం తపించే నా లోని ప్రేమికురాలిని ఎవరు చూస్తారు?
జ్వలిత కళ్ళు నీళ్ళతో నిండిపోయాయి.
భర్త రాజ శేఖర్ కి చూపించింది. చదివి పసివాడిలా ఏడ్చాడు. ఎన్ని సార్లు కొడుక్కి అన్నం పెట్టకుండా పస్తులుంచి మాడ్చాడు? ఎన్ని సార్లు గొడవ పడ్డాడు. ఎన్నిసార్లు ఈ చేతులతో కొట్టాడు కార్తీక్ ని ఇంట్లోంచి తరిమేసాడు, మళ్ళి తెచ్చుకున్నాడు. మళ్ళి కొట్టాడు, మళ్ళీ తెచ్చుకున్నాడు. జ్వలిత, సౌమ్య ఎంత అడ్డు పడుతున్నాకానీ. ఒకరోజు సౌమ్య “నాన్నా నువ్వు అన్నయ్యని చంపెసేటట్లున్నావు. ఇంకోసారి చెయ్యి వేస్తే నేను అన్నయ్యను తీసుకొని వేరే వెళ్ళిపోతాను” అంది కోపంగా ఏడుస్తూ.”నాన్నా కొట్టకు నాన్నా అర్థం చేసుకో ఐ యామ్ ఏ విమెన్ నాన్నా, నాట్ ఎ మాన్ నాన్నా” అంటూ తన బెల్ట్ దెబ్బలకి నొప్పితో లుంగలు చుట్టుకుపోతూ తండ్రి కాళ్ళకు అల్లుకుపోయేవాడు. ఆఖరికి కార్తీక్ ఆత్మహత్యా ప్రయత్నం తరువాత గానీ కార్తీక్ లో స్త్రీగా మారాలన్న కాంక్ష ఎంత బలంగా ఉందొ అర్థం అయింది రాజ శేఖర్ కి . ఎంత నరకం అనుభవిస్తున్నాడో కదా పురుష దేహానికి, స్త్రీ స్పందనలకి మధ్య? తనకెందుకు అర్థం కావట్లేదు? నిజంగా కన్నంత మాత్రాన కొడుకు జీవితం మీద తనకేం హక్కుంది అనుకుని వదిలేసాడు. రాజీపడ్డాడు. కొడుకు ఏదో ఒక రూపంలో కళ్ళ ముందు ఉంటే చాలదూ అనుకున్నాడు భార్య జ్వలిత లాగా!
“నువ్వెలా తట్టుకున్నావు జ్వలితా” ఈ ప్రయాణం లో అన్నీ తానై సపోర్ట్ చేసిన స్నేహితురాలు హిమజ అడిగింది జ్వలితని చాలా సార్లు. అవును ఎలా తట్టుకుంది? ఎలా నిల బడింది? ముక్కలైన హృదయాన్ని, దేహాన్ని మళ్ళీ మళ్ళీ అతికించుకుంటూ, వరదలా పొంగి పోతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ? ఎన్ని సార్లు సైకియాట్రిస్ట్ రాసిన యాంటి డిప్రేస్సంట్ మందులు వాడలేదని? లెక్క లేనన్ని కోన్సేలింగ్ సెషన్స్, ఆశ్రమాలెంబడి పడి ధ్యానాలు చేయలేదని? తెల్లారేసరికి ఫీనిక్స్ ఇంట్లో చీరో, చుడీ దారో వేసుకుని తిరుగుతూ కనిపించేది. ఏడీ నా కొడుకు కార్తిక్ ఏడీ? ఆ బట్టల వెనకాల దాక్కున్నాడా? లేక కార్తీక్ చనిపోయాడా? లేక ఫీనిక్స్ గా మళ్ళి పుట్టి ఇలా తిరుగుతున్నాడా? కార్తీక్, కార్తీక్ అంటూ అరుచుకుంటూ ఏడుస్తూ తను ఇల్లంతా తిరుగుతూ వెతుక్కున్న రోజులు ఎన్ని లేవు? తన స్నేహితులేనా అడిగింది ఇలా ఫీనిక్స్ క్వీర్ కమ్యూనిటీ కూడా అడిగింది. కాదు పొగిడింది “ఆంటీ గుడ్ పేరెంటింగ్ టు యువర్ ట్రాన్స్ చైల్డ్”అంటూ. అవును మరి ఎంత విషాదపు విషాన్ని మింగుతూ చిరునవ్వుని, ప్రాణాల్ని కాపాడుకోవాల్సి వచ్చింది. కార్తీక్ లోని ట్రాన్స్ చైల్డ్ తో కలిసి చేస్తున్న ఈ సరి కొత్త మాత్రుత్వపు ప్రయాణంలో?
అవును కార్తీక్ నుంచి తొలి సారి ఈ విషయం పూర్తిగా విన్నప్పుడు ప్రపంచం అంతా తల్లకిందులుగా అయిపోయినట్లు అనిపించింది. చాలా భిన్నమైన అనుభవం, విచిత్రమైంది కుడా. ఒకే మనిషి ఒకే సమయంలో ఇద్దరిగా మారిపోవడం లేదా పురుషుడి నుంచి స్త్రీగా మారిపోవడం, తాను కన్న తన కొడుకు తానిచ్చిన పురుష జన్మని తిరస్కరించి, తనని తానూ స్త్రీగా పునః సృజించుకోవడం నేను ఒకేసారి ఇద్దరికీ అమ్మగా మారడం ఎంత వింత విషయం ఇది? ఎలా దీన్ని జీర్ణం చేసుకోవాలి? కార్తీక్ తనకు పుట్టిన క్షణాల్లో కూడా తను ఇటువంటి అనుభూతిని పొందలేదు. ఏం జరుగుతున్నది తన జీవితంలో? తన కొడుకు తాను మగపిల్లవాడిని కాదు ఆడపిల్లని అని చెప్పినప్పటినుంచీ తనలో ఎనలేని ఆందోళన, భయం, అయోమయం, తెలీని దుఖం కలగ సాగాయి. తనొక షాక్ లాంటి స్థితిలోకి వెళ్ళిపోయింది. ఇల్లంతా, గది మూలలన్నిటిలో ప్యూపాలు గూడు కట్టినట్లు అందులోంచి, వాటిని పెకిలించుకుని రంగు, రంగుల సీతాకోక చిలుకలు ఇల్లంతా ఎగురుతున్నట్లు అనిపించేది. కనిపించేది కుడా. భ్రమేమో , ఏమో తెలీదు. కార్తికే పెద్ద రెక్కలున్న రంగు, రంగుల సీతాకోక చిలుకలా ఇల్లంతా ఎగురుతూ కనిపించేవాడు. ఇంట్లో అడ వేషం లో తిరుగుతున్న కార్తీక్ వొంట్లోంచి కొత్త తోట ఒకటి విరబూసిన పువ్వులతో ఇల్లంతా చుట్టేస్తున్నట్లు అనిపించేది. కార్తీక్ కోరిక పరివ్యాప్తమైపోయేది. మా ఉనికిలో, శ్వాసలో , ఇంటి వస్తువుల్లో దేవుడి పటాల్లో తనలో, రాజశేఖర్లో, సౌమ్యలో కార్తీక్, కాదు కాదు ఫీనిక్స్ నిండిపోయింది.
***
తన గదిలోంచి కార్తీక్ ఒక ధమరుకాన్ని గోడలు బద్దలయ్యేలా మోగిస్తున్నట్లు అనిపించేది. నిజానికి మౌనంగా ఉండే కార్తీక్ తన గదిలో కూర్చొని చిన్న సైజు డ్రమ్స్ వాయించే వాడు. మురళి మ్రోగించే వాడు. కార్తీక్ ఇన్స్త్రుమెంటల్ సంగీతంలో శిక్షణ తీసుకుంటున్నాడు. గదిలో నిత్యం సాధన చేసుకుంటూ గడిపేవాడు.”విను, నా సంగీతం మాట్లాడుతుంది అమ్మా” అనేవాడు.అన్నీ తను మాకు వినిపించాలనుకునే వేదన రాగాలే.ఇల్లంతా ప్రవహించేవి.ఇది మిగతా అందరు తల్లులు ఎదుర్కునే సమస్య కాదు. పూర్తిగా భిన్నమైనది, భయాన్ని వెరపుని కలిగించేది. కార్తీక్ చెబుతున్న స్థితి గురుంచి చాలా అధ్యయనం చేయడం మొదలు పెట్టింది తను. కార్తీక్ వెళ్ళే క్వీర్ కమ్యూనిటీ మీటింగ్స్ కి వెళ్ళేవారు తనూ, చిన్న కూతురు సౌమ్య. రాజ శేఖర్ తో, బంధువులతో గొడవలు, వైరుధ్యాలు. తను డీలా పడ్డప్పుడు సౌమ్య అన్న కార్తీక్ కి అండగా నిలిచింది. రాజశేఖర్ ఒక దశలో తట్టుకోలేక కార్తీక్ తో హింసాత్మకంగా ప్రవర్తించాడు. అప్పుడు తనూ సౌమ్య కాపాడుకున్నాం.ట్రాన్స్ జెండర్ బిడ్డకి తల్లిగా ఉండడం ఎలా ఉంటుంది అసలు? అది తనకే తెలుసు. మునుపటి ప్రేమలు, మమకారాలు, స్పందనలు, నిర్ణయాలు ఏమీ మారలేదు. ప్రతీ క్షణం నీమీద అదే ప్రేమ ఉంది, నీనిర్ణయం వల్ల నీ మీద ఆపేక్ష, ప్రేమ ఏమీ తగ్గలేదు అని తల్లిగా నిరూ పించుకొవల్సి వచ్చేది. కొత్త రూపం తీసుకున్న మాతృత్వపు పొరలు మహా కటినంగ, నొప్పిగా ఉండేవి. బయటకి చూపించే ధర్యం మాటున బోలెడంత భయం,ఆందోళన,అబధ్రత దుఖం చేరాయి. పిల్లలు ఎలా ఉన్నా తల్లి ప్రేమించాల్సిందే కదా? తన ఈ కొత్త మాతృత్వం తనను నిలవనివ్వలేదు. ఇక్కడ జరిగిందేంటి అంటే తను జన్మనిచ్చిన మనిషి, తన జెండర్ మార్చుకోవడానికి, తల్లిగా సహకరించడానికి మనిషిగా తాను కూడా పూర్తిగా మారి పోవడం, మెటామార్ఫాసిస్ చెందడం, ఒక విచిత్రమైన స్థితి. ఒక కొత్త మనిషిని గర్భం తో కాదు హృదయంతో కనడం లాంటిదన్నమాట. ఇక్కడ తను చాలా ధృడంగా ఉండాలి. సమాజం, కుటుంబం ప్రశ్నిస్తే ఎదుర్కోవడానికి, భయాల్ని, పిరికి తనాన్ని,మొహమాటాల్ని వదులుకోవాలి. వాళ్ళు ఎదురుపడితే, పరదా చాటున దాక్కోవడం మానేసి, ధైర్యంగా నిలబడి వాళ్ళ ప్రశ్నలకి సరైన సమాధానాలు ఇవ్వడం నేర్చుకుంది.వాళ్ళు ఎగరేసిన
కనుబోమల్ని దించి పదేసేది.కార్తీక్ పక్కన ధృడంగా నిలబడ్డం అలవాటు చేసుకుంది.దీనివల్ల తనకి ఏమీ నష్టం లేదు. తన కొడుకు తనకు ముఖ్యం. తను డిస్టర్బ్ అయినా ఫరవాలేదు. త్వరగానే సర్దుకుంటుంది.ముఖ్యంగా తను అపరాధభావన లో పడకుండా, కార్తీక్ అందులోకి కూరుకు పోకుండా చూసుకుంది. మామయ్య ఫోన్ చేసి బండ బూతులు తిట్టాడు.అవమానంగా , సిగ్గుగా లేదా నీ కొడుకుని ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? అని తనెందుకు అవమానపడాలి?కార్తీక్ ఏమైనా హత్యలు చేసాడా?దొంగతనం చేసాడా?లేదే! తన కొలీగ్ ఒకామె కొడుకు డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటే పరువు పోయిందని ఆత్మహత్యాప్రయత్నం చేసింది. కానీ తన కొడుకు కార్తీక్ ఆ పని చేయలేదు.తన తప్పుడు అస్తిత్వాన్ని మార్చుకోవాలనుకున్నాడు అంతే. ఆ పని చేసినా తన కొలీగ్ ఆత్మహత్య చేసుకోకుండా కొడుకుని కాపాడుకోవాలి. తనంత పిరికిది కాదు. ఆ ఆలోచన తనూ చేసింది. కానీ కార్తీక్ ను రక్షించుకోవాలన్న ఆలోచన ముందు అది వోడి పోయింది. తన బలహీనమైన మనసు ధృడంగా మారింది.
తర్వాత దశ దశలుగా జెండర్ ఛేంజ్ సర్జరీలు, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీలు కౌన్సెలింగ్‌లు జరుగుతూనే ఉన్నాయి. కళ్ళ ముందు కార్తీక్ నుంచి ఫీనిక్స్‌గా మారుతున్న అద్భుతమైన ట్రాన్షిషన్ ని విస్తుపోయి చూడ్డమే. లోకం వింతపడింది. దగ్గర, దూర కుటుంబాలు బహిష్కరించాయి. సౌమ్యకి సంబంధాలు రావడం తగ్గిపోయాయి. అందరికీ తెలిసిపోయింది చాలా సంబంధాలు వెనక్కి వెళ్లిపోయాయి. కానీ సౌమ్య తన కొలీగ్ తో ప్రేమలో పడింది. మాకు తరువాత తెలిసింది. దానికంటే ముందు తన బాబాయి పంపిన సంబంధం వచ్చింది.
“నాకు చావాలని ఉంది” సారి ఈ మాటన్నది కార్తీక్, రాజ శేఖర్లు కాదు, సౌమ్య. ఈ సారి సౌమ్యకి ఆ సంబంధం కూడా తప్పిపోయింది. “మీ కొడుకు కార్తీక్ హిజ్రా అట కదా. మీ ఇంట పిల్లనెలా చేస్కోవాలి. ఏంటి హిజ్రా అనకూడదా ట్రాన్స్ వుమెన్ అనాలా? ఓహ్ వీళ్లకీ మర్యాదా? పొండి రాజశేఖర్ గారూ, రేపు మీ అమ్మాయి ట్రాన్స్ మెన్ కాదని ఏంటి? మా కొద్దీ సంబంధం ఆ బాబాయి ని అనాలి అసలు ఇలాంటి వెధవ సంబంధం తెచ్చినందుకు.” మొఖం మీదే చీత్కారాలు, వేళాకోలాలు “గెట్ అవుటాఫ్ మై హౌస్” రాజశేఖర్ అరుపులతో ఇంటి తలుపులు మూసుకుపోయేవి. ఫీనిక్స్ గది తలుపులు తెరుచుకునేవి. ఫీనిక్స్ ఒళ్లు వాతలు తేలేట్టు కొట్టి, మళ్లీ “ఫ్యాంట్ షర్ట్ వేస్కోరా” అంటూ రాజశేఖర్ పిచ్చిగా అరుస్తూ పానిక్ అటాక్ వచ్చేంతగా అరుస్తూ కూలబడిపోయేవాడు. దెబ్బలతో వాతలు తేలిన దేహపు నొప్పిని ఉండ చుట్టి గది మూలాల్లోకి ముడుచుకుపోయేవాడు కార్తీక్. కానీ నాన్న చెప్పినట్లు ఫ్యాంట్ షర్ట్ మాత్రం వేస్కునేవాడు కాదు.
***
ఒకరోజు అర్థరాత్రి కుళ్లి కుళ్లి ఏడుస్తున్న చప్పుడుతో పక్కనే పరుపు కదలికలతో మెలకువ వచ్చిన జ్వలిత. రాజశేఖర్‌ని చూసి నిర్ఘాంతపోయింది. మెల్లగా లేచి అతన్ని లేపి హృదయానికి హత్తుకుంది. “బతకాలని లేదు జ్వలితా, ఎంతమందికి సమాధానం చెప్పాలి. ఆఫీసులో, బంధువుల్లో, కాలనీలో. ఇప్పుడిలా సౌమ్య పెళ్లి సంబంధం ఇలా వెన క్కెళ్ళిపోవడం నా వల్ల కావట్లేదు జ్వలితా వద్దీ జీవితం” అలా ఎన్నో సార్లు పసిపిల్లాడిలా ఏడ్చిన రాజశేఖర్! “వాళ్లని ఏమైనా అననివ్వండి. వాడు మన పిల్లాడు. ఎలా ఉన్నా, ఎలా మారినా ఒప్పుకోవాలి. అమ్మాయే పుట్టిందనుకుందాం. అంటూ తన నిర్ణయాన్ని ఏనాడో చెపుతూనే ఉంది రాజశేఖర్ కి.
గత నాలుగేళ్లుగా, పదుల సంఖ్యలో కౌన్సెలింగ్‌లు, యాంటీ డిప్రెసెంట్ మాత్రలు ట్రాన్స్ చిల్డ్రన్ పేరేంటింగ్ సెషన్స్ అటెండ్ అయ్యి, అయ్యి కొంచెం కొంచెంగా మారుతూ.,మధ్య మధ్యలో మారలేక మారాము చేస్తూ దు:ఖపడుతూ, కూలబడుతూ మళ్లీ మళ్లీ లేచి నిలబడుతూ ఒకరికొకరు నిలబెట్టుకుంటున్నారు జ్వలితా, రాజశేఖర్, సౌమ్యలు. “వాడి హక్కు తాను అమ్మాయిలా బతకాలనుకోవడం! వాడు మనకు కూతురుగానో, కొడుకుగానో దక్కడం ముఖ్యం. నేనెవరినీ లెక్క చేయను సౌమ్యకి ఇంకా ఇరవై ఏళ్లే. కాలం మారుతుంది విషయం సాధారణం అయిపోయింది.ముందు మనం దీన్ని నార్మల్ విషయంగా చూస్తే బంధువులూ,సమాజమూ కూడా అలవాటు చేస్కుంటారు. మీ సంగతి నాకు తెలీదు కానీ నేను మాత్రం వాడి పక్కనే, వాడి కోసమే నిలబడతాను. నాకు ఇద్దరూ అమ్మాయిలే పుట్టారనుకుంటాను” జ్వలిత స్తిరంగా చెబుతుంటే.
“ఎలా జ్వలితా, వీడికి అసలు వేరే అబ్బాయితో పెళ్లి అవుతుందా? గర్భసంచి ఉండని వీడికి పిల్లలు పుడతారా? వంశాభివృద్ధి, ఓల్డ్ ఏజ్‌లో భద్రత ఎట్లా? ఆడపిల్లగా వీడు సమాజంలో ఏ పేరుతో బతుకుతాడు? వీడి అస్తిత్వం ఏంటి? వీడిని వాడి కమ్యూనిటీలో సెక్సువల్‌గా ఎక్స్‌ప్లాయట్ చేయరని ఏంటి? వీడికి ప్రభుత్వం సిటిజన్‌షిప్ ఇస్తుందా? మనం పోయిన తర్వాత వీడిని ఎవరు చూస్తారు? ఒక వేళ సౌమ్యకి పెళ్లైనా తన భర్త కార్తీక్‌ని చూడనిస్తాడా? జెండర్ మారితే సరిపోతుందా? మారాక ఇంట్లో, సమాజంలో ఎంత భయంకరమైన పర్యవసానాలు ఎదుర్కోవాలో వాడికేం తెలుసు”? రాజశేఖర్ పూడుకుపోతున్న గొంతుతో దు:ఖాన్ని అదిమి పెడ్తున్నాడు. “పిల్లలు పుట్టక పోతే అడాప్ట్ చేసుకుంటాడు.మనం సప్పోర్ట్ ఇవ్వాలి అంతే. కావలిస్తే ఎక్కడికైనా వేరే రాష్ట్రానికి వెల్లిపోదాం”స్థిరంగా అంది జ్వలిత.
***
కానీ అదే రాజశేఖర్, కొడుకు ఆత్మహత్యా ప్రయత్నం తర్వాత మారాడు. కొడుకు సెక్స్ మార్పిడి సర్జరీల కోసం డబ్బు సమకూర్చుకోవడంలో పడిపోయాడు. “ఎవరైనా కూతురు పెళ్లికో, ఇల్లు కట్టడం కోసమో భూములు అమ్ముతార్రా? నువ్వేంటిరా నీ కొడుకు ఆడదానిగా మారడానికి ఇదంతా చేస్తున్నావు? నాలుగు తన్ని వాణ్ణి కూర్చోపెట్టక? అసలు నన్నడిగితే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయక వాడితో తాన తందాన అంటావేంట్రా? నేను ఊళ్లో బంధువుల్లో తలెట్లా ఎత్తుకోవాల్రా? ఏమ్మా జ్వలితమ్మా వాడికంటే బుద్ధి మందగించింది. నీకేం అయ్యిందమ్మా?ముందు వాడికి పెళ్లి చేసెయ్యండి. బెంగళూరులో మా మేనల్లుడి కూతురు బాగా చదువుకుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మంచి అందగత్తె కూడాను,పెళ్ళైతే మారిపోతాడు” ఆక్రోశపు తండ్రి అరుపులు కేకల మధ్య నీరసంగా నవ్వుకొంటాడు రాజశేఖర్. తన తండ్రికేం తెలుసు తను చేస్తున్న యుద్ధం గురించి? తను తేలేదా సంబంధాలు తొందరగా పెళ్లి చేసేద్దాంఅని?స్త్రీతో సాంగత్యంలో వాడేమన్నా తనను తాను పురుషుడిగా అనుభూతి చెందుతాడేమోనని! “ఫీలింగ్స్ రావట్లేదు నాన్నా నా మగ ఫ్రెండ్స్ మీద వచ్చినంతగా” అంటూ తిరస్కరించాడు. అమ్మాయి జీవితం నాశనం అవుతుంది వద్దని వెనక్కి తగ్గారు తను, జ్వలిత.
***
ఈ క్రమమంతా సౌమ్య తల్లికి, అన్నకి చాలా సప్పోర్ట్ గా నిలుచుంది.
గతంలో చాలాసార్లు తన లంగా వోణీలు, చుడీ దార్లు బొట్టు, కాటుకా తల్లో పూలు పెట్టుకుని మురిసిపోయే అన్న కార్తీక్ గురించి అమ్మకి చెప్పింది సౌమ్య. అమ్మకి ముందే తెలుసని తెలుసుకొని ఆశ్చర్యపోయింది. ఖంగారు, భయం, ఆందోళనతో. అంతకుమించి “ఒద్దురా అన్నయ్య కౌన్సెలింగ్ తీసుకోరా”అంటూ వెంటబడింది. తండ్రికి తెలియకుండా కౌన్సెలింగ్‌కి తీస్కెల్లే తల్లికి తోడు వెళ్ళింది.. ఏ మాత్రం మార్పులేని కార్తీక్‌ని మార్చాల్సిన అవసరం లేదని అతన్ని స్త్రీగా మారనివ్వడమే పరిష్కారమని అతనికి కుటుంబం అంతా సహకరించమని కౌన్సెలర్ చెప్పిన దాన్ని నాన్న బలంగా చెప్పేసింది. తన తొలి మద్దతు కార్తీక్ కే ఇచ్చింది సౌమ్య. కార్తీక్ ఆత్మహత్యా ప్రయత్నం చేస్కున్న రోజు నాన్నని తిట్టేసి అన్నని తీస్కుని ఏటైనా వెళ్లిపోయి విడిగా బతుకుతాననీ , అన్న కాదు తన అక్కతో కలసి ఉంటాననీ చెప్పేసింది. డిప్రెషన్ లోకి వెల్లిపొయిన తల్లిని కౌన్సిలర్ దగ్గరికి, సైకియా ట్రిస్ట్ దగ్గరికి తీసుకుని వెళ్లి కౌన్సిలింగ్ ఇప్పిస్తూ జ్వలితని బిడ్డలా చూసుకోవడమే కాదు తండ్రిని కుడా కాపాడుకొంది.
***
కార్తీక్ నుంచి పూర్తిగా ఫీనిక్స్‌గా మారడానికి ఐదేళ్ల కఠినమైన కాలాన్ని నలుగురూ కలసి దాటారు. కన్నీళ్లనీ, అవమానాలనీ, నిద్ర లేని రాత్రుళ్లనీ.
తనకో కొత్త పేరు అనుకున్నాడు కార్తీక్. అతనున్న క్వీర్ సొసటీ ఫ్రెండ్స్ కార్తీక అని పెట్టుకోమన్నారు. కార్తీక్ ఒప్పుకోలేదు. లోకంలో ఉన్న ఏ స్త్రీ పేురూ వద్దనుకున్నాడు. స్త్రీగా తనకిది పునర్జనమ్మ అని తనను తాను ఎంతో దహించుకుని, దహించుకున్న లోలోపల జ్వలించిపోయి వందలసార్లు మరణించీ మళ్ళీ మళ్ళీ జన్మించిన ఫీనిక్స్ పక్షి లాంటి వాడినని తన పేరు ఫీనిక్స్ అని తనే పెట్టుకున్నాడు.
“ఎవరు నోరు పలకలేని పేరు ఫీనిక్స్. కార్తీ, ఒరే కార్తీక్ అని 22 ఏళ్లు పిలుచుకున్న పేరు. ఇప్పుడు ఫీనిక్స్ అని పిలవాలంటే కొత్తగా ఉంది. తామిద్దరమూ కన్న కార్తీక్, పురుషుడిగా తనను తాను రద్దు చేస్కొని ఫీనిక్స్ అని అమ్మాయిగా మళ్లీ పుట్టి తమ కళ్ల ముందే తిరుగుతుంటే పరమాశ్చర్యంగా, అద్భుతంగా ఉంది.
***
“అమ్మా వెళ్లిపోమ్మంటే వెళ్లిపోతాను. నా బతుకేదో నేను బతుకుతాను. మీకేం ఇబ్బందీ ఉండదు. చెల్లి పెళ్లి కూడా జరిగిపోతుంది నేను దూరంగా ఉంటే, ఎటో వెళ్లి పోయిందనో, చనిపోయిందనో చెప్పండి’. ముఖం చేతుల్లో పెట్టుకుని సోఫాలో జ్వలిత ఒల్లో తల పెట్టి భోరున విలపించింది ఫీనిక్స్. ఆరోజు సౌమ్యని ప్రేమించిన వినయ్, కుటుంబ ఒత్తిడికి లొంగి సౌమ్యని కాదనుకున్న వార్త చెప్పాడు. అన్ని రోజులు స్థిరంగా ఉన్న సౌమ్యలో ఎందుకో నిస్సహాయత ఆవహించింది. ప్రాణంకంటే ఎక్కువగా ప్రేమించిన వినయ్ ని వదులుకోలేక ఆమె విలపించింది. వినయ్ లేని జీవితం ఒద్దనుకుంది. తల్లి ఒళ్లో తల పెట్టుకుని దు:ఖించింది.
తన ముందు ప్రేమ ప్రపోసల్ పెట్టిన వినయ్ కి “మా అన్న ఒక ట్రాన్స్ వుమన్” అని చెప్పిండి.తనకి ఏ అభ్యంతరం లేదని చెప్పాడు వినయ్. తన తల్లి దండ్రులని వప్పించు కుంటానని చెప్పాడు కూడా. సౌమ్యని చూడ్డానికి వచ్చిన వినయ్ తల్లిదండ్రులు ఫీనిక్స్‌ని చూసి నిర్ఘాంత పోయారు. సౌమ్యవాళ్లతో స్పష్టంగా “మా అన్నయ్య జెండర్ చేంజ్ చేసుకుని స్త్రీగా మారాడు” అని చెప్పింది. వాళ్లు కాదనుకుని వెళ్లిపోయారు. సౌమ్యని చేస్కుంటే చచ్చిపోతానని వినయ్ తల్లి బెదిరించడంతో వినయ్ నిస్సహాయుడైనాడు.
కార్తీక్ నుంచి ఫీనిక్స్‌గా మారడం చుట్టూ ఎన్ని దు:ఖపు సుడిగుండాలు , సునామీలు, ఎడారి మంటలు, కన్నీటి అయోమయాలు, దిక్కుతోచనితనాలున్నాయి. ఎన్ని సవాళ్లు, ఎంత కోల్పోయినతనం,ముఖ్యంగా సౌమ్యకి. ప్రేమ పోగొట్టుకుని బతకడం ఎంత కష్టం?
కార్తీక్ పూర్తిగా స్త్రీగా మారాక ఫీనిక్స్‌గా ఇంటికొస్తున్నప్పుడు ఎంత సంబరం సౌమ్యకు? ఇల్లంతా అలంకరిచింది. ఫీనిక్స్ రూమ్ గోడలని తనకిష్టమైన కళంకారి, నకాషీ బొమ్మలతో నింపేసింది. ఫీనిక్స్‌కి మంచి పట్టు చీరలు, చుడీదార్లు, నైటీలు తన జీతంతో కొనిచ్చింది.
ఆనందంగా ఇంటికొచ్చిన వాళ్లని ఇరుగు పొరుగు అవమానంగా , అసహ్యం గా చూసింది గుసగుసలు పోయింది, బహిష్కరించింది.
జ్వలిత స్నేహితురాళ్లు ఒకలో ఇద్దరో తప్ప ఎవరూ రాలేదు. బంధువులూ అంతే వాళ్ల వంశం నుంచే వీళ్ల నలుగురినీ తొలగించేశారు. పండగలకి, పుట్టిన రోజులకి పిలుపులు లేవు. ఇంట్లో ఫీనిక్స్ పుట్టిన రోజు జరిపిన రోజున ఫీనిక్స్ క్వీర్ కమ్యునిటీ ఫ్రెండ్స్ చాలామంది వచ్చారు. పాటలు పెట్టుకున్నారు. నృత్యాలు చేసారు. వెంటనే ఇరుగు పొరుగు వచ్చి హిజ్రాలతో గానా బజానా పెట్టుకుంటారా?మర్యాదస్తులు ఉండే కాలనీ ఇద ఆపండి అని గొడవ చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు వచ్చి ఎంక్వయిరీ చేసి, “మరోసారి మాకు కంప్లైంట్ రాకూడదు. సంసారులు ఉండే ఇళ్ళల్లో ఇలాంటి ఫంక్షన్స్ చేసుకోకూడదు జాగ్రతగా ఉండండి” అని చెప్పి వెళ్ళారు.
“పోనీలే ఫీనిక్స్, మనం నలుగురమే ఒకళ్లకొకళ్లం బలం” అంది జ్వలిత పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న ఫీనిక్స్‌ని దగ్గరకి తీసుకుంటూ. తనవల్ల సౌమ్య ప్రేమించిన వినయ్ శాస్వతంగా దూరమవడం ఫీనిక్స్ భరించలేక పోతున్నది. ఎన్నో సార్లు “నా వల్లే కదా ఇదంతా చెల్లీ” అని సౌమ్యని పట్టుకొని ఏడిచేది.
అద్దంలో తన నున్నని చర్మం, ఎత్తైన వక్షోజాలు, నున్నని చంపలు, ముక్కు పుడకా చీరలో తన దేహం ఒదిగిపోవడం, గాజులు నగలు చుస్కూంటూ మురిసిపోతున్న ఫీనిక్స్‌ని చూస్తూ సౌమ్య మెల్లగా ఇక తర్వాతేంటి ఫీనిక్స్? అనడిగింది దిగులు విషాదం నిండిన కళ్లతో చూస్తూ! ఆ కళ్ళల్లో జారే కన్నీటిలో వినయ్ కనిపించి వణికిపోయింది ఫీనిక్స్.
తన ప్రేమికుడి వినయ్ తిరస్కారం, నెలరోజుల్లో అతగాడికి మరో అమ్మాయితోపె ళ్లి జరగడం,సౌమ్యని కుంగదీసింది. ఆమెనే కాదు,ఇంటిల్లి పాదినీ .ఆరోజు రాజశేఖర్ కానీ,సౌమ్య కానీ తమ తమ గదులు తెరిచి బయటకు రాలేదు. ఫీనిక్స్ దిగులు దిగులుగా ఇల్లంతా తిరుగుతూనే ఉంది. “సౌమ్యా తలుపు తెరువు” అని సౌమ్య గది ముందు నిలబడి తడుతూనే ఉంది. జ్వలిత మాట పడిపోయినట్లే కూర్చండిపోయింది. ఆరోజెవరూ అన్నాలు తినలేదు. ఫీనిక్స్ కుమిలిపోయింది. తల్లిని పలకరించే సాహసం చేయలేకపోయిది.
***
అమ్మా, నాన్నా, సౌమ్యా!
నేను వెళ్లిపోతున్నాను. ఎక్కడికో తెలీదు ప్రస్తుతం అయితే నా స్నేహితులు రమ్మన్న దేశంలోని సుదూర ప్రాంతానికి. మాకు కొంచెం గౌరవం, స్నేహం, ప్రేమ దొరికి మనుషులుగా మిమ్మల్ని మేం నిరూపించుకోగలిగే దేశానికి. మా సమూహంలోకి. మీరంతా నన్ను ఎంతో ప్రేమించారు. సహించారు. భరించారు. ఎనలేని త్యాాలు చేశారు. మీ ముగ్గురికి నా పాదాభివందనాలు.మీరంతా నన్ను అర్థం చేసుకున్నారు.కానీ సమాజం ఇంకా ఆ స్థాయికి చేరలేదు. సౌమ్యకి పెళ్లి కావాలి. నేను వెళ్లిపోతేనే అవుతుంది. మెల్లిగా జనం నన్ను మర్చిపోతారు. సౌమ్యను అంగీకరిస్తారు. నేను జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకుంటానో, లేదో తెలీదు కానీ మై డియర్ ఫ్యామిలీ, మీకు తల వంపులు తెచ్చే పని మాత్రం చేయను. ఎంతమంది ట్రాన్స్జెందర్స్ డాక్టర్స్, లాయర్స్ కావాట్లేదమ్మా? నేనూ అల ఏదో ఒకటి అవుతానమ్మా. మా క్వీర్ కమ్యునిటీ పైన సమాజం చేస్తున్న దౌర్జన్యాలకి వ్యతిరేకంగా పోరాడ తానమ్మా. మా హక్కుల కోసం పోరాడుతాను. చదువెలాగూ ఆగిపోయింది. నాకు మ్యూసిక్ లో ఉన్న ఆసక్తిని కొనసాగించి మంచి మ్యుసిషియన్ అవుతాను. పాటలతో సమాజాన్ని క్వీర్ కమ్యునిటీ సమస్యల పట్ల చైతన్యం కలిగిస్తాను. అమ్మా నాన్నా, బంగారు చెల్లీ నాకో లక్ష్యం ఉంది. దాన్ని చేరుకోనివ్వండి నన్ను. అమ్మా నీకు నా పాత, నా సంగీతం ఎక్కడున్నా వినిపిస్తాను. ఇప్పటికైతే నేను నా స్వంత దేహంతో నాకంటూ ఒక ప్రత్యేకమైన పేరుతో పిలిపించుకునే స్థాయికి చేరుకున్నా. ఇక నా జీవితం నాది. నేనే అన్నీ భరిస్తాను. ఇక మీరు మీ కోసం, సౌమ్య కోసం జీవించండి. వేరే రాష్ట్రం వెళ్ళిపొండి. సౌమ్యకి మంచి సంబంధం వస్తుంది. నేను సౌమ్య అత్తారింటికి వెళ్లిపోయాక వచ్చి కలుస్తాను. నేను ధైర్యంగానే ఉన్నాను. నాకు నా కమ్యూనిటీ అండ ఉంది. ఏడ్వకండి నా కోసం. ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండండి. నేను ఎక్కడున్నా పలకరిస్తూనే ఉంటాను. దిగులుపడకండి. సౌమ్య గురించి ఆలోచించండి.
ప్రేమతో ,
మీ పెద్ద కూతురు ఫీనిక్స్!
ఒక తెల్లవారుఝామున ఇంట్లో ఫీనిక్స్ కనబడలేదు. ఆమె రాసిన ఉత్తరం మాత్రం దొరికింది. వీడ్కోలు అక్షరాలను కన్నీళ్లతో చూసుకుంది జ్వలిత. “మీ పెద్ద కూతురు ఫీనిక్స్”అనే అక్షరాలను దు:ఖంతో ముద్దాడింది. రాజ శేఖర్ కుప్ప కూలిపోయాడు సౌమ్య కదిలి, కదిలి ఏడవసాగింది. గోడ మీది ఫోటో ఫ్రేంలో ఎర్రటి చీరలో సంతోషం పొంగిపొర్లుతున్న నవ్వుతో, మెరుస్తున్న కళ్లతో అనుకున్నది సాధించిన ధీమాతో ఫీనిక్స్ వెలిగిపోతూ ఉంది.
అవును “ఫీనిక్స్” ఎగిరిపోయింది. మళ్ళీ కాలి బూడిద అవ్వదు కదా “ఒహ్హ్ సూర్యుడా దాక్కో” జ్వలిత భయం తో వొణికింది. ఉహూ ఫీనిక్స్ జీవిత కాలం పద్నాలుగు వందల ఏళ్ళట. నా పెద్ద కూతురు అన్నేళ్లు బతుకుతుంది అంతే! జ్వలిత తనకి తాను ధైర్యం చెప్పుకుంది.
విభ్రాంతి కల్గించిన కథ. వ్యక్తి ఆకాంక్షలను దాటి కుటుంబం వరకూ సాగి సహకరించిన కథ. Post modern story. ఇంత రాసి సౌమ్య కి మంచి సంబంధం రావాలి అన్న ఆలోచన .. వీడకపోవడం పాత్ర ఆలోచన !? ఎనీ హౌ.. జెండర్ ట్రాన్స్ కి కుటుంబ ఆమోదం కొరకు ప్రయత్నించి సఫలీకృతం అయిన కథగా, సమాజ ఆమోదయోగ్యం కోసం .. ఎదురుచూసే కథ ని (వాస్తవిక కథలను) మన ముందు పెట్టినందుకు
డా. గీతాంజలి గారికి అభినందనలు.