కవిత్వం చదువుతున్నపుడు కవి ఎవరు ఏమిటి కంటే ఆ కవి ఏమంటున్నాడు? ఎటువైపు వున్నాడు అన్నది మనసు వెంట నడుస్తా వుంటుంది. తనదైన దృష్టి, తనదైన దృక్పథం ఉన్న కవి వాక్యం హృదయంతో చదివిస్తుంది. కవిత్వాన్ని ఇష్టంగా చదువుకునే క్రమంలో నాకు నచ్చిన కవినో, కవితనో, కవిత్వాన్నో ఈ ‘గుండె చప్పుడు’లో పంచుకుంటానని మనవి.
ఈ ఆసక్తితో… చాలా కాలం అక్రమ నిర్బంధంలో ఉంటూ ఇటీవలే విడుదలైన ప్రొపెసర్ జి.ఎన్. సాయిబాబా గారు జైల్లో వున్నప్పుడు రాసిన కవిత్వం (నేను చావును నిరాకరిస్తున్నాను) చదువుతున్నప్పుడు వర్తమానం కళ్ళముందు కదిలాడింది. చరిత్ర పొరల్లోకి తొంగిచూసిన గుండెకు వాస్తవాల తారీఖులు ములుకుల్లా గుచ్చుకున్నాయి.
ఉద్యమకారుడిగా, మానవహక్కుల కార్యకర్తగా, రచయితగా ఆచార్య జి.ఎన్ సాయిబాబా గారు సుదీర్ఘ కాలంగా రాజ్యంతో పోరాటం చేస్తూనే ఉన్నారు. వుంటే బయట, లేదంటే లోపల చైతన్య సమూహాలతోనో, చర్చలతోనో అట్టడుగు గొంతులకు అండగా మాట్లాడుతూనే ఉన్నాడన్న వాస్తవం మనల్ని ఆలోచింపజేస్తుంది. అభిమానం పెంచుతుంది.
తాను జీవించిన కాలాన్ని తన రచనల్లోకి ఒంపడమే కాక, తనదైన చారిత్రక అవగాహనతో మాట్లాడిన ఈ కవితలు (ఇంగ్లీషు కవితలకు తెలుగు అనువాదం) వర్తమాన సమాజం పట్ల సాయి గారి అవగాహనను తెలియజేస్తాయి. అక్రమ నిర్బంధపు కాలంలో వ్యక్తిగా ఆయన సమాజంలో తిరుగాడకపోయినా హృదయంతో సమాజాన్ని అర్ధం చేసుకున్న తీరు, లోపలి తాను బయటి ప్రపంచంతో సంభాషిస్తూ, సంఘర్షిస్తూ ఉన్న చైతన్యం మనల్ని కూడా చైతన్య పరుస్తుంది. ఎంతోకాలంగా ఆదివాసీ, దళిత సమాజపు హక్కులకోసం, అట్టడుగు ప్రజల బాగుకోసం తపిస్తున్న వారి హృదయం వినిపిస్తుంది.
చాలా వ్యూహాత్మకంగా రాజ్యం సాగిస్తున్న హింసను, కుట్రను స్పష్టంగా గమనిస్తున్న కవి ఎరుక, అంచనా అర్ధమవుతుంది. ఇపుడు ‘నేను చావును నిరాకరిస్తున్నాను’ సాయిబాబా అండాసెల్ కవిత్వం మొత్తాన్ని చర్చించిబోవడం లేదు కానీ అందులో “నా గుండె చప్పుడు నీకర్ధం కాదు” క్లుప్తంగా పరిచయం చేస్తాను.
“కులాల మతాల తెగల చీలిక పేలికల బొంత పురుగుల్ని తింటూ/దేశం అభివృద్ధి చెందేది ఏముంటుంది,” అని పాలకుల ముఖంలోకి చూసి మరీ నిలదీసిన ఈ కవిత దళితుల ఆత్మగౌరవ చారిత్రక ఘటన నేపథ్యంగా సంభాషిస్తుంది. పీడనకు గురవుతున్న జాతి గుండె ఘోష మీకు వినిపీదని, అర్ధం కాదని పెత్తందారులను ఎందుకు అంటున్నాడో చరిత్రలోకి తొంగి చూడాల్సిందే. భీమా కోరేగావ్ వంటి ఘటనల్ని చదవాల్సిందే. కట్టుకథల్ని, పిట్టకథల్ని పక్కకు నెట్టి సత్యాన్ని కళ్ళకు అద్దుకోవాల్సిందే. ఆ రకంగా దళితుల ఆత్మగౌరవ చారిత్ర ఘట్టం భీమ కోరేగావ్ గురించిన వారి దృష్టి స్పష్టమవుతోంది.
జి.ఎన్. సాయి గారి కవితల్లో నాకు చాలా ఇష్టమైన ఈ కింది కవితను గురించి ప్రస్తుతానికి పరిచయం చేస్తున్నాను. చదవండి…
నా గుండె చప్పుడు నీకర్థం కాదు
చక్రవర్తుల తూటాలు కూల్చలేని
రెండొందల ఏళ్ల మట్టి విగ్రహం
అంటరాని స్పర్శకి కుప్పకూలింది
నువ్వు కోరేగావ్ దళిత హృదయాన్ని అర్థం చేసుకోలేవ్
చీమల సేనలు
శ్రామిక సైన్యం
ప్రేమిక దళం
నేలలోంచి మొలుచుకు వచ్చిన మట్టి చేతుల బలగం
అంటరాని గుండెల దండు
ప్రేమ స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు కోరే
కోట్లాది తిరగబడ్డ హృదయాలు
ఇద్దరు చక్రవర్తుల ఉత్థాన పతనాలను
విషాద గీతంగా ఆలపిస్తున్నాయ్
నువ్వు కోరేగావ్ భీమా హృదయాన్ని
అర్థం చేసుకోలేవ్
కులాల మతాల తెగల చీలిక పేలికల బొంత పురుగుల్ని తింటూ
దేశం అభివృద్ధి చెందేది ఏముంటుంది
దేశం దొడ్డికి పోయే డొప్పల గుండా
ప్రవహిస్తుందా
నువ్వు భీమా కొరేగావ్ గుండె చప్పుడు ఎప్పటికీ వినలేవ్.
(తెలుగు: బాసిత్)
*
పై కవితలో కవిగా సాయి బాబా గారు దళితుల ఆత్మగౌరవాన్ని చిత్రించారు. తరాలుగా అస్తిత్వపు పోరాటాన్ని గుర్తుకు తెచ్చారు. ముఖ్యంగా పాలకులకు పాలకుల వెనక పనిచేస్తున్న ఫాసిస్టులకు దళితుల అస్తిత్వం, ఆత్మగౌరవం అన్నవి అర్ధం కాని వాస్తవాన్ని వివరిస్తాడు. కుల పునాదుల పై ఊరేగుతూ, తన మూర్ఖత్వాన్ని కొనసాగిస్తున్న ఆధిపత్యపు సమూహానికి చారిత్రక సత్యం, అందులో దాగిన ఆత్మగౌరవపోరాట స్ఫూర్తి ఎప్పటికీ అర్ధం కావు అన్న స్పష్టతను సూటిగా చెప్పడం ఈ కవితలో మనం గమనిస్తాం. ఒక దళితుల అంశమే కాదు, ఆదివాసీలు, కుల, మత ప్రాతిపదికన హింసకు గురవుతున్న మూలవాసులు ఎందరో ఈ కవిత మాటున కన్నీటి చెంపలై కనిపిస్తారు. నిబద్ధతగల ఉద్యమాకారుడి కలం నుంచి వెలువడిన ఇటువంటి కవితల్ని ఈ జైలు కవితల్లో మనం చదవచ్చు.
ఈ విధంగా కవి తాను జీవించిన కాలపు గుండె చప్పుడ్ని వినిపిస్తున్న ఈ కవితను గుండెకు హత్తుకుంటూ అక్రమ నిర్బంధం నుంచి నిర్దోషిగా ఇటీవలే మనమధ్యకు వచ్చిన ఆచార్య సాయిబాబా గారికి శుభాకాంక్షలతో…
*
నన్ను కదిలించిన మరో కవితోనో కవితతోనో మళ్లీ కలిసేదాక సెలవు…