ఆచార్య కేశవకుమార్ వృత్తిరీత్యా తత్వశాస్త్ర అధ్యాపకులు, ప్రవృత్తి రీత్యా అసమ సమాజాన్ని
అక్షరాలలో బంధించిన అభ్యుదయ కవి. పుట్టి పెరిగిన అమృతలూరు పల్లె గడప నుంచి అత్యున్నత స్థాయి ఢిల్లీ విశ్వవిద్యాలయం వరకు అనితర సాధ్యం కాని ప్రస్థానాన్ని సాగించిన విద్యావేత్త. పాండిచ్చేరి, భువనేశ్వర్, హైదరాబాద్ విశ్వవిద్యాలయాల్లో జ్ఞాన సముపార్జన చేసిన అధ్యాపకులు. ‘దళిత ఉద్యమం వెలుగునీడలు’ వ్యాస సంకలనకర్తగా ప్రసిద్ధులు. ‘బహుజన కెరటాలు’ పత్రికకు కొంతకాలం ప్రధాన సంపాదకులుగా పనిచేశారు. అంబేద్కర్ పొలిటికల్ ఫిలాసఫీ మీద, దళిత మూవ్ మెంట్స్ మీద ప్రామాణిక సిద్ధాంత గ్రంథాలు రచించిన పరిశోధకులు. అన్నిటినీ మించి దళిత చైతన్యాన్ని కాంక్షించి అక్షరాన్ని ఆయుధంగా ప్రయోగించిన ఉత్తమ కవి.
యూనివర్సిటీ చదువుల్లో కొనసాగే కుల వివక్షణ వ్యతిరేకిస్తూ ‘విస్పోటన’ సాహితీ సంస్థను ఏర్పాటు
చేశారు. కవిత్వాన్ని ఉబుసుపోక చేసే పనిగా కాకుండా అంటరానితన వ్యతిరేక ఉద్యమానికి ప్రతీకగా
తీర్చిదిద్దారు. నిరంతరం సాహిత్యం గురించి చర్చిస్తూ, యూనివర్సిటీ గోడల మీద కవిత్వాన్ని పోస్టర్’గా
అంటించి దళిత విద్యార్థుల్లో చైతన్యాన్ని, సంఘటితాన్ని ప్రోది చేశారు. 90వ దశకంలో యూనివర్సిటీని బలంగా ప్రభావితం చేసిన విప్లవ, దళిత, స్త్రీవాద ఉద్యమాలతో కొత్త చూపు ఏర్పాటు చేసుకున్నారు. ‘ప్రోగ్రెసివ్
స్టూడెంట్స్ ఫోరం’ ఏర్పాటు చేసి విద్యార్థి రాజకీయ ఉద్యమాల్లో యువత పాత్రను ప్రభావితం చేసేలా కవిత్వం రాశారు.
చాలా ఆలస్యంగా దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత విలువరించిన మొదటి కవితా సంపుటి
‘ఆదిమ పౌరుడు’. గోడల మీద పోస్టర్స్ అంటించి ప్రచారం చేసిన కవిత్వ పరిధిని దాటి గుండెలోతుల్ని
స్పృశించే నిఖార్సైన కవిత్వాన్ని ‘ఆదిమ పౌరుడు’గా అందించడం వెనుక నాలుగు దశాబ్దాల ఆవేదన ఉంది.
నానాటికీ తీవ్రమవుతున్న వివక్ష పట్ల ఆక్రోశం ఉంది. ఏడున్నర దశాబ్దాలుగా దేశాన్ని పట్టిపీడిస్తున్న
అంటరానితనం పట్ల తీవ్ర నిరసన ఉంది. ప్రేమ పేరుతోనో, వివక్ష పేరుతోనో అసువులు బాస్తున్న దళితుల పట్ల సానుభూతి ఉంది. కులం పేరుతో, మతం పేరుతో దళిత బహుజనులలో చీలికలు తెస్తున్న రాజ్య విధానాల పట్ల ప్రతిఘటన ఉంది. నకిలీ దేశభక్తిని అసలైన దేశభక్తిగా ప్రచారం చేస్తున్న ‘మాంత్రికుడి వికటాట్టహాసం’ పైన అంతులేని ఆవేదన ఉంది. అన్నిటినీ మించి మనిషిని కులంగానో, మతంగానో కాకుండా మనిషిగా గుర్తించాలని ఆకాంక్ష ఉంది.
డెబ్భై తొమ్మిది సంవత్సరాల వయసుతో భారతదేశం వైజ్ఞానికంగా, సాంకేతికంగా పురోగమిస్తూనే
ఉంది. అంతరిక్ష పయనాలు, అత్యాధునిక క్షిపణి ప్రయోగాలతో దూసుకుపోతూనే ఉంది. అయినా దళిత
జాతిలో చెప్పుకోదగినంత మార్పులు ఏమీ లేవు. చదువుల్లోనూ, పదవుల్లోనూ ‘ఆధిపత్యం’ కిందే
నలిగిపోతున్నారు. సాంఘికంగానూ, ఆర్థికంగానూ ఎప్పుడూ వెనకడుగే. రెండు గ్లాసుల పద్ధతి, వెలివేతలు,
వివక్షలు, పరువు హత్యలు… ఇవన్నీ దేశానికి ‘కులం’ నేర్పిన విద్యలు.
“సునీతా… ఓ సునీతా నా ప్రియమైన సునీతా!
మా ఆనందాల్ని, కలల ప్రపంచపు డొల్లను
నువ్వు త్రీడీలో చూసి జారుకొన్నావు
ఇప్పుడు మేం ఒకరి కళ్లల్లోకి ఒకరం అనుమానంగా చూసుకుంటున్నాం
ఒకరి ఆలోచనల్లోకి ఒకరం మైక్రోస్కోప్’లో చూసి
కోరలు ఉన్నాయేమోనని వెతుకుతున్నాం
హఠాత్తుగా జీవితం అంటే భీతిల్లిపోయి
‘ప్రేమ’కు రక్తం అంటుకున్న విధ్వంసాన్ని చూసి
భయంభయంగా బతుకుతున్నాం” (ఆ పిల్ల ఈ ప్రపంచాన్ని తన్ని ఎటో వెళ్లిపోయింది)
అగ్రజాతి అమ్మాయిల్ని ప్రేమించిన దళిత అబ్బాయిలకి, దళిత జాతి అమ్మాయిల్ని ప్రేమించిన
అగ్రజాతి అబ్బాయిల్లో శిక్షలు మాత్రం దళిత కులాలకే. ఎవర్ని ఎవరు ఎవరిని ప్రేమించినా చావు మాత్రం
దళితుల్నే వరిస్తుంది. ఎన్నో అవమానాల్ని మోసి, అన్యాయాల్ని భరించి యూనివర్సిటీ మెట్లు ఎక్కినా ‘కుల’
భావన పైటకొంగులా వేలాడుతూనే ఉంటుంది. బహిరంగంగా కొందరు, రహస్యంగా మరికొందరు దళిత జాతి
ఆడపిల్లలందరూ ‘ప్రేమ’కాటుకు బలై ఉరికంబానికి ఎక్కుతూనే ఉన్నారు. ఎక్కడో మారుమూల పల్లె
‘వెల్లటూరు’ నుంచి ‘హెచ్.సీ.యూ’ గడప తొక్కిన సునీత లాంటి ఆడపిల్లలు అందరూ ‘ఈ ప్రపంచాన్ని తన్ని
ఎటో వెళ్లిపోయారు’. వాళ్ళను మోసం చేసిన అగ్రజాతి అబ్బాయిలు మాత్రం ‘కోర్టు ముఖం మీద ఒంటెలు పోసి
పెళ్లి కొడుకుల్లా’ మారుతూనే ఉన్నారు. ప్రేమ ఎంత బలమైనదో, మరింత బలీయమైందో, ఎంతమంది
ప్రేమికులు ‘ప్రేమ’కులా’నికి బలవుతున్నారో చెప్తూ “ప్రేమ పట్టుని విడువని విక్రమార్కుడిలా/ కులపురంలో/
ధర్మ కత్తి పట్టుకొని సాహసంతో/పయనమైన ఇలవరుసుడు/ ప్రేమ దివ్యత్వాన్ని పూసుకుందామని” కులం
కాటుకు క్రూరంగా బలైన ‘ఇలవరసు’ని ప్రేమగా తల్చుకుంటారు. ఎలా మొదలవుతాయో తెలియని ‘ప్రేమలు’
ఎలా ముగుస్తున్నాయో మాత్రం అంచనా వేసే పరిస్థితిలో వర్తమాన సమాజం నడుస్తోంది. అందుకే ‘ఎన్నటికీ
కలవని రైలు పట్టాలని కలుపుతూ ఇలవరుసు రక్తం ప్రవహిస్తోంది’ అంటున్నాడు కవి.
జ్ఞాన సముపార్జనలో ‘ప్రశ్నించడం’ కీలకం. ఏది ఎందుకు జరుగుతుందో ప్రశ్నించినప్పుడు నిజాలు
వెలుగులోకి వస్తాయి. మనో వికాసం కలుగుతుంది. ఏది సత్యమో, ఏది అసత్యమో లోకానికి వెల్లడవుతుంది.
ఈ సంపుటిలోని ‘మనుషుల్లేని దేశం’, ‘తలొంచుకుపోదాం’, ‘కరుకు కాలం’, ‘చెడగొట్టాలి’ లాంటి కవితలు ఇదే
భావాన్ని వ్యక్తం చేస్తాయి. అయినా ఈ దేశంలో ‘ప్రశ్నించడం’ నేరం. ఒకే జనగణమన, ఒకే వందేమాతరం
పాడుతున్నా మనుషుల్లో చీలికలు. గాలీ, నీరూ, నేలా అందరివీ అయినా కొందరికే వాటిమీద హక్కుభుక్త
అధికారాలు. నాయకులంతా అధికారాన్ని చలాయిస్తూ, అజ్ఞానాన్ని కాల్చిన గుడ్డలా మార్చి దేశం మీదకి
విసిరేస్తూ, ప్రశ్నించిన వాళ్లని పాతరేస్తూ ‘మనుషుల్లేని దేశం’ ఎలా ఉంటుందో ఇలా చెప్తున్నాడు కవి.
“నకిలీ దేశభక్తిని / నిజం దోపిడీని /
వొళ్లంతా విభూదిలా రాసుకుని/
దేశం దిమ్మపై/ మాంత్రికుడి వికటాట్టహాసం /
‘నేను శాసనాన్ని, దేశాన్ని, దేవుడ్ని!’
దేశమిప్పుడు/ అందమైన అబద్ధాల శవపేటిక”
నాయకులకు వాగాడంబరం ఉంటే చాలు, చిత్తశుద్ధి అక్కర్లేదు. క్షణానికో రూపం మారుస్తూ
ఊసరవెల్లిలా ఉంటే చాలు, నిజాయితీ అక్కర్లేదు. అబద్ధాలని, అన్యాయాల్ని వెంటేసుకుని నకిలీ దేశభక్తిని
నిజమైన దేశభక్తిగా ప్రచారం చేస్తూ దేశాన్ని అందమైన అబద్ధాల పేటికగా తయారుచేశారని చెప్తున్నాడు కవి.
అబద్ధాలు చెప్పడం అసలైన దేశభక్తిగా, ప్రశ్నించడం ఘోరమైన దేశద్రోహంగా నడిచే ఈ దేశంలో ‘తలొంచుకు పోవడం’ ఒక ఆర్ట్ అని చెప్తున్నాడు కవి.
“ప్రశ్నల తలలు తెగిపడిన చోట/ పురాణ కథలకి ఖర్చయిపోయిన చరిత్ర/
మనిషి మతం గుమ్మానికేలాడదీసిన దిష్టిబొమ్మ
కర్మ శాస్త్రాల్లో ఇరుక్కుపోయిన అక్షర స్రాద్ధాలు
ఫలితమాశించకుండా / గొడ్డులా పనిచేసుకుపోవడం పరమధర్మం
ప్రశ్నలు తెగినచోట/ కడుపు కాలుతున్నా/శవాలుగా బతకడమో ఆర్ట్”
అభివృద్ధిపరంగా ముందుకెళ్తున్నామో, ఆచారాల పేరుతో వెయ్యేళ్ల వెనక్కి వెళ్తున్నామో తెలియనంత
అయోమయస్థితిలో నేటి ఆధునిక భారతం కొట్టుమిట్టాడుతోంది. పుక్కిట పురాణాల్ని చెవికెక్కేలా బోధించే
పండితులు ఎక్కువయ్యారు. ‘కర్మ’ సిద్ధాంతం ప్రకారమే నీ బతుకు ఇలా అయిందని చెప్పే వేదాంతులు
పెరిగిపోయారు. వేదాల్ని, శాస్త్రాల్ని, పురాణకథల్ని ప్రశ్నించడం దేశద్రోహం. ప్రశ్న ఎదుటివాడి గుండెని చీల్చే చురకత్తే కావచ్చు, కానీ అదే చురకత్తిని ప్రశ్నించిన వాడి గుండెల్లోకి దింపడమే నేటి రాజకీయం. ‘ప్రశ్న
లేకపోతే ప్రగతి శూన్య’మన్నది పాతమాట. ‘ప్రశ్నించేవాళ్లు బతికుండడం ప్రమాదకరం’ అన్నది నేటిమాట.
అందుకే అనాదికాలం నుంచీ ప్రశ్నించినవాడి గొంతును రాజ్యం నొక్కుతూనే ఉంది. ముక్కలుగా నరికి
కాకులకీ గద్దలకీ విసురుతూనే ఉంది. ప్రశ్నించినవాడిని ‘అహింసా బూటుకు నలిగిన చీమల రక్తం
అంటుకుందనే’ అతి చిన్న కారణంతో చంపడం ఈ దేశంలో చాలా తేలిక. ప్రశ్నించడమే నేరంగా, పాపంగా
పరిగణించబడుతున్న చోట తరతరాల హింసని మోస్తూ గతం చీకటిలో మనగరదీసుకుని పడుకుంటే ఏదో ఒక నాటికి ఈ దేశం అంతరించిపోతున్న జాతిలో కలిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు కవి.
దేశాల మధ్య శాంతిలేదు, సహనం లేదు, సమానత్వం లేదు, సామరస్య పూర్వక వాతావరణం లేదు.
గెలవడమో, గెలిపించడమో అనే యుద్ధక్రీడలో పెద్దదేశాలు గద్దెనెక్కి వేడుక చూస్తుంటే, చిన్న రాజ్యాలు
మట్టిదిబ్బలుగా మారిపోతున్నాయి. గెలవడమే లక్ష్యం తప్ప ప్రజాసంక్షేమం అక్కర్లేదు. ఆధికారం చేపట్టాలనే
ఆలోచన తప్ప దేశ ప్రగతి పట్ల ధ్యాస లేదు. యుద్ధాల పేరుతో భయానక వాతావరణం సృష్టించడం కంటే
దేశాల మధ్య స్నేహపూర్వకంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణి కొనసాగాలనే ఆశాభావాన్ని ఇలా వ్యక్తం చేస్తున్నాడు
కవి.
“ఈ యుద్ధాలొద్దు / ఈ చీకటి తత్వాలొద్దు తాత్విక తోవ
మారాలిప్పుడు / ప్రేమే నీతిగా న్యాయంగా” (నువ్వే నేనుగా)
సామాన్యులెప్పుడూ యుద్ధక్రీడలో బలిపశువులే. ఆస్తుల్ని, ఆప్తుల్ని వదిలేసి ప్రాణభయంతో
పారిపోయే బలహీనులే. అలాంటి పరిస్థితి మారాలని కోరుతున్నాడు కవి. శాంతికి నిలయంగా, ధర్మానికి
పట్టుగొమ్మగా విలసిల్లిన దేశంలో అధర్మం పెచ్చరిల్లడం, శాంతిని కాపాడాల్సిన యంత్రాంగం చేతగానితంతో
చూస్తుండడం దేశ సమగ్రతకు ఏనాటికైనా గొడ్డలిపెట్టని నినదిస్తున్నాడు కవి.
‘దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ అన్నది గురజాడ మాట. దేశమంటే
మట్టేనోయ్… దేశమంటే గోవులేనోయ్’ అన్నట్లుగా నేటి పరిస్థితి మారిపోయింది. దేశంలో ఏ మూలకు వెళ్లినా
దళితుల జీవితాల్లో కనిపించని ఎన్నో చీకటికోణాలు తొంగి చూస్తూనే ఉన్నాయి. కులగోత్రాల కోసం,
మలమూత్రాల కోసం తన్నుకుచచ్చే దేశంలో మనిషి ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. అందుకే ఆ
పరిస్థితిని ఇలా చెప్తున్నాడు కవి.
“ఇప్పుడు స్కూలులో కాలేజీల్లో యూనివర్శిటీలలో
పార్లమెంటులో పేవుమెంటులో
పేపర్లలో టీవీల్లో సోషల్ మీడియాలో
అన్ని చోటుల్లో ఆవులే / మనుషులు మాయమైపోయే
జై గోమాతగోరూ!” (అధికార ధేనువు)
గోవుల్ని దొంగిలిస్తున్నారనో, గోమాంసం అమ్ముతున్నారనో దళిత బహుజనుల పట్ల దుర్మార్గంగా
ప్రవర్తిస్తున్న రోజులివి. గోమూత్రాన్ని సేవించినా, గోమయాన్ని స్వీకరించినా పరమ పవిత్రమనే బోధలకు
కొదవలేని కాలం. గోవుల్ని పూజించడం మంచిదని చెప్పేవాళ్లు, సాటి మనిషిని ప్రేమించాలని చెప్పడాన్ని
ఎందుకు మర్చిపోతున్నారో అర్థం కాని పరిస్థితి. అందుకే సనాతన ధర్మకాలం నాటి యజ్ఞగుండంలో, నేటి
అధికారమనే అగ్నిగుండంలో దళితులెప్పుడూ బలిపశువులే అని ఆవేదన చెందుతున్నాడు కవి.
“ఊర్లు మారుతుంటాయి / బాధితుల పేర్లు మారినట్టు
మాలో మాదిగో మహరో చెమారో
కోటేశో కారంచేడో ఇళవరసనో కీళ్వేన్మనో
హత్రాసో ప్రణయో జజ్జరో టేకు లక్ష్మో
ఈ దేశమంతా అదే అత్యాచార ఆచారం
హతుడు ఎప్పుడూ ఒక్కడే / హంతకుడు కూడా అనాదిగా ఒక్కడే
వాడి పేరేదైతేనేం అదే కుల క్రౌర్యం” (నా పేరే రేపటి పోరురా)
ఏ దేశమేగినా, ఎందుకాలిడినా కులమెప్పుడూ నిన్ను వెంబడించే నీడ అన్నట్లుగా నేటి పరిస్థితి
మారిపోయింది. ప్రాంతాలు మారుతున్నాయి తప్ప దళితుల పరిస్థితుల్లో మార్పుల్లేవు. అకారణంగా దళితుల్ని
కొట్టి చంపడం, చిన్న కారణాలకే నిలువునా తగలబెట్టేయడం, దళితుల్ని చంపి శవాల్ని డోర్ డెలివరీ చేయడం లాంటి సంఘటనలు నిత్యమూ చూస్తున్నవే, చదువుతున్నవే! అధికారం మారినప్పుడల్లా దళిత పల్లెలు అగ్నిగుండాల్లా మారుతుంటాయి. స్త్రీలపైన అత్యాచారాలు దీర్ఘయజ్ఞంలా కొనసాగుతుంటాయి. దళితుల్ని నరికి కాలువల్లో విసిరేయడాలూ, స్త్రీలను మానంభంగం చేసి హత్య చేయడాలూ మామూలైన చోట ‘ఈ దేశాన్ని అత్యవసరంగా సానిటైజ్ చేయాల్సిందే’ అని సందేశాన్నిస్తున్నాడు కవి. ప్రశ్నించే వేళ్లను విరిసినా ఆత్మగౌరవ పల్లెలు అంకురిస్తూనే ఉంటాయనే వాస్తవాన్ని చెప్తున్నాడు కవి. కేశవ్
కుమార్ అభ్యుదయ భావాల్ని, చైతన్య భావజాలాన్ని అనువణువూ నింపుకున్న కవి. సమాజంలో
జరుగుతున్న పరిణామాల్ని నిశితంగా పరిశీలిస్తూ వాటిని అత్యంత ప్రభావవంతమైన కవిత్వంగా మలచడంలో సిద్ధహస్తుడు. విశ్వవిద్యాలయాల్లో దళితుల్ని హేళన చేయడాన్ని నిరసిస్తూ ‘మానవీయ సువాసనలతో తాత ముత్తాతల చెమట చుక్కల్లోంచి పుట్టి పెరిగిన విజ్ఞానపు పునాదుల్తో’ కట్టబడే కొత్త యూనివర్శిటీకి స్వాగతం పలుకుతున్నాడు. కులం కట్లు తెంచి, మతం ముడులు విప్పుకుని, రాజ్యానికి, దేశభక్తికి అవతల నుంచున్న ప్రపంచ ‘ప్రథమ పౌరుడి’ గా తనను తాను ప్రకటించుకుంటున్నాడు. దేశాన్ని ఏలే ‘నల్లనల్లని పాటల’ కోసం కలలు కంటున్నాడు. ‘పోగుచేసిన అక్షరాలని సాగుచేసి, కొత్తపదాలుగా చీకటి మీద పరచాల’ని తహతలాడుతున్నాడు. అన్నిటినీ మించి ‘ప్రజాస్వామ్యమంటే… ఒక దేశానికో, మతానికో, సామాజిక సమూహానికో తలవంచడం కాదనీ, ఆధిపత్యంపై మనిషి చేసే అలుపెరగని ఆత్మగౌరవ పోరాటమనీ’
నిర్వచిస్తున్నాడు. నాలుగు దశాబ్దాల నివురుగప్పిన నిప్పుగా, చైతన్యజ్వాలగా మార్చిన ‘ఆదిమ పౌరుణ్ణి’
మనకందిస్తున్నాడు. దళితుల కుల సంఘర్షణ నేపథ్యంగా భవిష్యత్తులో వారినుంచి మంచి అగ్ని కణికల్లాంటి
కవితా సంపుటాలు రావాలని కోరుకుంటున్నాను.