నాగలకట్ట సుద్దులు : వస్తువైవిధ్యం, రూప వైశిష్ట్యం

‘నాగలకట్ట సుద్దులు’లో వస్తు రూపాలు రెండూ సామాజికాలే. 2003 నుంచి 2006 వరకు దాదాపు మూడున్నర సంవత్సరాలపాటు వార్త దినపత్రికలో ‘శాంతిసీమ’ పేరుతో వెలువడ్డ యీ శీర్షిక వొక నిర్దిష్ట కాలానికి చెందిన రచనే అయినా దానిని శాంతి నారాయణ సార్వకాలీన రచనగా తీర్చిదిద్దాడు. ఆయన కేవలం కాలమిస్టు అయితే ఆ పని సాధించగలిగేవాడు కాదు. ఆయనలోని కవీ కథకుడూ అందుకు తోడ్పడ్డారు. రచ్చబండ మీద, వొక్కోసారి యింటి పంచలో, చెట్టు నీడలో చెప్పుకొనే సుద్దుల్ని వినూత్నమైన శైలిలో ఆయన కథలుగా మలిచాడు. కొండొకచో వాటికి కవిత్వ పరిమళాన్ని సైతం అద్దాడు. నాటకీయ శిల్పంలోకి యిమిడ్చాడు. సున్నితమైన హాస్యం మేళవించి వ్యంగ్య రచనగా తయారు చేశాడు. ఏ రూపంలో తీర్చిదిద్దినా వాటికి తనదైన ప్రాపంచిక దృక్పథాన్ని జోడించాడు. ఆ దృక్పథంతోనే కాలిక శీర్షిక రాజకీయ వ్యాఖ్యగా ప్రాణం పోసుకుంది. సామాజిక భాష్యంగా యెదిగింది. ప్రజాస్వామిక స్వభావాన్ని సంతరించుకుంది. సాహిత్యమై పరిమళించింది.

రచ్చబండ వొక మినీ చట్టసభ
ప్రజాస్వామిక సమాజంలో రచయిత ప్రతిపక్ష పాత్ర నిర్వహించాలని చెబుతారు. ప్రతిపక్షమంటే అధికారం కోసం గోతికాడ నక్కల్లా కాచుకు కూర్చోవడం అని అర్థం మారిన కాలంలో రచయిత వుండాల్సింది ప్రజల పక్షంలో. పాలితుల వైపు నిలిచి పీడితుల గొంతు వినిపించడమే రచయిత బాధ్యత. రచయిత ఆ పని మరచిననాడు సామాజిక నేరం చేసినట్టే అని శాంతినారాయణ గుర్తించబట్టే శాంతిసీమ కాలమ్ నాలుగు కాలాలు నిలిచింది.

రాయలసీమ అనంతపురం జిల్లా సింగనమల మండలం బండమీద పల్లె గ్రామంలోని నాగలకట్ట రచ్చబండ నాకొక మినీ చట్టసభలా గోచరించింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి తొలి బడిలా అనిపించింది. చట్టసభల్లో కాట్లాడుకునే ప్రజా ప్రతినిధులు అక్కడ వోనమాలు దిద్దాలి. రచ్చబండ సుద్దుల్ని వొజ్జబంతి రాతలుగా కూర్చడంలో శాంతి నారాయణ చూపిన నేర్పు అపూర్వం.

పాలకుల ప్రజా వ్యతిరేక విధానాల గురించి, పాలనా వ్యవహారాల్లో చోటుచేసుకొంటున్న అవకతవకల గురించి, అసంబద్ధ రాజకీయ నిర్ణయాల వల్ల దైనందిన జీవితంలో అడుగడుగునా ప్రజలు యెదుర్కొనే యిబ్బందుల గురించి, వ్యవస్థల్లోని లొసుగుల గురించి, అధికార యంత్రాంగంలో పాతుకుపోయిన అవినీతి అలసత్వం వంటి సమస్త అవలక్షణాల గురించి, పౌర జీవితంలో అనునిత్యం పెరుగుతున్న అభద్రత గురించి, విస్తరిస్తున్న కుల మత వైషమ్యాల గురించి కొమ్మోడు (తెలుగుదేశం పార్టీ), ఓబులేసు (కాంగ్రేసు పార్టీ), గంపన్న (వామపక్ష?), మల్లన్న పాత్రల ద్వారా చేసిన చర్చలు, జరిపిన సంభాషణలు, ప్రకటించిన అభిప్రాయాలు, వినిపించిన డిమాండ్లు, ప్రతిపాదించిన తీర్మానాలు, చేసిన అప్రకటిత శాసనాలు … పాఠకుల కళ్లముందు వొక mock assembly ని సాక్షాత్కరింపజేస్తాయి.

పక్కా లోకల్ విషయాల దగ్గర్నుంచీ మొత్తం రాష్ట్రానికీ దేశానికీ సంబంధించి తమను కల్లోలపరచే కలవరపెట్టే సమస్త విషయాల్నీ అక్కడ అతి సామాన్యులు చర్చకు పెడతారు. ఆ చర్చ యేకపక్షంగా సాగదు. ప్రతి వొక్కరికీ అభిప్రాయ వ్యక్తీకరణకు స్వేచ్ఛ వుంటుంది. వాళ్ళలో వొక్కొకరూ వొక్కో రాజకీయ పార్టీకో భావజాలానికో ప్రాతినిథ్యం వహిస్తారు. అందుకు అనుగుణంగా తమ వాదనని వినిపిస్తారు. ప్రజా సమస్యలకు పరిష్కారాలు వెదుకుతారు.

ఇవన్నీ ఆత్మాశ్రయ పద్ధతిలో మల్లన్న చెప్పిన కథలు. అందువల్ల మల్లన్నలో రచయిత కంఠస్వరం వెతుక్కుంటాం. కొన్ని సందర్భాల్లో మల్లన్న తక్కిన రచ్చబండ సభ్యుల్ని సమన్వయపరచి వారికి సర్దిచెప్పే స్పీకర్ లా పెద్దమనిషి పాత్ర పోషించినప్పటికీ చాలా సార్లు తనవైన అభిప్రాయాల్ని, నిర్ణయాల్ని ప్రకటిస్తూ వుంటాడు. గౌరవనీయ సభ్యులు అసభ్యంగా ప్రవర్తించకుండా ప్రజాస్వామిక సరిహద్దులు మీరకుండా అదుపుచేస్తూ వుంటాడు. రాజనీతిజ్ఞతని చూపుతాడు. ఒక మెంటర్ లా ప్రవర్తిస్తాడు.

ఫీచర్లో రాయలసీమ మాండలికం సొగసునీ సీమ ప్రాంతీయ అస్తిత్వ అంతరంగాన్నీ రచయిత యేకకాలంలో ఆవిష్కరించాడు. తాను పుట్టి పెరిగిన నేలపై అలవికాని అభిమానంతో ప్రేమతో మమకారంతో రాసినవే అయినప్పటికీ రచయిత ప్రకటించిన అభిప్రాయాలు నిష్పక్షపాతంగా న్యాయ బద్ధంగా వుండటం వల్ల చదువరుల విశ్వాసాన్ని చూరగొంటాయి.

కరువు కాటకాలు, కక్షలు, కార్పణ్యాలు, ఫ్యాక్షన్ రాజకీయాలతో భగ్గుమనే రాయలసీమ శాంతి సీమగా మారాలని ఆకాంక్షిస్తూ శాంతి నారాయణ అనంతపురం యాసలో నిర్వహించిన యీ కాలిక శీర్షిక సమకాలీన రాజకీయాల మీద ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ సంఘటనల మీద చేసిన వార్త వ్యాఖ్య మాత్రమే మిగిలిపోక తన చుట్టూ ఉన్న సమాజంతో రచయిత చేసిన ప్రజాస్వామిక సంభాషణగా రూపొందింది. ఒక సామాజిక సందర్భానికో, రాజకీయ సందర్భానికో సాధారణంగా పరిమితమయ్యే ఫీచర్లో రక్తమాంసాలున్న మనుషుల్ని పాత్రలుగా చేసి వారు నిత్య వ్యవహారంలో వుపయోగించే మౌఖిక భాషలోని సంభాషణల ద్వారా నాటకీయత సాధించటంలో శాంతి నారాయణ చూపిన ప్రతిభ అపూర్వమైనది. నాగలకట్టమీద కూర్చుని ఆ గ్రామీణులు చెప్పుకునే సుద్దుల్లోనే కొండని అద్దంలో చూపినట్టు మొత్తం సమకాలీన సమాజాన్ని ప్రతిబింబింప చేయటానికి యెన్నుకున్న యీ టెక్నిక్ ఫీచర్ కి కథానిక లక్షణాలు కూడా తెచ్చిపెట్టింది.

‘నాగలకట్ట సుద్దులు’లోని భాష, భావ గాంభీర్యం, వ్యంగ్యవైభవం, అధిక్షేప చాతుర్యం, తలకిందుల సామాజిక విలువలపట్ల అసహిష్ణుత, అపసవ్య – కుత్సిత రాజకీయ దుర్నయాల పట్ల ప్రకటించిన ధర్మాగ్రహం యీనాటికీ ప్రాసంగికంగా వుండటమే వాటి విశిష్టతను తెలియజేస్తుంది ఒక రచన స్థల కాలాల్ని అధిగమించి దీపించడానికి కారణం దానిలోని సృజనాత్మకతే. అది రచయిత దృక్పథ పటిమ వల్ల పదికాలాలపాటు నిలబడుతుంది. నాగలకట్ట సుద్దులు లో తాను స్వీకరించిన వస్తువు గురించి, వాటిని ఆ రూపంలో కూర్చడానికి తనను ప్రేరేపించిన సమకాలీన సమాజం గురించి రచయిత స్వయంగా చెప్పిన మాటలు చూడండి:

‘ప్రస్తుత సమాజం నడుస్తున్న తీరుపట్ల, దీన్ని ఈ విధంగా నడిపిస్తున్న శక్తుల పట్ల, ఈ ప్రభుత్వాల పట్ల, వీటి విధానాల పట్ల, ప్రజాస్వామ్యం ముసుగులో జరుగుతున్న అప్రజాస్వామిక పద్ధతుల పట్ల, ఈ కుల మతాల పట్ల, ఇవి నిర్వర్తిస్తున్న దాష్టీకాల పట్ల, మనుషుల అమానవీయ చర్యల పట్ల, దుర్మార్గాలు దుర్నీతుల పట్ల, మూఢ విశ్వాసాల పట్ల, మూఢాచారాల పట్ల, అవినీతి పట్ల, అక్రమాల పట్ల, రాజ్యాంగ వ్యవస్థలను తమ స్వప్రయోజనాల కోసం విధ్వంసం చేస్తున్న రాజకీయ శక్తుల పట్ల, స్త్రీల పై అమలవుతున్న హింస పట్ల, అత్యాచారాల పట్ల, దిక్కు మొక్కు లేని అనాథల పట్ల, ఆదుకునే నాథుడే లేని పేదల పట్ల, నిరుపేద రైతుల పట్ల, రోజురోజుకు ఛిద్రమైపోతున్న గ్రామాల పట్ల, పట్టణాల విర్రవీగుళ్ళు వికారాలు విలాసాల పట్ల, ఒక్కటేమిటి నన్ను ఆవేదనకు గురి చేసిన ప్రతి అనైతిక విషయాన్ని ఈ రచ్చబండ చర్చల్లో నాగలకట్ట సుద్దుల్లో భాగం చెయ్యొచ్చునని, నాలో నిరంతరం మండే బాధాగ్నిని నాగలకట్ట పాత్రల ద్వారా బయటికి వెళ్లగక్కవచ్చునని భావించి అందుకు అనుకూలంగానే కాలం కథాంశాలను ఎన్నుకున్నాను’ (శాంతి నారాయణ : నాగలకట్ట సుద్దులు రెండో భాగం ముందుమాట)

‘కాదేదీ కవితకనర్హం’ అన్నట్టు శాంతి నారాయణ తన చుట్టూ జరిగే ప్రతి ఘటననీ, సమాజంలో అలజడికి కారణమయ్యే ప్రతి సమస్యనీ ‘నాగలకట్ట సుద్దులు’కు వస్తువుగ స్వీకరించాడు. ఆ యా సంఘటనలు సమస్యలు ఆ కాలంనాటివే అయినప్పటికీ రచయిత వాటిని చూసే దృష్టికోణం వల్ల, అర్థం చేసుకునే తీరు వల్ల, సూచించిన పరిష్కారాల వల్ల, తాత్వికంగా అవగాహన చేసుకోవడంలోని గాఢత వల్ల తాత్కాలికతను అధిగమించి ఫీచర్ యీనాటికీ ప్రాసంగికంగా కనిపిస్తుంది.

సమకాలీనత – ప్రాసంగికత
నాగలకట్ట సుద్దులు మొదలైంది కేంద్రంలో వాజపేయి రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో. ముగిసింది పాలకులు baton (అధికార దండం) మార్చుకున్న సందర్భం. రెండు సందర్భాల్లోనూ శాంతి నారాయణ ప్రజల పక్షమే నిలబడ్డాడు. ప్రపంచీకరణ, మతతత్వ ఫాసిజాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామిక శక్తులు బలం పుంజుకోవాల్సిన నిర్దిష్ట రాజకీయ సందర్భంలో వచ్చిన శీర్షిక రాజ్యాంగం నిర్దేశించిన లౌకిక సమత్వ భావనలకు యెంతగానో దోహదం చేసింది అంటే అతిశయోక్తి కాదేమో! మారాల్సింది ఆట నియమాలుగానీ ఆటగాళ్ళు కాదు అన్న స్పృహ రచయితకు వున్నప్పటికీ మారిన పాలకుల మీద, ముఖ్యంగా రాయలసీమ అభివృద్ధి విషయంలో, శాంతి నారాయణకు దింపుడు కల్లం ఆశలు యేవో కొన్ని వున్నట్టున్నాయి. నెమ్మదిగా అవి కూడా ఆవిరైపోయాయి.

నాగార్జున సాగర్, శ్రీశైలం, తుంగభద్ర ప్రాజెక్టుల నుంచి రాయలసీమకు రావాల్సిన నీటి వాటా దగ్గర్నుంచి రాజోలి బండ హంద్రీ నీవా గాలేరు సుంకేసుల మొదలైన సాకారం కాని నీటి కలల వరకూ శాంతి నారాయణ చర్చించిన సీమ సమస్యలు దశాబ్దాలు గడిచినా, రావు పోయి రెడ్డొచ్చినా – రెడ్డి పోయి రావొచ్చినా, పాలకులు మారినా, పార్టీలు మారినా రాష్ట్రాలు విడిపోయినా యీ రోజుకీ అపరిష్కృతంగానే వున్నాయి. సీమ నాయకులు తమ ప్రాంతానికి చేసిన, చేస్తున్న ద్రోహం స్వరూపం మార్చుకుంది గానీ దాని స్వభావం మారలేదు. సీమ విషణ్ణ ముఖ చిత్రం మారలేదు. నాయకుల స్వార్థ రాజకీయ చదరంగంలో ప్రజలు యెప్పుడూ పావులే. మరోసారి – మరోసారి శాంతిసీమ శీర్షిక చదివి అవి నేర్పిన గుణపాఠాల్ని పునశ్చరణ చేసుకోవాల్సిన సందర్భమే యిది.

కంచి మఠం లో హత్యలు జరిగినప్పుడు, పుష్కరాలకు వందలకోట్లు ఖర్చుపెట్టి ప్రజలు సంపాదించుకునే పుణ్యానికి గవర్నమెంటే పూచీ పడినప్పుడు, పెద్దనామాల సన్న జియ్యరు వెయ్యికాళ్ల మండపం గొడవ రేపినప్పుడు, గణేశ నిమజ్జనాలకు రాజ్యమూ మతమూ యేకమై హడావిడి చేసే సందర్భంలో హేతుదృష్టితో చేసిన ప్రతిపాదనలు, ‘శ్రెమే దేవుడన్న నమ్మకాన్ని జెనంలో కలిగిత్తే తప్పా ఈ దేశం బాగుపడదు’ అని చెప్పిన ముక్తాయింపు మాటలు ఆయనలోని లౌకిక ప్రజాస్వామిక భౌతికవాద దృక్పథానికి తార్కాణంగా నిలుస్తాయి. అందుకే అధికారం కోసం మత విద్వేషం రేపి దేశాన్ని వెయ్యేళ్ళు వెనక్కి నడపాలనుకునే హిందూత్వ శక్తులపట్ల అప్రమత్తంగా వుండాలని బుద్ధిగరపగలిగాడు. మతాన్ని రాజకీయాల్నుంచి వేరుచేయాల్సిన అవసరాన్ని పదేపదే గుర్తుచేయగలిగాడు. మతతత్వ వాదుల పాలన ఫాసిస్టు స్వభావం సంతరించుకుంటున్న ప్రస్తుత రాజకీయ సందర్భంలో యీ సుద్దుల అవసరం మరింత పెరిగింది.

ఈ రచనల్లో శాంతి నారాయణ వ్యక్తం చేసిన అభిప్రాయాలు యెంత స్థానికమో అంత సార్వత్రికం, విశాలం. అవి రాయలసీమకో తెలుగునేలకో పరిమితం కావు. దేశమంతటికీ వర్తించేవి. తమ పదవుల్ని పదిలపరచుకోవడం కోసం ప్రజల్ని పావులుగా వుపయోగించుకోడానికి పాలకుల యెత్తుగడల పట్ల ఆయన మొత్తం భారతీయ సమాజాన్ని అప్రమత్తం చేశాడు. ప్రజా చైతన్యమొక్కటే దుష్ట రాజకీయాలకు చరమ గీతం పాడగలదని నిర్ధారించాడు.

అగ్రకులాల సంపన్నులు అనుభవించే సదుపాయాలు, సోకులు, సౌకర్యాలు అన్నీ శ్రామిక కులాల కష్ట ఫలాలే అని తీర్మానించాడు. నిచ్చెన మెట్ల కులవ్యవస్థలో అధికారం, పదవులు, సంపద అన్నీ పై కులాల చేతిలో కేంద్రీ కృతమై వుండగా తరతరాలుగా సామాజికంగా, ఆర్థికంగా అణచివేతకి గురైన జాతులు యెలా యెదగగలరని మౌలికమైన ప్రశ్న సంధించాడు. ఈ అసమ వ్యవస్థని అంతం చేయడానికి అవసరమైన – అనివార్యమైన రాజకీయ పోరాటాలకు మద్దతు కూడగట్టడానికి తన కాలమ్ ని వుద్దేశించాడు. అందుకు దళిత బహుజన మైనారిటీల ఐక్యత అవసరాన్ని సైతం ఆయన గుర్తించాడు. పదిహేనేళ్ల క్రితం శాంతి నారాయణ ప్రతిపాదించిన యీ రాజకీయ సమీకరణం యివ్వాళ మరింత నిర్దిష్టమై నిర్మాణాత్మక రూపం తీసుకోవాల్సిన అవసరం వుంది.

సామాజిక చలనం : ప్రాంతీయత
తన దృష్టికి వచ్చిన ప్రతి సామాజిక చలనాన్నీ శాంతి నారాయణ యీ సుద్దుల్లో నమోదు చేశాడు. వాటి వెనుక వున్న రాజకీయ శక్తుల ప్రమేయాన్ని గుర్తించాడు. వాటి దుర్మార్గాన్ని బహిర్గతం చేయడానికి రచయితగా యే మాత్రం వుదాసీనత చూపలేదు; దేన్నీ ఖండించకుండా వొదిలిపెట్టలేదు. నకిలీ స్టాంపుల కుంభకోణం, మధ్యాహ్న భోజన పథకంలో ముందుకొచ్చిన కులం, సినిమాల్లో రాయలసీమ తెలంగాణ ప్రజల భాషా సంస్కృతుల్ని అపహాస్యం చేయడం వంటి రాజకీయ సామాజిక సాంస్కృతిక సమస్యలెన్నిటినో చర్చకు పెట్టాడు. పార్లమెంటులో ప్రశ్న అడగడానికి లంచం తీసుకున్నపెద్దమనుషుల అవినీతి భాగోతం దగ్గర్నుంచీ రాములోరి గుడి చుట్టూ మసీదు చుట్టూ వోట్ల రాజకీయాలు నడిపే సంఘీయుల కుట్రల వరకూ ప్రతి అడ్డగోలు వ్యవహారాన్నీ యెటువంటి సంకోచం లేకుండా విమర్శించాడు. ఆ క్రమంలో రౌడీలకూ పోకిరీ యెదవలకూ రాజకీయ నాయకులకూ వొత్తాసు పలకడం తప్ప శాతగానోల్లకు సహకరించరనీ చట్టాన్ని కాపాడాల్సిన రక్షకులే భక్షకులౌతున్నారనీ పోలీసోల్లని శపించాడు. ప్రేమించలేదన్న కక్షతో ఆడపిల్లల మీద కత్తులతోనో యాసిడ్ తోనో దాడులు చేసే మానవ మృగాల్ని చీల్చి చెండాడాడు. అటువంటి దుష్ట సంస్కృతికి కారణమయ్యే మూలాల్ని తాత్వికంగా విశ్లేషించాడు. బంజారా హిల్స్ దీపకాంతుల కింద ముసిరిన చీకటి బతుకుల గురించి ఆరాటపడ్డాడు. రిజర్వేషన్ల వల్ల ప్రతిభ లేనోళ్ళు అందలం యెక్కుతున్నారని వోపలేని అక్కసుతో చేసే వాదనని తార్కికంగా తిరస్కరించాడు. వెనకబడ్డ ప్రాంతాల రైతాంగం గోడు పట్టించుకోకుండా కుట్రలు పన్నే ‘అభివృద్ధి’ రాజకీయాల బండారం బయటపెట్టాడు. సరళీకరణ ప్రైవేటీకరణ ప్రపంచీకరణల వ్యూహాలతో దేశ సంపదని కార్పోరేట్ కి దోచిపెట్టే పాలకుల దళారీ రూపాల్ని బహిర్గతం చేసాడు. ‘పీనిగల మీద పైసాలు యేరకతినేవాల్లు దేశాన్ని పాలిత్తా ఉంటె యెప్పుడప్పా ఇది బాగుపడేది?’ అని ఆరాటపడ్డాడు.

ఇలా ‘నాగలకట్ట సుద్దులు’ అవి వెలువడ్డ కాలం నాటి రాజకీయ ఆర్ధిక సామాజిక సాంస్కృతిక పరిస్థితులకు నిలువెత్తు దర్పణంగా నిలిచాయి. అధికారంలోకి రావడానికో నిలుపుకోడానికో సమస్త వ్యవస్థల్నీ ధ్వంసం చేసే పార్లమెంటరీ రాజకీయాలపై పదునైన వ్యాఖ్యలుగా రూపొందాయి. పౌరజీవితంలో అన్ని పార్శ్వాల్లోనూ పతనమౌతున్న విలువల్ని చూసి ఆవేదనతో చెప్పిన ఆ సుద్దులు అవినీతిమయమైన పాలనా యంత్రాంగంపై, శవాలతో వోట్ల నాటకాలాడుతూ అన్ని విలువలకూ తిలోదకాలిచ్చిన రాజకీయ నైచ్యంపై, దుడ్లున్న వాడి పంచలో కులాసాగా కులుకుతున్న న్యాయ వ్యవస్థపై యెక్కుపెట్టిన అస్త్రాలుగా తయారయ్యాయి.

సాహిత్య రచనని సామాజిక ఆచరణగా స్వీకరించిన శాంతినారాయణ రచ్చబండ మీద పాత్రల ముఖత: లేవనెత్తిన సవాలక్ష ప్రశ్నలకు పాలకుల నుండి జవాబులు డిమాండ్ చేశాడు. పాఠకుల్లో కొత్త స్ఫూర్తి నింపాడు. ప్రశ్నించే తత్త్వాన్ని పెంచాడు. నిరసన తెలిపే ధైర్యాన్ని కోల్పోకూడదని వుద్బోధించాడు. ప్రజల్లో వొక ప్రెజర్ గ్రూప్ వుంటేనే ప్రజాస్వామ్యం మనగల్గుతుందని హెచ్చరించాడు. ప్రభుత్వాల బాధ్యతా రాహిత్యాన్ని ప్రశ్నించలేని ప్రజల చేతకాని తనాన్ని, పట్టని తనాన్ని సైతం చీదరించుకున్నాడు. సమాజంలోని సమస్త పార్శ్వాలలో సున్నితత్వాన్ని కోల్పోవడం చూసి బెంగటిల్లాడు. అయితే అదే సందర్భంలో ఐక్య పోరాటాలు చేయాల్సిన పీడిత ప్రజల మధ్య కుల మతాల వైరుధ్యాల కారణంగా ప్రబలుతున్న వైషమ్యాల్ని చూసి వాపోయాడు. వీటన్నిటినీ అధిగమించి ప్రజా శ్రేణులు సంఘటితంగా చేపట్టాల్సిన కార్యాచరణ గురించిన స్పృహను కలిగించాడు.

తెలుగు నేల మీద నడిచే రాజకీయాల గురించి స్థూలంగా మాట్లాడినప్పటికీ రాయలసీమ నిర్దిష్టత యీ కథనాల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అందునా సీమను పట్టి పీడించే నీటి రాజకీయాలు ఫ్యాక్షన్ రాజకీయాలు ప్రధానంగా చర్చకు వస్తాయి. కోస్తా ఆధిపత్య రాజకీయాలు, రాయలసీమ లోపలి ముఠా తత్వ శక్తుల స్వార్థ పూరిత కుతంత్రాలు జమిలిగా సీమకు చేసిన అన్యాయాన్ని ప్రస్తావించినప్పుడల్లా శాంతినారాయణ గొంతు దు:ఖంతో పూడుకుపోవడం గమనిస్తాం. రతనాలసీమ యెడారిగా మారి సామాన్యుల బతుకులు యెదారి పోతున్న తీరుని చిత్రించడంలో యెంతో ఆవేదననీ గుండెతడినీ చూడగలం.

చర్చలు రాయలసీమ కేంద్రంగా సాగినప్పుడు కూడా అనంతపురం ప్రత్యేక సమస్యలు ఆయనకు తెలీకుండానే ప్రాథమ్యం వహిస్తాయి. హంద్రీ నీవా పూర్తిచేసి అనంతపురాన్ని సుభిక్షం చేస్తామని వాగ్దానాలు గుప్పించి అధికారంలోకి వచ్చే రాజకీయ పార్టీల మోసపూరిత విధానాలని సందర్భం వచ్చినప్పుడల్లా (కాంగ్రేసు – తెలుగుదేశం ‘దొందూ దొందే’ అని) కడిగేస్తూనే వుంటాడు. వేల కోట్ల రూపాయల కాలువ పనుల గురించి మొదలుకాని ప్రాజెక్టుల గురించి పూటకో మాట మాట్లాడుతూ అరగజం పురోగతి చూపలేని గజయీతగాళ్ళని యేకిపెడతాడు. పాతకాలంనాటి వందలాది చెరువులు నిండితే బక్క రైతుల బతుకులు బాగుపడతాయని గుబులుపడతాడు. వరస కరువుల్ని జయించవచ్చని ఆశపడతాడు. వ్యవసాయం సరే; పోనీ అక్కడి వనరుల లభ్యతని దృష్టిలో వుంచుకొని రూపొందించుకోవాల్సిన పారిశ్రామిక విధానాల పట్ల సైతం యే పార్టీకీ దూరదృష్టి లేదు, చిత్తశుద్ధి లేదు అని వాపోయాడు.

హత్యల ద్వారా అధికారాన్నీ ఆధిపత్యాన్నీ కాపాడుకోవాలని, శవాల మీదగానే గద్దెనెక్కాలని ప్రయత్నించే సీమ ఫ్యాక్షనిస్టుల రాజకీయాల గురించి ప్రశ్నిస్తూనే హింస మూలాల్ని తాత్వికంగా అన్వేషిస్తాడు. భూస్వామ్య పెత్తందారీ కుటుంబాల మధ్య జరిగే ఆధిపత్యాల పోరులో చంపుతున్నదీ చస్తున్నదీ బతుకుదెరువు లేని కరువు పీడితులైన అమాయకులే అని ఖేదపడతాడు. రాయలసీమ అందునా అనంతపురం కక్షల సీమగా పేరు మోయడానికి కారణం అక్కడి ప్రజల మధ్య వున్న కక్షలు కాదనీ నొక్కిచెబుతాడు.

ఈ సుద్దుల్లో రచయిత చేసే చర్చలు సూత్రీకరణలు మూల్యాంకనాలు నిర్ధారణలు చాలా నిర్మాణాత్మకంగా కనిపిస్తాయి. అప్పుడు నాగలకట్ట వొక ప్రజా కోర్టులా వ్యవహరిస్తుంది, రచయిత న్యాయమూర్తిలా గోచరిస్తాడు. రాజకీయ సామాజిక ఆర్థిక నేరస్తుల్ని నిలదీస్తాడు. పార్లమెంటరీ రాజకీయాల్లోని డొల్లతనాన్ని యెండగడతాడు. రాజ్యాంగ వ్యవస్థల్ని నిర్వీర్యం చేసే కుట్రల్ని బహిర్గతం చేస్తాడు. ప్రజా సంక్షేమానికి కీడు చేసే వ్యక్తుల్నీ వ్యవస్థల్నీ దేన్నీ విడిచిపెట్టలేదు. నిర్ద్వంద్వంగా ఖండించాడు. చివరికి న్యాయ వ్యవస్థలోని దిగజారుడు తనాన్ని విమర్శించడానికి వెనకాడలేదు.

తన యీ సాహిత్య ‘ఆర్టీవిజా’నికి శాంతి నారాయణ ప్రజల భాషను మాధ్యమంగా యెంచుకున్నారు. అది యీ రచనకు అదనపు బలం.

భాష – శైలి
(‘తెలుగు యెంత కమ్మనైన బాసప్పా’)
నాగలకట్ట సుద్దుల్ని అన్ని ప్రాంతాల పాఠకులూ ఆత్మీయంగా గుండెకు హత్తుకోడానికి కారణం అందులోని భాష అనడంలో యేమాత్రం సందేహం లేదు. ఫీచర్ ఆసాంతం భాష భావం జోడు గుర్రాల్లా దౌడుతీశాయి. తనకకెంతో యిష్టమైన అందమైన రాయలసీమ మాండలికాన్ని తన తల్లిదండ్రులనుండి అందిపుచ్చుకున్నట్టు మొదటిభాగం అంకితం పేజీలో శాంతినారాయణ స్వయంగా చెప్పుకున్నాడు. అది ఆయన రక్తగతమైన భాష. శ్వాస తీసుకున్నంత అతి సహజంగా ఆయన వాడిన భాషని ఫలానా ప్రాంతీయ మాండలికమనో వర్గ మాండలికమనో భాషా శాస్త్రవేత్తల పరిభాషలోకి కుదించి వ్యవహరించలేం. అది మట్టిపొరల్ని పెకలించుకు వచ్చిన ప్రాకృతిక భాష. శిష్ట వాసనలు అంతగా సోకని బహుజన భాష. పల్లె పొత్తిళ్ళలో పుట్టిన శ్రమజీవుల భాష. ఉత్పత్తికులాలకు చెందిన ప్రజల సాంస్కృతిక జీవితంలోంచి వికసించిన హృదయ భాష. అచ్చమైన బతుకు బాస. అందుకే కత్తి పద్మారావు శాంతి నారాయణ భాషని సామాజిక విప్లవ భాష అంటాడు.

ఓరియంటల్ కళాశాలలో నేర్చిన సంప్రదాయ వాసనలు వదిలించుకోవడం కష్టమే. భాష విషయంలో కావొచ్చు భావజాలం విషయంలో కావొచ్చు చదువు తెచ్చిపెట్టిన సంకెళ్ళని శాంతినారాయణ ఛేదించాడు. అన్నిరకాల కట్టుబాట్లు తెంచుకున్నాడు. ప్రాచీన సాహిత్య అధ్యయనం ద్వారా అబ్బే పాండిత్య స్ఫోరకమైన శైలికి లొంగిపోలేదు. తన మూలాలకు ఆయన దూరం కాలేదు. అమ్మవొడిలో చనుబాలతో నేర్చిన భాషలోని మాధుర్యాన్ని పెదవిపై చప్పరిస్తూనే వున్నాడు. తల్లినుడిలోని జీవల్లక్షణమైన మౌఖికతని తన రచనల్లో ఆయన అద్భుతంగా పలికించాడు. యాసని వొడిసిపట్టుకుని కాగితంమీదికి వొంపుతున్నాడు. అందుకే తక్కిన సీమ రచయితల కన్నా విలక్షణమైన తనదైన స్వరాన్ని వినిపించగలిగాడు.
ఆయన స్వరంలో సంభాషణలు చాలా సహజంగా పలికాయి. మౌఖిక భాషలోని యాస వుచ్చారణ రీతుల్ని – వూనిక తూగు లయ విరామం వంటి అనేక అంశాల్ని – యథాతథంగా రాతలోకి తీసుకు రావడం వల్ల, ప్రజల దైనందిన వ్యవహారంలోని జీవద్భాష సొబగులన్నిటినీ రాతలోకి తర్జుమా చేయటం వల్ల సుద్దులు ‘సాహిత్యకత’ని సంతరించుకున్నాయి. శాంతిసీమ భాష విద్యావంతులైన పై వర్గాలకు చెందినవారి కలాల నుంచి జాలువారిన రాత భాష కాదు. జీవిక కోసం అనునిత్యం శ్రమించే వుత్పత్తి కులాలకు చెందినవారి నాలుకలపై జీవించే నోటి భాష. కాళోజీ మాటల్లో ఒక్కముక్కలో చెప్పాలంటే బడి పలుకు కాదు పలుకుబడి.

వుప్పోడూ పులిసేదే పొప్పోడూ పులిసేదేనా?
తాతాశార్లకూ పీర్లపండక్కీ ముడేత్తే యెట్లా?
యెదటోని బొంతలో బొక్కలు సూపడమే గానీ తమ బొంత సూసుకోవద్దా?
వూర్లో పెండ్లి జరుగుతావుంటే వూసినదాన్ని పట్టేకి కాదన్నెట్ల … వంటి సాటవలు ,
కొరముట్లు, బీగాలు, సుళ్ళ కూతలు, బసేలి, గేరీ, తలి, మకురు, పలకువ, అసెడ్డం, కువాడం, ముజిగుంబరం, పిత్తరం రేగడం, నలుసులెంచడం, సెటాయింపు పుట్టడం, నిగత తీరడం, గెలుము తోలడం, అవలాయి కూతలు, బయికారి యేడుపులు, వడ్లగింజలో బియ్యపు గింజ, శెని సెప్పుతో కొడతా వుంటే, గోసిలో రాయి పడేతట్ల, పొప్పులుబెట్టి పోరుమాన్పినట్ల, మోసెయి వొంగితేనే ముంజేయి వొంగుతాది … వంటి లెక్కలేనన్ని సీమ పదబంధాలు జాతీయాలు నుడికారాలు ఆయన మాటల్లో అలవోకగా జాలువారతాయి. అవి యీ సుద్దులకు సొంపు సోయగాల్నీ సౌష్టవాన్నీ సౌకుమార్యాన్నీ సహజాతి సహజమైన సొబగునీ సాధించాయి. దు:ఖోద్విగ్నతనీ క్రోధావేశాన్నీ వ్యక్తం చేయడానికి అనువైన యీ భాషలోని యెన్నో పదాలు నిఘంటువుల్లో దొరకవు. పాఠ్యపుస్తకాల్లో కనిపించవు. అయితే గత మూడు దశాబ్దాలుగా పత్రికల్లో వచ్చిన వివిధ ప్రాంతాలకు చెందిన నాగలకట్ట సుద్దులు లాంటి మాండలిక కాలిక శీర్షికలద్వారా అద్భుతమైన భాషా సంపద అన్ని ప్రాంతాల పాఠకులకు పరిచయమైంది. అయితే ‘బాసే ఇగ్నానం కాదు’ అన్న యెరుక కూడా శాంతి నారాయణకు వుంది. ప్రజల సాంస్కృతిక భాషకు సాహిత్య భాషా గౌరవాన్ని సాధించిన రచయితల్లో శాంతినారాయణ ముందువరసలో నిలిచివున్నాడు.

సజీవ వచనం
గ్రామీణ సమాజంలో వుండే సూటిదనమే నాగలకట్ట సుద్దుల వచనంలోకి ప్రవహించింది. పిల్లికి సెలగాటం యెలకకు పాన సంగటం, తిక్కోని పెండ్లిలో తిన్నోడుబుద్దిమంతుడు, పుట్టగోసే పామై కరిసిందట, తేలుకు పెత్తనమిత్తే..,వుట్టికెగరలేనమ్మకు సొర్గమా!, ఆడల్యాక మద్దెలోడిదని, ఇదంతా వాపే బలుపు కాదప్పా వంటి జాతీయాలు శీర్షికలు రచన అంతస్సారాన్ని పట్టి యిస్తాయి. ప్రజల నాలుకలపై నానే నానుడులు పదబంధాలు వాటిలోని సహజ కవితాభివ్యక్తి ప్రతి వాక్యంలోనూ అలవోకగా జాలువారతాయి.

ఈ పుస్తకం లోని ప్రతి శీర్షికా వొక సామాజిక పాఠం. వొక జీవితానుభవ సారం. వొక రాజకీయ ధర్మాగ్రహ ప్రకటన. సైద్ధాంతిక పరిణతి, సమ్యగ్ దృష్టి, నిశిత పరిశీలన, లోతైన విశ్లేషణ, సదవగాహన, సంయమనం, సమతౌల్యం వాటిలో దర్శనమిస్తాయి. కళ్ళముందు జరుగుతోన్న అన్యాయాలపట్ల తీవ్రాతితీవ్రమైన క్రోధం, దు:ఖితులపట్ల ఆర్తి – సహానుభూతి వ్యక్తమౌతాయి. కొన్ని సందర్భాల్లో అగమ్యగోచరమైన భవిష్యత్తు పట్ల నిస్సహాయతతో కూడిన అసహనం వినిపించినప్పటికీ నూటికి నూరుపాళ్ళూ సామాన్యుడి గొంతే ప్రతి రచనలోనూ పలుకుతుంది. అయితే ఆర్.కె. లక్ష్మణ్ పొలిటికల్ కార్టూన్ లోని కామన్ మేన్ లా యీ రచయిత జరిగే మంచికీ చెడుకీ తాటస్థ్యం పాటించే మౌనసాక్షిగా వుండిపోడు. తనవైన నిక్కచ్చి అభిప్రాయాల్ని కుండబద్దలుకొట్టినట్టు చెప్పడానికి యెక్కడా వెనకాడలేదు. నిప్పుల మీద నడవడానికి యెన్నడూ సంకోచించలేదు. నిజాయితీ నిర్భీతీ నిబద్ధతా నిష్పక్షపాతం ప్రత్యక్షరంలోనూ గోచరమౌతాయి. పాలకపక్షమైనా ప్రతిపక్షమైనా తప్పుచేసినవాడినల్లా కాలర్ పట్టుకు నిలదీసే దమ్మున్న వాక్యం యీ రచనలకు బలాన్నిచ్చింది. అది పాఠకుల ఆలోచనలకు పదునుపెట్టి వారి చైతన్య పరిధిని విస్తరింపజేస్తుంది. మహాకవి వేమన పద్యానికున్నంత శక్తి రచయిత శాంతినారాయణ వచనానికి వుంది.
సుదీర్ఘ కాలం నడిచే యిటువంటి రచనలో మొనాటనీ – యాంత్రికత యేర్పడే ప్రమాదం వుంది. వాక్యం పునరుక్తమయ్యే అవకాశం వుంది. కానీ శాంతి నారాయణ వచనం యెక్కడా పలచన కాలేదు. తొలి సుద్దుల దగ్గర్నుంచీ చివరి ముచ్చట వరకూ ఆయన శైలిలో బిగువు కొంచెం కూడా సడలలేదు. చిక్కదనం తరగలేదు. విసుగు కలగలేదు. పఠనీయత తొలగలేదు. సారం కరగలేదు. సాంద్రత విరగలేదు.

రాజకీయ వార్తా కధనాలుగా మిగిలి పోకుండా వుండేందుకు మానవీయ సంవేదనలు వుద్వేగాలు సహృదయ పాఠకుల హృదయాలను ఆకట్టుకుని తల్లీనం చేసుకునే అనుభూతులు పాత్రలకు ఆపాదించడం వల్ల ప్రతి సన్నివేశం వొక దృశ్యంగా రూపుకట్టింది.

నాటకీయత
కఠోర జీవన వాస్తవిక చిత్రణ ‘శాంతిసీమ’ను ఫీచర్ స్థాయి నుంచి సృజనాత్మక కథన స్థాయికి వున్నతీకరించడానికి దోహదం చేసింది. అదే యీ రచనల ప్రాథమిక బలం. రచ్చబండ సంభాషణకి వుద్వేగాలతో పాటు రాజకీయ తాత్త్వికతని జోడించి గొప్ప కళావిలువని సాధించడంతో ప్రతి శీర్షికా సజీవంగా కళ్ళకు కట్టినట్టు వొక యేకాంకికలా రూపొందింది.
నాటకానికి అనుకూలమైన రంగస్థలాన్నీ దృశ్యాన్నీ నేపథ్యాన్నీ యేర్పరచడంలో శాంతి నారాయణ యెక్కడా కళాత్మక దృష్టిని విడవలేదు. పెళ్ళికి ముందు లైంగిక స్వేచ్చ గురించి సినీ నటి ఖుష్బూ వ్యాఖ్యల ప్రస్తావన వచ్చినప్పుడు రచయిత ప్రకటించిన అభిప్రాయాలు రచ్చబండ మీద కాకుండా యింటి పంచలో స్త్రీల నోట పలికించడం ద్వారా గొప్ప సాహితీ ఔచిత్యాన్ని పాటించాడు. కొన్ని సందర్భాల్లో సంఘటనా స్థలాన్నే వేదికగా మార్చుకోవడం చూస్తాం. ఆ యా సందర్భాల్లో రచయిత నాటక ప్రయోక్తగా మారాడు. ఫీచర్ లో దృశ్య రూపక లక్షణాలకి యిటువంటి వుదాహరణల నెన్నింటినో చూపవచ్చు.

వస్తువుకు అనుగుణమైన దృశ్య కల్పన, పాత్ర నిర్మితి, పాత్రల స్వభావాలకీ, సామాజిక నేపథ్యాలకీ అనుగుణమైన సంభాషణల పరికల్పన నాటకానికి ప్రాణభూతంగా నిలుస్తాయన్న స్పృహ శాంతి నారాయణలో మెండుగా వుంది. గ్రామీణ ప్రజల అమాయకత్వం భోళాతనం కనపడీ కనపడని గడుసుదనం హాస్య చతురత వంటి గుణాలకు తన పాత్రల్ని నమూనాలుగా వాడుకున్నాడు.

అయితే ఫీచర్లో మొనాటనీని పరిహరించడానికి పాత్రల్ని ప్రవేశపెట్టినప్పుడు భిన్న భావజాలాలకు వాటిని ప్రతీకలగానో ప్రతినిధులుగానో చిత్రించినప్పుడు అవి కేరికేచర్స్ గా మారి కథనంలో వైవిధ్యం కరువయ్యే ప్రమాదం కూడా వుంది. కేరికేచరింగ్ తప్పు కాదు గానీ వ్యక్తులు మూసలుగా మిగిలిపోకూడదు. దాన్ని పరిహరించడానికి శాంతి నారాయణ తన పాత్రల్ని భిన్న సందర్భాల్లో భిన్న వుద్వేగాలకు గురిచేయడం గమనిస్తాం. ఆయన పాత్రలు వొక్కోసారి దుఃఖిస్తాయి, ఆక్రోశిస్తాయి, మరోసారి కోపిస్తాయి, శపిస్తాయి, చాలా సార్లు నిస్సహాయతతో తలతలడిల్లుతాయి, అసహనంతో సతమతమౌతాయి. మనుషుల్ని ప్రేమిస్తాయి. ద్వేషిస్తాయి. సాటి మనిషి పట్ల అనుకంపతో ప్రవర్తిస్తాయి. విస్తృతమైన జీవితానుభవం, నిశితమైన సామాజిక పరిశీలన, లోతైన రాజనీతి చింతన ఆయన కళాత్మక అభివ్యక్తికి యెంతగానో తోడ్పడ్డాయి.

దృక్పథ స్పష్టతే రచనకు బలం
నాగలకట్ట సుద్దులు జరిగిన దాన్ని వున్నదున్నట్టుగా వర్ణించే యథాతథ కథనాలు కావు. జీవితానుభవం అందించిన చైతన్యంతో ప్రతి సామాజిక దృగంశాన్నీ నిర్దిష్టమైన కార్యకారణ సంబంధంతో విశ్లేషించడం, మూలాల్లోకి వెళ్లి విమర్శనాత్మకంగా చూడటం వాటి ప్రత్యేకత. రచయితగా శాంతినారాయణ ప్రాపంచిక దృక్పథం వాటిలోని ప్రత్యక్షరంలోనూ కనిపిస్తుంది. రచయిత దృక్పథం రచనకు చెందిన వస్తు రూపాలతో మిళితమయ్యే వుంటుంది. వస్తు రూపాల్ని దృక్పథమే నిర్దేశిస్తుంది. రచనలోని సామాజిక వాస్తవికత, కళాత్మకత రచయిత దృక్పథ బలంతోనే పాఠకులకు చేరతాయి. శాంతి నారాయణ దృక్పథం ప్రజల జీవన మూలాల్లోంచీ సంఘర్షణలోంచీ రూపొందింది. అదే యీ రచకున్న అసలైన బలం. ఈ మాటలు చూడండి:

ఈ మతాన్నీ, కులాలనూ సెక్కుసెదరనీకుండా కాపాడుకుంటా మనుసుల్ని వొగర్నొగర్ని కల్సుకోనీకుండా తమ పెత్తనం నిలుపుకుండేకి యింగా కొంతమంది గుంజులాడతానే వుండారు.
దేశెంలో నూటికి యెనబై పాల్లు అనగారిన కులాలోల్లే అయినప్పుడు అంతబాగం దెశె సంపద గూడా వాల్లకే సెందల్ల గద.
వొగ దేశెమూ వొగ జాతిగా వుండే యీ జెనాన్ని కులాలతో యిడగొట్టి దాండ్ల మద్దెన యెచ్చు తగ్గులు కలిపిచ్చి, తగ్గు కులాలోల్లతో వూడిగం జేయిచ్చుకుంటా పెద్దకులాలు ఆ పట్టును వొయినంగా కాపాడుకుంటా వుండాయి.

ప్రపంచంలో గాలీ నీల్లూ జాతులూ సంకరం గాకుండా సొక్కటంగా వుంటాయేమప్పా?
యాడయినా పగతో పగ తీరిపొయ్యిందా? పగతో పగ తీర్సుకోవడం యిగ్నానవంతులు చేసే పనేనా? పనీ పాటా లేని పేదోల్లకు అవీ ఇవీ యెరజూపి తమ పెద్దరికం కోసరం, అధికారం కోసరం రాజకీయ నాయికులు అమాయికుల్ని బలిజేయడం యింగా యెన్నాల్లన్నా?
దేవుల్ల మింద బక్తి, మనిసి మాన్నుబావుడయ్యేకి వుపయోగపడల్లగానీ మనిసిని మనిసి నరుక్కుండేకి కాదు.
తమ రాజకీయాల కోసరం జెనం బతుకుల్తో ఆడుకుండే వాల్లనెవుర్నీ కాలం శెమించదు… నిండు మనసుతో జెనానికి మేలు చేసినోన్ని కాలం గవురవిత్తానే వుంటాది. దేవుడనేవాడు గుల్లూ గోపురాల్లో లేడని, పెపంచమే దేవుడని, శ్రెమ జెయడం వల్లనే ఈ పెపంచంలో యా వొస్తువైనా పొందవచ్చునని చెప్పేదే సరైన మతము, అట్లా చెప్పిన బుద్దుని మతమొగటే ఈ దేశాన్ని కాపాడాల్ల.

బతికినన్నాల్లూ మనిసిని మనిసి ప్రేమించుకుంటా యేరుబందరం బుద్ది మానుకోని, జాతులూ మతాలూ దేశాలూ అన్నీ కలిసి మెలిసి అన్నదమ్ముల్లెక్కన వొద్దిగ్గా వుండుకోకుండా యీ పగలూ పంగనామాలూ యేందన్నా?

శాంతి నారాయణ సామాజిక రాజకీయ దృక్పథాన్నీ జీవన తాత్వికతనీ పట్టి యిచ్చే యిటువంటి వాక్యాలు యీ రచనలో కొల్లలుగా కనిపిస్తాయి. ఒక రచయిత పేరు చెప్పగానే చటుక్కున యేదైనా వొక ఫినామినల్ రచనని పేర్కొంటాం. శాంతినారాయణ పేరు చెప్పగానే నాకైతే ఆయన రచించిన నాగలకట్ట సుద్దులే గుర్తుకువస్తాయి. ఆయన సమగ్ర సాహిత్య వ్యక్తిత్వాన్ని ప్రతిఫలించే ప్రాతినిధ్య రచన అది. అందులో వ్యక్తమైన అనేక అంశాల చుట్టూ అల్లుకుని వున్న కుల- వర్గ స్వభావాన్నీ వైరుధ్యాల్నీ అధ్యయనం చేయాల్సిన అవసరం వుంది. ఆయన ప్రతిపాదించిన జీవన సత్యాలు యివ్వాళ దేశం యెదుర్కొంటున్న అనేక రుగ్మతలకు పరిష్కారం అందిస్తాయని నా నమ్మకం. పల్లెల్లో ప్రతి రచ్చబండ నాగలకట్టలా వొక నిరసన క్షేత్రం వొక ధర్నా చౌక్ గా మారాలనీ ధిక్కార స్వరాలన్నీ రచ్చబండలమీద యేకమై సమస్త ఆధిపత్యాలకు యెదురునిలవాలనీ రచ్చబండ వేదికగా శాంతి నారాయణ చేసిన సంభాషణ బలంగా కొనసాగాలనీ నా ఆశంస. ఎందుకంటే ఆ సంభాషణ ప్రజాస్వామికమైనదే కాదు మానవీయమైనది కూడా.

సాహిత్య విమర్శకుడు. తెలుగు కన్నడ రాష్ట్రాల్లో ముప్ఫై ఏదేళ్లపాటు సంస్కృతం – తెలుగు పాఠాలు చెప్పి రిటైర్ అయ్యారు. ‘తెలుగులో మాండలిక కథాసాహిత్యం’ పై పరిశోధన చేసి అదే పేరుతో ప్రచురించారు. స్త్రీ వాద కథలు, నిషేధ గీతాలు, డక్కలి జాంబ పురాణం, రెండు దశాబ్దాలు కథ , జానపద చారిత్రిక గేయగాథలు, బయ్యారం ఖ ‘నిజం’ ఎవరిది?, కన్నీటి సాగరాలొద్దురా మల్లన్నా, నోబెల్ కవిత్వం, అదే నేల (ముకుందరామారావు), తొవ్వ ముచ్చట్లు (జయధీర్ తిరుమల రావు ), యుద్దవచనం (జూలూరి గౌరి శంకర్), పాపినేని శివశంకర్ కథలు, తాడిగిరి పోతరాజు కథలు, రాయలసీమ : సమాజం సాహిత్యం (బండి నారాయణస్వామి), బహుళ - సాహిత్య విమర్శ : సిద్ధాంతాలు, ప్రమేయాలు, పరికరాలు (పర్స్పెక్టివ్స్), 50 యేళ్ల విరసం : పయనం - ప్రభావం … వంటి పుస్తకాలకి సంపాదకత్వ బాధ్యతలు వహించారు. ‘వేమన దారిలో’ పేరున ఎంపిక చేసిన వేమన పద్యాలకు వ్యాఖ్యానం చేసారు. ‘సమకాలీనం’ పేరుతో కథా విమర్శ పై వ్యాస సంపుటి వెలువరించారు. ప్రగతిశీల ఉద్యమ సాహిత్యాన్ని ప్రేమించే ప్రభాకర్ అస్తిత్వ ఉద్యమాలు శకలాలుగా కాకుండా ఏకోన్ముఖంగా సాగుతూ అంతిమంగా పీడిత జన విముక్తికి దారి తీయాలని కోరుకుంటున్నారు.

Leave a Reply