నాక్కొంచెం టైం కావాలి

రక్తం కార్చుతూ
రాలిపోయిన
నా వెలిశాల శాంతికపోతపు
వార్త తెలిసి
ఉక్కిరిబిక్కిరవుతున్న
నామనసు కుదురుపడడానికి
నాకు కొంచెం టైం కావాలి

ఉలిక్కిపడ్డ
మారేడుమిల్లి వార్తతో
వెన్ను వెలిగినట్టై
నా మనసు దోచి
నా అక్షరాలను పదునెక్కించిన
వెలిశాల వీర విప్లవ
శాంతికపోతం
నన్ను ఒంటరిని
చేసి వెళ్లిందని
తల్లడిల్లిన మనసు
తడిసి ముద్దైన
నాహృదయం
నిశ్చలమై
నిటారుగా ఆలోచించడానికి
నాకు కొంచెం టైం కావాలి

సముద్రాన్ని కాగితాల్లో బంధించమంటే
ఎలా…!
సెలయేటి అలల సంగీతాన్ని
చేతులతో బంధించి
చెరువుగట్టుకి మళ్ళించ మంటే ఎట్లా…!
అందుకే
నాకు కొంచెం టైం కావాలి

సెలయేటి అలల సంగీతాన్ని పదునెక్కించాలన్న
సముద్రాన్ని సున్నితంగా అక్షరబద్ధం చేయాలన్న
నాకు కొంచెం టైం కావాలి నాకు కొంచెం టైం కావాలి.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, చిట్యాల మండలం గుంటూరుపల్లి. కవి, రచయిత, అధ్యాపకుడు. రచనలు: అవ్వ జెప్పిన తొవ్వ (దీర్ఘ కవిత), పాదముద్రలు, వెన్నెల వర్షం( పాటల సీడీ), గురి (దీర్ఘ కవిత ). వరంగల్ సీకేఎం కాలేజీలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు.

Leave a Reply