నాకు అమ్మై

నిన్నో అటుమొన్నో
ఫోన్ లో మాట్లాడుతూ
ఉన్నట్టుండి నన్ను మ్యూట్ చేసింది

ఎవరితోనో మీటింగులో మేజిక్ చేస్తూ
ముసిముసి నవ్వులమువ్వలవుతోంది

కీబోర్డు మీద మునివేళ్ళతో
ఎన్నో విధాలుగా
ప్రపంచాన్ని నిర్మించడంలో తలమునకలవుతూ
కళ్ళను నక్షత్రాలను చేసి ఆకాశానికి అతుకుతోంది

తెరపై చిక్కుముళ్ళన్నీ
దాని ధాటికి బెదిరి తోక ముడిచాయి

మరోవైపు పెనం మీద పెసరెట్టును
చందమామను చేస్తుంది

ఒకోసారి మామూలు బ్రెడ్డుముక్కకు
పంచభక్ష్య రూపాన్ని తొడుగుతుంది

దానికి ఇచ్చిన రెండు చేతులకు
అది అదనంగా
వెయ్యి మొలిపించుకుంది

మొన్ననే కదా
బడికి వెడుతూ వెడుతూ
బుగ్గల నిండా వెన్నెల చుక్కలై
ధారాపాతంగా ప్రవహించింది

నిన్ననేగా పారాడుతూ
నుదుటితో అదాటున గుమ్మాన్ని ఢీకొంది

పేచీకోరుతనంతో నాతో గొడవపడుతూనే
సప్త సముద్రాలను అరక్షణంలో ఈదేసింది

యూనివర్సిటీ చేత పట్టుబట్టి
అక్షరాలు దిద్దించి
పెద్దకోటు తొడుక్కుని
పట్టాతో నింగిని తాకింది

రోజుకో రకం అందమైన ఆత్మవిశ్వాసపుముఖంతో
నన్ను ఆశ్చర్యపరుస్తూ
కొత్తగా పరిచయమవుతుంది

దాని దగ్గరగా వెళ్ళి
ముద్దలు కలిపి పెడితే
ముద్దులు బహుమతిగా ఇచ్చేది

ఇప్పటి ఆరిందాగా మా చంటిది
నన్ను పసిపాపను చేసి
బొమ్మలతో ఆడిస్తోంది
తర్జనితో బెదిరిస్తోంది

నేను దిగులుగిన్నై
ఒలికిపోయినపుడల్లా
నాకు అమ్మై అభయమిస్తోంది

ఊరు విశాఖపట్నం. కవయిత్రి. కథలు, కవిత్వం, నవలలు చదవడం ఇష్టం. కవిత్వమంటే మరింత మక్కువ. వివిధ పత్రికల్లో కవిత్వం ప్రచురితమైంది. త్వరలో ఓ కవిత సంకలనం రానుంది.

2 thoughts on “నాకు అమ్మై

Leave a Reply