నా దారెంట మోదుగు పూలు రాలుతుంటే
ఎరుపు రంగు హృదయం లో నింపుకుంటుంది
నా దారెంట ఇప్పపూల కస్తూరి వాసన
కొత్త దనం నన్నావహిస్తుంది
నా అడుగులకు తాకిన రుధిరం
బస్తర్ వాగుల్లో కడిగినా పోట్లేదు
దారెంట పాదముద్రల్లో కొత్త అడుగులు పడుతున్నాయి
తూటాల తోట గా
ఇప్పవనం దద్దరిల్లుతుంటే
నల్లని ఇప్ప బెరడు నిరసన తెలుపుతున్నాయి
రాజ్యపు మదపుటాసన ధాటికి ముక్కుపుటాలు తట్టుకోలేక పోతున్నాయి
పుష్పించే కాలం లో
చిత్రహింసలకు కాలంచేసిన
మనుషుల జూసిన మొగ్గలు కుంచించుకు పోతున్నాయి
రాటు దేలిన ఇప్పమాను లోని ఎరుపు రంగు శాశ్వతం
సామాజికార్థిక అసమానతల్లోంచి నిరంతర సంఘర్షణల్లో ఉద్భవించే లావా ఎరుపు నిత్యం ఎగిసి పడుతుంది
నిర్మూలిస్తామని అనుకునే నిరక్షర కుక్షుల జూసి
మోదుగులు విరగబూస్తున్నాయి
అడవి నిండా ఎటు చూసినా ఎరుపే!!
ఎక్కుపెట్టిన రాజ్యం తుపాకుల జూసి పూలు పక్కున నవ్వుతున్నాయి!