నల్లమలా!
చిక్కని ప్రకృతి సోయగమా!
నిన్ను చూస్తే
పురాజ్ఞాపకాల ఉసిళ్లు
భళ్ళున లేస్తాయి
రంగురంగుల పూల సుగంధాలు
రకరకాల పిట్టల గానం
లోపలి పొరల్ని
సమ్మోహనంగా తాకుతాయి.
జీవం నిండిన నల్ల చలవ పందిరీ!
కొండలపై వెన్నెల్ని మేసి
వాగువంకల్ని వొరుసుకుంటూ
దుప్పిలా పరుగెత్తిన చరిత్ర
మా చూపుని శుభ్రం చేసేది.
రేలపాటలు పాడే
వెదురు పూల వనమా!
నువ్వొక తత్వాల బైరాగివి
సిద్దుడి మూలికవి
పతి భక్తిని ఈడ్చితన్నిన
అక్కమహాదేవి ధిక్కారానివి
జనారణ్యంలో డస్సిపోయిన మనిషిని
సేదదీర్చే సెలయేరువి
మైదానాలను కాసే బయలుదేవరవి!
అరమరికలులేని
సమస్త జీవుల వువ్వెత్తు జాతరవి
నల్లమలా!
నాగరికత పన్నిన
అభివృద్ధి కుతంత్రానికి
గుండెపగిలి రోదిస్తున్న
నిధి నిక్షేపమా!
అక్కడక్కడ మినుకుమనే చుట్టుగుడిసెలు
ఆది మానవుడి శిలాజాల్లాంటి
అడవి బిడ్డలు
ఆకు పసరుతో కలిసిపోయిన
మనిషి వాసన
ఇక పొగచూరబోతుందా?
విరగబూసిన ఇప్పపూల వనమా!
చెంచు లక్ష్మి కొప్పున మెరిసే
బంతిపూల దరహాసమా!
నువ్విక నల్లపూసవేనా?
నిన్ను కథల్లోకెక్కించి
పేదరాసి పెద్దమ్మను చేస్తున్నదెవరు?
నల్లమలా!
ఎక్కడ చూసినా
‘చెట్లు కూలుతున్న దృశ్యాలు’
జైల్లై నోరుతెరిచిన ఆరు బయళ్ళు
తల్లివొడి నుంచి
బిడ్డల గెంటివేతలు
మానవత్వం కాలుతున్న
కమురు వాసన
దేశాన్ని కమ్ముకుంటుంది
నల్లమలా!
శాంతి చర్చలు వొంపిన చీకటీ
డొక్కలో కుమ్మిన
పై పై మాటలూ
నీకు తెలుసు కదా!
నల్ల మబ్బూ!
ఓరిమిని చప్పరించింది చాలు!
నువ్విక మేలుకో!
గద్దల్ని తోలే యుద్ధ తంత్రమై కదులు!
రాబందు మూకలపై
దావానలమై విరుచుకుపడు!
నల్లమలలో
నిత్య హరితకీకారణ్యంలో
మనోరంజిత గానలహరులవిహరింపచేసే
కోయిల ప్రతిరూపమా
సాహితీవన గీతామృతరాగ విపంచీ
విప్లవ జ్వాలారూపిణీ స్వరూపరాణీ
నీకివే మా శతసహస్ర పుష్పాంజలి
నల్లమలా… నల్లమలా… ఒక సొత అస్తిత్వాన్ని కలిగి ఉన్న ప్రాంతం. లక్షలాది జీవులని కడుపులో దాచుకున్న భూమి. ఇట్లా ఇప్పుడు మరణానికి రొమ్ము ఎదురొడ్డి నిలుచున్న యోధ