నల్లబజార్లు

స్మశానాల వెంట నడుస్తున్నట్టు
ఒకటే చావుకంపు
చూడ్డానికందరూ బ్రతికున్నట్టే
కనబడుతున్నా
పట్టి పట్టి చూస్తేకానీ
లోపల మనిషితనం చచ్చి
చాన్నాళ్లయ్యిందని తెలిసి చావదు
ఊపిరుండాలన్న ఒకే ఒక్క ఆశతో
అక్కడికెళతాం
అదైతే దేవాలయమే
లోపలెన్నో నల్లబజార్లు
గదికో హుండీ వుంటుందక్కడ
అడుగుకో శవం లేచి
నా వాటా ఏదంటూ చేయి చాస్తుంది
అక్కడక్కడా కొన్ని గద్దలు
జనం అవసరాలతో
దాగుడుమూతలాడుతుంటాయి
నోట్లకొమ్మలకు వేలాడే
గబ్బిలాలు కొన్ని
ఆశల్ని తలక్రిందులు చేస్తుంటాయి
కొందర్ని చూస్తే
వీళ్ళసలు మనుషులకే పుట్టారా
అని అనుమానం!
కొన్ని ఘటనల్లోకి ప్రవహిస్తే
అసలు మనుషులమధ్యే ఉన్నామా
అని సంశయం!

జననం: ఒంకులూరు, శ్రీకాకుళం జిల్లా. కవి, రచయిత, ఉపాధ్యాయుడు.  వివిధ పత్రికల్లో కవితలు, అభినయ గేయాలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి.

Leave a Reply