నడిచే దారిలో నువ్వొక ముళ్ళువి

పలికే గొంతు నీది కాదు
మాట్లాడే మాట నీది కాదు
ఆలోచన నీది కాదు
ఆహార్యం నీది కాదు
ఎవడో నడిపిస్తే నడిచే వాడివి
ఎవడో మాట్లాడిస్తే మాట్లాడే వాడివి
నిన్నటి వరకు నీవు నడిచిన దారి
ఇవ్వాల నీకు తప్పుగా కనిపిస్తుంది
నిన్నటి వరకు నువ్వు ప్రచారం చేసిన మాటలన్నీ
ఇవ్వాల నీకు అర్థం లేనివిగా అనిపిస్తున్నవి
ప్రజా సైన్యం లేకుండా
ప్రజలకు ఒరిగేది ఏమీ లేదన్న సూక్తిని మరిచావా
సాయుధం కాకుండా
సమసమాజం రాదన్న సత్యాన్ని మరిచావా.
ఆయుధం వదిలిపెట్టగానే
అహింస గుర్తుకొచ్చిందా
బయటికి వచ్చిన వాళ్ళలో
కనీసం కొద్ధి మందయినా
ఆయుధాలను జమ్మిచెట్టుపై దాచి వచ్చిన వాళ్ళే
కనీసం కొద్ధి మందయినా
కాని కాలంలో కాలు ముందుకు కదపలేక
వెనుకడుగు వేసిన వాళ్ళే
నాటిన విత్తనం మొలకెత్తాలంటే
దానికి తగిన వాతావరణం ఉండాలి
మొలకెత్తిన మొక్క బ్రతకాలంటే
దాని వేర్లకు నీరుకావాలి
దాని పత్రాలకు సూర్యకిరణం తాకాలి
మబ్బులు కమ్మిన సూర్యుడు
ఎప్పుడు చీకట్లోనే మగ్గిపోడు
పదను తాకిన నేల పత్రహరితమై
పరిమళించక మానదు
నాది ఊహ కాదని
నాది అత్యాశ కాదని
నీకూ తెలుసు
నీవు పలికిన చిలక పలుకులన్నీ
ప్రజలకు తెలియనివి కావు
ప్రజావీరులకు తెలియనివి కావు
మాటల మాటున నువు దాచిన విద్రోహాన్ని
ప్రజలు గ్రహిస్తున్నారు
ఒక్క సారి దారి తప్పిన వాడి గమ్యం
ఎలా ఉంటుందో వాడికే తెలియదు
నీకూ ఓ లక్ష్యం ఉండే ఉంటుంది కానీ
నీ అభివృద్ధి నిరోదకమైన లక్ష్యాన్ని
ఏ ప్రజలూ ఆమోదించరు
మోడులు చిగురించే కాలం వస్తుంది
ఎండిన చెరువులు నీళ్ళతో నిండి
మత్తల్లుపడే కాలం వస్తుంది
వడ దెబ్బకు తలలు వాల్చిన మొక్కలు
కళ్ళు తెరచి పుష్పించే కాలం వస్తుంది
పూలు రాలె అకాలం ముగిసి పోయి
మొగ్గలు పూలుగా విచ్చుకునే కాలం వస్తుంది
కాలానికి తగినట్టుగా
రూపం మారవచ్చు కానీ
లక్ష్యం మారదు
నడక మారవచ్చు కానీ
నడిచే దారి ఎన్నటికి మారదు
నువు చూపే దారి ఎండమావి లాంటిది
లక్ష్యం లేని నడకకు అంతం ఉండదు
ప్రజలు నిర్ణయించుకొని నడిచే దారిలో
నీలాంటి ముళ్ళు కాలికి గుచ్చుకున్నప్పుడు
పీకి అవతల పారేసి
ప్రయాణం కొనసాగింపక తప్పదు.

పుట్టింది ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముత్తారం గ్రామంలో. పెరిగిందీ విద్యాబుద్ధులు నేర్చిందీ హన్మకొండ పట్టణంలోని కుమార్ పల్లి వీదుల్లో.
అప్పుడప్పుడూ కవిత్వం రాస్తుంటాను. ప్రగతిశీల విప్లవ సాహిత్యాలంటే వల్లమాలిన ప్రేమ.

2 thoughts on “నడిచే దారిలో నువ్వొక ముళ్ళువి

  1. కవిత్వం వ్రాసారు. సంతోషం. కవికి భాష బాగా తెలిసి ఉండటం అవసరం. మీరు ఏమీ అనుకో నంటే ఒకటిరెండు మాటలు. మొదటీది. ముల్లు అన్నమాటకు బహువచనం ముళ్ళు. ఒక ముల్లు – రెండు ముళ్ళు. భాష వీషయంలో కృషిచేయండి. రెండవమాట. ఏఇజాన్ని బుజాన మోసేది ఐనా కవిత్వం కవిత్వం పరిథి కుంచించుకుపోతుంది. కవీ ప్రపంచాన్ని సమగ్రంగా చూడలేకపోతాడు.

    మరొకమాట. ఏపత్రిక ఐనా సంపాదకులు ఉంటారు కదా. ఈపత్రికకూ ఉండేఉంటారు. శీర్షికలోనే భాష తప్పుగా ఉంటే గమనించలేదూ ఆంటే ఆది శ్రధ్ధిలోపమా లేక వారి భాష కూడా అంతంతమాత్రమేనా అని సందేహించక తప్పదు.

  2. ఈ తవికలు ఎందుకు రాస్తున్నారో వారికే తెలియాలి. వామపక్ష భావాలను ప్రకటించే జాల పత్రిక లాగా అనిపిస్తుంది. శోధిని నిండా ఇలాంటివే ఎక్కువగా కనిపిసున్నాయి. మాలిక ఉన్నప్పుడు బ్లాగులోకం బాగుండేది.

Leave a Reply