నడక నేర్పే కవికి సలాం

నడవడం చేతయిన వాడెవ్వడూ
దారి పక్క పొదల్లో గస పెట్టడు.

రాయడం చేతయిన వాడెవ్వడూ
పెన్నుకి ద్రోహం చెయ్యడు.

దాని ముసుగులేవైనా సరే
రాజ్యం
ధిక్కారపు గొంతుల్ని
వెతుక్కోని మరీ ఉరితీస్తుంది.

కెన్ సారో వివా..
నైజీరియా నుంచి నువ్విచ్చిన పిలుపుని
చావు విందులో మునిగి తేలుతున్నవాళ్ళకి వినిపించడం లేదు.

నిశ్శబ్దం కింద
మా చావు వాయిదాల్ని
ఇంకా ఎవ్వరూ లెక్కించడం లేదు.

కాళ్ల కింద చెలరేగనున్న
రిలయన్స్ మంటల్ని
మేమింకా గుర్తించనే లేదు.

ఇంట్లోనే టీవీ చూస్తో
తగలడే సరికొత్త కమురుకంపు కలని వాగ్దానం చేస్తున్న
ఈ నేతల ముఖాన విసిరే చెప్పు కోసమూ మేం వెతకడం లేదు.

మేం చావడానికి
సిద్ధం అయినవాళ్ళం.
అందుకే ఆలోచించం,రాయం.

గాయాల రసుల్లో
ప్రేమ గీతాలు కెలుక్కుని
నెత్తుర్ని వాంతి చేసుకుని
కాంతి వలయాలనుకుంటాం.

నేను శవం ఐపోయిన వార్తల్ని
పొద్దున్నే చదుకొని సుఖనిద్రలో
మృత్యువు వాసనలో జోగాడుతాం.

కెన్..
నా నిశ్శబ్దం
నా శవం మీద కప్పుతున్న కఫన్ అని నేనింకా గుర్తించలేకుండా ఉన్నాను.

నువ్ నడక నేర్పినందుకు
నీ అడుగుల్లో అడుగేస్తున్నాను.

( ప్రజల కోసం మాట్లాడినందుకు ఉరితీతకి గురైన ‘కెన్ సారో వివా’ కోసం…)

జననం: పేర్ణమిట్ట, ప్రకాశం జిల్లా. అధ్యాపకుడు, పాత్రికేయుడు. MA, M.Phil, PhD, (LLB) చదివారు. చలం, కొకు పై , బహుజన తాత్వికత పై పరిశోధన చేశారు. సంపాదకత్వం: నువ్వే లేకపోతే( అంబేద్కర్ విగ్రహ విధ్వంస నిరసన కవిత్వం), పరివర్తన నిజం-మత మార్పిడి అబద్ధం( కంధమాల్ దళిత క్రైస్తవుల హత్యల నిరసన కవిత్వం), తెగిపడిన చోట తెగబడటమే( లక్ష్మీపేట దళిత నరమేధం నిరసన కవిత్వం) సంకలనాలకు సంపాకత్వం వహించారు.

Leave a Reply