నడక

ఈ దేశంలో మాలా మాదిగలున్నారు. వాళ్ళ బతుకు బడిలో’ అ’ అంటే ‘అమ్మ’కాదు, అంటరానితనం. ‘అ’ అంటే ‘ఆవు’ కాదు ‘ఆకలి’. ఆ బతుకు బడిలో మాలచ్చి వుంది. ఆమె మొగుడు లచ్చెర్పు వున్నాడు. అత్త సుబ్బులుంది. మామ పోలయ్య వాళ్ళతో పాటు రాములు, చిన్నె కత్త అట్టా చాలామంది వున్నారు. వాళ్ళు పుట్టాక పురిట్లోనే అంటరానితనం వంటికి పూసుకొన్నారు. ఆకలి ఉగ్గిన్నెలో తాగారు. మీరు విశాల హృదయం గలవారు. మీకు యింకా ఈ దేశంలో అంటరానితనం వుందా అని ఆశ్చర్యం కలగొచ్చు. బతకడం చాతకాని దౌర్భాగ్యులంతా ఆకలి అంటారని కొట్టి పారెయ్యెచ్చు. అదృష్టవంతులు మీరు, వడ్డించిన విస్తరి మీ జీవితం. కాని మాలచ్చి జీవితం వడ్డించిన విస్తరి కాదు. మాలచ్చిని రాయడమంటే ఆకలి, అంటరానితనం కలిపి రాయడమే.

ఉన్నవాళ్ళు లేనివాళ్ళు వున్నారు. లేని వాళ్ళల్లో అంటదగిన వాళ్ళు అంటరానివాళ్ళు వున్నారు. ఆ అంటరానివాళ్ళల్లో మాలా మాదిగలున్నారు. మాలా మాదిగ మగాళ్ళు లేని వాళ్ళు, అంటరానివాళ్ళు. మాలామాదిగ ఆడాళ్ళు లేనివాళ్ళు, అంటరానివాళ్ళు, మొగుడు కింద నలిగేవాళ్ళు. మాలచ్చి మొగుడు బతుకులో వర్గం వుంది. కులం వుంది. మాలచ్చి బతుకులో వర్గం వుంది, కులం వుంది. మగాడి పెత్తనం వుంది.

మాలచ్చి ఆ కులాల్లో కాకుండా అగ్రకులాల్లో పుట్టి వుంటే మహాలక్ష్మిగా పిలవబడేది. అంటరానివాళ్ళ కులంలో పుట్టింది కాబట్టి మాలచ్చి అయింది. మాలచ్చి మొగుణ్ణి కూడా లక్ష్మీనరసింహం అని పిల్చేవాళ్ళు. యింకాస్త ముందుకుపోతే లక్ష్మీ నరసింహశాస్త్రి అయ్యేవాడు, లక్ష్మీనరసింహ చౌదరి అయ్యేవాడు. రెడ్డి అయ్యేవాడు. అంటరానివాడు కాబట్టి లచ్చెర్పు అయ్యాడు. నిజానికి మాలచ్చిది దేవత పేరే. లచ్చెర్సుదీ దేవుడి పేరే. దేవుడి పేరైనా అంటరానివాడికి పెట్టబడ్డది కాబట్టి అది హీనంగానే పిలువబడుతుంది. ఎంత గొప్ప దేవతైతే మాత్రం అంటరాన్ది అగ్రవర్ణమౌతుందా ? మాలచ్చి మాలచ్చే,
మహాలక్ష్మి మహాలక్ష్మి దేవుళ్ళు దేవతలు హీనులైపోయినా ఈ దేశం అచారం చేస్తుంది గాని అంటరానివాళ్ళని అందంగా పిలవడమంటే పురీసుకొని చావడమే. దేవుడు అగ్రవర్ణాల లోగిళ్ళలో ‘దేవుడు గోరు’ అవుతాడు. మాలా మారిగల యిక్కల్లో దేవుడు గోడు అవుతాడు. అట్లా ‘దేవుడు గోడు’లు నాలుగు వందల యిరవై తొమ్మాని కులాల్లో మిలియన్ల కొద్దీ పున్నారు. కొందరు యేసురత్నా లయ్యాడు. కొందరు మర్చినయ్య లయ్యారు. కొందరు మస్తానమ్మలయ్యారు కొందరు పరిశుద్ధమ్మలయ్యాడు. అయితే యేసుగోడుగానో, మస్తాన్డుగానో, పరిసుద్ధిగానో పిలవబడ్డూనే వున్నారు మతం మారొచ్చు, పిలవబడే పద్ధతి మారదు. ఈ రచయితలకి బొత్తిగా బుద్ధి లేదు. ఏసురత్నాల రెడ్డి, ఏసుగోడు వకటౌతారా?

మాలచ్చి ఉత్తరాది బిడ్డ. ‘దచ్చాదికి నా బిడ్డనియ్య’ నంది మాలచ్చి అమ్మ పిల్లన చూశాక లచ్చెరువు అమ్మ వోలి ఎంతైనా యిచ్చేద్దామనుకుంది. ప్రధానం మూటలో పుండాల్సిన వక్కలకన్నా నాలుగు వక్కలు ఎక్కువే వుంచింది. కట్టకి బదులు రెండు కట్టల తమలపాకులేసింది. రెండు రవికల వరస కాదని అయిదు రవికల వరస పెట్టింది. తన ముక్కులో ముక్కుపుడక, తోడికోడలు దెవులో కమ్మలు కలిపికట్టింది. వెర్రేమన్నా పట్టిందేమోనని కులపెద్ద చూస్తే “ఉత్తరాది పిల్ల మామా… నాకా… పతానం కర్చు పట్టించుకోదు… పిల్ల… ఎట్టావుంది. మెరుపుతీగ… కట్టండి. యింకా ఏదికట్టాలో” అంది. యిదంతా నిజానికి మాలచ్చి మీద ప్రేమతోనే కాదు, డచ్చాడికి నా బిడ్డనియ్య’నన్న మాలచ్చి అమ్మమీద కోపం కూడా కలిసింది. “దచ్చారికి బిడ్డనియ్యనంటడా… సూపిత్తా ద్బది డెబ్బేదో” అని పైకి అననే అంది. దర్బారి ప్రదానం ఉత్తరాదివాళ్ళకి అంతగా నచ్చలా పక్కలు తగ్గాయన్నాడు. ఆకులు మూడు కట్టలుండాలన్నారు. రవికలు మరీనాసిరకం అన్నారు. ముక్కుపుటక చూసి మాలచ్చి అమ్మమూతి మూడు తిప్పులు తిప్పింది. కమ్మలు కమ్మలు కాదంది. తెల్లారిందాకా ఆ రగడ అట్టాగే సాగింది. పేదవాళ్ళ పెళ్ళిలో ‘ప్రదానం వొక్కల లెక్కే గొప్ప అంశం. | ఎకరాల లెక్క తెలీని వాళ్ళకి ఆకులు వక్కలే అలుగుల పర్వం/ చివ్వరికి రాజీకి రాడని కాదు. వస్తారు. కాని ఆదో సందడి. ఆకలి కడుపుల సందడి. లకు నవ్వుల పందడి. అంతకన్నా ఏ ఆస్తులు వున్నాయి కాబట్టి, పెద్ద మాల, మాదిగ పెద్ద యిక్కడే పైకెన్సీ కూర్చుంటారు. యిది మా వైపు ఆచారమంటారు. యిట్టా మా వూరూ వాడా లేదంటారు. తెలిసిన జ్ఞానమంతా పదిమందికి తెలిసేలా చెబుతారు. ఆఖరికి ఎవరో ఒకరు కలుగజేసికొంటారు. మాలచ్చి ఈ తతంగమంతా తోటి పిల్లలోనగం రాత్రి దాకా చూస్తూ కూర్చుంది. ఆ తర్వాత వాళ్ళు ఎట్టా కొట్టుక చస్తే తనకేం అని అక్కడే వున్న నులక మంచం మీద నిద్రపోయింది. తెల్లారికట్ల నిద్ర లేపితే నిద్రలేసింది. చేతిలో ఆకూ ఒక్కొ వుంచారు. కులపెద్ద ‘బొందు’ వేశాడు. మాలచ్చి పెళ్ళి కూతురైంది.

పిల్ల పాలకంకిలాగుంది. లచ్చెర్సు అమ్మ పదే పదే అనుకొంది. సంవత్సరం తర్వాత నిద్దరకాయడానికి కోడలు వెళ్తుంటే దాచ్చాదికి వచ్చిపడ్డ సంపద మళ్లీ ఉత్తరాది పోతున్నట్టనిపించింది. పొలిమేర దాకా సాగనంపింది. లచ్చెర్సుకు బిడ్డ జాగ్రత్తని పదిసార్లు చెప్పింది. ఎందుకో గాని కళ్ళు నీళ్ళు తిరిగాయి. ‘ముసలాడుంటే ఎంత ముచ్చటపడేవాడో’ అనుకొంది. ‘ముదనష్టపోడు ఆడికి అట్టాంటి రాత లేద’నుకొంది. యింటి కొచ్చాక యిళ్ళు కళ దప్పినట్టనిపించింది. కల్లాం గంపలో చీపురేసుకొంది. గంప చంకన పెట్టుకొని పెద్దిరెడ్డి కుప్ప కేసి నడిచింది. కళ్ళంతా కోడలే వుంది. కల్లాంలో వడ్డ గింజ కనబడలేదు. కల్లమంతా వట్టి రాళ్ళు అన్పించింది. లచ్చెర్సు తర్వాత తనకి ఆడపిల్ల యిందుకే పుట్టలేదనుకొంది.

మాలచ్చికి అట్టాగే వుంది. కలసి వుంది కొద్ది రోజులైనా, అత్త మా దొడ్డ మనిషనుకొంది. అమ్మతో అంటే ఏమనుకొంటుందో అని అనలేదుగాని అత్త మంచితనం అందరికీ చెప్పింది. పెళ్ళయిన మూడోరోజు మాట. అత్తతో పాటే నిద్ర లేసింది. అంట్లు ముందేసుకొని అత్త కూర్చొంటే పక్కనే కూర్చొంది. అత్తకేసి వింతగా చూసింది. మహా వుంటే మూడు పళ్ళాలుంటాయి. రెండు తపేళాలుంటాయి. అయిదారు మూకుళ్ళుంటాయి. నొప్పిగ్గా పిడకకసితో రుద్దుతుంది. ఎంత రుద్దినా తెల్లగా రానందుకు తిట్టుతోంది. పగిలిన మూకుడు కూడా వదల్లేదు. రెండుసార్లు రుద్దింది. పనయ్యాక ‘అటక మీద పెట్టే పిల్లా’ అంది. ఏది ఎట్టా పెట్టాలో చెప్పింది. అత్త వాకిలి చిమ్మటం మొదలెట్టింది. మాలచ్చి కూడా చీపురు తీసుకుంది. శుభ్రంగా చిమ్మాక అత్త గూట్లో ముగ్గు డబ్బీ తీసుకుంది. ముగ్గు కర్ర గియ్యబోతూ అత్త కోడలు కేసి చూసింది.

“గీత్తావే పిల్లా”

“నువ్వు గియ్ సూత్తా”

నిజానికి మాలచ్చి ముగ్గులు బాగా గీస్తుంది. అయినా అత్త గీస్తే చూడాలనుకుంది.

“నాది ముతగ్గీత… నచ్చినోడు ఎప్పుడూ తిడతుండేవోడు.. నీయమ్మ ముగ్గు గీత రానిదానివి ఎట్టా కాపరం సేత్తావే అని” అంటూనే గియ్యటం మొదలెట్టింది. తప్పు పోయిందంటూ మూడుసార్లు చెరిపేసింది. “సచ్చియాడుందో ఆయనమ్మ ముగ్గు గీత బాగా గీసేది. ఈడ మొదలు పెత్తే ఆడ ఆపేది. ఆమె పోయిందీ యింటి ముందు ముగ్గు గీతే సిన్నదయింది. 14 వినిదయింది. ఏ మాట కామాట సెప్పుకోవాల పిల్లా మా ముపల్లి ముగ్గు న్చుకోయే పిల్లా అని బుగ్గ మీద ముచ్చటగా కొట్టిందేగాని తిట్లా కడుపున పెట్టుకుంది. ముసురోజుల్లో పునీళ్ళల్లో ఉప్ప గల్లేసి నేను తాగాకే తాను తాగేది కళ్ళు శుడుచుకుంటూ అత్త నాలుగోసారి ముగ్గేయబోయింది. మనస్సు ముగ్గు మీద లేదు మాలచ్చి ముగ్గు బుట్ట అందుతుంది. గీత మారుస్తూ గీత పెట్టింది. చిలకల్ని, పిందెల్ని తొడిగింది. వొంచిన నడుం ఎత్తకుండా గీస్తూనే వుంది. అత్త కళ్ళప్పగించి చూస్తోంది. ఇన్ని గీతలు యింత వయ్యారంగా ఎట్టా గీసిందని అబ్బురపోయింది. అక్కడే నిలబడి వొచ్చే సాయ్యే వాళ్ళకి నా కోడలు గీసిందని చెప్పింది. దచ్చాది వాళ్ళకి ఉత్తరాది ముగ్గు మింతగానే అన్పించింది. ఆ వింత ఆ నోటా ఈ నోటా పడి పెద్దిరెడ్డి లోగిలిలో కూడా తెలిసింది. పెద్దిరెడ్డి భార్య ‘అట్టాగా’ అంది. ‘నీ పెళ్ళాన్ని పొద్దున్నే తీసుకురారా అచ్చెర్చు’గా అని అంది. లచ్చెర్సు పొంగిపొయ్యాడు. ఆ రాత్రి మాలచ్చితో చెప్పాడు. మాలచ్చి ససేమిరా వెళ్ళనంది. వెళ్ళకపోతే బాగుండదన్నాడు. యిష్టం లేకపోయినా చీకటి పొద్దున పెద్దిరెడ్డి యింటికి లచ్చెర్సుతో వెళ్ళింది. పెద్దిరెడ్డి భార్య ముగ్గు పెట్టమంది. ముగ్గు పెట్టాక పెద్దిరెడ్డి భార్య రోజూ వచ్చి ముగ్గుపెట్టమంది. యింటికి తిరిగి వస్తే యింటి ముందు మూడుసార్లు చెరిపేసిన మూడు ఒంకర్ల ముగ్గు కర్ర కన్పించింది. దిగులనిపించింది. అత్తతో తెగేసి చెప్పింది. చచ్చినా పెద్దిరెడ్డి యింటి ముందు ముగ్గుపెట్టనంది. గీసేది నేను. నా యింటి ముందు కాక ఆళ్ళ యింటి ముందు ఎందుగియ్యాలంది. అత్త ఆ పిల్లకేసి చూసింది. ఉత్తరాది పిల్ల మాటలు ముచ్చటగానే వుంటాయనుకొంది. అంత ముచ్చట కాదనలేకపోయింది. అంతేగాని మాలచ్చి మాటల వెనకవున్న అర్థాల్లోకి వెళ్ళలేకపోయింది. వెళ్తే ఈ చరిత్ర యింత దీనంగా దుర్మార్గంగా వుండదు. ముగ్గేసేది నేను. నా యింటి ముందుకాక ఆళ్ళయింటి ముందు ఎందుకెయ్యాల అని మాలచ్చి అనుకొన్నట్టే చెమట నాది. చాకిరి నాది ఆడి గాదె మాత్రమే ఎందుకు నిండాల అని లచ్చెర్పు ప్రశ్నించుకొంటే ఆత్మాభిమానాలు భూ సంబంధాలు యింకోలా వుండేవి. లచ్చెర్చుకు అవన్సీ పట్టలేదు. ‘ఎందుకు రాలేదురా నీ పెళ్ళాం’ అంటే ఏం చెప్పాలో పాలుపోవడం లేదు. కొత్త పిల్లతో కఠినంగా మాట్లాడలేకపొయ్యాడు.

కుప్ప నురిపిళ్ళ కాలం. లచ్చెర్చు తాత నాటి నుంచి పెద్దిరెడ్డి యింట్లో దాకిరి ఆ కుటుంబానికి ఆనవాయితీగా మారింది. లచ్చెర్పు పెద్దిరెడ్డి యింట్లో చిన్న పని చితక పని చేసేవాడు. ఒక్కోరోజు ఆ చిన్నా చితక పని రోజంతా వుండేది. పొద్దున్నే సద్ది అక్కడే తాగేవాడు. మధ్యాహ్నం కూటి దుత్తలు పొలానికి పట్టుకెళ్ళేవాడు. రాత్రి ఏదో జాముకు యింటికొచ్చేవాడు. చిన్నా చితక పనులంటే అట్టాగే వుండేవి. వీటికి తోడు కుప్ప మురిసి గింజ యింటికొచ్చే దాకా కుప్పల కాపలా వుండేది. ఆరుకాలం రెడ్డిని నమ్ముకొన్నందుకు రెడ్డిగారి గొడ్లు తిని తొక్కేసిన ‘తొక్కుడు’ తన గొడ్లకి తెచ్చుకొనేవాడు. కుప్ప మురిపిళ్లయ్యాక కల్లాల్లో లచ్చెర్సు అమ్మ తాలూ తరక వూడ్చుకొనేది. పండక్కి బుట్ట కూడు, నాలుగైదు మంచి అరిసెలు, కూరలు పెట్టేవాళ్ళు. ఏరువాక పున్నమికి పంచల సాపు పెట్టేవాళ్ళు. పెద్దిరెడ్డి భార్య చిరుగు కోకలు లచ్చెర్సు అమ్మకిచ్చేది. ఈ తతంగమంతా లచ్చెర్చుకు ఒక హోదాని యిచ్చేది. అది “పెద్దిరెడ్డి మాలోడు” అని పిలిపించుకోవడం.

ఈ పెద్దిరెడ్డి మాలోడు హోదా లచ్చర్సుతోనే ఆగలేదు. అది మాలచ్చిదాకా వచ్చింది. ఓసారి అత్తకి బాగా లేకపోతే పెద్దిరెడ్డి యింటి కెళ్ళింది. ముగ్గుకు రానన్న తర్వాత యిదే అక్కడికి పోవడం. పెద్దిరెడ్డి భార్య పెద వెంకాయమ్మది సాగదీసే గుణమని పేరుంది. ఏదీ ఒక పట్టాన మర్చిపోదు. ఏడేళ్ళ వెనకటి మాట కూడా అవసరమొచ్చినప్పుడు గుర్తు చేస్తుంది. లచ్చెర్సు మేనత్త వూరెల్లాడు. లచ్చెర్సుకు అరెకరా వుంది. నిజానికది పెద్దిరెడ్డికే కౌలుకిచ్చాడు. కవులు కిచ్చినా దున్నటం తనే చేసి పెట్టాల. ఆ తరువాత పెద్దిరెడ్డి దున్నకం మొదలైతే తనూ అరక కట్టాల. అప్పుడప్పుడు సన్నకారు రైతులు దున్నకానికి పిలుస్తారు. అట్టా కూలి కూడా గిట్టుతుంది. తొలకర్లు పడ్డాయంటే దున్నకం మొదలౌతుంది. ఎడ్లు కావాలి. మేనత్త దగ్గర ఎడ్ల జత తోలుక రాకపోతే కుదరదు. లచ్చెర్సుకు సొంత ఎడ్లు లేవు. వాళ్ళ నాన్న వున్నప్పుడు దాపటెద్దు వుండేది. ఎలపటెద్దు మేనత్త దగ్గర్నుంచి తెచ్చేవాడు. యిప్పుడు అదీ లేదు. అందు కోసం వెళ్ళాడు. వెళ్ళిరెండు రోజులైంది. యింకా రాలేదు. పడిశం పట్టిందే పిల్లా అంటూ అత్త కాస్త నడుం వాల్చింది. సాయంత్రానికి జ్వరం ముంచకొచ్చింది. సొంటి రుద్ది కంటికి కలికం పెట్టింది. జిల్లేడు ఆకు కణతలకు రాసింది. కసాయం కాసి తాపించింది. పడిసెం తగ్గడం దేవుడెరుగు. వాళ్ళు నెప్పులు, జ్వరం. మూలుగు ఎక్కువైంది.

లాభం లేదని టౌన్లో డాక్టర్ దగ్గర పన్జేసి ఈ మధ్యనే ఆ ఊళ్ళో వైద్యం మొదలెట్టిన కాంపౌండర్ వుంటే అతని దగ్గరికి పరుగెత్తింది. ఆయన వచ్చి చూశాడు. మూడు బిళ్ళ లిచ్చాడు. మూడుసార్లు మజ్జిగతో యిమ్మన్నాడు. మజ్జిగ తప్ప యింకేది యివ్వాద్దన్నాడు. తప్ప లేదు. అత్తకన్నా తనకెక్కువ ఎవరున్నారు. అందుకే పెద్దిరెడ్డి యింటి కాంపౌండులో భయపడ్తూ నిలబడింది. పెద వెంకాయమ్మ అనుమానంగా చూసింది. రాకూడని మనిషి వచ్చినట్టు చూసింది.

“అత్తకి జోరం… మజ్జిక్కావాల…”
ఏ కళ మందో అరె పాపం అంది పట్టుకెల్లువ కాస్త ఈ బస్తా ఆ వద్ద మర దగ్గరేసిరా అని వద్ద బస్తా చూపింది. మాలచ్చి తపేళా కింద పెట్టి బస్తా దగ్గర కెళ్ళింది. మొయ్యలేవేమోనే పాపం అంది. మీ అత్త చూస్తే నన్ను తిట్టుద్దే అంది. ఆ అత్త కోసమే బస్తా మోస్తున్నానని మాలచ్చి అందామనుకొంది. బస్తా నెత్తిని పెట్టుకొని గేటు రాటుతుంటే “ఆ మిల్లోడు యిప్పుడే వడ్లు మరేస్తానంటే ఏపించుకురాయే” అంది. మిల్లు దగ్గర్లో లేదు. మూడు పూళ్ళు కలిపి మధ్యలో వుంది. ఊళ్ళో బస్తా మోసుకెళ్తుంటే బస్తా బరువుకన్నా తనకేసి అట్టాగే చూస్తున్న మగాళ్ళ చూపులే కష్టంగా వున్నాయి.

“ఎవుర్రా ఆ పిల్ల’

“పెద్దరెడ్డి మాలాడి పెళ్ళాం”

ఆ మాట అన్నవాడి నెత్తి మీద బస్తా వెయ్యాలనిపించింది. జుట్టు పట్టి లాగి ఈడ్చి తన్నాలనిపించింది. మిల్లు దగ్గర చాలాసేపు వుండాల్సి వచ్చింది. దీపాలు పెట్టే వేళైంది. యింట్లో అత్త గుర్తొచ్చింది. రామమందిరం దగ్గరి మాటలు గుర్తొచ్చాయి. ఏడ్పు బలవంతాన ఆపుకొంది. లచ్చెర్సు పెళ్ళాం అనొచ్చు, సుబ్బులు కోడలు అనొచ్చు. పెద్దిరెడ్డి మాలాడి పెళ్ళాం ! బియ్యం బస్తా తెస్తున్నా ఆ మాటలే. నరాల్ని గుంజినట్టు అన్పించింది. దారంతా ఏడ్చింది. ఆ అంటరాని లేత గుండె ఆత్మాభిమానంతో ఏడ్చింది. కన్న తల్లి తండ్రి పేరు లేదు. కట్టుకొన్న మొగుడు పేరు కాదు. వాణ్ణి కన్నవాళ్ళ పేరు కాదు. ఎవడా పెద్దిరెడ్డి ? ఆడి పేరుతో తన గుర్తింపేమిటి? మిల్లు దగ్గర ఆపుకున్న ఏడ్పంతా చీకట్లో ఏడ్చింది. పెద్దిరెడ్డి అరుగు మీద బస్తా దింపి మౌనంగా నిలబడింది. పెద్దిరెడ్డి భార్య తపేళలో మజ్జిగ పోస్తూ పొద్దునే ముగ్గు గీత గిద్దువుగాని రాయే మాలచ్చీ అంది. అవసరం అన్నీ సహించేలా చేస్తుందేమో. అనాలోచితంగా తలూపింది.

మంచంలో అత్త మూలుగుతూనే వుంది. దీవం తీసుకొని పక్కింటికెళ్ళింది. వళ్కింట్లో దీపం ముట్టించుకొస్తుంటే రాములు పిన్ని “తిల్లిక యింకా ముట్టిలేదంటే పిల్లా” అంది. “ముట్టీలేదే మునుసబుగోరి మాలాడి పెళ్ళామా” అంది. రాములు పిన్ని మొహం ఎట్టా వుందో చీకట్లో చూడలేదు. దీపం దగ్గర పెట్టి చూడాలనుకొంది. చీకట్లో అత్త గుర్తొచ్చి గబగబా యింటికొచ్చింది. ఆత్తని కూర్చోబెట్టి బిళ్ళిచ్చింది. బిళ్ళ నోట్లో పడ్డాక మజ్జిగిచ్చింది. ఆముదంలో కలబంద మట్టవాడ్చి కణతలకి పెట్టింది. “కలికం పెట్టేదా అత్తా” అంది. అత్త అడ్డంగా తలూపింది. అయినా మనసూరుకోక సొంటి సాది కలికం పెట్టింది. అత్త కలికం బాధతో తిట్టటం మొదలెట్టింది. ఆ తిట్లు తనని అవమాన పర్చినట్లు లేవు. ‘మళ్ళా పెత్తున్నా’ అంటూ ఉడికించింది కేవలం తిట్లు తినడానికే అట్టా అంది. అత్త తిడుతుంటే గుండెల నిండా నవ్వుకొంది.
కూటి తపేళలో ఎసురుకు నీళ్ళు పోసి పొయ్యిమీద పెట్టింది. దీపం ముందు పెట్టుకొని రాళ్ళేరుతూ కూర్చుంది. రాములు పిన్ని రానే వచ్చింది. వస్తూనే ఏంటే కూతురు బిడ్డా అట్టా అన్నావ్ అంటూ పొయ్యి దగ్గర కూర్చొంది. రాములు పిన్నికి జరిగిందంతా చెప్పింది. విన్న రాములు మాలచ్చి కేసి వింతగా చూడలేదు.

“నాకు అట్టా పిలిస్తే బాగుండదు పిన్నీ”
రాములమ్మ జవాబు చెప్పలేదు. వాస్తవానికి తనకీ యిష్టం వుండదు. తాను ఈ వూరికి కోడలుగా వచ్చిన కొత్తలో మునసబు మేనల్లుడు తనతో చాలా ముతగ్గా మాట్లాడాడు. మొగుడు పక్కనున్నా వాడు ఆమె మొగుడు కానట్టే మాట్లాడాడు. మొగుడు మాట్లాడలేదు. పై పెచ్చు నవ్వుతూ నిలబడ్డాడు. తానూ మాట్లాడలేదు. సిగ్గు పడూ తలదించుకొంది. పేదరికం అట్టా చేస్తుంది. రోషం లేక కాదు. అభిమానం చచ్చి కాదు. ఎందుకు ఆ బూతులకి నవ్వు వస్తుందో తెలీక కాదు. ఆ తర్వాత ఏం జరిగింది. వాడు గొడ్లకాడి జొన్నతొక్కు మూటకడ్తుంటే నడుం మీద చెయ్యేసి దగ్గర్కి లాక్కున్నాడు. తాను ఏం చేసింది ? ఎందుకు నోర్మూసుకొని కూర్చొంది ? మొగుడికి కూడా చెప్పకుండా ఎందుకు దాచుకొంది. “నీ పెళ్ళాన్ని తూర్పు మిరప దొడ్డికి రమ్మనా ఎంకా” అంటే తన ఎంకడు సరేనయ్యా అని ఎందుకన్నాడు. మిరపదొడ్డికెళ్ళి సాయంత్రానికి యింటి కొస్తే యింతాలిస్సెం ఎందుకైందే అని వాడెందుకు నిలెయ్యలేదు. ఎందుకు తిట్టలేదు. తనకేమీ తెలీనట్టు తన ఎంకడు వూరుకొన్నాడు. ఏళ్ళు గడిచాయి. ఎంకడు మునసబు మాలాడే. ఎంకడి పెళ్ళాం మునసబు మేనల్లుడి జొన్న తొక్కే. బతుకు యిట్టా కమ్మని దేవుడు రాశాడు.

“ఎసరు కాగిందా పిన్నీ”

“కాగిందే పిల్లా బియ్యంపాయ్”

ఎసట్లో బియ్యం పోసింది. రాములు నిప్పులు ఎగదోస్తుంది.

“తెలీక అడగతా పిన్నీ. ఈ వూళ్ళో ప్రతి మాలాడు పలానా రెడ్డి మాలోదేనా ఆడి పెళ్ళాం పలానా రెడ్డిగోరి మాలాడి పెళ్ళామేనా…”

“ఉత్తరాదిన యిట్టా లేదంటే పిల్లా”

“వుంది గాని పిన్నీ, మరీ యిట్టా లేదు. పార్టీ వున్న వూళ్ళోనైతే యిట్టా పిలవరు.”

పార్టీ అనే పదం రాములుకు కొత్తగా అన్పించలేదు గాని అదెట్టా కుదిరిందని అనుకొంది. రాములుకు తెలిసిన పార్టీలు రెండే. ఒకటి మునసబు పార్టీ. రెండోది పెద్దిరెడ్డి పార్టీ ఎన్నికలప్పుడు మునసబు పార్టీ మాలోళ్ళంతా ఒకటయ్యేవాళ్ళు, పెద్దిరెడ్డి పార్టీ మాలోళ్లంతా ఒకటయ్యేవాళ్ళు మాదిగలు కూడా అంతే. పక్కూరులో ఎన్నికలు జరిగేవి. పొద్దున్నే కూలికెళ్ళినట్టు కట్టలు కట్టలుగా మాలా మాదిగలు వెళ్ళేవాళ్ళు. ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి వోట్టేసేవాళ్ళకి మధ్యాహ్నం తిండి పెట్టేవాళ్ళు మగాళ్ళకి కల్లు పోసేవాళ్ళు ఓట్లేసి యింటి కొచ్చేవాళ్లు. పల్లె రెండు వర్గాలుగా చీలిపొయ్యేది. ఒక్కోసారి కోటీలు కూడా విడిపోయ్యేవి. యిళ్ళ మీద రాళ్ళు, బజార్లో తిట్లూ, అప్పుడప్పుడు కొట్లాటలు, పార్టీ లంటే తనకి తెలిసిందంతే. తనకి తెలిసిన పార్టీల సంగతి మాలచ్చితో చెప్పింది. మాలచ్చి పార్టీ అంటే మునసబు పార్టీ, పెద్దిరెడ్డి పార్టీ కాదంది. కమ్యూనిస్టుపార్టీ మాట తన మోటు పదాల్లో చెప్పింది. 1950 నాటిమాట. తన వూళ్ళో మాలా మాదిగలు వీళ్ళ కోసం ఎట్టా పోరాడారో చెప్పింది. ఊరి మధ్య చెరువులో మాలల్ని నీళ్ళు ముంచుకోనిచ్చేవాళ్ళు కాదు. పార్టీ వచ్చాక నీళ్ళు బుంగల్తో మాలా మాదిగలు చెర్లో దిగారు. పెద్ద కొట్లాటే జరిగింది. అయినా నిలబడగలిగారు. నీళ్ళు తెచ్చుకోగలిగారు. రాములు భూమ్మీద విడ్డూరం జరిగినట్టు అనుకొంది. కూలి రేట్ల కోసం పోరాటం చెయ్యడం, చుట్టు ప్రక్కల ఊళ్ళ నుంచి కూలీల్ని రాకుండా కట్టుదిట్టం చెయ్యటం.

యిదంతా అయోమయంగా వుంది. యిట్టా జరుగుతుందా అని అనుకొంది. పార్టీ, పోరాటం కొత్త మాటల్లా అన్పించాయి. మొత్తానికి ఉత్తరాది బిడ్డ కడుపులో చాలా సంగతులన్నాయనుకొంది. యిక్కడైతే యిప్పటికీ నీళ్ళ కుండల్తో పుణ్యాత్ములు తోడి పొస్తే పోపించుకోవటమే వూరబావి మాలా మాదిగలు తాక్కూడదు. బావి పళ్ళానికి దూరంగా కుండలుండాలి. అగ్రవర్ణాలవాళ్ళని అయ్యా అమ్మా అంటూ ప్రాధేయపడాలి. విసుక్కొంటూనో, కమరుకొంటూనో, బండ బూతులు తిడుతూనో మాల బుంగల్లో, మాదిగ బుంగల్లో నీళ్ళు పోస్తారు. ఒక్కోసారి బుంగ అక్కడ పెట్టుకొని నీళ్ళు పోసే పుణ్యాత్ముల కోసం ఎదురుచూడాల్సి వచ్చేది. కాళ్ళ కింది యిసుక కాలేది. నెత్తిని ఎండ మార్చేది. బతుకు మరీ అధ్వాన్నంగా వున్నట్టనిపించేంది. రాములుకు అంతా గుర్తొచ్చింది.

గంజి వొంచుతుంటే చిన్నెంకత్త గొంతు విన్పించింది. చింపిరి జుత్తు, ఎర్రిచూపు, కోటేరుముక్కు చిన్నెకత్త తమాషా మనిషి ఆ యింటా, ఈ యింటా పనిజేస్తుంది.

ఏ యింట్లో ఎప్పుడు పని చేస్తుందో ఎవ్వరికీ తెలీదు. ఈ మధ్య మిల్లు దగ్గర బియ్యం పట్టడం చేస్తుంది. తల దువ్విన పాపానపోదు. మాట్లాడినంతసేపు తలలో వేళ్ళు పెట్టి గోక్కుంటూనే వుంటుంది. వోరెత్తితే బూతులు. రాత్రి తొమ్మిది దాకా మిల్లులో వన్డేశాక ఆ పూట నూకలు వళ్ళో పోసుకొని కొడుకుల్ని కేకేస్తూ వల్లెంత తిరుగుతుంది. ఆ జామున తపేళ తీసుకొని ఊళ్ళోకి పోతుంది. వస్తూ మళ్ళీ కొడుకుల్ని కేకేస్తుంది. వండటం అయ్యాక మళ్ళీ కొడుకుల కోసం పల్లెమీద పడ్తుంది. అన్ని బజార్లు తిరుగుతూనే ఆ యింట్లో పచ్చడి, యీ ఇంట్లో కూర పెట్టించుకొంటుంది. తీరా యింటి కెళ్ళాక చూస్తే కుండలో కూడుండదు. కొడుకులు ఎప్పుడొస్తారో తిని పోతారు. కొడుకుల వంశాన్నంతా తిట్టి పోస్తుంది. కొడుకుల్ని తిట్టి వూరుకొక కొడుకుల వంశాన్ని కూడా తిట్టి పోస్తున్నందుకు మొగుడికి ఎక్కడ లేని రోషం వస్తుంది. పెళ్ళాం జుట్టు పట్టుకొని గబీ గబీ తన్నేవాడు. ఆమె బజార్న పడేది. మొగుడు నారాయుడు వెంట పడేవాడు. మొగుణ్ణి యిళ్ళ చుట్టూ తిప్పేది. పల్లె కంతకీ అదో సందడి. తిరిగి తిరిగీ ఏదో ఒక యింట్లో జొరబడేది. ‘రాయే నాయాల బైటికి’ అని మొగుడు తిడుతూ బజార్లో నిలబడేవాడు. దాన్ని బైటకి తోలండ్రా అని అనేవాడు. అట్టా బైటకి తోలకపోతే మీకూ నాకూ తెగిపోయినట్టనేవాడు.

ఈ రోజు సిన్నెకత్త మొగుడు మాలచ్చియింటి ముందే తిడుతున్నాడు. సిన్నెంకత్త తనింట్లో దూరిందని అర్ధమైంది. దీపం తీసుకొని యింటెనక దొడ్లో చూసింది. సిన్నె కత్త వొదుక్కొన ఓ మూల కూర్చొనుంది. చెప్పాద్దని సైగ చేసింది. మాలచ్చి సిన్నె కత్తని బయటకు రమ్మంది. నేను రాను ముదనష్టపోడు మంచోడు కాదని చిన్నె కత్త అంది. బలవంతంగా బయటికి లాక్కొచ్చింది. రాములు అడ్డమొచ్చింది. దాన్ని నరికేత్తాడే కూతురుబిడ్డా అంది. మాలచ్చి విన్పించుకోలేదు. వాకిలి ముందుకు చిన్నె కత్త బతిమిలాడుతున్నా లాక్కొచ్చింది. చిన్నెంకత్త మొగుడు ముందు నిలబెట్టింది. ఏది చేస్తావో చెయ్ అన్నట్టు చూసింది. నారిగాడు బిత్తరపొయ్యాడు. యిట్టా ఎప్పుడూ జరగలేదు. దాక్కొన్న సిన్నెంకి బయటకొచ్చేది కాదు, అలుపొచ్చినంతసేపు తిట్టి వెళ్ళేవాడు. యిప్పుడు అట్టా, రోజువారిలా జరగలేదు. దాక్కొన్న పెళ్ళాన్ని తన ముందుకు మాలచ్చి లాకొచ్చింది. యిబ్బందిగా వుంది. అంగ లేస్తూ వెళ్ళిపాయ్యాడు. వెళ్తూ యింటికి రానీ దాని సంగతి సూత్తా అంటూ వెళ్ళాడు. చుట్టూ చేరిన జనం మారిన దృశ్యంలో యిమడలేక ఎవరింటికి వాళ్ళు వెళ్ళారు.

“పొద్దున లేశానే కోడలా… మేపుడు గొడ్డుకి తొక్కుకెళ్ళానా ఆడ కెల్లగానే మీ ఆసామి యింట కాడకి రమ్మందని యాలాంకాడ పిల్లోడు సెబితే ఆసామి యింటి కాడికెల్లేనా, తిరగట్లో రాగులు పోసి తిరగలి పట్టమంది ఆసామి. ఒకటా రొండా పది మానికలు. తిప్పినా అసలే రెక్క నొప్పిగుంటే సున్నం రాశా అదట్టా వుంచు కోడలా… నా మాట తీసుకో. యిందులో నాదేమన్నా తపిసీలుంటే

  • నీ సెప్పు తీసుక్కొట్టు… అడ్డదిడ్డానా కొడుకులు వూరంతా తిరిగి కొంపకొత్తే కుండలో కూడ్లేకపోతే సత్తారని కూడొండానా… మసిగొబ్బు నోట్లో ఏసుకొందామనుకొంటే మిల్లు కాడ్నుంచి మనిసాచ్చేడా…. యింక తినేదేముంది… మిల్లుకాడికెల్లానా… యింటి కొచ్చాలకి ఈ జామైందా…. ఉప్పుగల్లుకి వూళ్ళోకెల్లాలా… మజ్జిగ సుక్కకి వూళ్ళో కెల్లాలా .. తిరగతానే నా కొడుకుల్ని పిలత్తా వున్నానా… ఎవుడన్నా నా మాట యినిపించుకున్నా… సెప్పేవేందే కోడలా…. ఈ ముసిల్ది ఎట్టా సేత్తుందని ఆ బిడ్డలికి లేదు….. ఆడది కూడు తిన్నదా లేదా అని కట్టుకున్నాడికి లేదు… నేను బతకనే కోడలా… యాడన్నాపడి సత్తానే….”

చిన్నెకత్త చెప్తూనే వుంది. ముక్కు చీదుకుంటూ పైటికి రాసుకొంటూ చెప్తూనే వుంది. వినే వోపికుంటే తనకి పెళ్ళయిన దగ్గర్నుంచి చెప్పటం మొదలెడుతుంది. ముగింపు మొగుడి తన్నులు దగ్గర ఆగుతుంది. కొసమెరుపు ఈ కాపురం చెయ్యలే నంటుంది. ఏ ఏట్లోనో పడి చస్తానంటుంది. జీవిత పుటల్లో ఈ పాత్రలు అట్టా పుట్టి అట్టా పెరుగుతాయి. ముగింపు మాత్రం… వాళ్ళనుకొన్నట్టు జరగదు. కాపురం చేస్తాయి. అందర్లా చస్తాయి. మామూలుగానే. చాలా మామూలుగానే. మాలచ్చి గుండెని ఎవరో కెలికినట్టయింది. మసిబొగ్గు చేతికిచ్చి పళ్ళు తోముకోమంది. చిన్నెంకత్త పళ్ళు తోముకొంటూ కూర్చొంది. ఈ గొడవకి అత్తయ్య నిద్ర లేసింది. ఎవరే అది అంది. మాలచ్చి చెప్పింది. ఆడికి బుద్ధి లేదు. దీనికి బుద్ధి లేదు అంది. మజ్జిక సుక్కుంటే యివ్వమంది. తాగి మళ్ళీ మూలుగుతూ పడుకుంది. వత్తానే కూతురు బిడ్డా అంటూ రాములు వెళ్ళింది.

ఆ రాత్రి మాలచ్చికి సరిగ్గా కంటిమీద కునుకు లేదు. తన వూరు గుర్తొచ్చింది. అమ్మ గుర్తొచ్చింది. పొగాకు గ్రేడ్ కెళ్ళే నేస్తాలు గుర్తొచ్చారు. తాను చిన్నప్పుడే గ్రేడు కెళ్ళడం మొదలెట్టింది. పెళ్ళయ్యేదాకా గ్రేడు చేసింది. తన వూరికి గ్రేడు కెళ్ళే వూరు మూడు మైళ్ళుంటుంది. ఆ వూరుకు చుట్టుపట్లా ఏడెనిమిది మైళ్ళనుంచి వచ్చేవారు, తన వూరు వారైతే నడిచి వెళ్ళేవారు. దూరపు వూళ్ళ వాళ్ళు లారీలు ఆపుకొని ఎక్కి వచ్చేవాళ్ళు. జట్టు జట్టుగా రోడ్డు మీద నిలబడేవాళ్ళు. లారీలాగాక లారి ఎక్కేవాళ్ళు. యింజన్ కాబిన్లో కొందరు ఎక్కేవాళ్ళు. లోడ్ లారీలపైన కొందరు ఎక్కేవాళ్ళు. దారిన పొయ్యేవాళ్లు “అలగాలంజలు తెగించాయ”నే వాళ్ళు లారీ డ్రైవర్లు మొరటు విసుర్లు విసిరేవాళ్ళు. అన్ని భరించేవాళ్ళు. తీరా పరుగెత్తుకెళ్తే కంపెనీ గేటు మూసేవాళ్ళు. అక్కడ కాళ్ళ వేళ్ళ పడటం. అంతా చారడు గంజి కోసం. జానెడు పాట కోసం, తమ కోసం, తమ బిడ్డల కోసం, తమ భర్తల కోసం ఆడది బరితెగించిన అలగాలంజ అనిపించుకొంటుంది.

పందిళ్ళలో మేస్త్రీల మాటలు భరించేది అందుకే అడ్డమైన గాడిద ‘అడ్డంగ కొవ్వారే మీరు’ అన్నా మౌనంగా వుండేది అందుకే. మాలచ్చి మౌనంగా వుండలేకపోయేది. ‘సోకొక్కటే సాలే … పస కావాల’ అని, మేస్త్రి అన్నప్పుడు ‘నీ పెళ్ళాం సొక్కన్నా నాదేం ఎక్కువ అంది’ ఆడు బట్వాడాలో కోతపెట్టాడు. ఆడు కోత పెట్టినందుకు బాధపడలేదు. కాని ఆడి పెళ్ళాం కూడా ఆడదే అనే సంగతి మరచి ఎత్తి పొడిచినందుకు బాధపడ్డది.

అంతేకాదు గ్రేడు పందిరిలో కూడా కులాల వరసలుండేవి. కమ్మ కూలీలు, రెడ్డి కూలీలు ఒక వరసలో కూర్చొనేవాళ్ళు. మాలా మాదిగ కూలీలు యింకో వరసలో కూర్చొనేవాళ్ళు. చాకళ్ళు, మంగళ్ళు, ముతరాసీలు సాధ్యమైనంత వరకు కమ్మా రెడ్డి కులాల్లో కూర్చొనేవాళ్ళు. అక్కడ చోటు లేకపోతే మాలా మాదిగ వరసలో కొచ్చేవాళ్ళు. అన్నాలు తినే వరసలు కూడా అట్టాగే వుండేవి. నీళ్ళ తొట్టెలు కూడా వేరుగా వుండేవి. తొట్టెల మీద పేర్లు రాయకపోయినా అలవాటుగా అది జరిగిపోయ్యేది. కులం ఉత్తరాది నుంది దచ్చాది నుంది దేశం అంతా వుంది. ‘బరి తెగించిన అలగాలంజలుగా’, రెడ్డిగారి మాలాడి పెళ్ళాలుగా, ఈ మాలా మాదిగ ఆడాళ్ళు ఎందుకు చూడబడాలి? మాలచ్చి చదువుకోలేదు. అయినా జీవితం అడగమన్న ప్రశ్నలు, మొరటు ప్రశ్నలు. ఆడికెందుకు కూడుంది ? నాకెందుకు లేదు ? దాని మొగుడు ఎందుకు పెత్తనం సెయ్యాల ? నా మొగుడు ఎందుకు వంగి సలాము సెయ్యాల? ఆడు ఆడి పెళ్ళాం ఎందుకు అంట దగ్గవాళ్ళు ? నేను నా మొగుడూ ఎందుకు అంటరానివాళ్ళం ? బుర్రను తొలిసే మోటు సందేహాలు. జాము పొద్దయింది. బయట అలికిడైతే బయట కొచ్చింది. లచ్చెర్పు ఎద్దులు తోలుకొస్తున్నాడు. లచ్చెర్పు ఎద్దల్ని గుంజకి కట్టేశాడు.

“ఎప్పుడు బయల్దేరావు”
“కొత్త పొద్దుటేలే బయల్దేరా… ఈ జామైంది… కూడుందా”
లచ్చెర్పు గబగబా తింటుంటే ఎంతా కలయిందో అనుకొంది. లచ్చెర్సు తిన్నాక చిన్నె కత్త గుర్తొచ్చింది. సూరుకింద మంచం చూస్తే ఖాళీగా వుంది. లచ్చెర్సుకు అంతా చెప్పి ఏమై వుంటుందని అంది. యింటి కెళ్ళుంటుందని లచ్చెర్సు అంటూ నవ్వాడు. అత్తని నిద్ర లేపి బిళ్ళేసింది. మజ్జిగ చుక్క యిచ్చింది.

లచ్చెర్సు అలిసి నిద్రపోతున్నాడు. మాలచ్చికి నిద్ర పట్టలేదు. లచ్చెర్సు మొరటు చేతుల్ని నిమిరింది. కాయలు కాచి వున్నాయి. కష్టమంతా కాయల రూపంలో మిగిలాయన్నట్టనిపించింది. ఈ చేతులు తన కోసమే, కేవలం తన కోసమే మొరటుగా మారితే ఎంత బాగుండు అనుకొంది. అట్టా అనుకోవటంలో గుండెలు బరువెక్కినట్టని పించింది. తాను ఆశబోతునా అనుకొంది. నిజంగా ఆశబోతునే అనుకొంది. నిద్ర పోతున్న అచ్చెర్చు కేసి చూసింది. పగలు జరిగిందంతా గుర్తొచింది. తెలీకుండానే లచ్చెర్సు చేతుల్పి గట్టిగా నొక్కింది. లచ్చెర్పు కళ్లు తెరిచాడు.

“నిద్దర పొలా”

యామైంది…. “

కళ్ళు నీళ్ళు తిరిగాయి. గుండెలు బలంగా కొట్టుకొన్నాయ్.

“యామైందే… ఏంటా ఏడువు…”

చెప్పింది. అంతా చెప్పింది. లచ్చెర్సు యిబ్బందిగా చూశాడు. ఈ ఆడది ఎందుకిట్ట చెపుతుందో, ఏడుస్తుందో అర్థం కాలేదు. తనకి తెలిసి అమ్మ అయ్య దగ్గర ఎప్పుడూ యిట్టా ఏడ్వలేదు. యిట్టాంటి ఏడ్పు తనకి కొత్తగా వుంది. మనుషులు యిట్టాంటి వాటికి కూడా ఏడుస్తారా అన్పించింది. ‘పెద్దిరెడ్డి మాలాడి పెళ్ళాం’ అనే మాట అంతగా ఏడ్పించే మాటా అన్పించింది. మాలచ్చి కేసి చూశాడు. మాలచ్చి పెద్దిరెడ్డి యింట్లో ముగ్గెయ్యనంది. రాలేదేంట్రా లచ్చెర్పూ అంటే ఏది చెప్పాలో అని అప్పుడాలోచించాడు. కాని యిప్పుడని పిస్తుంది. మాలచ్చి మాటలు, చేతలు యిబ్బందిగా వున్నట్టు, ఊపిరాడ నివ్వనట్టు, అలజడిగా వున్నట్టు. నిజమే ననిపిస్తుంది. మాలచ్చి పెద్దిరెడ్డి మాలాడి పెళ్ళాం ఎట్టా అయింది? అందటం లేదు. బుర్రంతా యింటిని కప్పేసిన చీకట్లా వుంది. చుక్కపొద్దు పొడిస్తే బాగుండు. పన్లో పడొచ్చు. చుక్క పొద్దు పొడ్చేలోపు నిద్ర పోవాలనుకొన్నాడు. మాలచ్చిని పడుకోమని కళ్ళు మూశాడు. మాలచ్చి నిద్రపోయిందో లేదో లచ్చిర్సుకి తెలీదు.

నిద్ర లేసి చూస్తే బాగా ఎండబడ్డట్టని పించింది. బయటకొచ్చి చూస్తే వాకిలంతా ముగ్గుంది. ఎడ్లకి మాలచ్చి కుడితి కలుపుతోంది. పెద్దిరెడ్డి యింటి కెళ్తున్నట్టు మాలచ్చితో అనలేకపోయాడు. మాలచ్చి కుడితి కలిపే పన్లో వుంది. లచ్చెర్సు యిల్లు దాటాడు. నడుస్తున్నాడే కాని కళ్ళ ముందు మాలచ్చి ఏడ్పు మొహం కన్పిస్తోంది. పెద్దిరెడ్డి గడపలో అడుగు పెట్టాడో లేదో పెద వెంకాయమ్మ విరుచుకుపడింది. మాల లంజకి అంత కొవ్వు పట్టకూడదంది. ముగ్గుకర్రకి రమ్మంటే రాకపోవటానికి అంత బలుపా అంది. మగాడు ఆడంగులోడైతే ప్రతి ఆడది యిట్టాగేనంది. యిట్టాంటి ఆడంగలోళ్ళు పెద్దిరెడ్డి మాలోళ్ళుగా వుంటే అది పెద్దిరెడ్డి వంశానికే పరువు తక్కువంది. ఆడంగలోడు అన్న మాటకు లచ్చిర్సు పెద వెంకాయమ్మ కేసి సూటిగా చూశాడు. వెనుక్కి తిరిగాడు. ఆ చూపుకు పెద వెంకాయమ్మ తల పక్కకు తిప్పింది. యింటి కెళ్ళాలనిపించలేదు. రామమందిరం దాటుతుంటే “ఎడ్లు తోలకొచ్చావా అచ్చెర్సు” అని ఎవరో అడిగారు. అవునన్నాడు. ఆగలేదు. వూరు దాటాడు. చెరువు కట్ట దిగుతుంటే చేలు కన్పించాయి. సాగు భూమి విశాలంగా పర్చుకొని వుంది. పెద్దిరెడ్డి యాలం ఆ ప్రాంతంలో కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది. మునసబు కొట్టాం ముందు కొత్తగా కొన్న ట్రాక్టరుంది. కరణంగారి పెద్ద కొడుకు పట్నం నుంచి వచ్చినట్టుంది. మోటర్ బైక్ వాళ్ళ పొలం పెద్ద కాల్వ అంచున నిలబెట్టి వుంది. పైకి చూస్తే మబ్బులు కొంపలంటుకు పోతున్నట్టు పరెగెత్తు తున్నాయి. తొలకొర్లు ఈ రోజో రేపో కావచ్చు. ఎంత నడిచినా పెద్దిరెడ్డి పాలం హద్దు దాటలేదు. పొద్దు నడినెత్తి కెక్కింది. మునసబు పాలం కరణం పాలం వొక్క చోట పుట్టి చెరో దిక్కు పరిగెత్తినట్టు నడించెట్టు మొదట్లోంచి చెరో నాలుగు మైళ్ళ దూరంలో ఆగివున్నాయి. నడించెట్టు గుట్ట కింద లచ్చెర్సు ఆగాడు. అయోమయంగా, అడ్డదిడ్డంగా వున్న గట్లు కళ్ళ ముందు నిల్చాయి. అవి పొలాలు కాదు. కయ్యలు. మడి చెక్కలు. పెద్దిరెడ్డి, మునసబు, కరణం కాకుల్లా, గద్దల్లా తన్నుకుపోగా మిగిలిన మాలా మాదిగల మాంసం ముద్దలు. కుంటలు, అరకుంటలు, పాతిక పరక చేలు. ఆ కయ్యల్లో తన కయ్య దగ్గర చూపు నిలిపాడు. బోలెడు అడ్డదిడ్డం గట్లు దాటి తన కయ్య గట్టున నిలబడ్డాడు. కాళ్ళు లాగినట్టుంటే గట్టు మీద కూర్చొన్నాడు. కాళ్ళ కింద నేలకేసి చూశాడు. అయ్య పోలయ్య గుర్తొచ్చాడు. యదవనాకొడుకు అట్టా సెయ్యకుంటే బాగుండే దనుకొన్నాడు. అయినా అయ్యమీద కోపం రావటం లేదు. యిదివరకైతే తిట్టి పోసేవాడు. యిప్పుడు తిట్టాలని లేదు.

సరిగ్గా గుర్తు లేదు. పెద్ద గాలివాన వచ్చిందంటారు. అప్పుడు లచ్చెర్సు చిన్నాడు. లచ్చెర్సు చెల్లెలుండేది. అప్పుడాపిల్ల బతికే వుంది. లచ్చెర్పు నాయనమ్మ మంచాన పడుంది. దాదాపు యిరవై ఏళ్ళ నాటి మాట……

వాన మొదలై పది రోజులైంది. యిప్పట్లో తగ్గేలా లేదు. పల్లెలో అర్ధపస్తుల స్థాయి దాటి పోయింది. పోలయ్య పిచ్చిమారాజు. ఆడి గుణం ఆడి కొడుకు లచ్చెర్సుకు రాలేదంటారు. సుబ్బులు కల్లలెరగని ముండంటారు. పస్తులు పరిమితి వొకరోజు దాటి రెండు రోజులైంది. ఒకరి కొకరు బదులిచ్చు కోవడం లేదు. అందరి యిళ్ళల్లో ఒకటే పరిస్థితి. కొత్తా పాత నందులో యింత ముసురు ఎప్పుడూ పట్టదు. ఈ ముసురు ఈ పల్లె అంతు తేల్చేలా వుంది. నాముకు రైతుల దగ్గర తెచ్చిన వడ్లు అయిపోయాయి. మళ్ళీ నాముకు దొరకటం జరిగే పని కాదు. వాన తగ్గేలా లేదు. గాలి ఎక్కువైంది. నానిన గోడలు కూలటం మొదలయ్యాయి. రెండు మూడు యిళ్ళు కూలిపాయ్యాయి. పోలయ్య నీరుగారిపాయ్యాడు. వానలో పిల్లాడ్ని బుజానేసుకొని నర్సిగాడు వెళ్తుంటే ‘యాడకిరా’ అని వెనకాల పాఠతో నర్సిగాడి తమ్ముడు వస్తుంటే అడగలేక ఆ ‘గూడ’ బుద్ధయ్యే సుబ్బులూ అన్నాడు. వానిలోనే మర్చిగాడి కొడుక్కి గుంట తవ్వారు. తిరిగొస్తుంటే కొడుకు కూతురు గుర్తొచ్చారు. తానూ మబ్బులు నొక్క పూట తినటం మానేసి మూడు రోజులైంది. బిడ్డలైతే ఈ రోజు అస్సలు తిన్లేదు. యింటి కొచ్చీ మంచం మీద కూలబడ్డాడు. ఆ కయ్య అమ్మేత్తానన్నాడు. సుబ్బులు వాసకేసి చూపింది. తొండర పడకయ్యా అంది. ఏడ్చి ఏడ్చి లచ్చెర్పు లచ్చెర్చు చెల్లెలు నిట్టాడి పళ్కువ నిద్ర పొయ్యారు. బయట చీకట్లు కమ్ముంది. సుబ్బులు ఒక నిర్ణయాని కొచ్చినట్టు జోరు వాసలో వూళ్ళోకి బయల్దేరింది. ఎక్కడికని పోలయ్య అడగలేదు. మనకచీకటి జోరువాన హోరుగాలి. మబ్బులు నడిచిందో పరుగెట్టిందో తెలీదు. పెద్దరెడ్డి యింటి ముందు ఆగింది. అప్పుడు పెద్దిరెడ్డి అమ్మ బతికే వుంది. వెంకట సుబ్బాయమ్మ కోడలుగా ఆ యింటి కొచ్చింది. మబ్బులు కొంగు పెట్టి కన్నీళ్ళు పెట్టుకొంది. పెద్దిరెడ్డి అమ్మకి సుబ్బులు కన్నీళ్ళ కన్నా మిన్నగా దొడ్డి వసారాలో సూడిగొడ్డు కన్పించింది. రోట్లో జొన్నలు పోసింది. సుబ్బులులో ఆశ పుట్టింది. తన బిడ్డలు బతుకుతారనుకొంది. ఓ జాము దాకా ఉంచింది. తవుడు జల్లించింది. కొంగుడు జొన్నగుండ్లు యిస్తే వానలో గాలికన్నా బలంగా, దయ్యంలా యింటికి పెరుగు తీసింది. బిడ్డలు గుర్తొస్తున్నారు. వాళ్ళు గుర్తొస్తే తన ఆకలి కూడా తన శక్తిని హరించదు. ఒక్కోసారి పేదవాళ్ళు మనుషుల్లా కన్పించరు. రాక్షసులౌతారు. చాలా భయంకరమైన రాక్షసులౌతారు. తన వాళ్ళ కోసం తన సర్వస్వాన్ని ధార పోసేంత రాక్షములౌతారు. వాళ్ళ చర్యలన్నీ రాక్షస చర్యలే వాళ్ళు రాకాసి ముండలు, దెయ్యాల బిడ్డలు. యిప్పుడు సుబ్బులు రాక్షసిగానే వుంది. వానలో జొన్నగుండ్లు దంచింది. వానలో పొయ్యి రాజేసింది. సంగటయ్యాక గంజి కూడా లేవని గుర్తొచ్చింది. అన్ని జొన్నలు దంచింది కదా మజ్జిగ చుక్క పొయ్యరా అనుకుంది. అప్పుడే పచ్చడి అడిగుంటే బాగుండేదను కొంది. తెడ్డుతో సంగటి బాగా కలబెట్టింది. మళ్ళీ పెద్దిరెడ్డి యింటికి బయల్దేరింది. యిప్పుడూ పొలయ్య ఎక్కడికని అడగలేదు. పిచ్చిమారాజు, సుబ్బులు పిల్చింది. పిచ్చిమారాజు పలికాడు.

‘మూలకుండలో రెండు ఎండొరికెలు వుండాల కాల్చి పెట్టయ్యా. నేను ఇప్పుడే వత్తా” అంటూ వానలోకి పరుగుతీసింది.

పొలయ్య లేశాడు. మూలకుండ అందున రెండే రెండు ఎండు ముక్కలు చేతికి తగిలాయి. నిప్పుల్లో వేశాడు. కాల్చి పక్కన పెట్టాడు. కుండలో సంకటి చూస్తూ వూరికే వుండలేక పొయ్యాడు. మూడు రోజుల ఆకలి. కుండలో సంకటి ముద్దలు చేశాడు. ఓ ముద్ద పళ్ళెంలో వేసుకొన్నాడు. దాన్లో మంచినీళ్ళు పోశాడు. ఉప్పు కలిపాడు. తనేం చేస్తున్నాడో తనకి తెలీదు. కాల్చిన ముక్క తీసుకొన్నాడు. మొదటి ముద్ద తిన్నాడు. తర్వాత రెండోది, తర్వాత మూడోది, తింటూనే పొయ్యాడు. ఆనక కుండకేసి చూశాడు. కుండలో సంగటి మిగిలి లేదు. అప్పుడు కన్పించారు. అతనికి నిట్టాడి పక్కన నిద్ర పోతున్న ఆకలి డొక్కల బిడ్డలు. గుండె తరుక్కు పోయింది. బావురు మన్నాడు. కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. వానలో తడిసొచ్చిన సుబ్బులుకి మొగుడు ఎందుకు ఏడుస్తున్నాడో మొదట అర్థం కాలేదు. లోపల కొచ్చాక ఖాళీకుండ, తిని కడిగిన పళ్ళెం చూసి అర్థమైంది. పోలయ్య యింకా ఏడుస్తూనే వున్నాడు. ఆ రాత్రి వర్షం కురుస్తూనే వుంది. సుబ్బులు నిట్టాడికి ఆనుకొని కూర్చొండి పోయింది. కూర్చునే నిద్రపోయిందో బిడ్డల ఆకలి పక్క వొరిగి అలసి ఆదమరిచి నిద్రపోయిందో తెలీదు. తెల్లవారింది. కాని పోలయ్య లేడు. ఎటెళ్ళాడో తెలీదు. యిప్పటికీ తెలీదు. కాసి కావిడి తగిలించుకొని తిరుగుతున్నాడనే పుకారు మాత్రం వుంది. అక్కడ కన్పించాడని యిక్కడ కన్పించాడని మాత్రం అప్పుడప్పుడు అంటుంటారు. సుబ్బులు అప్పుడప్పుడూ అంటుంది ఈ కయ్య అమ్ముంటే మీ అయ్య దక్కేవాడురా లచ్చెర్సూ అని,

కాలి కింద కయ్యని చూస్తుంటే లచ్చెర్సుకు తన బతుకంతా కళ్ళముందు నిల్చినట్టయింది. కళ్ళు పైకెత్తి చూశాడు. ఎప్పుడొచ్చిందో ఎదురుగా మాలచ్చి వుంది. తలదించు కొన్నాడు. మాలచ్చి మౌనంగా కూర్చుంది.

“అయ్య గుర్తొచ్చాడా”

“ఆకలి గుర్తొచ్చింది”

మాలచ్చి లచ్చెర్సు గుండెపైన చేయి వుంచింది. మనిషి గుండె అంతవేగంగా అంత శబ్దంగా కొట్టుకుంటుందా ! అన్పించింది. మాలచ్చికి నిజంగా అన్పించింది.

“పెద్దిరెడ్డి కొలువు మానేత్తా.”

గుండె కొట్టుకోవడమే కాదు. శబ్దం చెయ్యడమే కాదు. స్పందిస్తోంది. స్పందనలో తనని తాను గుర్తిస్తుంది. తన చుట్టూ ప్రపంచాన్ని గుర్తిస్తుంది. గుర్తించడం జరిగితే బాణం గురి తప్పదు.

“ఎల్దాం పద”

ఆ ఆకలి మనుషులు నడుస్తున్నారు. అంటరానివాళ్ళు నడుస్తున్నారు. భూమి వాళ్ళ

పాదాల క్రింద వొదిగి పోతోంది. ఆ నడక ఆగదు. గట్లు చెరిపేస్తో గుడిసెల్ని కలిపేస్తా… నిజానికి ఈ నడక మాలచ్చి చిన్న పిల్లగా వున్నప్పుడు మొదలైంది. యిప్పుడు విస్తరిస్తోంది. తను చూసిన నడకని రాములుతో చెప్పింది. యిప్పుడు తానే నడకగా మారింది… అత్త గుర్తొచ్చాక మాలచ్చికి ఉండబుద్ధి కాలేదు. కోకా రయికా సర్దుకుంటుంటే “నిద్దరకని వచ్చావు కదే” అని అంటున్న అమ్మతో “నిద్దర పోతే కుదర్దే అమ్మా” అంది.

(‘నేనేమడిగానని’ కథల సంపుటి నుంచి….)

కవి, రచయిత, విమర్శకుడు. నాటక కర్త. విప్లవ రచయితల సంఘం సభ్యుడు. రచనలు: 1. కాలం (కవిత్వం), 2. అంటరాని వసంతం(నవల), 3. నేనేమడిగానని(కథలు), 4. తెలుగు నాటక రంగ మూలాలు, 5. ఆఖరి మనిషి అంతరంగం.

Leave a Reply