మానవ హక్కుల కోసం ప్రాణాల్ని లెక్కచేయని నటాల్యా గార్బెనెస్కాయ

మానవ హకుల కార్యకర్తగా తన జీవితాన్ని, సంగీతాన్ని అణగారిన ప్రజల హక్కుల కోసం అంకితం చేసిన ప్రముఖ అమెరికన్ జానపద గాయని జోన్ బాయెజ్ ఒకానొక వేదిక మీద పాడిన పాట ‘నటాల్యా’ నన్ను బాగా ఆకర్షించింది. ఆ పాట పాడడానికి ముందు జోన్ నటాల్యా ను పరిచయం చేస్తూ తన లాంటి వాళ్ళ వల్లే మనమందరం ఈ భూమ్మీద క్షేమంగా ఉండగలుగుతున్నాం అని అంటుంది. ఆ పాటకు స్వేచ్చానువాదం ఇది:

నటాల్యా గార్బె నెస్కాయ

భయం లో విషాదంలో
వంటరిగా జైల్లో గడుపుతూ
కవిత్వ పదాలు అల్లేదానా

నీకు స్వేచ్చ నిచ్చే ఆ పదాలేవీ

నీవు నిరంతరం ఎదిరిచూసే
ఆ నేల ఏదీ ఆకాశం ఏదీ
ఆ వెలుతురూ ఏదీ

ఏవీ నీ ఆశలన్నీ
ఎక్కడున్నావు నువ్విప్పుడు

నగ్నంగా క్రూరంగా
నీనుండి నీ జీవితాన్ని లాగేసుకున్న
ఏ చీకటి కుహరాల్లో
క్షణక్షణం బతుకుకోసం పోరాడుతూ
ఛిన్నా భిన్నమవకుండా
నిన్ను నీవు కాపాడుకుంటున్నావు

ఎక్కడున్నారు నీ స్నేహితులు
ఎక్కడున్నారు మనుషులంతా
ఎవరు నిన్ను రక్షించగలరు

నీవు ఎన్నడూ చూడలేని
నీ పసిగుడ్డు ఎక్కడ
నటాలియా గార్బె నెస్కాయా ?

ఇంకా ఏముంది
ఎన్నడూ తెరవని
ఆ జైలుగది తలుపుల వెనక

వాళ్ళు ముద్రేసినట్టు నువ్వు పిచ్చిదానివా
లేదా వాళ్ళ కౄరత్వంచే శిథిలమయ్యావా
ఉన్నావా నీవింకా నటాలియా
లేదా శాశ్వతంగా పోగొట్టుకున్నామా నిన్ను

ఈపాట నిన్నెప్పటికైనా చేరుతుందా
నటాల్యా గార్బె నెస్కాయా

నటాల్యా 1936 లో సోవియట్ యూనియన్ లో జన్మించింది. 1964 లో లెనిన్ గ్రాడ్ విశ్వవిద్యాలయం నుండి పట్టా తీసుకున్న నటాల్యా కవీ , అనువాదకులో , సంపాదకులూ, పౌరహక్కుల కార్యకర్తగా ప్రాచుర్యం పొందింది. ‘వర్తమాన సంఘటనల నివేదిక’ అనే పత్రిక కు సంపాదకులుగా సోవియట్ యూనియన్ లో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనల గురించి నిర్భయంగా ప్రకటించేది. తన కవిత్వం లోనూ సోవియట్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రాయడం వల్ల 1975 దాకా ఆమె కవిత్వం, ఒక తొమ్మిది కవితలు మినహాయిస్తే, వెలుగు చూడలేదు. చెకస్లవాకియా ను సోవియట్ ఆక్రమించడానికి వ్యతిరేకంగా 28 ఆగస్ట్ 1968 నాడు రెడ్ స్క్వేర్ లో జరిగిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్న ఎనిమిది మందిలో నటాల్యా ఒకరు. సోవియట్ ప్రభుతం ఆమెను అరెస్ట్ చేసి ఆమెకు మతిభ్రమించిందని జైలులో పడేసింది. ఆమెకు మందకొడి స్కిజోఫ్రీనియా ఉందనే ఆరోపణలపై గర్భవతి అని కూడా చూడకుండా జైలు పాలుజేసింది. ఆ రోజుల్లో సోవియట్ ప్రభుత్వం అసమ్మతి తెలిపేవాళ్లను మతిస్థిమితం లేనివాళ్ళనే ఆరోపణలతో జైలు పలు చేసి అణచివేసేది. ఒక ఏడేళ్ల జైలు శిక్ష తర్వాత నటాల్యా పై ఆరోపణలు అన్నీ నిరాధారమని ఆమెకు మతి భ్రమించలేదని, స్తిమితంగానే ఉందని అంతర్జాతీయ న్యాయస్దానం తీర్పు ఇచ్చాక నటాల్యా ఫ్రాన్స్ కు వలస వెళ్లింది. 2005 లో పోలాండ్ కూడా ఆమెకు పౌరసత్వం ఇచ్చింది. నటాల్యా పారిస్ లో 2013 లో మరణించింది.

జీవితాంతం పౌరహక్కుల కోసం అంకితం చేసిన కవీ, సంపాదకులూ, కార్యకర్తా నటాల్యా కవితలు కొన్ని:

రేపు నీకు ఆనవాలు కూడా దొరకదు

నా పక్కనున్న గోడపై నుండి
మౌనంగా జారిపోయిన నీడ
ఆనవాలు కూడా దొరకదు నీకు
రేపు

నేను చిరునవ్వుతాను,
ఒక చేదైన కన్నీటి బిందువు
కనుపాపపై ఘనీభవిస్తుంది,
ఒక మంచుముక్కలా

బొమ్మఇంటికున్న అభ్రకం కిటికీలోంచి
బయటకేదీ ఏదీ కనబడనట్టే
నా ముఖంలో చదవలేరెవ్వరూ
గడిచిపోయిన నిన్నటి ఆనవాళ్లేవీ

కొత్త ఉదయమేదీ ఉదయించదు,
ఒక కన్నీటిబిందువు జాడా కనబడదూ,
వినబడదూ;
భీకరంగా తలుపులు బాదే మంచు తుఫాను తప్ప
ఇంకేమీ వినబడదు

మనందరం ఎదో ఒక రోజు
ఆ మంచుతుఫానులోనికే నడిచి వెళ్తాము.

ఈ చీకటి అంతస్తుపై ఏముంది

ఏముందీ చీకటి అంతస్తుపై
లిఫ్ట్ కూడా ఇక్కడ ఎక్కువ సేపు
ఆగడానికింత భయపడుతోంది

ఏముందా తలుపుల వెనుక, లోతుల్లో, గుండెల్లో
వెలుతురు చుక్కలు కూడా కుదుటబడడానికి
సంశయిస్తున్నాయి

రాత్రి శవంపై కప్పిన నిశ్శబ్దం
బొట్టు బొట్టు గా ప్రవహిస్తుందిక్కడ
చీకటి సన్నని తీగై కోస్తున్నప్పుడు
నక్షత్రవాకిలిని ముట్టుకోవడమే
అరుదైపోతుందిక్కడ

అతి శీతలంగా, తడి తడిగా
గోడల మీద పాకుతున్న విషపు తీగల మధ్య
నీ పాలిపోయిన కనురెప్పలు కనబడవు
శూన్యం నుండి నీ స్వరం చీల్చుకుని వినబడదు

ఈ అంతస్తు వాలిన చోటు ఒక ఖాళీ చదరంలాగుంది
ఒక సుదీర్ఘ నిద్రలో చదరం లా …

కలలు ఆరిపోయిన వాళ్ళు

కలలు ఆరిపోయినప్పుడు
ఒక నిశ్శబ్దపు ప్రతిధ్వని
నిగూఢ పక్షిలా
నా బుజంమీద వాలుతుంది

తూర్పు వాకిళ్ళున్న తోటల్లో
మూయని కంచెల మధ్య నుండి
ఒక తగరపు పూరేకు
నిశ్శబ్దంగా ప్రవహిస్తుంది

డొంకల మధ్య తోవల గుండా ,
తొక్కుడు లో నలిగిన గడ్డి మీద
పశ్చాత్తాపాన్ని ఎన్నడూ ఎరగని
వాళ్ళంతా నడుస్తారు
తలల మీద గాలి కెరటాలతో.

కానీ, బూరుగు చెట్లు కొమ్మల్ని నేలకు రాలుస్తున్న చోట,
మధ్యాహ్నం పూట పూలను వేరుచేస్తూ
నిర్మలమైన మెత్తటి గాలి వీస్తున్న చోట,
నేను మాత్రం నీకు కలవను.

పుట్టింది సిద్ధిపేట‌, చదివింది జిల్లా ప‌రిష‌త్‌ హై స్కూల్ లచ్చపేట, స‌ర్వేల్‌, హైద‌రాబాద్‌ పబ్లిక్ స్కూల్, జేఎన్‌టీయూ, ఓ యూ. వాసవి ఇంజినీరింగ్ కాలేజీలో పదకొండేళ్లు అధ్యాపకునిగా, అమెరికాలో గత 20 ఏండ్లుగా ఐటీలో, 14 ఏండ్లు విరసం సభ్యుడు. మూడు కవితా సంకలనాలు 'కల్లోల కలల మేఘం', 'సందుక', 'వానొస్తదా'?,  ఒక కవితా ప్రయాణ జ్ఞాపకాలు 'నడిసొచ్చిన తొవ్వ' – ఇప్పటిదాకా ప్రచురణలు. 'ప్రజాకళ', 'ప్రాణహిత'లతో సన్నిహిత సంబంధం.

2 thoughts on “మానవ హక్కుల కోసం ప్రాణాల్ని లెక్కచేయని నటాల్యా గార్బెనెస్కాయ

  1. జోన్ బాయెజ్ తన పాటలో నటాల్యాను బాగా ఆవిష్కరించింది. మీ అనువాదమూ బావుంది.

Leave a Reply