—————| మహమూద్ |
నగరం ఇప్పుడు నగరంగా లేదు కానీ,
ఎక్కడైనా మనుషులు మనుషులే!
విధ్వంసం కూల్చేసిన ప్రతిసారీ
నగరాన్ని తిరిగి నిర్మించేది మనిషే!
జీవితపు మండుటెండల్లో,
ఒక చలివేంద్రం లాంటి మనిషి
రణరంగపు సెగలను చల్లబరుస్తుంటాడు
క్షతగాత్రులకు తోడుగా
ఒక పిడకిట్లో గుండెనూ, ఇంకో పిడికిట్లో ధైర్యాన్నీ పట్టుకొని
నగరమంతా పరుగులు పెడుతుంటాడు!!
అతడి కాలి సవ్వడి వసంతమేఘగర్జన
అతడు చేయ్యందిస్తే
సుడిగాలి చుట్టేసిన నింగి గుండెకు ఊరట
వర్షం పడాల్సిన చోట బాంబులు కురుస్తుంటే
అతడు భుజమ్మీద నీటి కాన్ పెట్టుకొని పరుగులుపెడుతూ
నగరదాహాన్ని తీరుస్తాడు
కాలం గుండెల మీద కాళ రాత్రుల నృత్యం
కపాళాల కంటిలోని దృశ్యం ఒట్టి శూన్యం
నిదుర మరిచి నగరాన్ని కాపాలా కాసే అతని కన్నులు
ఎడారిలో జీవితాన్ని చిగురింపజేసే ఒయాసిస్సులు
ఈ నగరమంతా పరుచుకున్న పొగల మధ్యే నిలిచి నిలబడిన ఈ వీరుడి గుండె కవాటాల దీర్ఘ పోరాటం నిరాయుధమైంది
మనుషుల మీద మనుషులే చేస్తున్న దాడులను
మనుషులు కాక ఎవరు ఎదుర్కొంటారు
ప్రాణాలను తెగించి పోరాడుతున్న వారు కొందరైతే
ప్రాణాలు ఉగ్గబట్టుకొని బతకడం కోసం పోరాడే వారు కొందరు
అతడు మాత్రం ఇద్దరిని కలుపుతున్న వారధి
ఎవరితో విరోధం లేని అజాతశత్రువు
అతడిప్పుడు తన ప్రాణాలను ఫణంగా
పెట్టి గాజా నగరానికి ప్రాణం అందిస్తున్న
ప్రవక్త…
మానవత్వం వ్యక్తిత్వంగా మానవత్వపు మనుగడ
కోసం పోరాడుతున్న ధీరోదాత్తుడు
నగరం పాలిట అస్తమించని సూర్యుడు
యుధ్దం విసర్జిస్తున్న కారుచికట్లను తరుముతున్న
నిండు జాబిలి
శత్రువు సృష్టిస్తున్న
విధ్వంసం మధ్య వెలుగుతున్న
వెన్నెల దీపం
పొగలు గక్కుతున్న
శిధిలాల మధ్య నుంచి
శాంతి కోసం ఎదురుచూస్తున్న
వేదనకు వెలుతురు మలాము అద్దుతున్న
సహవాసపు వేకువ
**గాజా నగరంలో పని చేస్తున్న సహాయక బృందానికి
❤️❤️