కళ్లు నులుముకుంటూ బాల్కనీలోకి వచ్చాను. తెల్లవారడానికి ఎంతోసేపు పట్టదు. గుబురుగా ఉన్న చెట్లల్లోంచి పక్షుల కిలకిలారావాలు ఎంతో హాయినిస్తున్నాయి. కొన్ని బిడ్డలు అరుస్తున్నా ఆహారవేటకు వెళ్లక తప్పని తల్లులు ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మపైకి, ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మపైకి ఎగురుతున్నాయి. మరికొన్నింటి రెక్కల చప్పుళ్లు స్పష్టంగా వినిపిస్తున్నాయి. సాయంత్రం తిరిగి వచ్చేదాకా ఏ శత్రువు బారిన పడకుండా ఎలా ఉండాలో జాగ్రత్తలు చెప్తున్నట్లున్నాయి ఇంకొన్ని. బాల్కనీలో నిల్చుని ఆ దృశ్యాలను కాసేపు చూశాకే నా రోజును ప్రారంభిస్తాను. కంటికి మంచి చేసే ఆకుపచ్చని రంగుతో దినచర్య మొదలవడం ఎంతో హాయినిస్తుంది.
లేలేత సూర్య కిరణాలు ప్రసరిస్తూ మెరిసే ఆకుల మాటునుంచి వచ్చే సన్నటి పక్షి కూతలు వింటూ టీ తాగడం జిందగీలోకెల్లా గొప్ప అనుభూతి.
ఇలా ప్రకృతి ఆరాధనలో మునిగిపోయే నాకు తలమునకలయ్యే రోజువారీ పనులు తరుముతూనే ఉంటాయనుకోండి. వీటిలో కొన్ని ఇష్టంగా చేసేవీ, ఇంకొన్ని కష్టంగా చేసేవి ఉంటాయి. ఈ రెండూ కాకుండా భయంగొలిపే పనులు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా ప్రతి నెలలో వచ్చే రెండో శనివారం అన్మాట. ఆ శనివారం ఏముంటుందీ అనుకుంటున్నారా? పీటీఎం. అంటే పేరెంట్ టీచర్ మీటింగ్. ఈ ఒక్కరోజు చాలు నెల మొత్తం గుండెను దడదడలాడిరచడానికి.
నా దివాలాకోరుతనాన్ని అద్దంలో చూపడానికే ఈ రోజు పుట్టి ఉంటుంది. ఒకటీ అరా తప్పా అన్నిసార్లు దిగ్విజయంగానే విజయకేతనాన్ని ఎగురవేసాను. అంటే దానిని ఎదుర్కొన్నాను అనుకునేరు. వెన్ను చూపడంలో విజయకేతనం. అయినా ప్రతిసారీ కొత్తే. గాయం తగిలిన ప్రతిసారీ నొప్పి ఉంటుందిగా. అలా అన్మాట.
ఈ పీటీఎం తప్పించుకోడానికి ఎన్నెన్నో ప్లాన్లు వేస్తుంటాను. తప్పదుమరి. పిల్లకోతులకు మాట ఇచ్చాక రాను అన్నానంటే చిన్నబుచ్చుకుంటారు. ఆ తంటా నా ప్రాణానికే!
పిల్లలు అడిగింది నో చెప్పేంత పెద్ద విషయమా? అంటే కానే కాదు. జస్ట్ పీటీఎం. ఇది ఎప్పుడూ ఇజ్జత్ కా సవాల్ అన్నట్లుంటుంది. నిజం చెప్పాలంటే సర్కస్‌లో తాడుపై గాలిలో నడుస్తున్నట్లుంటుంది.
ఎట్లానైనా ఏదో ఒకటి చెప్పి, తప్పించుకుని, ఈ రోజును కూడా మరో దిగ్విజయమైన సుదినంగా నా డైరీలో లిఖించుకోవాలి అని ఎదురుగా కనిపించే చెట్ల సాక్షిగా మరోసారి ఒట్టు పెట్టుకుని ఇంట్లోకి నడిచాను.
అదుగో మా చిన్నోడు లేవనే లేచాడు. దగ్గరగా వచ్చి కాసేపు హత్తుకుని నిలబడి బాత్రూమ్ వైపు వెళ్ళడం అలవాటు తనకు. అలాగే చేశాడు. నేను వంట చేసేందుకు కిచెన్‌లోకి నడిచాను.
ఎనిమిదో తరగతి చదువుతున్న నా కూతురు ఆవులిస్తూ వచ్చింది. ఓరి నాయనో. ఈమె నుంచి తప్పించుకోవడమే కదా ఇప్పుడు అతి ముఖ్యమైన పని. సరే. ఈరోజు నేను చేయాల్సిన పనులన్నీ తనకు వరుసగా చెప్దామనుకున్నాను. ఆమె వచ్చీ రాగానే…
‘‘అచ్ఛా మా… జల్దీ జాకే బ్రష్ కర్లో, ఫ్రెషప్ హోనే తక్ మై నాష్తా బనాదూంగీ. ఠీక్ హై? జావ్ జావ్… పాపాకు ఉఠావో. ఆప్ లోగోంకు హెల్ప్ కర్తే’’ హడావుడి పెట్టాను.
పన్నాగం పారిందా? లేదా? అనుకుంటూ చపాతీలకు పిండి కలుపుతూనే తలతిప్పి తన బుజ్జి ముఖాన్ని చూశాను. ఎంత ముద్దొస్తుందో… అనుకుంటూ ముద్దు పెడదామని ముందుకు వంగాను. అంతే! బాంబు పేల్చేసింది…
‘‘యాద్ హై నా… ఆజ్ కా దిన్..’’ ఖైదీని ఇంటరాగేట్ చేస్తున్నట్లు చూసింది. చూడకేం చేస్తుంది. తనకే నాతో ఇలాంటి అనుభవాలు ఎక్కువ. బతిమాలే స్థాయి నుంచి బెదిరింపులకు ఎదిగింది. ఎయ్త్ క్లాస్‌కు వచ్చినా.. రెండంటే రెండేసార్లు వాళ్ళ స్కూల్‌కు వెళ్ళాను. అప్పుడు తన ఫ్రెండ్స్..
‘‘తేరే మమ్మీ మస్త్ క్యూట్ హై రే..’’ అన్నారట. అది తనను సంతోషపెట్టిన విషయం. ఇప్పుడు మళ్లీ అటువంటి కాంప్లిమెంట్ వినాలి తను.
‘‘హా…’’ అన్నాను నేను కళ్ళు టపటపలాడిస్తూ. ఏడ్వలేక నవ్వే ఎక్స్‌ప్రెషన్ ఒకటి మొహాన పడేసుకుని మళ్ళీ పిండి కలపడంలో మునిగిపోయా.
‘‘జబ్ తక్ జావ్… తుమ్ జాకే పాపాకు లేకే ఆవో. హెల్ప్ కర్తే’’ ప్రొఫెషనల్‌గా పురమాయించాను.
ఇద్దరూ వాళ్ళ పప్పాతో కలిసి వచ్చారు. నేను ఈరోజు పీటీఎం ఉంది వాళ్ళకు అని తనకు కళ్ళతోనే సైగ చేసి చెప్పాను. తను ఏవేవో కబుర్లు చెబుతూ ఇద్దరినీ రెడీ చేశాడు. నేను వారికి తినిపిస్తూ…
‘‘ఆజ్ హాఫ్ ఏ డే హైనా. ఆప్‌లోగ్ ఆయేతక్ అచ్ఛా కుఛ్Û వెరైటీ బనాకే రఖూంగీ. క్యా హోనా బోలో’’ ఊరించాను. ఒక్కోసారి అనిపిస్తూంటూంది పిల్లలను ఉత్సాహపరిచేందుకు నేను కృత్రిమత్వాన్ని కూడా ఆపాదించుకుంటున్నానేమో అని. చేతకాని తనాన్ని కప్పి పుచ్చుకునేందుకు ఇదో మధ్యే మార్గం కావొచ్చు.
మొత్తానికి వాళ్ళ పప్పా ఏవో చెప్పాడు. వాళ్ళు మౌనంగా వెళ్ళిపోయారు. పాపం. నేను కిటికీలోంచి వాళ్ళకు టాటా చెప్పి పంపించేసా. బిగ్గరగా ఊపిరి పీల్చి తినేందుకు కిచెన్‌లోకి వెళ్ళాను. మనసులో అంతా బాధే. బరువైన బాధ. ఎన్నాళ్ళిలా. ఈ భయాలను నేనే అధిగమించాలి. ఇంతకుమించిన సమయం ఇంకెప్పుడొస్తుంది. ఎలాగైనా పిల్లలకు మధురమైన బాల్యపు జ్ఞాపకాలు అందించాలి.
‘‘వచ్చే నెల పీటీఎంకైనా ధైర్యం కూడగట్టుకుని వెళ్ళాల్సిందే’’ మరోసారి గట్టిగానే నిర్ణయించుకున్నాను. నిర్ణయమైతే తీసుకుంటాను కానీ సమయం దగ్గరపడినప్పుడు తప్పించుకుంటుంటాను. ఎందుకూ అంటే కారణం లేకపోలేదు.
ఆ టీచర్స్‌తో మాట్లాడాలంటే అసలు నోట్లోంచి మాటే పెగలదు. ‘గలగలా ఎలా మాట్లాడుతుంది?’ ఆశ్చర్యంతో ఆమెనే చూస్తుంటాను. ఏమాత్రం జంకు ఉండదు. ఎంతో విశ్వాసంతో కనిపిస్తుంది. నాకూ మాటలు వచ్చు. చాలా మంచి మాటలు. కానీ నేను బయటకు వెళ్ళినప్పుడు ఆమెలా మాట్లాడలేను. ప్రయత్నిస్తాను. కానీ, తడబాటు వచ్చేస్తుంది. నోరెండుకు పోతుంది. పిల్లల గురించి చెప్పాలనుకున్న మాటలు మింగేసి, ఏదో ఒకటి మాట్లాడి బయటపడుతుంటాను. నా తెలుగు మీడియం చదువు ఇంగ్లీషులో పదాలు కూడగట్టుకుని పలికేలా చేస్తుంది. ఆ టీచర్ మాట్లాడే పదాలను మనసులో తర్జుమా చేసుకుని, అర్ధం చేసుకుని, మళ్ళీ నేను చెప్పదల్చుకున్న పదాలను కూడగట్టుకునేసరికే తను పదుల సంఖ్యలో పదాలను వెదజల్లుతుంది. ఇతర తల్లిదండ్రుల ముందు నేనెక్కడ నవ్వుల పాలవుతానో అనే భయం నా పిల్లలను సంతోషపెట్టనీయట్లేదు.
ఏం చేసేది? అంతా భయమే నిండిపోయింది నా జిందగీలో. ఏ మాట మాట్లాడితే ఎవరు ఏమనుకుంటారో? అసలు మాట్లాడిరది సరైనదో కాదో… ఇలా అంతా భయమే నిండుకుంది నా జిందగీలో. మార్పు వస్తున్న ఈ సమయంలోనూ ఆ కుంగుబాటు నుంచి బయటపడేందుకు శాయశక్తులా కోశిష్ చేస్తూనే ఉన్నాను. అయితే భయానికి బీజం నా బాల్యంలోనే పడిరదని నాకు గట్టి నమ్మకం.
***
‘‘పుట్టుకతో నేను మేధావినే… విద్యా వ్యవస్థే నన్ను భ్రష్టు పట్టించింది’’ ఆమధ్య ఎప్పుడో ఫేస్‌బుక్‌లో చూసానీ కోట్. నాకు బాగా నచ్చింది. దీనిని నాకు అనుగుణంగా మార్చుకున్నాను.
‘‘పుట్టుకతో నేను మేధావినే… నా చుట్టూ ఉన్న సమాజమే నన్ను పిరికిని చేసింది’’ అని.
నిత్యం వెంటాడే వాక్యాల్లో ఇదొకటి. ఈ వాక్యాలకూ నాకూ ఉన్న సంబంధాన్ని తరిచి చూసుకుంటాను చాలాసార్లు. చేయాల్సింది చేయలేకపోయాను. ఏం కావాలో అది అవలేకపోయినందుకు ఎప్పుడూ దిగులుపడుతూనే ఉంటాను.
అందరిలా నేనూ ఒక హాపీ ఫామిలీలో, లేదా మెజారిటీ ప్రజలకు ఆమోదమైన కులంలోనో, మతంలోనో పుట్టి ఉంటే ఈనాడిలా అవకాశం ఉన్నప్పటికీ బయటకు వెళ్ళాలంటేనే భయపడి దాగిపోయేదాన్నా? ఉద్యోగం చేయాలనే కోరికను వదులుకునేదాన్నా?
దీనికి బీజాలు చిన్నతనంలోనే పడ్డాయని అన్నాను కదా. దానికి ఆధారాలు లేకపోలేదు. ఆలస్యంగానైనా ఫేస్‌బుక్ తెరిచాను. దాని వల్ల మంచి పుస్తకాలు పరిచయం అవుతున్నాయి. తెప్పించుకుని చదువుతున్నాను గనుక నా చేదు గతాన్ని ఇలా అంచనా వేసుకోగలుగుతున్నానేమో. సమస్య తెలిస్తే పరిష్కారం సులువు అంటారు కదా.? సమస్య తెలుసుకున్నాను. పరిష్కారం దిశగా పోరాటమే చేస్తున్నానిప్పుడు.
అయిదో తరగతిలో ఉన్నప్పుడు మా వూర్లో వీసీఆర్ ద్వారా సినిమాలు వేసేవారు. ఊర్మిళ, పారిజాత, లక్ష్మి, ధనమ్మ, శోభ… అందరూ ఏడు గంటలకు సినిమాకు వెళ్తున్నామని సంబరపడుతున్నారు. ఈ సంగతి ఊర్మిళ నా చెవిలో ఊదింది హుషారుగా. ‘నేనూ వెళ్తాను కదా.?’ అమ్మీని అడిగాను.
‘‘ఫిలిం నై గిలిం నై. ఖామూష్ లిఖ్లేకే సోజా. అబ్బా ఆయేతో మార్తె’’ అన్నది.
అబ్బా ఎందుకు కొడతాడు? ఊర్మిళ వాళ్ళ నాన్న ఆమెను కొట్టగా నేనెప్పుడూ చూడలేదు. పారిజాతను కూడా అంతే. ఒకసారి ధనమ్మ, వాళ్ళ అన్నయ్య ఏడు కొండలు గొడవపడ్డారెందుకో. ఏడు కొండలు ఆమె తలపై గట్టిగా మొట్టికాయ వేసాడు. వాళ్ళ అమ్మ వచ్చిన తరువాత ధనలక్ష్మి ఫిర్యాదు చేసింది. వాళ్ళమ్మ అన్న మాట నాకు ఇప్పటికీ చెవుల్లో మార్మోగుతుంటుంది.
‘‘ఆడపిల్ల అంటే మహాలక్ష్మిరా. కొట్టకూడదు. అన్నలు అస్సలు చేయెత్తొద్దు. ఆడపిల్ల కన్నీరు ఇంటికే అరిష్టం.’’ ఇంకా ఏవేవో చెప్పింది. ఈ మాటలు గుర్తున్నాయి.
తల్లిదండ్రులు తమ పిల్లలను అంతలా చూసుకుంటుంటే, వాళ్లు తూనీగల్లా వాకిళ్ళలో ఆడుకుంటుంటే నన్ను మాత్రం ఆటలకు, సినిమాలకు ఎందుకు వెళ్ళనివ్వరు? అర్థమయ్యేది కాదు. మరునాడు క్లాసులో గ్యాంగ్ లీడర్ సినిమా గురించి, చిరంజీవి గురించి కథలు కథలుగా చెబుతుంటే నేను వింటూ కూర్చున్నాను.
పెద్దవుతున్నా కొద్దీ ప్రశ్నలు ఇంకా ఊరుతూనే ఉండేవి. ఫ్రెండ్స్‌కు చీరకట్టుళ్ళు, పెద్ద మనిషి ఫంక్షన్స్ జరుగుతూ ఉండేవి. నేను తప్ప అందరూ వెళ్ళేవారు. ఫంక్షన్ గురించి ఇంట్లో చెప్పేదాన్ని, కానీ వెళతానని అడగలేనంత నిరాశా నిస్తేజం కమ్ముకుని ‘‘ఎలాగూ వెళ్లేది లేదుగా’’ అనుకునేదానిని.
అయితే జానిబేగం, బీబీ, నజ్మాలాంటి వాళ్ళను చూసినప్పుడు ‘వాళ్ళకంటే కొంచెం మెరుగే నా పరిస్థితి’ అనుకునేదాన్ని. ఎందుకంటే నేను స్కూలుకు వెళ్తుంటే వాళ్ళు ఒక చేత కొడవలి, మరో చేత టిఫిన్ బాక్స్‌లతో పొలాలకు వెళ్తూ ఎదురొచ్చేవారు. అబ్బా ఎట్లానో బడికి అయినా పంపిస్తున్నాడని సంతోషడ్డాను.
నేను తొమ్మిది, పదో తరగతులలో ఉన్నప్పుడు కౌసల్య, ప్రియాంక, దేవిక, అలివేలుకు పెళ్ళిళ్ళు అయ్యాయి. బాల్య వివాహాలు అంటారని ఆ తరువాత తెలిసింది. వాళ్ళ పెళ్ళిళ్ళకు ఆహ్వానం అందింది. నేను నేరుగా అబ్బానే అడగొచ్చు కదా. అడగకుండా అమ్మీని అడిగి నిరాశపడిపోయాను. చాలామంది ఒకరి ఇళ్ళకు ఇంకొకళ్ళు వెళ్తుండేవారు. నా ఇంటికి వచ్చేవారు లేరు. వెళ్ళే వారు లేరు. కొన్ని విషయాలను గమనించేదాన్ని. జానిబేగం, బీబీ వాళ్ళ అబ్బా, మా అబ్బాలాగే ఉంటారా లేదా అని. ఎవ్వరూ అట్లా లేరు. పైగా ఎంతో స్నేహంగా ఉండేవారు. వాళ్ళ అమ్మీ ఎప్పుడైనా మా ఇంటికి వచ్చి అమ్మీతో చాలాసేపు ముచ్చట్లు పెడుతుండేది. కూరగాయలకు, సరుకులకు బుర్ఖా లేకుండానే కిరాణా షాపులకు వెళ్తూ కనిపించేవారు. అలాగే రేషన్ షాపుకు. మా ఊరు దాటి వెళ్తే మటుకు బుర్ఖా ధరించేవారు. మా అమ్మీ పరిస్థితి వేరు. మా ఇంటికి ఇరవై అడుగుల దూరంలోని కిరాణా షాపుకు వెళ్ళే అనుమతి లేదామెకు. ఏవైనా సరుకులు అవసరమైతే నేను కానీ, తమ్ముళ్ళు కానీ తెచ్చేవాళ్ళం. అమ్మీ ఇంటి వెనుకనుంచి ఆ కిరాణా షాపు అతని భార్యకు చెబితే ఇంటి ముందు నుంచి అతను మా చేతుల్లో పెట్టేవాడన్నమాట. మేము మాత్రమే ఎందుకింత నిర్బంధంలో ఉన్నామో అర్ధమయ్యేది కాదు. మా అబ్బా మాత్రమే స్ట్రిక్ట్‌గా ఎందుకు ఉండేవాడు? దీనికి కారణం ఎవ్వరికీ తెలిసేది కాదు.
మా ఇంటి వాకిటి తలుపులు ఎప్పుడూ మూసే ఉంటాయి. మేతకు వెళ్ళే ఆవులను, మేకలను, గొర్రెలను, బర్రెలను చూస్తూ ఉండటం నాకు చాలా ఇష్టంగా ఉండేది. ఎప్పుడైనా పొరపాటున తెరిచి పెట్టినా అమ్మీ హడావుడిగా వచ్చి మూసివేసేది. తెరిచి పెట్టమని అడిగేదాన్ని. అమ్మీ చెప్పే ఒకే ఒక్క మాట గుండెలో ముల్లులా కుచ్చుకునేది.
‘‘అబ్బాకు నై పసంద్. ఖుల్లా నై రఖ్నా బోల్తే’’ అని.
ఇంకా ఇలాంటి ప్రశ్నలు నా చిన్ని మెదడులోంచి పుట్టుకొస్తుండేవి. అమ్మీ చెప్పే సమాధానమంతా అబ్బా ఇష్టాయిష్టాల చుట్టూనే తిరుగుతూండేది. దాంతో దిగులు తప్ప మరోటి మిగల్లేదు ఆమె జిందగీలో.
‘అందరిలోకెల్లా మా ఇల్లే తేడాగా ఉందేమిటి?’ నాలో నేను ప్రశ్నించుకునేదానిని. నా నిద్ర ఎగిరిపోయేది.
కనీసం ఇలాంటి భావాలను పంచుకోవాలన్నా ఒకరో ఇద్దరో తోడు ఉండాలి. నలుగురిలో కలవని జిందగీ మాది. నలుగురితో మాట్లాడటం అరుదైన సంగతి. ఎప్పుడూ నాలుగు గోడల మధ్య పంజరాల్లో పక్షుల్లా ఎందుకు ఉండేవారమో తెలియక సతమతమైపోయేదాన్ని. రానురానూ నా మాటల ప్రవాహం తగ్గింది. ఉత్సాహమే పోయింది. దిగాలుగా బడికి వెళ్ళడం, రావడం తప్పితే మరో వ్యాపకం లేదు. నాతో స్నేహించేవారు లేరు. ఒంటరితనం ఆవహించింది. నిద్ర కరువైంది. ఇన్ని దిగుళ్ళ మధ్య ఎడారిలో ఒయాసిస్సు కోసం వెతికినట్లు మధురానుభూతులకోసం ఎదురుచూస్తూండేదాన్ని.
‘యాసీన్ సూరా చదువుకుని పడుకుంటే నిద్ర వెంటనే వస్తుంది’ అమ్మీ ఎప్పుడూ అంటూండేది.
‘నాకు పట్టపగలే భయంకరంగా ఉంది. ఇంతకన్నా భయపెట్టే కలలు రాత్రిళ్లేం వస్తాయి?’ అడిగేదాన్ని.
అమ్మీ మాట్లాడేది కాదు. ఆమే ఆ రాత్రికి ఆయతుల్ కుర్సీ చదివి అరమోడ్పు కన్నులతో… గుండెలపై ఊదుతూ ఉంటే ఎంత బాగుండేదని! ఆ సమయంలో మా అమ్మీ అచ్చం జాదూకిపరీలాగే కనిపిస్తుంది.
‘ఎక్కడో రాకుమారిలా వెలుగొందాల్సిన మా అమ్మీ నాకోసమే ఇలా వేంచేసిందేమో’ అనిపించేది.
చల్లటి వెన్నెల కురుస్తుండగా తెల్లటి నందివర్థనాలను అతికించిన ఆ ఆకాశపు వెలుతురులోంచి చాంద్ కా టుక్డా దిగివచ్చి దయ, కారుణ్యం, వాత్సల్యం కురిపిస్తూ నను ప్రేమారగా హత్తుకునే ముగ్ధమనోహరి ఆమె మాత్రమే. తల మీదుగా ఓణీ కప్పుకుని, రెండు చేతులను జోడిరచి, దీన్ గురించి తప్ప నాకు తెలిసిన మిగతా విషయాలనన్నింటినీ నా మెదడులోంచి చెరిపేయమని దుఆ చేస్తుంది.
కానీ, నా మెదడంతా ప్రశ్నల పుట్ట! చాలా ప్రశ్నలకు సమాధానాల కోసం అమ్మీని విసిగించేదాన్ని. అయినా తృప్తి కలిగేది కాదు. మెదడు ప్రశ్నల ఊట. తన పని తాను చేసుకుపోయేది. దాని మానాన అది పోకుండా నాలుకకు దురదపుట్టించి నోటికి పని చెప్పేది. కాలేజీకి వెళ్ళే సమయానికల్లా మరిన్ని ప్రశ్నలు పుట్టించేది ఇదే నోరు.
చాలాసార్లు నాకే అనుమానం వస్తుంటుంది. నేనేమైనా పల్లెటూరిలో మహావృక్షంలా కనిపించే ఆముదపు చెట్టునా అని.
‘పోనీలే… ఈ చదువు వల్ల ఈమాత్రమైనా బయటి ప్రపంచాన్ని చూస్తున్నాను కదా’ సమాధానపడేదాన్ని. నాకున్న ఆ కాస్త వెసులుబాటు అమ్మీకి లేదని చాలా బాధపడేదాన్ని.
మా తమ్ముళ్ళలా నన్ను పెద్ద చదువులు చదివించాలని అనుకోలేదు మా అబ్బా. ఆడపిల్లలకు ఎంత చదివించినా కట్నాలీయక తప్పదు. డబల్ ఖర్చులు అని నిట్టూర్పులిడిచే అబ్బాకు పాలోళ్ళు ఎవరూ చేయని పని తాను చేస్తే గొప్పగా ఉంటుందనిపించింది. ఆడపిల్లనైన నన్ను బడికి పంపి గర్వపడేవాడు. అందరూ చదువు అవసరమా? అని పెదవి విరుస్తుంటే, వాళ్ళను లెక్కచేయకుండా నన్ను బడికి పంపుతున్నాననే భావం ఉత్సాహమిచ్చేది. కాకపోతే.. ఎప్పుడు ఫెయిల్ అయితే అప్పుడు ఆపేద్దామనుకున్నాడట. చదివించినా చదవలేని మొద్దు మెదడు ఆడవాళ్ళది అని ఏమైనా రుజువు చేయాలనుకున్నాడేమో మరి. నేనేమో ఒక్కో తరగతిని దాటుకుంటూ పోయాను.
ఏమాటకామాటే చెప్పుకోవాలి. మా అబ్బా కష్టజీవి. ఊళ్ళో ఏ పని దొరికితే ఆ పనికి పోయేవాడు. ఆ రోజుల్లోనే హైస్కూల్ దాకా చదువుకున్నా, పని చేసే విషయంలో నామోషీ అనుకోలేదేనాడు. సాగర్ నీళ్ళు మా పొలాలకు పారుతుంటాయి. రెండు పెద్ద పెద్ద చెరువుల కింద ఏటా రెండు కార్ల పంటలతో పచ్చదనంతో నిత్యం కళకళలాడుతుండేది మా వూరు. మా వూరి రైతు కూలీలకే కాక పాలమూరు నుంచి వచ్చే వలస కూలీలకు కూడా ఆతిథ్యమిస్తూ కళకళలాడుతుండేది. ఇప్పుడు మా వూరి వాళ్ళే వలసపోతుంటే నడివయస్కులు, అంతకంటే పెద్దవారు దిగాలు పడిపోతున్నారు.
‘‘ఎట్లా ఉన్న ఊరు ఎట్లా అయిపాయే’’ అని కళ్ళల్లో నీళ్ళు తిప్పుకుంటుంటారు. మాకూ రెండెకరాల పొలం ఉండేదట. మా అబ్బా తాగే తాగుడికీ, నలుగురికి తాగించడానికీ మేం పుట్టకముందే ఆ రెండు ఎకరాలకు ఫాతెహా ఇచ్చేసిండట. అయినా అబ్బా జాన్‌ది చాలా పెద్ద గుండె. పొలం పోగొట్టినందుకేనాడూ బాధపడలేదు. కూలీ నాలీ చేసేందుకేనాడూ సిగ్గు పడలేదు. రెక్కల కష్టాన్నే నమ్ముకున్నాడు. చేనులో అరక దున్నడం, నారు పోయడం, కలుపు తీయడం, కోతలు కోయడం, పడుగు పెట్టడం, ఒడ్లు కాంటా వేయడం… ఇట్లా అన్నింటిలోనూ పనిమంతుడనిపించుకున్నాడు.
వేసవుల్లో పొలం పనులు లేనప్పుడు సైకిల్‌పై ఊరంతా తిరుగుతూ ‘‘పాలైస్, సేమ్యా ఐస్’’ అంటూ ఐస్‌క్రోట్లు అమ్మేవాడు.
ఇంత కష్టపడే అబ్బా అంటే మాకందరికీ ప్రాణం. గౌరవం. ఈ రెండిరటికి మించి భయం కూడా. ఆయన ఇంటికి వచ్చే వేళకు మేము పిల్లుల్లా నక్కేవాళ్ళం ఒణుకుతూ. అమ్మీకి అయితే చాలాసార్లు పై ప్రాణాలు పైన్నే పోయేవి.
అబ్బా ఒళ్ళు హూనమయ్యేట్లు కష్టపడతాడు. ఆ కష్టాన్ని మరిచేందుకని పీకల దాకా తాగుతాడు. తాగి ఊరికే ఉండడు. తన బలమంతా చేతుల్లోకి రప్పించి కనబడినోళ్ళనల్లా కొడతాడు. ఇంటికి చేరగానే తనకు ఎదురుగా ఎవరు కనిపిస్తే వారి వీపుపై అబ్బా పెద్ద పెద్ద హస్తాల అచ్చులు పడాల్సిందే. నాలుగో తరగతిలోననుకుంటా.
ఊరంతటికీ కరెంటు వచ్చినా మా ఇంట్లోకి రాలేదింకా. కిరోసిన్ దీపం వెలుతురులో నేను నిద్ర పోవడానికి వేసిన నవారు మంచంమధ్యలో కూర్చుని పలకపై ఏదో రాస్తున్నాను. అమ్మీ నాకోసం అన్నం తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది. తమ్ముళ్ళిద్దరూ నిద్రపోయి ఉన్నారు. అప్పుడే అబ్బా తలుపు తోసుకుంటూ ఇంట్లోకి ప్రవేశించాడు.
‘‘అబ్బా’’ సంబరంగా పిలిచాను. అంతే! పెద్ద పెద్ద అంగలతో వచ్చిన ఆయన ఏమీ మాట్లాడకుండానే చెంపపై ఫెడేల్‌మని కొట్డాడు. ఆ దెబ్బకు మంచంలో అలాగే పడిపోయాను. మళ్ళీ వీపుపైనా అంతే బలంగా కొడితే స్పృహ తప్పి పడిపోయాను. నాలుగు రోజులకు ఆసుపత్రిలో కళ్లు తెరిచానట.
సారాయి తాగకపోతే ఎంతో బాగా, ప్రేమగా మాట్లాడే అబ్బా… తాగితే షైతాన్‌లా మారతాడు. హడలి పోతుండేవాళ్ళం. అబ్బా వచ్చే సమయానికి చాలాసార్లు నిద్రపోయి ఆ ఘోరాలు తప్పించుకునేవాళ్ళం. కానీ, అమ్మీకి ప్రతిరాత్రీ ఒక దోజఖ్‌గానే ఉండేది.
ఫలానా వారి కొట్లో కూర్చుని తాగుతున్నాడు అని ఎవరైనా చెప్పిన రోజు రాత్రి మాకు కాళరాత్రి. మాకు తొందరగా అన్నం తినిపించి, పిల్లి తన కూనలను ఇళ్ళు మార్చినట్లుగా మమ్మల్ని ఏ పొరుగింట్లోనో పడుకోబెట్టేది అమ్మీ. ఆమెకు? ఆ పూట భయమే భోజనం. ఆ రాత్రి ఆమెకు జగ్‌నేకీ రాత్. కంటికి కునుకంటని రాత్రులెన్నింటినో అలాగే గడిపేసి, కోడి కూతతో మమ్మల్ని నిద్రలేపి మెల్లిగా ఇంటికి తీసుకువెళ్ళేది.
ఏమీ జరగనట్లే వాకిలి ఊడ్చి, బావి నుంచి నీళ్ళు తోడి గిన్నెలు వేసుకుని కడుగుతూ ఉండేది. నిద్ర కళ్ళతోనున్న మేము వంట గదిలోనే చప్పుడు చేయకుండా ముడుచుకునేవాళ్ళం. చాలాసార్లు నిద్ర పట్టేది కాదు. నాకు ప్రతి ఉదయమూ ‘భయోదయమే’. బాల్యమంతా ఈ చేదు జ్ఞాపకాలే.
నిద్ర లేచిన తరువాత అబ్బా తీరు గమ్మత్తుగా ఉండేది.
‘‘తాగినా కూడా ఇంటికి వచ్చి, అన్నం తిని పడుకున్నాను కదా?’’ అని అమాయకంగా అడిగేవాడు.
అందరితో సరదాగా మాట్లాడుతున్నాడు కదా అని మనం రాత్రి సంగతులేమైనా చెబితే చాలు. ఆ రోజు రాత్రికి తాగడానికి అదే వంక. మేము అన్న మాటలను గుర్తుంచుకుని మరీ ఆ కోపమంతా తీరేలా పిల్లలు, పెద్దలు అని చూడకుండా కసిగా కొట్టేవాడు.
అయినా సరే! అమ్మీ కోపంగా అరుస్తూ ఉండేది. అరుస్తూనే పొయ్యిలో కట్టెలు జోడిస్తూ మంట రాజేసేది. అప్పటికీ కడుపులో బాధతో ఆమెకు ఆకలే తెలిసేదికాదు. కేవలం మాకోసమే యంత్రంలా పనులు చేస్తూ పోయేది. మమ్మల్ని స్కూలుకు రెడీ చేస్తుంటే అబ్బా తానేం చేశాడో చెప్పమని అడుగుతుండేవాడు.
ఏం అడిగినా మాకు మాట్లాడే ధైర్యమే ఉండేది కాదు. అమ్మీ మాత్రం ఊరుకునేది కాదు. పిల్లలను భయపెట్టాడని, ఇష్టమొచ్చినట్లు కొట్టాడని, ఇంట్లోంచి వెళ్ళిపోతానని అరిచేది. తాగుడు మానితే తప్ప ఇక్కడ అసలు ఉండనంటే ఉండనని ఖరాఖండీగా చెప్పేసేది. కానీ, వెళ్ళడానికి ఆమెకు ఎవరున్నారని? కన్నవారూ లేక, తోడ బుట్టినవారూ లేక అక్కడే పడి ఉండేది. ఆడవారి తరఫున ప్రశ్నించేవారు లేకపోయినా ఇష్టారాజ్యంగా బలప్రయోగం చేస్తారనుకుంటా ఈ మగవారు.
అమ్మీ తన దురదృష్టానికి ఎన్నిసార్లు కన్నీళ్ళు పెట్టుకునేదో. ఆమె మేనమామ కుటుంబం ఊర్లోనే, ఇంటికి దగ్గరలో ఉన్నా వాళ్ళింట్లోని కొడుకులందరూ తాగుబోతులు కావడంతో అక్కడికీ వెళ్ళలేకపోయేది. అసలు ఒకరి పంచన చేరడం ఇష్టమే ఉండేది కాదామెకు. అబ్బా చేసిన పనులవల్ల ఆమెకు తిప్పలు తప్పేవి కావు. ఇంకా కొన్నిసార్లయితే అబ్బా తాగి ఊళ్ళో వాళ్లపై చేయి చేసుకునేవాడు. అమ్మీ సర్ది చెప్పి పంపుతుండేది.
తెల్లారిన తరువాత అమాయక ముఖంతో అబ్బా అడిగే ‘రాత్రి నేనేం చేయలేదు కదా..?’ ప్రశ్న నేను పెద్దవుతున్నాకొద్దీ ‘అంతా కావాలనే చేసి… ఇప్పుడిట్లా అడుగుతున్నాడా..?’ అనుమానాన్ని పెంచింది. చాలాసార్లు రుజువైంది కూడా.
ఎందుకంటే మా అబ్బాకు పుట్టెడంత ‘అనుమానం’ కూడా ఉంది. అందమైన అమ్మీని షాదీ అయితే చేసుకున్నాడు కానీ, ఆమె ఏ ఒక్క కోరికనూ తీర్చలేకపోయాడు. పైగా ఆమె పుట్టింటి నుంచి తెచ్చుకున్న బంగారం, వెండి సొమ్ములను అడ్డికి పావుశేరు లెక్కన అమ్మేశాడు. పెళ్ళిలో తాతయ్య ఇచ్చిన కట్నకానుకలు, ఇత్తడి, రాగి సామాన్లు కూడా అదే తాగుడుకు బలి చేశాడు. ఏడాదికి ఒకే ఒక్కసారి రంజాన్ పండుగకు మాత్రమే ఒకేఒక్క చీర నసీబ్ అయ్యేది. మాకు కాస్త మధ్య మధ్యలో ఒకటీ అరా పెళ్లిళ్లకో, పాత డ్రెస్‌లు పొట్టిగా అయితేనో మరో రెండు జతలు అదనంగా వచ్చేవి. అంతే.
ఊరు ఊరంతా రిష్తేదార్లు ఉన్నా ఏ ఒక్కరి ఇంటికి మమ్మల్ని వెళ్లనిచ్చేవాడు కాదు. వారు కూడా అబ్బా కోపాగ్నికి తగినట్లుగా మసులుకునే వారు. ఏదైనా మంగ్నీ, షాదీలాంటి దావత్‌లకు పిలిస్తే అమ్మీ ఏనాడూ తనంతట తానుగా వెళ్ళడం చూసిన జ్ఞాపకం లేదు. అబ్బా వచ్చి, వెళ్ళమని చెబితే తప్ప వెళ్ళకూడదు. అప్పటికే ఆ దావత్‌కు పిలిచిన వాళ్ళు ఇంటికి రెండు మూడు సార్లయినా తిరిగి వెళ్ళేవారు.
అమ్మీ ఎప్పుడూ ఏ దావత్‌నూ సరిగా ఎంజాయ్ చేయలేదు. మమ్మల్ని దావత్‌కు పంపి, ఎక్కడో తాగుతూ కూర్చుంటాడనే బెంగ నిలవనిచ్చేదికాదు. పెళ్ళివారింట భోజనాలు కానిచ్చేసి వెంటనే తిరిగి వచ్చేవాళ్ళము. ఇంకాసేపు ఉందామని అమ్మీని ఎంతగా ఇబ్బంది పెట్టేవాళ్ళమో. ఏ దావత్‌లోనైనా ఆమె ఆనందంగా గడిపిందీ లేదు. కనీసం చావుల్లోనైనా తనివి తీరా ఏడ్చేంత సమయము దొరికిందీలేదు.
మా అబ్బాకు మరో లక్షణము ఉంది. అదే అనుమానించడం. అనుమానం అనే పదానికి అర్ధం తెలిసేందుకు చాలా సమయమే పట్టింది. ఊహ తెలిసినప్పటి నుంచే జుట్టును జారుముడి వేసి కనిపించేది అమ్మీ. అమ్మీ జడతో ఆడుకోవడం నాకు చాలా ఇష్టంగా ఉండేది. దువ్వెనతో దువ్వుతూ, చక్కటి పాపిట తీసి రెండు జడలు వేసేదాన్ని. ఒక్క జడతో ఎన్నెన్నో డిజైన్లు ప్రాక్టీస్ చేస్తూండేదాన్ని. ఇన్ని అయ్యాక నేను వేసిన ఏ ఒక్క జడతోనూ అమ్మీ కనిపించేది కాదు. వాటన్నింటినీ విప్పి మళ్ళీ అదే జారు ముడితో ఉండేది. నల్లగా తాచుపాములా నిగనిగలాడే జడను జూడాగా ఎందుకు మార్చేదో ఇంటర్మీడియట్‌కు వచ్చిన తరువాతే తెలిసింది.
‘అట్లా జడ అల్లుకుని ఎవరికోసం కులుకుతున్నావు?’ అబ్బా అన్నాడట. అందుకే మూడు పదులైనా నిండని వయసు నుంచే జూడా వేసుకునేది. అబ్బా అనుమానించేతీరు అర్ధం కావడానికి నాకూ ఎదురైందో విషాదభరిత ఘటన.
ఇంటర్మీడియట్ ఫస్టియర్‌లో కొత్తగా కాలేజీలో చేర్పించారు నన్ను. ఒకరికొకరు తోడుగా ఉంటారని నా స్నేహితురాళ్ళు అందరూ కో`ఎడ్యుకేషన్ కాలేజీలో వారి ఇష్టానుసారంగా చేరితే మా అబ్బా నన్ను ఒక్కదానినే గర్ల్స్ కాలేజీలో చేర్పించాడు.
స్కూలు దాకా పల్లెటూరిలోనే గడిపిన మా అందరికీ టౌనుకు వెళ్ళడం కొత్తే. ముప్ఫై కిలో మీటర్ల ప్రయాణం. ఉదయం, సాయంత్రం గతుకుల రోడ్లపై ఆగుతూ ఊగుతూ జర్నీ చేయాల్సిందే. దాదాపు అమ్మాయిలందరూ అక్కడే రూమ్‌లు అద్దెకు తీసుకుని ఉండేవారు. దగ్గరి ఊరు వాళ్ళు మాత్రం వచ్చి పోయే వారు. ఒక్క నేను తప్ప. ఒంటరినై పోయాననే దిగులు పోయే అవకాశమే రాలేదేనాడు. నా ముఖంలోనూ నవ్వు మాయమైంది అమ్మీ లాగానే.
టౌన్ అంతా రకరకాల జనంతో, బస్సులతో, లారీలతో, ఇతర వాహనాలతో రద్దీగా ఉండేది. నేనేమో ఉదయం తొమ్మిదిన్నర గంటలకు కాలేజీ అయితే మా వూరిలో వచ్చే ఆరున్నర బస్ ఎక్కి రావలిసి వచ్చేది. తరువాత ఉండే ఎనిమిదిన్నర గంటల బస్సుకు వెళ్తే ఫస్ట్ పీరియడ్ అయిపోయే అవకాశం ఉంది. అందుకని ఆరున్నర బస్ కోసమే తయారుకావాలి. బస్సు అన్ని ఊర్లలో ఆగుతూ ఆగుతూ టౌనుకు చేరేసరికి ఎనిమిది అయ్యేది. షార్ట్‌కట్ రూట్‌లో కాలేజీకి చేరుకునేందుకు మరో ఇరవై నిమిషాలు పట్టేది. కాలేజీ గేట్ తెరవడానికి వాచ్‌మెన్ వచ్చేసరికి నేను మాత్రమే బిక్కుబిక్కుమంటూ అక్కడ ఉండేదానిని.
తిరిగి సాయంత్రం నాలుగున్నర గంటలకు కాలేజీ విడిచిపెడితే స్టడీ అవర్స్ అంటూ మమ్మల్ని ఆరున్నర దాకా చదివించేవారు. నాకు సరిగ్గా అయిదు గంటలకే బస్ ఉండేది. ఎప్పుడైనా బస్ లేట్ అయితే తప్ప ఆ బస్సు అందకపోయేది. చాలాసార్లు ‘బస్ వెళ్ళిపోతుంది సర్, ఒక్కదానినే బస్టాపులో తొమ్మిది గంటల దాకా కూర్చోవాలి’ టీచర్స్‌ను బతిమాలేదానిని. మాకు కెమిస్ట్రీ చెప్పే నర్సిరెడ్డి సర్ స్టడీఅవర్స్‌లో ఉండేవారు. ఆయన చాలా స్ట్రిక్ట్. అందుకని ఆయనతో ఈ విషయం చెప్పాలన్నా భయంగానే ఉండేది. కనీసం చదివిన పాఠం అప్పజెప్పాలన్నా గుండె దడదడలాడేది.
అసలు ఆ టైంలో చదవడం సాధ్యం అయ్యేదే కాదు. తేలికైన టాపిక్ ఇచ్చిన రోజైతే తొందరగానే అప్పజెప్పి వెళ్ళిపోయేదాన్ని. కానీ ఫిజిక్స్, కెమిస్ట్రీలాంటి సబ్జెక్ట్స్ ఉన్నరోజు పాఠం చదవడం అనేదే ఉండదు. కచ్చితంగా బస్‌మిస్ అయిపోతుంది అనే దిగులే చదవనిచ్చేది కాదు.
సరిగ్గా ఇటువంటి ఒకానొక సమయమే ఆరోజు వచ్చింది. బస్ మిస్ అయింది. ఆ బస్టాండులో మా రూట్‌కి వెళ్ళే బస్సులు, బస్టాండులోని మిగతా బస్సులు నిలబడే చోటుకి దూరంగా, డిపోకు ఆనుకుని ఉన్న గోడకు దగ్గరగా నిలబడేవి. దాంతో ప్రయాణీకుల రద్దీ కూడా ఉండేది కాదు. అయిదు గంటల బస్సు వెళ్ళిపోయింది. నేను తొమ్మిది గంటల దాకా ఒంటరిగా కూర్చోవలిసిందే. ఒకపక్కగా గోడకు ఆనుకుని బండరాయిపై కూర్చుని తెలిసిన వారు కనిపిస్తే ధైర్యం కూడగట్టుకుందామని ఎదురు చూస్తున్నాను.
ఆకలి కూడా మొదలైంది. అంతమంది జనాలుండే రద్దీలో ఒక్కదాన్ని వెళ్ళి నీళ్ళు తాగాలన్నా భయమే. అసలు అలా నీళ్ళు కానీ, ఏదైనా తినే పరిస్థితి అంతకు ముందు రాలేదెప్పుడూ. పైగా బస్‌పాస్ ఉండటంతో నాకెప్పుడూ డబ్బులు చేతిలో పెట్టుకునే అవసరం పడలేదు. మా అబ్బా కూడా ఏ సమయం ఎలా వస్తుందోనని ఒక్క పది రూపాయలు దాచి పెట్టుకోమని ఇచ్చిందీలేదు. అసలే కొత్త. తెలిసిన వారెవరూ లేక ఒంటరిగా భయపడుతున్న సమయంలో బస్టాండులోపలికి తిరుపతి వస్తూ కనిపించాడు. తిరుపతి అంటే నాకు హై స్కూల్‌లో క్లాస్‌మేట్ అయిన ప్రియాంక వాళ్ళ అన్నయ్య. ఎవ్వరూ లేని చోట అతడు కనిపించడంతో ప్రాణం లేచి వచ్చినట్లైంది.
ప్రియాంకా వాళ్ళకు కిరాణా షాప్ ఉంది. వాళ్ళ ఇల్లు మా స్కూల్‌కు దగ్గరగా ఉండేది. చుట్టుపక్కల ఊళ్ళ నుంచి వచ్చిన నాలాంటి వాళ్ళందరం లంచ్ టైంలో ప్రియాంకతో కలిసి వెళ్ళేవాళ్ళం. మేము మా లంచ్ బాక్సులతో సహా ఆమె ఇంట్లో వాలిపోయి, భోజనం తరువాత బావిలోంచి చల్లటి నీటిని తోడుకుని తాగేవాళ్ళం. లంచ్ తరువాత వచ్చేప్పుడు అదే షాపులో ఏవైనా కొనుక్కోవచ్చు అనే ఆశ ఎక్కువగా ఉండేది. మా బ్యాచ్‌తో మంచి గిరాకీ అవుతుందని ప్రియాంక వాళ్ళమ్మ నవ్వుతూ అంటూండేది. తిరుపతి మాకు సూపర్ సీనియర్. టెంత్ ఫెయిల్ అవడంతో షాపులో కూర్చోబెట్టారట. మా అందరితో స్నేహంగా ఉండేవాడు. ప్రియాంక పిలిచినట్లుగానే మేమంతా పేరుతోనే పిలిచే వాళ్లం. పదో తరగతి పూర్తయ్యి, నేను కాలేజీలో చేరిన తరువాత అదే తొలిసారి తిరుపతిని చూడటం.
తనే పలకరించాడు. నిజానికి తిరుపతిని చూడగానే ధైర్యం వచ్చింది. ప్రియాంక నాగార్జున కాలేజీలో చేరిందని, ఆమె కాలేజ్ కోసమే ఇక్కడ రూమ్ తీసుకున్నట్లు చెప్పాడు. ఒక్కత్తివే ఉన్నావెందుకూ అని అడిగేసరికి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. వాటిని ఆపుకుంటూ బస్సు వెళ్ళిపోయిందని, అందరూ వెళ్ళి పోయారని చెప్పాను. ఆ సమయంలో ఒక ప్రైవేటు బస్సు మా వూరి వైపు వెళ్తుందని తొందరగా వెళ్ళమని చెప్పాడు. ఆ ప్రైవేటు బస్సు ఎక్కడ ఆగుతుందో కూడా వివరించి చెప్పాడు. నేను బస్సు కోసమే వెయిట్ చేస్తానని చెప్పాను. ఏం అర్ధమయ్యిందో
‘డబ్బులు లేవా’ అడిగాడు. అప్పుడు చెప్పక తప్పింది కాదు.
‘‘లేవు’’ తల వూపాను. వెంటనే తన జేబులోనుంచి చేతికందిన అయిదు రూపాయల నోటు ఇవ్వబోయాడు.
‘‘వద్దు తిరుపతీ… నీవు కలుస్తావో లేదో, తిరిగి ఇవ్వడం కష్టం కావొచ్చు’’ అన్నాను సిగ్గుపడుతూ.
‘‘అయ్యో దయ్యం. నువ్వు ప్రియా లాంటిదానివేరా. ప్రియా దగ్గర తీసుకుంటానా? నీ దగ్గర తీసుకోడానికి’’ అన్నాడు.
చివరకు తీసుకోక తప్పలేదు. ఇక ఆ ప్రైవేటు బస్సు కోసం పరుగులాంటి నడకతో వెళ్ళాను. అయితే నేను వెళ్ళే సమయానికి ఆ బస్సూ వెళ్ళిపోయింది. ఏడుపు తన్నుకొస్తుండగా, గొంతు తడారిపోతుండగా తిరిగి అదే బస్టాండులో… ఇంతకు ముందు కూర్చున్న చోటే కూర్చున్నాను. తిరుపతి తన ఊరివాళ్లను కలవడానికి వచ్చాడట. ఇప్పుడు అతడూ లేడు.
మళ్ళీ ఒంటరైపోయాను. మెల్లిగా చీకటి ప్రారంభమైంది. బస్టాండ్ అంతటా లైట్లు వెలిగాయి. బస్టాండులోని చీకటి, బస్సుల రణగొణ ధ్వనులు కొత్తగా, వింతగా అనిపిస్తున్నాయి. ఇంత చీకటి దాకా మా వాకిట్లో తప్పితే మరెక్కడా ఉన్న అనుభవం లేదు.
‘‘ఎవరైనా మంచినీళ్ళు తాగిస్తే బాగుండును’’ అనుకుంటున్నాను. ఆకలితో తలనొప్పి ప్రారంభమైంది. దూరంగా నిలుచున్న వ్యక్తి వద్దకు వెళ్ళి టైం తెలుసుకుని వచ్చాను. మా రూట్ బస్సులు ఆగే ప్రాంతంలో వెలుతురు కూడా పడట్లేదు.
ఏడు అవుతుంది. ఇంకా రెండు గంటలు గడపాలి. బస్సు వచ్చే సమయానికల్లా కనీసం పదిమంది అయినా వస్తారులే అనే ఆశ. జనాలు లేకపోతే బస్సు వేయరేమో! మరోవైపు భయం.
ఒక గంట తరువాత కారు చీకటిలో కాంతి పుంజంలా, నిరాశా నిస్పృహలను రూపుమాపేలా బస్టాండు మెయిన్ గేటులోనుంచి అబ్బా వస్తూ కనిపించాడు. చీకటిలో సరిగానే పోల్చుకున్నానా… ఆయనేనో…కాదో… పరీక్షగా చూడసాగాను.
‘యా అల్లాప్‌ా… మా అబ్బానే కావాలి, మా అబ్బానే కావాలి…’ అంటూ దుఆ చేయడం మొదలుపెట్టాను. కాస్తంత చేరువయ్యాక కనురెప్పలు ఆర్పకుండా అలాగే చూస్తూండిపోయాను.
‘‘అయ్… మా అబ్బానే’’ సంతోషంతో నా గుండెలు నిండిపోయాయి. అంతసేపూ నీరసపడిపోయిన నాకు ఒక్కసారిగా ఏడుపు పొంగిపోతున్నది. కాస్తంత తమాయించుకుని అబ్బా దగ్గరకు వస్తుండగా నేనే ఎదురెళ్ళాను.
నేను బస్టాప్‌లో ఒక్కదాన్నే ఉండటంతో చాలా ఆశ్చర్యపోయాడు.
‘‘నీతోపాటు ఎవ్వరూ లేరా? రోజూ ఒక్కదానివే వస్తున్నావా?’’ అని ఆశ్చర్యంతో అడిగాడు.
నాపై జాలి కురిపించడంతో ఎంతో ఆనందమేసి, రోజూ కాలేజీకి వెళ్లివస్తున్న తీరు చెప్పి మార్పించమని బతిమాలుకుందాం అనుకున్నాను.
అయితే అంతకన్నా ముందుగా నాకు ఆకలి, దాహం వేస్తున్న సంగతి చెప్పాను. దీనితోపాటు తిరుపతి ఇచ్చిన అయిదు రూపాయల సంగతీ చెప్పాను.
అంతే! అంతసేపూ సౌమ్యంగా నా మాటలు వింటూ వచ్చిన అబ్బా ముఖం నల్లగా మాడిపోయింది. నా మనసులో కలవరం రేగింది. తిరుపతి విషయం చెప్పగానే అబ్బా ముఖం పాలిపోవడం ఎందుకో అర్ధమేకాలేదు. ఏదో కీడు జరగబోతోందనే భయం ప్రవేశించింది. నోరు పిడచ కట్టుకుపోయింది. అయోమయంలో ఉన్నాను. అబ్బా మారు మాట్లాడకుండా అదే గేటు దాటుకుని బయటకు వెళ్ళాడు. ఓ అరగంట గడిచిందేమో. అప్పుడు తూలుతూ వచ్చాడు.
భయం భయంగానే అబ్బా ముఖం వైపు చూశాను.
ముఖం ఎర్రగా, కళ్ళు చింత నిప్పుల్లా… భీకరంగా కనిపిస్తున్నాడు. భూమి ఇక్కడే చీలిపోతే బాగుండును. ఆ భూమిలోకి చొచ్చుకుపోయేదాన్నే. ఊర్లో ఉన్న నలుగురు టెంత్ స్టూడెంట్స్‌లో నాకు మాత్రమే కదా ఫస్ట్‌క్లాస్ వచ్చింది. ఇద్దరు అబ్బాయిల్లో ఒకడు ఫెయిల్. మరొకడు థర్డ్‌క్లాస్. ఇంకో అమ్మాయి సెకండ్ క్లాస్.
‘‘ఊరంతా గర్వంగా చెప్పుకుంటూ తిరిగిన అబ్బా ఈరోజు నా నిజాయితీని శంకిస్తున్నాడు. తన ఉగ్రరూపంతో బెదిరిస్తున్నాడు’’ ఇదే భయంలో కొట్టుకుపోతుండగా బస్సు వచ్చింది. ఎలాగోలా బస్సు ఎక్కాం, ఇంటికి చేరుకున్నాం. నేను అలాగే నీరసంగా కూర్చుండిపోయాను. అబ్బా ఫ్రెషప్ కోసం వెళ్లాడు. ఆ వెనకే అమ్మీ వచ్చింది. అమ్మీ నా ముఖం చూసే ఏదో జరిగిందని ఊహించి కంగారుపడిపోయింది. నాకు వివరంగా చెప్పే సమయమేదీ? అబ్బా వచ్చేశాడు.
తమ్ముడు పడుకుని ఉన్న మంచంపైనే ఒక పక్కన పుస్తకాలు పెట్టి కూర్చున్నాను.
అమ్మీ నన్ను తొందరగా స్నానం చేసుకుని వస్తే ఇద్దరికీ భోజనం వడ్డిస్తానని దస్తర్ సిద్ధం చేస్తోంది. నాకు కాళ్ళు వణుకుతున్నాయి. మంచంపై నుంచి లేవలేకపోతున్నాను. గుండె దడదడా కొట్టుకుంటోంది.
‘‘హౌ… తూ తీన్ టైం చెరా. ఉనే ధగడోంసే పైసె మంగ్తే హుయే ఫిర్తె రెప్‌ాతీ’’ అంటూ ఒక్కసారిగా అరిచాడు.
అమ్మీ ఖిన్నురాలైంది. తాగేసి ఉన్నాడని అర్ధమైంది. కానీ, కూతురిని కూడా అలా అనగలడని ఊహించలేదేమో.
నన్ను లోపలికి వెళ్ళి బట్టలైనా మార్చుకోమని చెప్పింది. నా కాళ్ళల్లో సత్తువ లేక కూలబడిపోయాను. ఇంతలో అబ్బా పెరట్లోకి వెళ్ళి పొడవాటి కర్ర తీసుకుని వచ్చాడు. అమ్మీ అడ్డు వచ్చింది. కర్రను లాక్కునేందుకు ప్రయత్నించింది. బక్క ప్రాణం. ఒక్క తోపుకే దూరంగా పడిరది. కోపంతో ఊగిపోతున్న అబ్బా చేతిలో నేనో పిచ్చుకను అయ్యాను. తన ప్రతాపం అంతా ఆ చిన్ని లేత శరీరంపై చూపాడు. ఇష్టారాజ్యంగా కొడుతూనే పోయాడు. ఇంతలో అమ్మీ తేరుకుని విడదీయడానికి వచ్చింది. ఆమెకూ తగులుతున్నాయి దెబ్బలు. అయినా అబ్బా గుప్పెట్లోంచి నన్ను లాక్కోడానికి ఎంతగానో ప్రయత్నిస్తోంది. నాపై కురిసే దెబ్బలకు నాకు నోరు పెగలట్లేదు. గొంతు దు:ఖంతో పూడుకుపోయింది. కన్నీరు బుగ్గలపై జారుతూ పోతోంది. అంతసేపూ జరిగిన ఆ తతంగాన్ని నిద్రపోతున్న తమ్ముళ్ళు ఎప్పటి నుంచి లేచి చూస్తున్నారో. అబ్బా నాపై విరుచుకుపడేందుకు మళ్ళీ ముందుకొస్తూ…
‘‘దేఖో రే… ఇనే క్యా కరీకి. ఇస్కూ చెప్పల్ లేకె మారో’’ నన్ను చూపిస్తూ వాళ్ళను ఉసిగొల్పాడు.
అలాగే తను కూడా మంచంపై కూర్చుని ఉన్న నా దగ్గరకు వచ్చి, వీపుపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు.
ఏమీ తెలియని చిన్న తమ్ముడు చెప్పులు విసిరి కొట్టాడు. రెండు పెదవులపై చెప్పులు గట్టిగా తగలడంతో చిట్లిపోయి రక్తం కారడం మొదలెట్టాయి. అవి వాచినట్లుగా స్పర్శామాత్రంగా తెలుస్తూనే ఉంది. తను కొట్టడమే నిష్కారణం. ఇక తమ్ముళ్ళతోనూ కొట్టించి, అవమానించేంత నీచత్వం ఏం చేశానని?
‘‘అసలు నేను ఏం తప్పు చేశానో, ఆ ధగడ్ అన్న పదానికి అర్థమేంటో’’ అయోమయంలో కూరుకుని… ఎప్పుడు తెల్లారిందో తెలియనే లేదు.
నేను అదే చీకటిలో వంట గదిలోకి వెళ్ళిపోయా. అసలు ఎవరికైనా ముఖం ఎలా చూపించను? ఎంతోకొంత పెద్దదాన్నేగా ఇప్పుడు. కాలేజీకి వెళ్తున్నాను. అసలు అబ్బా కొట్టడమేంటి? నాకంటే చిన్నవాళ్ళయిన తమ్ముళ్ళతో కొట్టించడమేంటి? అవమాన భారం కుంగదీసింది.
తెల్లవారాక అమ్మీ డ్రెస్ విప్పించి చూసి కళ్ళనీళ్ళు పెట్టుకుంది. పెదవులు రక్తంతో ఎండిపోయి, ఉబ్బిపోయి ఎర్రగా కనిపిస్తున్నాయి. ముఖం, కళ్ళు వాచి దయనీయంగా కనిపిస్తున్నాయి. తెల్లటి లేత శరీరంపై ఎర్రగా వాతలు తేలి కనిపిస్తున్నాయి. ముందుగా పొయ్యి వెలిగించి వేడి నీళ్ళు పెట్టి స్నానం చేయించింది. ఆ తరువాత పెద్ద తమ్ముడితో ఆర్‌ఎమ్‌పీని ఇంటికి పిలిపించి ట్రీట్‌మెంట్ చేయించింది. నొప్పులతో ఇంట్లోనే ఉండిపోయాను. నాకు జరిగిన అవమానానికి చచ్చిపోవాలనుకున్నాను. చావుకు మార్గాలు మనసులోనే అన్వేషిస్తూ ఉండిపోయాను.
చివరకు చీమలకోసం ఎప్పుడో తెచ్చిపెట్టిన గెమాగ్జిన్ పొట్లం కనిపించింది. కాగితపు పొరలు విప్పి తెల్లటి గెమాగ్జిన్ పొడిని నాలుకతో అద్ది మింగడం ప్రారంభించాను. అంతలోనే అమ్మీ ఎందుకో లోపలికి వచ్చింది. గెమాగ్జిన్ నాకుతున్న నన్ను చూసి దిగ్భ్రాంతికి గురైంది. నన్ను బావి దగ్గరకు ఈడ్చుకుపోయి నోట్లో వేళ్ళు పెట్టి కక్కించింది. ఆ తరువాత మళ్ళీ ఆర్‌ఎమ్‌పీని పిలిపించి ఇంజక్షన్‌లు వేయించింది. ఆ పూట అమ్మీ ఏడుపుకు ఓదార్పు కరువైంది. మరోవైపూ నేనూ నిస్సహాయంగా మంచంపై పడిపోయాను. గాయాలు పూర్తిగా మానేసరికి నెల రోజులకు పైన్నే పట్టింది. మనసుకు అయిన గాయం పాతికేళ్ళు గడిచినా వెంటాడుతూనే ఉంది. ఆ దృశ్యం ఇప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. నిద్రలోనుంచి ఉలిక్కిపడి లేస్తుంటాను. ఇది గుర్తుకు వచ్చినప్పుడల్లా కళ్ళు ధారలై ప్రవహిస్తూ ఉంటాయి. ఆ తరువాత అబ్బా చాలాసార్లు పలకరించినా నేను మాట్లాడలేదు. అసలు ముఖం చూడలేక సిగ్గుతో కుంచించుకు పోయాను. బలం ఉంది కొట్టగలిగాడు. మగాడిని అనుకున్నాడు కొట్టాడు. తమ్ముళ్ళు కూడా రేపు కాబోయే మగాళ్ళే. అందుకే నన్ను వాళ్ళచేత చులకన చేయించి కొట్టించాడు. నన్ను కొట్టడమేమీ కొత్తకాదు. అంతకమునుపు లీలగా జ్ఞాపకమున్న రెండు సంఘటనల్లో..
నేను వీధిలో పరుగెడుతున్నాను. అబ్బా నన్ను తరుముతున్నాడు. పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వస్తున్నాడు. నేను పరుగెత్తీ పరుగెత్తీ ఒక గర్భిణీ కనిపిస్తే ఆమె వెనకాల నిలబడ్డాను. ఆమె అబ్బాకు అడ్డు పడుతుందని ఆశపడ్డానేమో..! సరిగా గుర్తులేదు. కానీ, నేను కుందేలు పిల్లలా అబ్బాకు చిక్కాను. ఇంట్లోకి తీసుకువెళ్ళి ఇష్టారాజ్యంగా బలంగా కొట్టాడు. అసలు నేనొక పసిపిల్లనన్న స్పృహ ఆయనకు ఏ కోశాన లేదనుకుంటా.
ఆ దుర్ఘటన తరువాత కాలేజీకి వెళ్ళినా చదువుపై దృష్టి నిలపలేకపోను.
‘‘అబ్బా గండం నుంచి గట్టెక్కే మార్గాలనే అన్వేషించేదాన్ని. అమ్మీని కూడా బయటకు తీసుకురావాలి. ఎలాగైనా’’ ఇవే ఆలోచనలు నాకు నిద్ర లేకుండా చేసేవి. ఎంతో చురుకుగా చదువుతూ ముందుకు వెళ్ళాలని అనుకున్న నాకు ఇప్పుడు ముందున్న లక్ష్యమల్లా అబ్బా బారి నుంచి తప్పించుకుని అందనంత దూరంగా వెళ్ళి బతకడమే. కానీ దారేదీ.
ఇలాంటి పరిస్థితుల్లో చదువుపై దృష్టి ఏముంటుంది? ఆ దోజఖ్‌నుంచి బయటపడే మార్గం షాదీ అయింది. మొత్తానికి ఇంటర్ పరీక్షలు రాసాక నికాప్‌ా అవడంతో ఆ ఇంటికీ నాకు బంధం తెగిపోయింది. ఎందుకంటే ఇన్నేళ్ళలో వెళ్ళిన దాఖలాలు వేళ్ళపై లెక్కపెట్టగలిగేవే.
అమ్మీ కంటే అదృష్టవంతురాలినేమో. మంచి ఇంటిలోనే పడ్డాను. కాకపోతే ఎవరితోనైనా కలవడం అంటే భయంగా ఉండేది. వాళ్ళందరూ హసీ మజాఖ్‌తో ఎంతో బాగున్నా సరే ఆ వాతావరణమంతా నాకు కొత్తగానే ఉండేది. ఆ కొత్త వ్యక్తుల మధ్య ఆకలివేసినా ఎవరికి చెప్పుకోవాలో తెలియక తికమకపడేదాన్ని. ఎంతోకాలం నాలో నేను కుమిలిపోతూ ఒంటరిగా గదిలోనే గడిపాను. ఈ లోపున ఒకరి తరువాత మరొకరు పుట్టుకొచ్చిన పిల్లలు.
షోహర్ ఉద్యోగం కోసం సిటీకి అయితే చేరాం. ఆయన మంచి చదువరి. నా స్టడీ స్కోర్ చూసి వెన్ను తడుతున్నాడు. పిల్లలిద్దరూ స్కూల్‌కు వెళ్ళాక నేనూ చదువుకోవడం మొదలు పెట్టాను. ఆపేస్తాననుకున్న చదువు పట్టుదలగా డాక్టరేట్ దాకా సాగుతూనే ఉంది. మా ఇద్దరు పిల్లల విషయంలో మేమిద్దరమూ చర్చించుకుంటూ, పిల్లల ఇష్టాలనూ గౌరవిస్తున్నాం. నాకు ఉన్న భయాందోళనలు నా పిల్లలపై పడకుండా జాగ్రత్త పడుతున్నాము. నాకూ ట్రీట్‌మెంట్ సాగుతూనే ఉంది. స్ట్రెస్ రిలీజ్ కోసమని ట్యాబ్లెట్స్ రాసాడు డాక్టర్.
నా కూతురు ఏ జంకూ లేకుండా మాట్లాడుతూంటే అబ్బురపడి వింటూ ఉంటాను. నేను కోల్పోయిన నా బాల్యం నా పాపలో తనివితీరా చూసుకుంటున్నాను.
నా బాబుకు ఆడవారికి మర్యాద ఇవ్వడం నేర్పించాలని మేమిద్దరమూ డిసైడ్ చేసుకున్నాం. పాప,బాబుకు ఎక్కువ తక్కువ భావాలు లేకుండా పెంచాలని నిర్ణయించుకున్నాం. ఇంటి పనులు ఇద్దరూ నేర్చుకుంటున్నారు. ఖాళీ ఉంటే అక్కా తమ్ముళ్ళ టామ్ ఆండ్ జెర్రీ ఆటలు చూస్తూ మైమరిచి పోతుంటాను.
మా తమ్ముళ్ళు ఇద్దరూ అబ్బాలాగే తాగుబోతులయ్యారు. వాళ్ళ భార్యలు చేసే ఫిర్యాదులు నా దృష్టికి వస్తూనే ఉంటాయి. తాముంటున్న ఇల్లు తప్ప మరో ఆధారం లేని వాళ్లు ఆ ఇంటి కోసం కాట్లాడుకుంటున్నారని అమ్మీ చెప్తూంటుంది.
ఐక్యత లేని కొడుకులను చూసి అబ్బా లోలోపలే కుమిలిపోతున్నాడట. ఇప్పుడిక కొడుకులు చూస్తారనే నమ్మకం అబ్బాలో లేకుండా పోయిందట. అమ్మీని ఎన్నిసార్లు నా దగ్గరకు వచ్చేయమని చెప్పినా అబ్బా ఒక్కడే అవుతాడంటుంది. బహుశా.. అమ్మీకి ఉన్నంత సహనం, క్షమాగుణం నాలో లేవేమో. అయినా సరే.. ఇద్దరినీ నా దగ్గరకే పిలుచుకోవాలి. బలహీనులపై దయచూపే విధానమేమిటో నేనైనా తెలిసేలా చేయాలికదా?
డాక్టర్ సలహా మేరకు అద్దం ముందు కూర్చుని కాసేపు మాట్లాడటం ప్రాక్టీసు చేస్తున్నా. త్వరలోనే ఈ భయాన్ని అధిగమించి నా పిల్లలతో స్కూలుకు వెళ్లాలనుకుంటున్నాను. ఆ టీచర్‌తో ఇంగ్లీషులోనే మాట్లాడతాను.
ఎంత బాగా రాశావు నస్రీన్. కథ ఎలా ముగుస్తుందోనని భయపడుతూ చదివాను.
ఆర్థిక సమస్యలు , అభద్రతా స్త్రీలనూ,పురుషులనూ కూడా వేధించేవే. కానీ వాటి నుంచి అవుట్ లెట్ గా వ్యసనాలనూ, కుటుంబ స్త్రీల మీద హింసనూ మగవాళ్ళకు అనుమతిస్తుంది సమాజం.
స్త్రీలు భయంలోకి, న్యూనత లోకి ముడుచుకు పోతారు . దాని ప్రభావం జీవితమంతా వెంటాడుతుంది.
ఆశావహమైన ముగింపు ఇవ్వటం బావుంది.
చక్కగా చెప్పగలిగావు. అభినందనలు.
ధన్యవాదాలు అక్కా
కథ బాగుంది. గొప్ప పెయిన్ ని కథ చేశారు.
Chala bavundandi.