కొన్ని మంచి రచనలు ఎంత ఉత్తేజితులను చేస్తాయో, అలాగే కొన్ని దుర్మార్గమైన రచనలు అంతగా కలవర పెడుతాయి. అలా కలవరపెట్టిన రచననల్లో ఒకటి వంశీ జూలూరి రాసిన “ప్రజాస్వామ్య దేవుడు కాదు, రాముడే సర్వోన్నతుడు!” అనే వ్యాసం. ఇది నిత్యం రామ జపం చేసే గాంధీ వర్థంతి రోజున (జనవరి 30, 2024) ఆంధ్రజ్యోతిలో ప్రచురింపబడింది. దానిలోని అప్రజాస్వామిక, లౌకికభావ వ్యతిరేక, రాజ్యాంగవిరుద్ధ అంశాలను ఎత్తిచూపుతూ వెంటనే ఈ వ్యాసం రాసి ఆంధ్రజ్యోతి సంపాదకులకు పంపాను. కాని అది ఇంతవరకు అచ్చు కానందున ఇక్కడ మీతో పంచుకుంటున్నాను.
వంశీ జూలూరి రచన దుర్మార్గమని ఎందుకంటున్నాంటే అందులో బ్రాహ్మణీయ పెత్తనం వుంది. బహుళత్వాన్ని రద్దుచేసే ఏకత్వ దాడి వుంది. భారతదేశమంటే రామరాజ్యమనే హిందుత్వ ఫాసిస్టు కుట్ర వుంది. ఇవేవి రచయిత కేవలం అమాయకంగానో, అజ్ణానంతోనో రాసినవి కాదు. ఎందుకంటే ఆయన అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో యూనివర్సిటీలో మీడియా స్టడీస్ ప్రొఫెసర్. గత కొన్నేండ్లుగా హిందుత్వ వాదనను ప్రవాసంలో బలంగా వినిపిస్తున్నవాడు. ఆయన ఒక హిందుత్వ ప్రవచనకర్తగా ఆ వ్యాసంలోని అంశాలు రాసి వుంటే అందులో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. కాని ఒక కరడుగట్టిన పెట్టుబడిదారీ దేశంలో ఆధునికత, ఉదారవాద భావాల పునాదిగా నడిచే ఒక విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా పనిచేస్తూ తిరోగమనవాదాన్ని, బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజానికి మద్దతును కూడగట్టే భావనలను తెలుగు ప్రజల ముందు పెట్టడం కొంత ఆశ్చర్యంగానే వుంది. అసలు ఆయన రాసిన వాటిలో అభ్యంతరాలు ఏమిటో చూద్దాం.
వంశీ జూలూరి తన వ్యాసంలో ఒక భావోద్వేగం, ఒక “దైవ ఉన్మాదం” (ఇది ఆయన వాడిన మాటనే) గురించి ప్రస్తావించారు. భావోద్వేగం “అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ” సందర్భం గురించి. ఆ భావోద్వేగాన్ని “మన జాతి, నాగరికత” అనుభవించిందని, మనది ఒకే జాతని, ఒకే నాగరికతని హిందుత్వ ఏకత్వ సిద్దాంతాన్ని చెప్పకనే చెప్పారు. అంతటితో ఆగక రాముడి విగ్రహానికి, దేశమంతా నిర్మాణమైన జాతీయ, రాజకీయ నాయకుల విగ్రహాలతో ఒక పోలిక చేస్తూ ఆ వ్యవహారాన్ని “దైవ ఉన్మాదమని” అభివర్ణించారు. వివిధ రాజకీయ పార్టీలు వారి రాజకీయ ప్రయోజనాల కోసం వారి నాయకుల విగ్రహాలు పెట్టుకుంటే తప్పులేనప్పుడు బిజేపీ తమ ప్రయోజనం కోసం రాముడి విగ్రహాన్ని పెట్టుకుంటే తప్పేముందని చెప్పడం ఆయన భావన. ఇక్కడ రెండు అభ్యంతరకరమైన అంశాలున్నాయి. మొదటిది, ప్రభుత్వమంటేనే హిందుత్వ అనేలా, దేశ ప్రధానమంత్రే తన ఇంటి కార్యంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం. దాని ద్వారా మొత్తం హిందూ సమాజాన్ని ఒక ఉద్వేగానికి గురిచెయ్యడం. రెండవది, సారంలో నాయకుల విగ్రహాలు, రాముడి విగ్రహాలు కలిగించే ఉద్వేగం ఒకటే అయినప్పుడు, ఒకటి ఉన్మాదం అయితే మరొకటి కూడా ఉన్మాదమే!
ఆయన చాలా నాయకుల పేర్లు ప్రస్తావించినా అంబేద్కర్ విగ్రహాల మీద ప్రత్యేక కసిని ప్రదర్శించారు. ఆయనను అందరి నాయకుల “ప్రజాస్వామ్య దేవుడు” అని వ్యంగంగా అంటూ, ఆయనే “దేవుడని ఆరాధించే” ఆయన “ప్రతినిధులను” దైవ ఉన్మాదులుగా చూపే ప్రయత్నం చేశారు. తమకి నచ్చని రాజకీయాలను ఉన్మాదులుగా, తీవ్రవాదులుగా చిత్రీకరించడం బ్రాహ్మణీయ హిందుత్వ సంప్రదాయం కదా!
వంశీ జూలూరి ఒక మంచి ప్రశ్నతో మరో వాదనను విపించే పనిచేశారు. ఆ ప్రశ్నేమంటే, “మన ఆధునిక సంవేదనలు, ‘శాస్త్రీయ దృష్టి’ ఎందుకు మనలను ఆలయాలు నిర్మించేవారిని, ఆరాధనలకు, ప్రాణప్రతిష్ఠలకు నిధులు సమకూర్చేవారిని తిరోగామిశక్తులుగా, అవన్నీ నిరుపయోగమైన పనులుగా ఎందుకు చూస్తున్నాయి?” నిజానికి ఈ ప్రశ్నను చాలా లోతుగా హేతుబద్దంగా సమాధానం చెప్తారేమోనని వడివడిగా చదువుకుంటూ పోయేసరికి నాకు నిరాశే మిగిలింది. ఆ ప్రశ్నకు ఎటూ తేల్చకుండానే తన తల్లితండ్రుల (సినీనటి జమున, ఆమె భర్త – పేరు ప్రస్తావించలేదు) ఆర్థిక సహకారంతో 1975లో దుగ్గిరాల అనే గ్రామంలో నిర్మించిన నవగ్రహ విగ్రహాల దేవాలయం కలిగించే ‘ప్రయోజనాలు’ చెప్పుకుంటూపోయారు. ఏమిటా ప్రయోజనాలంటే, “నిరుద్యోగులు తమకు ఉద్యోగం వచ్చేలా చూడాలని ఒక గ్రహాన్ని పూజిస్తారు. దీర్ఘకాలిక రుజాగ్రస్తులు ఉపశమనం కోసం మరో గ్రహానికి నైవేద్యం సమర్పిస్తారు; యువ దంపతులు మంచి బిడ్డలకోసం ప్రార్థిస్తారు.” ఇలాంటి ప్రయోజనాల కోసమే అయోధ్యలో రామాలయం అవసరమని పరోక్ష సంబంధాన్ని ఏర్పరిచే ప్రయత్నం చేశారు.
అంతేకాదు “మనం ఇప్పుడు ఒక విడ్డూరమైన, అనాగరికమైన- సాంస్కృతికంగా పర్యావరణ పరంగా ఒక విషపూరిత ఆధునికీకరణ దశలో ఉన్నాం” కాబట్టి దానికి విరుగుడుగా అశాస్త్రీయత వైపుకు, మధ్యయుగాలవైపుకు అడుగులు వెయ్యాలని సూచిస్తున్నారు. ఇలాంటి మూర్ఖపు విశ్వాసాలను ప్రజలలోకి భక్తి పేరిట చొప్పించాలని చూడడాన్ని తిరోగమనవాదమే కాదు, తిమిరవాదం అని కూడా అంటారు. ఈ మాటలను ఆధునికవాదులే కాదు, చివరికి గరికపాటి వంటి హిందుత్వ ప్రవచనకర్తలు కూడా ఒప్పుకోరు.
ఇక్కడ మరో సామాజిక అంశం ఏమంటే అసలు వంశీ జూలూరి ఈ సర్వరోగ నివారిణిని (విగ్రహాలను ప్రతిష్టించడం) ఎవరికోసం ప్రస్తావిస్తున్నారో అర్థం చేసుకోవాలి. సమాజాన్ని విగ్రహాల చుట్టూ తిప్పితే బలపడే, దోపిడీ చేసే కులాలు, వర్గాలు, లింగాలేంటివో గుర్తించాలి. చివరికి బాధితులుగా మిగిలిపోయే వారెవరో అర్థం చేసుకోవాలి. ఈ ప్రశ్నలు అడగకుండా దళిత, బహుజనల మీద మతం మత్తు చల్లుతున్నారు. మనం మతాన్ని నమ్మినా నమ్మకపోయినా ప్రతి మతం కొన్ని ఆధ్యాత్మిక విషయాలను చెబుతూనే దాని మనుగడ కోసం భావోద్వేగాలను ప్రేరేపించే కార్యాక్రమాలను ఆ మత విశ్వాసాలలో భాగం చేస్తుంది. అయితే ఆధ్యాత్మిక విషయాలపై కొందరికే నియంత్రణ ఇచ్చి, భావోద్వేగాలను మాత్రం మొత్తం సమాజం మీద రుద్దుతుంది. నిజానికి రామమందిరం వ్యవహారంలో హిందూ మతంలో ఉందని చెప్పుకునే ఆధ్యాత్మికతను చంపేసి కేవలం భావోద్వేగాలనే రెచ్చగొట్టారు. ఆ భావోద్వేగాని చూసి వంశీ జూలూరి గారు పరవసించిపోతున్నారు. ఎంతగా అంటే అది దైవ ఉన్మాద దశకు చేరిందని తెలుసుకోలేనంతగా!
వంశీ జూలురి విశ్వాసం ఎంతో దృఢమైన విశ్వాసాలను ప్రకటించారు. ఆయన మాటలు వింటుంటే ఇక దేశ చరిత్రను రామాలయం ముందు, తర్వాతగా విడదీసి రాయాల్సిందేమో అనిపిస్తుంది. చూడండి ఎంత విశ్వాసమో: “మన జాతి, నాగరికత ఇప్పుడు అదే విధమైన భావోద్వేగంలో ఉన్నది. ఒక విలక్షణ స్ఫూర్తిని ఆవాహన చేసుకొంటూ, వర్తమాన సమస్యలను అధిగమించేందుకు అయోధ్యలో నిర్మించిన భవ్య రామమందిరంతో శక్తిని పొందుతోంది. పరిపూర్ణ ఆత్మవిశ్వాసంతో భవిష్యత్తును ఆవాహన చేసుకొంటోంది.” అంటే దీనర్థం ఇప్పటి వరకు మనకు ఒక విలక్షణ స్పూర్తి, సమస్యలను అర్థం చేసుకుని అధిగమించే శక్తి, భవిష్యత్తును ఆవాహన చేసుకునే ఆత్మవిశ్వాసం ఏవీ లేవని, ఇక రామాలయంతో అవన్ని పొంది పేదరికం, హింస, దోపిడీ, పీడనలు అంతరించిపోతాయని వంశీ జూలూరి ప్రగాఢ విశ్వాసం. అయితే భక్తులెవరైనా ఇప్పటివరకు అయోధ్యలో రామమందిరం లేదు కాని దేహమే దేవాలయంగా ఆత్మారాముడు ఎప్పుడూ వున్నాడు కదా అని అమాయకపు ప్రశ్న వెయ్యకండి, దేశద్రోహులుగా మిగిలిపోతారు!
మరొక వాదనను చూడండి. “శాస్త్రీయ దృష్టిని అలవరచుకోవాలని తొందరపెట్టే వారు ముహూర్తం, వాస్తును పరిహసించడం పరిపాటి. అయితే క్రూర ఏకేశ్వరో పాసన సంప్రదాయాలు విస్తరించకముందు యావత్ప్రపంచమూ అనుసరించిన పద్ధతులు అవి. ఇప్పుడు మనలను ఆవహించిన రామభక్తి అంతకంతకూ అంతరించిపోతున్న ఆ పురాతన జ్ఞాపకాన్ని మళ్లీ మన మనస్సుల్లో నింపుకోవాలనే ఆరాటమే.” అంటే మూడనమ్మకాలను, అశాస్త్రీయతలను కాపాడే ఒక శక్తిని రామభక్తి కలిగిస్తుందని చెబుతున్నారు. ఇక్కడ “పురాతన జ్ణాపకాలు” అనే ఒక గంభీరమైన పదం వాడారు కాని ఆ జ్ణాపకాలలో కేవలం భక్తి, ముహూర్తాలే లేవు అందులో హింస, పెత్తనం కూడా దాగివున్నాయి. ఈ పురాతన జ్ణాపకాల వ్యవహారమంతా సమాజంలో బ్రాహ్మణ్యాన్ని మరింత బలోపేతం చెయ్యడం కోసమే.
అంబేద్కర్ అన్నట్లు బ్రాహ్మణీయతలో ఎలాంటి సమానత్వం, ఉదారత్వం, స్వేచ్ఛ ఉండవు. కాబట్టి పీడిత కులాలు, వర్గాలు, లింగాలు బ్రాహ్మణీయ భావజాల బూజును (మావో మాటల్లో చెప్పాలంటే) ప్రతిరోజు ఇల్లు తుడుచుకున్నట్లు తుడిచెయ్యాలి. దానికోసం హేతువాద సూత్రాలను, లౌకిక ప్రజాస్వామిక విలువలను ఆయుధాలుగా చేపట్టాలి. అంతేకాదు సామాజికశాస్త్రాలను క్రిటికల్ గా మన సామాజిక పరిస్థితులకు అన్వయించి అర్థం చేసుకోవాలి. వంశీ జూలూరి వంటివాళ్ళు అలాంటి ప్రయత్నాల మీద నీళ్ళే కాదు, నిప్పులు కూడా చల్లుతారు. ఆయన ఏమంటారంటే, “సామాజిక శాస్త్రాల భావనలు, సిద్ధాంతాలు వస్తాయి, పోతాయి. వాటికి ఆవల, వాటన్నిటికీ అతీతంగా వేల్పులు నిశ్చలంగా నిలబడి వుంటారు. వారి ఉనికి సుస్థిరమైనది, స్ఫూర్తిమంతమైనది.” అసలు అమెరికాలో విద్యార్థులకు పాఠాలు చెప్పే ఒక అధ్యాపకుడు ఇలాంటి భావాలను వ్యక్తపరచడం ఆశ్చ్యర్యాన్ని మాత్రమే కాదు, ఆ విద్యార్థుల మీద జాలి కూడా కలిగిస్తుంది. ఆయన మాటల్లో ఎలాంటి తర్కం లేదు. కేవలం మూర్ఖత్వం తప్ప.
వంశీ జూలూరి తన వ్యాసాన్ని ఒక అత్యంత ప్రమాదకరమైన వాక్యంతో ముగించారు. అదేమంటే, “మీ రాజ్యాంగం, మీ ప్రజాస్వామ్యం, మీ పవిత్ర గ్రంథం–ఇవేవీ మా రాముడిని మించి సమున్నతమైనవి కావు. వ్యవహరించాల్సి వస్తే దాని ఆధారంగా వ్యవహరించండి.” ఇది కేవలం ముగింపు వాక్యం జాదు, ఒక హెచ్చరిక. రాజ్యం, రాజ్యాంగం, మొత్తం సమాజం (అన్ని మతాలు, వర్గాలు, కులాలు, లింగాలు) రాముడి ఆధారంగా, కేంద్రంగా నడవాలట. అంటే దేశంలో ఉన్న బహుళ జాతులు, మతాలు, రాజకీయ విశ్వాసాలు అన్నీ రాముడి పేరిట జరిగే బ్రాహ్మణీయ హిందుత్వానికి లొంగి బతకాలని ఒక హెచ్చరిక చేస్తున్నారు. అమెరికాలో హిందూఫోబియాకు వ్యతిరేకంగా హిందువుల మానవహక్కుల గురించి మాట్లాడే వంశీ జూలూరి దేశంలో మాత్రం బ్రాహ్మణీయ హిందుత్వ పెత్తనం కొనసాగాలని కోరుకుంటున్నారు. ఇక్కడ అన్ని ఇతర మతాల, జాతుల హక్కులను రాముడి సాక్షిగా విస్మరిస్తున్నారు.
కాని జూలూరి వారికి రాముడి మీద ఉన్నంత పట్టు ప్రజల మీద, ప్రజాఉద్యమాల మీద లేనట్లున్నది. రామ జపం చేసుకునే గాంధీని చంపిన హిందుత్వ శక్తులు రాముడి పేరిట ఎన్ని కుట్రలు చేసినా వాటిని తప్పక గుర్తిస్తరు, ఎదిరిస్తరు. రేపు ప్రజలకు మరో దారి ఉండేలా లేదు. ముఖ్యంగా తెలుగు నేల మీద ప్రజా చరిత్ర ఇదే చెబుతుంది. అందుకే దైవం పేరిట పెట్రేగుతున్న ఉన్మాదం పోయి, ప్రజాస్వామ్యం వరివ్యాప్తి తప్పక జరుగుతుంది. ఈరోజు కాకపోతే, రేపు.
పెట్టుబడి చేతిలో మీడియా. చర్చకు తావివ్వదు
Professor —vamshi Juluri garu —-YOUR THINKING AND WRITING IS WRONG SIR
Wake up sir —-how long bramana petthanam – julum —??YOU KNOW RAMUDU ??
YOU SAW RAMUDU ????man cannot live with out god medhavi. Garu
ASHOKJI — U R RIGHT SIR
=======================buchireddy gangula
వంశీ తల్లి జమున. జానకి కాదు. ఆవిడ ఈ ప్రబుద్దుడి గురించి ఎప్పుడూ చెబుతుంటుంది.
పొరపాటును సరి చేసిన. Thank you!