కాళ్ల కింద నేల కాదు,
నెత్తి మీది నింగి కాదు..
భుజాల మీది బాధ్యత.
జైల్లో సముద్రం కాదు,
బయట మిగిలిన ఎడారి కాదు..
ఆత్మబలిదానపు ఆతృత.
విత్తు ఒక్కటే కావచ్చు,
వృక్షాలు ఒక్కటి కాదు..
ఆకుపచ్చని అడవి ఒక ఆసరా.
గలగలల గోదారి కాదు,
బిరబిరల కృష్ణమ్మా కాదు..
చెట్టుకు వేలాడుతున్నభరోసా.
తేనెలొద్దు తేటలొద్దు
కొలవడాలు కచేరీలు వద్దు
కాపురాల్లో కలహాల కరువే దిలాసా.
రంగు కండువాల ఊసరవెల్లులొద్దు
కలల నెమలి పింఛాలమ్ముకునే జాతర్లొద్దు
బోర్లించిన పుస్తకాల మాటున
బోర్లాపడే బొచ్చెలొద్దు
మల్లెపూల దండలొద్దు
మత్తు ఒదలని మాటలొద్దు
దేశపటం మనిషే ముఖచిత్రం కావాలోయ్