ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త రైతు చట్టాలను వాటి పర్యవసానాలను తెలుసుకునే కంటే ముందు పాత చట్టం ఏమి చెబుతుందో కూడా పరిశీలిద్దాం. భారతదేశంలో గల భౌగోళిక, సామాజిక సాంస్కృతిక భిన్నత్వాన్ని రూపు మారాలని, దేశాన్ని ఏకరూప రాజ్యాంగ మార్చాలని అనుకునే కుట్రలో భాగంగా గత కొన్ని సంవత్సరాలుగా నూతన చట్టాలు రూపొందించబడ్డాయి. ఇది రాష్ట్రాల యొక్క హక్కులను కాలరాసే చర్య. రాజ్యాంగబద్ధ గా ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వాలకి పరిపాలన అధికారాలు, నియంత్రణ లేకపోతే స్వయం నిర్ణయాధికారం లేకపోతే ఇక ఆ ప్రాంతంలోని ప్రజల హక్కులు, ఆకాంక్షల గురించి చెప్పనవసరం లేదు. ఇక బలహీనులైన రైతులు అత్యంత దుర్భర స్థితిని అనుభవించాల్సి వస్తుంది.
అత్యవసర వస్తువుల చట్టం -1955 ప్రకారం ఏదైనా ఒక నిత్యావసర వస్తువును అత్యవసర వస్తువుల కింద చేర్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి కేంద్రం చేయవలసి ఉంది. ఈ చట్టం ప్రకారం లైసెన్స్, అనుమతులు ఇవ్వడం, వ్యవసాయ ఉత్పత్తులను రెగ్యులేట్ నియంత్రించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండేది. అత్యవసర ఆహార ఉత్పత్తుల కోసం వృథాగా ఉన్న భూమిని వ్యవసాయ వినియోగంలోకి తీసుకొచ్చి, పంట దిగుబడి పెంచే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. వస్తువులు కొనడం, అమ్మడం, నిల్వ చేసుకోవడం, రవాణా చేయడం, పంపిణీ చేయడం ధర నియంత్రించే అధికారం కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలకు వినియోగానికి మించి అధికంగా నిల్వ చేయడం, బ్లాక్ మార్కెట్ ని నియంత్రణ అధికారాలు ఉండేవి. దానివల్లనే వ్యాపారులు అక్రమంగా ఆహార పదార్థాలను నిల్వ చేయకుండా పరిమితి ఉండేది. ఓపెన్ మార్కెట్లో నిత్యావసర సరుకులు సామాన్యులు కొనుక్కొని స్థాయిలో ఉండేవి. రేపు కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వ్యవసాయ రంగం వెళ్తే, ధరల నిర్ణయం వారిదే అయితది. ప్రభుత్వాలు చేతలుడిగిన ప్రేక్షకుల్లా మిగిలిపోవాలి.
వ్యవసాయ ఉత్పత్తులను అత్యవసర చట్టం పరిధిలో చేర్చాలన్న తొలగించాలన్న ఆయా రాష్ట్రాల యొక్క అభిప్రాయాలను తీసుకోవడం తీసుకోవాలని 1955 చట్టం చెప్తుంది. కానీ ఇప్పుడు చేసిన నూతన చట్టం రాష్ట్ర అధికారాలను పూర్తిగా హరించి వేసింది. కేంద్రమే అన్ని అధికారాలను తన గుప్పిట్లో పెట్టుకోవడం సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు. కొత్తగా తెచ్చిన ఈ చట్టాల వల్ల భారత దేశపు ఆహార భద్రతకు భవిష్యత్ వ్యవసాయరంగానికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది.
అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో వ్యవసాయ రంగం స్థితి గతులు పరిశీలిద్దాం. ముఖ్యంగా అమెరికా తీసుకువచ్చిన ఫార్మ్ యాక్ట్-2018 లో వ్యవసాయ ఉత్పత్తుల పెంచాలని నిర్ణయించింది. అమెరికాకు కెనడా, చైనా దేశాలు ఎగుమతులకు పెద్ద మార్కెట్ గా ఉన్నాయి. గత నాలుగు సంవత్సరాలుగా చైనాతో నడుస్తున్న వైరం కారణంగా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు తగ్గిపోయాయి. చైనాతో వాణిజ్య సంబంధాలు దెబ్బ తినడం వల్ల ఇలా వస్తున్న లోటును రెండో అత్యధిక జనాభా గల ఇండియాకు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు పెంచుకోవడం ద్వారా పూడ్చుకోవడానికి అవకాశం ఉంది. ఇంత పెద్ద జనాభా కలిగిన దేశం మరొకటి లేదు. ఇంత పెద్ద మార్కెట్ కూడా లేదు.
అమెరికా మాత్రం తన అవసరాల కోసం వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులకు కెనడా, మెక్సికో దేశాలపై ఆధారపడుతున్నది. సమీపంగా ఉన్న దేశాల నుంచి చౌకగా దిగుమతి చేసుకుంటూ, తూర్పు ఆసియా దేశాలు దేశాలకు ఎక్కువ ధరకు తన వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముతున్నది. అమెరికా లో పండిన పత్తిలో 75% పండించిన బియ్యం లో 50% గోధుమల్లో 50% ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు.
కానీ మనదేశంలో వినియోగానికి సరిపడే స్థాయిలోనే బొటాబొటిగా గోధుమ ఉత్పత్తి ఉంది. కొన్ని సార్లు అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే ఇతర దేశాల నుంచి గోధుమ దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. మనదేశంలో పండించే నూనె గింజలు దేశంలోని 40 శాతం అవసరాలకు మాత్రమే సరిపోతుంది 60 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. మనం వనస్పతి, వెజిటేబుల్ ఆయిల్ ఉత్పత్తులు చైనా నుండి అధిక మొత్తంలో దిగుమతి చేసుకోవడం జరుగుతున్నది.
పామ్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, పొద్దుతిరుగుడు నూనె లా దిగుమతి లో భారతదేశం ప్రపంచంలోనే మొట్ట మొదటి స్థానంలో ఉంది. అంటే మన దేశంలో ఉత్పత్తి అయ్యే నూనెగింజల మన దేశ అవసరాలకు ఏ మాత్రం సరిపోవడం లేదు. ఇవన్నీ ప్రభుత్వం చెప్పిన లెక్కలే. సోయాబీన్ నూనె కోసం అర్జెంటీనా, బ్రెజిల్, అమెరికా దేశాల పైన పామాయిల్ కోసం ఇండోనేషియా, మలేషియా తదితర దేశాలపై, పొద్దుతిరుగుడు నూనె కోసం కజకిస్తాన్, అర్జెంటీనా, రష్యా దేశాల పైన మనం ఆధారపడి ఉన్నాం.
మొత్తంగా వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులలో నూనెలు, వనస్పతిలే 34 శాతం ఉన్నాయి. మనదేశంలో గోధుమల వినియోగం సుమారు 97 నుండి 99 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉంటే మన దేశంలో ఉత్పత్తి అయ్యే గోధుమలు గత మూడేళ్లుగా సుమారుగా100 మిలియన్ టన్నుల వరకు ఉంటున్నాయి. ఎంత అయితే తక్కువ ఉత్పత్తి అవుతుందో ఆ మొత్తం గోధుమలను అమెరికా నుండి దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. కేంద్ర ప్రభుత్వం గోధుమలకు మద్దతు ధర పెంచిన తర్వాత దేశంలో గోధుమ సాగు విస్తీర్ణం పెరిగింది. దేశ అవసరాలకు సరిపోయే గోధుమ ఉత్పత్తి సాధ్యమైంది.
ఏప్రిల్ 2020 నాటికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు ఇతర ఏజెన్సీల వద్ద 755.94 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార నిల్వలు ఉన్నాయి.
వరి ఉత్పత్తి మనదేశంలో సుమారుగా 114 నుండి 120 మిలియన్ మెట్రిక్ టన్నుల వరకు ఉంటుంది.
మన దేశ ప్రజలు ఏడాదికి 102 మిలియన్ మెట్రిక్ టన్నుల వరకు వరి బియ్యం వినియోగిస్తున్నారు. భారతదేశంలో 70 శాతం మంది ప్రజలు ప్రతి రోజు బియ్యం తో చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల వరి అనేది ప్రధాన వినిమయ ఆహారం. మన దేశంలో నాలుగు వేల వరి వంగడాలు పండించడం జరుగుతుంది 40 నుంచి 50 శాతం వరకు ఉత్పత్తి చిన్న సన్నకారు రైతుల ద్వారా జరుగుతుంది 90 శాతం మందికి 4,5 ఎకరాల కంటే తక్కువ విస్తీర్ణంలో భూమి ఉంది. బియ్యం లో ఉత్పత్తి అయ్యే నూకల నుండి ఆల్కహాల్ తయారు చేస్తారు.
2017 – 18 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం మోడల్ ఏ.పీ.ఎం.సి. అండ్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టం తెచ్చింది. తరువాత కేంద్ర ప్రభుత్వానికి మల్టిపుల్ మార్కెట్ ఛానల్, ప్రీ అగ్రిమెంట్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ మొదలైనవాటిపై ప్రేమ పుట్టింది. వీటిని అమలు చేయడానికి పాత ఏపీఎంసీ చట్టాలు అడ్డుగా ఉన్నాయి. వాటి అధికారాలు రాష్ట్రాల పరిధిలో ఉన్నాయి. వాటి అధికారం తగ్గించడానికి కేంద్రం ఒక కుట్రపూరిత ప్రయత్నం మొదలు పెట్టింది. అందుకోసం 2019లో జూలైలో ఏడుగురు ముఖ్యమంత్రులు సభ్యులుగా హైపవర్ కమిటీ వేసింది. తనకు అనుకూలంగా ఉన్న ముఖ్యమంత్రులతో మాత్రమే కమిటీ వేసుకొన్నది. ఆ కమిటీతో కాంట్రాక్టు వ్యవసాయానికి అనుకూలంగా సిఫారసులు చేయించుకున్నది. వాటి అమలుకు అత్యవసర వస్తువుల చట్టం -1955 పెద్ద అడ్డంకిగా ఉంది. అందుకే దానికి సవరణలు చేసింది. కార్పోరేట్, కాంట్రాక్టు వ్యవసాయానికి అనుకూలంగా మూడు చట్టాలు చేసింది. అందులో రైతులకు ఎంతో లాభం చేస్తున్నట్టుగా మల్టిపుల్ మార్కెటింగ్ అవకాశాలను ఇస్తున్నట్టుగా కొన్ని అందమైన అబద్ధాలని చేర్చినారు. పాత చట్టంలో ఉన్న లొసుగులను తొలగించి, రైతు అనుకూల విధానాలను రూపొందించమని ఉద్యమాలు నడుస్తుంటే, అంతకంటే నష్టదాయక చట్టాలు చేయటం దురదృష్టకరం. గ్రామీణ ప్రాంతాల్లో మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తున్నామని చెబుతూనే, దీర్ఘకాలికంగా కాంట్రాక్ట్ వ్యవసాయం చేసుకొనడానికి అవకాశం కల్పించారు. గతంలో ఉన్న కంట్రోల్ తీసివేస్తూ ఒక వ్యక్తి లేదా సంస్థ పెద్ద మొత్తంలో వ్యవసాయ ఉత్పత్తులు కొనుక్కోవడం, నిల్వ చేసుకోవచ్చని పాత చట్టాన్ని ఉల్టాచేసారు. ఫలితంగా నిన్నటిదాకా నేరమైన విషయం ఈరోజు న్యాయం అయిపోయింది.
కొత్తగా పార్లమెంటు ఆమోదం పొందిన మూడు బిల్లులు :
అందమైన పేర్లతో ఆర్డినెన్స్ తేవడం.
1) వ్యవసాయ ఉత్పత్తి వ్యాపారం వాణిజ్యం (ప్రమోషన్& ఫెసిలిటేషన్)
2) రైతులకు మద్దతు ధరపై ఒప్పందం (సాధికారత, రక్షణ)
3) అత్యవసర వస్తువుల చట్టం – 2020
దీని ప్రకారం అత్యవసర వ్యవసాయ ఉత్పత్తులను అన్ లిమిటెడ్ గా నిల్వ చేసుకునే అధికారం కల్పించాలి కాశం కల్పించారు.
- ఏ ప్రాంతంలోనైనా అమ్ముకోవచ్చు. ఇతర రాష్ట్రాల్లో అమ్ముకోవచ్చు. మార్కెట్ యార్డ్ లో అమ్ముకునే అవసరం లేదు. పంట చేను మీద వచ్చి కొనుక్కోవచ్చు. ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలా ఆవరణలో అమ్ముకోవచ్చు. గిడ్డంగుల ఆవరణలో అమ్ముకోవచ్చు. స్టోరేజ్ లో పెట్టుకొని అమ్ముకోవచ్చు. ఇంకో పద్దతి ఎలక్ట్రానిక్ ట్రేడింగ్. ఈ ఆర్డినెన్సు ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ను అనుమతిస్తుంది. ఆన్లైన్ ప్లాట్ ఫామ్ మీద అమ్మకాలు కొనుగోలు చేసుకోవచ్చు. దీనికి ఏవైనా కంపెనీలు, భాగస్వామ్య సంస్థలు, రిజిస్టర్డ్ సొసైటీ, ఇన్కమ్ టాక్స్ నెంబర్ కలిగి ఉంటే ఎవరైనా కొనుగోలు చేసుకోవచ్చు. ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్, అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ సొసైటీ కూడా కొనుక్కోవచ్చు.
ఇది అత్యధిక మొత్తంలో కొనుగోలు దారులను ఏమాత్రం ఆకర్షించలేదు. ముఖ్యంగా కార్పొరేట్ సంస్థలు, మల్టీ నేషనల్ & నేషనల్ కార్పోరేట్ రిటైల్ సంస్థలకు లాభం చేసేదిగా మాత్రమే ఉంది. లైసెన్స్ లేకుండా కొనుక్కునే విధానం అమలులోకి రావడం అనేది ఎంతమంది కొనుగోలుదారులను తయారు చేస్తుందో చూద్దాం. ఇక కొనుగోలుదారులపై ఎటువంటి లేవి, మార్కెట్ ఫీజు గాని వసూలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలను వాటి అధికారాలను నిర్వీర్యం చేశారు.
- రైతులకు మద్దతు ధరపై ఒప్పందం :
ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ అని ముద్దుపేరు కూడా పెట్టారు. దీనిలో ప్రధానమైంది ఫార్మింగ్ అగ్రిమెంట్ రైతులకు కొనుగోలుదారులకు మధ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. కనీసం ఒక పంట కాలానికి లేదంటే ఐదు సంవత్సరాల వరకు ఒక రైతు వద్ద అగ్రిమెంట్ చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ పండ్లతోటలు ఇతర దీర్ఘకాలిక పంటలు అయ్యేటట్టు ఉంటే ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కూడా అగ్రిమెంట్ చేసుకునే అవకాశం ఈ చట్టం కల్పిస్తుంది. ఓ అందమైన పేరు ఏంటంటే ముందే పంట ధర నిర్ణయించడం. అగ్రిమెంట్ రాసుకున్న అప్పుడే పంట ధర నిర్ణయించుకొని రాసుకోవాలి. ఇంకేమైనా అదనపు ధర చెల్లించాల్సి వస్తే అది కూడా అగ్రిమెంట్లో పొందుపరిచికోవాలి.
ఏదైనా డిస్ప్యూట్ వస్తే బోర్డు కి వెళ్లి రిప్రజెంటేషన్ చేయవలసి ఉంటుంది అగ్రి బండి ఎవరు వెయిట్ చేసినా కూడా దానికి సంబంధించిన పరిష్కారం అర్జీలు ఇచ్చిన 30 రోజుల లోపల పూర్తి కావాలి లేదంటే సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ నువ్వు సంప్రదించవలసి ఉంటుంది. చట్టంలో అగ్రికల్చర్ ల్యాండ్ ను రికవరీ కోసం తీసుకోకూడదని చెప్పినప్పటికీ రైతులకు అప్పులపాలు అయితే ఆ భూమిని అమ్ముకొని మాత్రమే కట్టవలసి ఉంటుంది చట్టం మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్లిన తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలుసు.
- ఎసెన్షియల్ కమోడిటీస్ చట్టం 20 20:
ముందు పాత చట్టం ఏం చెప్తుందో చూద్దాం. 1955 చట్టం ప్రకారం ఆహారపదార్థాలు, ఎరువులు, పెట్రోలియం వస్తువులు పతులు అత్యవసర వస్తువుల కిందికి వస్తాయి. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ వస్తువులను నిషేధించడం, సరఫరా, మార్కెట్ తదితర అంశాలపై నియంత్రణ అధికారం ఉంది.
కొత్త ఆర్డినెన్స్ కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే అధికారాలను కట్టబెట్టింది. అందులో తృణధాన్యాలు, పప్పులు, ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు, నూనె గింజలు, లాంటి కొన్ని ఉత్పత్తులను మాత్రమే అసాధారణ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నియంత్రణ చేస్తుంది. ఆ అసాధారణ పరిస్థితులు ఏమంటే ఒకటి యుద్ధాలు, రెండవది పదార్థాలకు అత్యంత కొరత ఉన్నప్పుడు, మూడవది అత్యంత ధరలు పెరిగినప్పుడు, నాలుగవది ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు సంభవించినప్పుడు.
సరఫరా, నిల్వలపై గతంలోని పరిమితిని తొలగించేశారు. ఎంతైనా నిల్వలు చేసుకోవచ్చు. 12 నెలలు నెలల్లో పండ్ల పై 100% అనగా (హార్టికల్చరల్ ప్రొడ్యూస్) ఆహార ఉత్పత్తుల ధరలు గత సంవత్సరం కంటే 50 శాతం పెరిగితే స్టాక్ పై పరిమితి విధిస్తారు. ఇది చాలా విచిత్రంగా ఉంది. గతంలో కఠినమైన చట్టాలు ఉన్నప్పుడే ఉదాహరణకు ఉల్లిగడ్డల ధరలు ఒక నెలలో కిలో 10 రూపాయలు ఉంటే తర్వాత రెండు నెలలకు 50 రూపాయలు ఉండేవి. ఇప్పుడు 100 రూపాయలు అయినాయి. అత్యధిక నిల్వలకు అవకాశం కల్పించిన తర్వాత అసాధారణ పెరుగుదలని కేంద్రం నియంత్రణ చేస్తామన్నారు కదా. పది రెట్లు పెరిగినాయి. ఏం నియంత్రణ చేసారు. కార్పోరేట్ శక్తులను నియంత్రించే శక్తి 4 ప్రభుత్వానికి లేదు. చట్టాలను వల్ల మేలు జరుగుతుందని సాధారణ ప్రజలకు మాత్రం లేదు.
2010 సంవత్సరంలో బీహార్లో తీసుకువచ్చినా నూతన వ్యవసాయ మార్కెటింగ్ విధానం వల్ల కొత్త ఇన్వెస్టర్స్ పెట్టుబడిదారులు ఈ రంగంలోకి రాలేదు. ఉన్న మార్కెట్ యాడ్స్ అన్నీ కూడా నిరాదరణకు గురై పనికిరాని స్థితిలో శిథిలావస్థకు వచ్చినాయి. వాటిని పట్టించుకునే నాధుడు లేడు. ఇప్పుడు కూడ దేశవ్యాప్తంగా మార్కెట్ యార్డులకు అదే పరిస్థితి రావచ్చు.
కోవిడ్ – 19 మహమ్మారి తట్టుకొని నిలబడగలిగిన ఒకే ఒక రంగం వ్యవసాయ రంగం. గత సంవత్సరం కంటే ఈ జూన్ త్రైమాసికంలో 3.14 శాతం అభివృద్ధిని నమోదు చేసుకుంది. అయినప్పటికీ నూకలు, మొక్కజొన్న నుంచి ఆల్కహాల్ తయారు చేస్తూ ఆ వచ్చిన ఆదాయాన్ని వ్యవసాయ రంగం ఖాతాలో చూపించడం లేదు. అనేక పరిశ్రమలకు ముడి సరుకు అందిస్తున్నప్పటికీ వ్యవసాయ రంగం యొక్క ఆదాయాన్ని జీడీపీలో తగ్గించి చూపిస్తున్నారు. దేశవ్యాప్తంగా రిటైల్ వ్యాపారం నుండి వచ్చే ఆదాయాన్ని కూడా వ్యవసాయ ద్వారా వచ్చే ఆదాయంలో చూపడం లేదు.
దేశ అవసరాలకు సరిపోయే పప్పుధాన్యాలు, నూనెగింజలు మనదేశంలో పండించాలంటే వాటికి మద్దతు ధర ఇచ్చి ప్రోత్సహించాలి. కార్పొరేట్ శక్తుల చేతుల్లో కి వ్యవసాయ రంగం వెళితే అత్యధిక జనాభా ఉపాధి కోల్పోతుంది. ఇప్పటికే ప్రభుత్వాలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యాయి. భవిష్యత్తులో వ్యవసాయ రంగం దెబ్బతింటే దేశంలోనే అత్యధిక జనాభా అది లేక ఉపాధి లేక దుర్భర జీవితం గడపాల్సి వస్తుంది.