రెండురోజులుగా వానపొటుకుతో ఇల్లు మడుగైంది. నా భార్య ఓపికగా నీళ్లు ఎత్తిపోస్తూంది.ఆమెకు నిద్రలేక జాగరణ చేస్తున్నట్లుంది. వాన వచ్చి పోయి రెండురోజులైనా ఇల్లంతా కారుతూంది. వాన పొటుకు కన్నా మానుపొటుకు ఎక్కువంటారు కదా మాకేమో ఇంటి పొటుకు ఎక్కువైంది. కొంప కొల్లేరు అయినట్లుంది.. ఇంటి పై కప్పు చూస్తే ఎప్పుడు కూలి పడుతుందోననే టెన్షన్ తో ” త్వరగా మంచి ఇల్లు దొరికితే మారుదాం ” అన్నాను నా భార్య తో
“చూడండి మీకు అనవసరమైన టెన్షన్. మన అనంతపురములో వానలు వచ్చేదే ఏడాదికొకసారి. అదీ బలంగా వస్తేనే కదా ఈ వాన పొటుకు కూడా. ఇక్కడ మనకు ఓనరు పొటుకు లేదు కదా “అంటూ నవ్వింది
“అదీ కరెక్టే. ఇంతకు ముందున్న ఓనరు గోడకు మేకు దించినా అతని గుండెల్లో దించినట్లు బాధ పడేవాడు. గాలికి తలుపులు ధబీమని పడితే మనపై మండిపడేవాడు. అతనికంటే ఈ ఓనర్ రంగమ్మ ఎంతో మంచిది.”అన్నాను
“మన రంగమ్మ బాడుగ పెంచదు, మనం పెంచినంత సంతోషంగా తీసుకుంటుంది.. అందుకే స్వంతం ఇల్లు కట్టుకునే వరకు ఇదే ఇంట్లో ఉందాం ” అనింది
“నీవు చెప్పేదంత బాగుంది కానీ నాకే అప్పుడప్పుడు ఆమె పొటుకుంటుంది “అన్నాను
“మీకేం పొటుకు “ఆశ్చర్యంగా నా వైపు చూస్తూ అడిగింది
“ఏమీ లేదు నాతో ఎప్పుడు మాట్లాడినా మాటకు ముందు’ దేవుడుండాడు నాయనా ‘ అని సుత్తి కొడతాంటుంది “అన్నాను నవ్వుతూ
“ఓహో అదా మీ బాధ, ఏదో పాత తరం మనిషి కదండీ, చాదస్తం ఎక్కువుంటుంది కదా, ఆమెకు వూతపదం అయింది. మీరు నాస్థికుడని ఆమెకు తెలీదు కదా” అంటూ నవ్వు కలిపింది
“ఏమో తెలిసే నన్ను ఆస్తికునిగా మార్చల్లని చూస్తాందేమో “అనుకుంటున్నా అన్నాను నవ్వుతూ
“ఆమె ఎన్ని వేల సార్లు అన్నా మీరు మారరు కదా “
“నన్ను మార్చలేదు కానీ మన బాబును మారుస్తుందేమోననే నా ఆందోళన ” అన్నాను
“అవునండి మొన్న ఒక రోజు ‘అమ్మా నాన్నేమో దేవుడు లేడు అంటాడు, రంగమ్మవ్వ ఏమో దేవుడుండాడు అంటుందే, ఇంతకు ఉన్నాడా లేడా?’ అని అడిగినాడు “
“అదే నా భయం. చిన్నపిల్లల్లో ఈ లేత వయసులో హేతువాద ఆలోచనలు తలకెక్కిస్తేనే ఈ మూఢనమ్మకాలు పోతాయి, కానీ చుట్టూ ఇట్లా చాధస్తమోళ్ళు ఉంటే వాళ్లకు తలకెక్కుతాయి మూఢనమ్మకాలు, అందుకే ఇల్లు మారదాం ” అన్నాను
“అవును మీరే ఆమెను మార్చ వచ్చు కదా ” అనింది
“వయసు మీరిన ఆమెను మార్చడం కష్టం. కనీసం ఆ మాట అనకుండానన్నా మార్చే ప్రయత్నం చెయ్యాలని అవకాశం కోసం ఎదురుచూస్తున్నా “అన్నా నవ్వుతూ
ఇలా మాట్లాడుకుంటుండంగానే ‘ఏయ్ ఏయ్ ‘పక్కింటి వాళ్ళ కేకలు విని ఏమైందో అని చూస్తే ‘ఛలో రామచంద్ర నగర్ ‘అన్నట్లు వచ్చిన వానర మూక మా కాంపౌండ్ వాల్
పైన వున్న కొబ్బరి గిన్నెలు ఎత్తుకపోతూ, చెట్లపైకి ఎక్కి కొమ్మలు పీకేస్తూ కాసేపు వీధంతా కిషకింద కాండ చేసాయి..
ఇదంతా చూస్తూ బయటే చెట్టు కింద నిలబడిన మా ఇంటి ఓనర్ రంగమ్మ ను చూసి ” ఇప్పుడు టాపిక్ దొరికింది, రంగమ్మకు స్పాట్ పెట్టేస్తా ” అన్నాను నవ్వుతూ
“పాపం ఊరుకోండి, ఆమె చాదస్తం ఆమెది, మీరేదన్న అంటే బాధ పడుతుంది “
“అరె నేనేమి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడను, ఆమె మనసునొప్పించకుండా మాట్లాడుతా, నీవు వింటూండు నా మాటలు “అన్నాను
“సరేలే “అని నా పక్కనే నిలబడింది నేను ఏమి చేస్తానో అని ఆసక్తిగా చూస్తూ
“ఛ ఏమి కోతులో ఇవి, ఈ మధ్య మరీ ఎక్కువైనాయి, ఎవర్నైయినా కరిస్తే రాబిస్ వచ్చి చస్తారు కదా. మున్సిపాలిటీ వాళ్ళు కొళాయికి నీళ్లు ఇవ్వరు, కనీసం ఈ కోతులనైనా లేకుండ చెయ్యొచ్చు కదా “అన్నా గెట్టిగా ఆమెకు వినపడేట్లు
“ఏమి చేసేకయితుంది నాయనా, వాటిని పట్టించి ఎంత దూరం వదిలినా మరీ తిరిగి వస్తాయి నాయనా “అంటూ మాట కలిపింది రంగమ్మ
నేను అనుకున్నట్లే టాపిక్ లోకి వచ్చింది అనుకొని నా భార్య వైపు చూసి నవ్వుతూ ” పట్టిస్తే పోవమ్మా చంపెయ్యాల్సిందే ” అన్నాను
“అయ్యో అట్లా చంపకూడదు నాయనా,చంపితే పాపం నాయానా “అనింది ఉలిక్కి పడినట్లు
“ఎందుకు చంపకూడదమ్మా, మెదడు వాపు వ్యాధి వస్తుందని పందులను చంపుతారు కదా, అది పాపం కాదా? అయినా పాపాలదేముంది లేమ్మా, పుష్కరాల్లో నీళ్లలో మునిగితే పోతాయి కదమ్మా.”
“అయ్యో , కోతులను చంపితే కోతి పిల్లలు పుడతారంట నాయనా “
” కొరియవాళ్ళు కోతులను చంపుకొని తింటాండారు కదమ్మా, వాళ్లకు కోతిపిల్లలు పుట్టడం లేదే, అది సరేలేమ్మా మనోళ్లు పందులను, చేపలను, తాబేళ్లను చంపుకొని తింటాండారు కదామ్మా, వాళ్లకు అట్లా పిల్లలు పుట్టలేదు కదామ్మా “
“కోతి ఆంజనేయస్వామి, రాముని బంటు మనదేవుడు, కదా నాయనా, కొరియా వాళ్లకు కాదు కదా.వరాహం, చేప, తాబేలును చంపితే ఏమీ కాదు నాయనా,అవీ కోతి ఒకటే అని ఎట్ల అంటావ్ నాయనా, కోతి పవర్ ఫుల్ కదా ” అనింది కోపంగా
“వరాహ, మత్స్య, కూర్మావతారాలు విష్ణువు దశావ తారలలో వే కదమ్మా. ఆంజనేయస్వామి కన్నా ఎంతో పవర్ ఫుల్ కదమ్మా “అన్నాను
ఆమెకు ఏమి చెప్పాలో దిక్కుతోచక మౌనంగా చూస్తూంది
“సరేలేమ్మా నువ్వు చెప్పినట్లే కోతులను చంపితే కోతి పిల్లలు పుట్టుతాయి అనుకుందాం మరి కోతుల రాజు వాలి ని చంపిన రామునికి ఇద్దరు కుమారులు లవకుశలు చక్కగా పుట్టినారు కదమ్మా ” అని అడిగాను
“అయ్యో రాముడు దైవాంస సంభూతుడు కదా నాయనా ” అనింది
“మరి దైవాంశ సంభూతుడైతే వాలిని చెట్టుచాటునుంచి ఎందుకు చంపినాడు, ఎదురుగా పోయి చంపొచ్చు కదామ్మా ” అన్నాను
“మానవ జన్మ ఎత్తిన తరువాత మానవ ధర్మం పాటించల్ల కదా నాయనా, వాలికి ఎదురుగా పోతే రాముని సగం బలం వాలికి పోతుంది కదా నాయనా, అందుకే చెట్టు చాటు నుంచే చంపినాడు “అనింది
“అట్లయితే మానవ జన్మ ఎత్తిన రామునికి కోతి పిల్లలే పుట్టల్ల కదమ్మా” అన్నాను
ఇక ఏమి చెప్పాలో దిక్కు తోచక “కాదు నాయనా తమిళనాడు లో ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఎండకు ఉంటుంది, దాని పైన వెన్న పెడితే కరగదు నాయనా, ఇది మహత్యం కాక మరేమంటావ్ నాయనా ” అనింది ధీమాగా
“అది వెన్న కాదంటానమ్మా, వెన్నయితే తప్పక కరగుతుంది, మహత్యాలు అన్నీ భక్తులను ఆకట్టుకునేకి చెప్పే కట్టు కథలమ్మా ” అన్నాను
“అయితే వినాయకుడు పాలు తాగేది కూడా మహత్యం కాదంటావా “
అది తలతన్య సిద్ధాంతం వల్ల జరిగేది అని చెప్పితే త్వరగా తలకెక్కదు కదా అనుకొని, “అవునమ్మా నీవన్నట్లు మహత్యమైతే పాలు తాగే వినాయకుడు పండు కూడా తినల్ల కదా,మరి ఇప్పుడేమంటావ్ ” అన్నాను
ఇక మాటలు లేక , “దేవుడున్నాడో? లేడో? నాయనా ‘” అనింది
“చూడమ్మా జీవవైవిధ్యాన్ని కాపాడ్డానికి, ఏ జీవరాసిని చంపరాదనీ, చంపితే పాపమని ఏదో ఒక భయం పెట్టినారు.అంతే. మనకు ప్రమాదకరమైనప్పుడు కోతులను కూడా చంపొచ్చని శ్రీరామ భక్తుడు అయిన మహాత్మా గాంధీనే చెప్పినాడమ్మా “అన్నాను
ఇదంతా విన్న నా భార్య “చివరకు రంగమ్మ ను మార్చినారు “అనింది నవ్వుతూ
“రంగమ్మ మారలేదు, ఆమె వూతపదం మారింది “అన్నాను నవ్వుతూ..
అప్పటి నుంచి మాతో ఏమి చెప్పాలనుకున్నా ‘దేవుడు వున్నాడో లేడో నాయనా ‘అనే మొదలుపెడుతుంది.