దేముడి దండు

వాళ్ళు మాట్లాడద్ధనే అంటారు
మనమేది మాట్లాడినా మాట్లాడద్దనే అంటారు

కలిగినమాటంటే
కంటిలో పుల్లబొడుసుకున్నట్టు
ఉన్నమాటంటే
మిన్నిరిగిపోయి మీద పడ్డట్టు
కుతకుతా ఉడికిపోయేవోళ్ళు
కళ్ళు కాషాయరంగులో తిప్పుతూ
కాడిమోసే గిత్తలపైకి కాలుదువ్వి రంకెలేస్తూ
మనమేది మాట్లాడినా మాట్లాడద్దనే అంటారు

వాళ్ళ..
కారుకూతలపై కవిత రాసి
కావరాలపై కతలు చెప్పి
అబద్దాల అడ్డుగోడలపై గద్దెనెక్కి
కులుకుతూ కులుకుతూ కునుకుదీసేటోళ్లను
మోసపు పుర్రెల భాగోతాలను
బయటకీడ్చే వొద్దికలు జరిగే తావుల్లో
ఏదీ మాట్లాడద్దనే అంటారు

నిజాల నీలి ఆకాశం కింద జనం కూడి
ఏది మాట్లాడినా మాట్లాడద్దనే అంటారు

వాళ్లు ఏదీ అడగొద్దనే అంటారు
వాళ్లు ఏమీ అనొద్దనే అంటారు
వాళ్ళు ఏవీ చెప్పదన్నే అంటారు

నీతిగా నేల ముఖంలోకి చూసి
సూటిగా మాట్లాడలేని డుబ్బాకోరు దద్దమ్మలు
తప్పతాగి ఊగే తాగుబోతు వంటి
మత్తులో ఊగుతున్న మురికి మూకల్ని ఉసిగొల్పి
మంచీ చెడు మాట్లాడనివ్వకుండా
గలాటాలు చేస్తారు.

నిషేధపు కావరపుమబ్బులు మూగి
ఉరుముతున్న ఊకదంపుడు వానలో
మునగా తడిసి తరిస్తున్న దేముడి దండై
చీకటినే వెలుతురనుకొనే వెర్రివెంగళప్పలు
నిజాలబాటలో నడుస్తారా?
కాలాన్ని నీతిగా నడవనిస్తారా?

అవాస్తవాలు పంచకింద కూకోని
సత్యాన్ని చదువుకోమంటే చదువుకుంటారా?

దోవనబోయే వాళ్ళను
దోవన వచ్చే వాళ్ళను
బుడ్డబెదిరింపులు బెదిరించి
వెలుగుదారిలో పోయేటోళ్లను దారి మళ్లించేందుకే పూనుకుంటారు గానీ

హననమవుతున్న జనం హక్కుల గురించి
ఖననమవుతున్న జాతి భవిత గురించి
ఒకమాటైనా మాట్లాడనిస్తారా?

మాట్లాడటమే
ముక్కులో మిరపకాయపెట్టుకున్నట్టు
మండిపడేటోళ్లు
మనమేది మాట్లాడినా మాట్లాడద్ధనే గదా అంటారు

నిలువెత్తు నాగదారిముళ్లకంపలు
నీకూ నాకు మధ్య నిసిగ్గుగా నాటుతూ
నామాల నుదురుతో నవ్వుకునేటోళ్ళు
మనుషులు కలిసి మాట్లాడితే
అస్సలు మాట్లాడద్ధనే అంటారు.

మనం మాటలు ఎక్కుపెడితే
వాళ్ళ కుట్రల కోటపేటలు కూలిపోతాయని
భీతిపాములు వొంటికి చుట్టుకున్నోళ్లై
మనమేది మాట్లాడినా మాటాడొద్దనే అంటారు

పూర్తిపేరు ప‌ల్లిప‌ట్టు నాగ‌రాజు. చిత్తూరు జిల్లా ‘అరవై నాలుగు పెద్దూరు’లో తెలుగు ఉపాధ్యాయుడు. శ్రీ వెంకటేశ్వర విశ్వ‌విద్యాల‌యంలో పీహెచ్‌డీ చేస్తున్నారు. ఆరువంద‌ల‌కు పైగా కవితలు, మినీ కవితలు, 6 కథలు రాశారు. చిత్తూరు జిల్లా ‘అభ్యుదయ రచయితల సంఘం’, ‘ఈ తరం కవితా వేదిక’లో కార్యవర్గ స‌భ్యుడిగా ప‌నిచేస్తున్నారు.

Leave a Reply