1
1935 లో హిట్లర్ ప్రకటించాడు
‘మూడవ రైచ్
వేయి సంవత్సరాలైనా నిలబడుతుంది’
పది సంవత్సరాల తర్వాత
బెర్లిన్ శిథిలాల కింద
నేలమాళిగలో హిట్లర్ ఏమన్నాడు?
ఇంకొన్ని సంవత్సరాల తర్వాత
అమెరికా విదేశాంగ మంత్రి జాన్ ఫాస్టర్ డల్లెస్
గొంగళిపురుగులా గురక పెడుతూ ప్రకటించాడు
‘ఈ దశాబ్ది ఆఖరుకల్లా
కమ్యూనిస్టు బానిసత్వం అంతమై తీరుతుంది’
మరికొన్ని సంవత్సరాల తర్వాత
సముద్రాంతర సీమలోనుండి
విశాల అమెరికన్ జనాలకి
అభివాదం చేసిన
యూరీ గగారిన్ ఏం చేశాడు?
‘కమ్యూనిస్టు వ్యతిరేకత అన్నది
ఇరవైయవ శతాబ్దంలోనే అత్యంత హాస్యాస్పదమైన విషయమ’ని
జర్మన్ నవలా రచయితా థామస్ మాన్
సరిగ్గానే చెప్పాడు
అయినా, లాభాల వేట కొనసాగుతూనే ఉంది
లాభార్జన కోసం హత్యాకాండ
ఇంకా కొనసాగుతూనే వుంది
2
గడ్డకట్టే డిసెంబరు మాసపు చలిగాలులలో
ఒక మిత్రుడు నాతో మాట్లాడాడు
‘నేను నిరాశ పడుతున్నాను
ప్రతీదీ మందకొడిగా సాగుతున్నది
నియంతృత్వ పాలన బలంగా వుంది
నా ప్రజల వేదన నన్ను బాధిస్తోంది, నన్ను నిస్పృహలోకి నెడుతోంది’
తన ఆవేదననీ,
గొంతులో ధ్వనించే దుఃఖాన్నీ ,
పోరాటాన్ని కొనసాగించాలన్న తన లోలోపలి సంఘర్షణనీ
అర్ధం చేసుకున్నాను
నువ్వు పిరికిపందవనో, అడవులలోకి వెళ్ళమనో అనలేదు
సోమరిపోతువనీ, నిరాశావాదివనీ,
పిడివాదపు మూర్ఖుడివనీ తనని నేను నిందించలేదు
కోతపెట్టే ఆ శిశిరపు శైత్యాన్ని
కొంచెమైనా తగ్గించాలని
నేను తన భుజంపై చేయి మాత్రం వేశాను
3
తలుపు తట్టారెవరో
ఎదురుగా, రెండు దీనమైన కళ్ళు
వాటి వెనక ఆరేళ్ళ పిల్లవాడు
దేశపు దైన్యానికీ,
సిగ్గుమాలిన, చేవచచ్చిన దేశానికీ నిదర్శనంగా
అతను చేయి చాచాడు
దేశపు ముఖచిత్రం మీద
చనిపోయిన ఆ మనిషి మరణాన్ని నిరసించే
నా హృదయం పగిలి ముక్కలైపోయింది
అయినా,
రొట్టె ముక్కని తన చేతికి ఇచ్చాను
తెలియనితనపు అగాథాలలోంచి
ఆ లేత కళ్ళు నాతో మాట్లాడుతున్నాయి.
4
జాతీయగీతం పాడుతున్నారు ఎవరో వీధిలో
నేను లేచి నిలబడి
కిటికీలోంచి తొంగిచూశాను
పాడే మనిషి పాదాలకు చెప్పులు కూడా లేవు
పొద్దున్న చద్దన్నం కూడా తినిఉండడు
ఉదయం పూటా, మధ్యాహ్నమూ
అసత్యాలని వీధిలో అమ్మే మనిషి
అతని వయసు ఖచ్చితంగా పదిహేనేళ్ళకి మించదు
పదిహేనేళ్ళూ పేదరికంలోనే మగ్గి ఉండాలి
బొంగురుపోయిన అతని గొంతులోనుంచి
సుష్టుగా భోంచేసిన గ్రీకు దేవతల కాలంనుంచి జాలువారినట్టు
గ్వాటెమాల జాతీయ గీతం వినిపిస్తోంది
అతన్నే గనక చూడకపోయి ఉంటే
‘ఎవరో సైనికుడు పాడుతున్నాడ’ని అని ఉండేవాణ్ణి
5
ఈ మధ్యనే యూరప్ నుంచి తిరిగి వచ్చాను
మాడ్రిడ్ తెలుసా అని
మేనల్లుడొకడు అడిగాడు
తెలీదని కటువుగా జవాబు చెప్పి
పారిస్ గురించి కబుర్లు కొనసాగించాను
కానీ, నా కథ పేలవమై కళతప్పిపోయింది
రక్తం, హఠాత్తుగా
హృదయంలోంచి ఎగజిమ్మింది
భయంకరమైన రక్తస్రావం
6
1942 చివరి రోజులు
నియంత హోర్హే ఉబికో పాలిస్తున్న రోజుల కథ
చర్చి భవనాలు కట్టే తాపీ మేస్త్రీ ఒకడుండేవాడు
‘స్వెచ్చ, బద్మాష్ జనరల్ నశించాల’ని
ధైర్యంగా నగరం గోడల మీద రాసేవాడు
ఆ తాపీ మేస్త్రీని పట్టుకున్నారు
సంపూర్ణ సైనిక బలంతో
ఎదురులేని అధికారం చెలాయిస్తున్న
జనరల్ ని వ్యతిరేకించే
సాహసమెందుకు చేశావని
ప్రశ్నించారు
తాపీ మేస్త్రీ జవాబిచ్చాడు: ఉబికో కూలిపోతాడు
అందరూ నవ్వారు, వీడొక వెర్రిబాగుల మనిషి
జనరల్ శాశ్వతంగా గ్వాటెమాల దేశాన్ని శాసిస్తాడు
ఆమరణాంతం దేశాన్ని శాసిస్తాడు
దేవుడిలాగే ఉబికొ సర్వ శక్తివంతుడు
ఎవరూ తనని ఎదిరించే సాహసం చేయలేరు
ఉబికో అధికారం అంతులేనిది
సాటిలేని తన బలమంటే
జనాలకి భయం, నోరు మెదపబోరని అనుకున్నారు
తాపీ మేస్త్రీ మొండిగా తన మాటపై నిలబడ్డాడు: ఉబికో కూలిపోక తప్పదు
గ్వాటెమాల దేశాన్ని అతనెన్నటికీ శాశ్వతంగా పాలించలేడు
ఉబికోపై ప్రజలు తిరగబడతారు
తిరగబడినదానికంటే, ‘స్వెచ్చ, బద్మాష్ జనరల్ నశించాల’ని
ఉబికో అధికార బలంమీద నమ్మకం లేకుండా
నగరం గోడలపై నినాదాలు రాసినందుకు
సైనిక స్థావరంలో ఒక వేకువజామున
ఆ తాపీ మేస్త్రీని కాల్చి చంపేశారు
7
వీధిలో ఎవరో నన్ను ఆపి
నా గుండెలమీద వాలి కన్నీళ్ళు కార్చారు
దారిన వెళ్ళే వాళ్ళు ఆగి, చుట్టూ చేరారు
శాసనాలకు ఒద్దికగా లొంగిపోని వాళ్ళు
‘వాళ్ళు తనని చంపేశారు, బిడ్డా
వాళ్ళు తనని చంపేశారు, ఆ గెరిల్లాలు’
ఆమె ఏడ్చింది, ఆమె గొంతులో
నల్లని బూడిదలాంటి దుఃఖం
నేను, జీవితాన్ని అమితంగా ప్రేమించి
అందరూ జీవితాన్ని ప్రేమించాలని పోరాడే మనిషిని
ఆ ప్రేమని ఏ ఒక్కరూ ప్రశ్నించే పరిస్థితి రాకూడదనుకునే మనిషిని
నాకే చంపాలన్న కోరిక
ప్రతీకారం కోసం చంపిన వాళ్ళని చంపాలనే
వెర్రి, మొరటు కోరిక
కానీ, నేనేమీ మాట్లాడకుండా అలాగే నిలబడ్డాను
నా గుండెలమీద రోదిస్తున్న
ఆ వృద్ధురాలి తల నిమురుతూ నిలబడ్డాను
జీవితం ఇంకా వేదనా భరితంగా మారింది
నాకు తెలుసు: ప్రాణానికి ప్రాణం
ఇవ్వాలంటే ఎన్నో మార్గాలున్నాయి
ప్రాణాన్ని ఇవ్వవలసిన పద్ధతిలో ఇవ్వడమే
ముఖ్యమైన విషయం!
(అనువాదం: సుధా కిరణ్)