దుఃఖ ధ్వని

తలలు పట్టుకున్న అడవి తల్లి
విల విల లాడే దుఃఖ ధ్వనిలో
గుక్క తిప్పుకోని ఆదిమ శోకం
అగ్గిని కాల్చే అడవి నినాదంలా
గోండు గూడెం రూన్ సౌన్ సైరన్ !

నువ్వు ఎప్పటికీ రావనుకున్నా బిడ్డా
ఈ రోజుకి ఇట్టా వచ్చావురా అయ్యా ?
బడి నుండి నువ్వు బయలెళ్లిన దారిలో
రాని నీ కోసం రోజూ చూస్తూనే ఉంటానయ్యా
నీ రాకని ఏ పిట్టలైనా మోసుకొస్తాయేమోనని!

నా గారాల బిడ్డా!
నీ కోసం ఎన్ని మాటలు దాచిపెట్టానోరయ్యా
సంత నుండి తెచ్చిన పంచె విప్పకుండానే
పీతల చారు తెరలకుండానే నువ్వు
అడవి సొరంగం లోకి పరిగెత్తేవు
నువ్వు అగపడతావని రోజూ
అడవంతా దేవులాడతానే ఉండా
నువ్వు కనిపిస్తలేదని ఎన్ని తిట్టుకున్నానో
ఈ పాపిస్టిదాన్ని ఏమనుకోకయ్యా
ఎట్టయితే నువ్వు వచ్చావు
నా కోసం అడవి పూల మంచమెక్కి!

మావోడు మా ఊరొచ్చాడురో
హో హో రె హా ఓ హో హా
ఓ హో హో హా జరగండ హే
ఈ అమ్మ ఆఖరి సూపు కోసం!
నువ్వు నిజంగానే
మన అడవి వెన్నెల వీరుడువురో
ఈ మట్టి గుట్టల్లోంచి రేగిన రక్త దుమ్మురో!

బిడ్డా! అడవుల్నే తినే పెద్ద పులులు
తిరుగుతున్నాయంటే అబద్ధం అనుకున్నాం
మన గూడేల్ని కుళ్ళగించే గనుల దొరలు
కాపలాగా ఈ తుపాకులు మోగిచ్చే
కంపెనీ కూలి రాజు కూలిపోను!

ఒరే చిన్నోడా! నువ్వు లెగవురా!
గోండు గోడ మీద గీసిన జింక పిల్లలు
నీ కోసం యెట్టా బెంగ పెట్టకున్నయోరా
చెరువు ఒడ్డున దేవతల చెట్టు మీద పిట్టలా
మమ్ముల్ని కనిపెట్టుకుంటూనే వుంటావురా ?

అయ్యా! నువ్వు చిన్నప్పుడు
ముసళ్ళని ఓడించిన కోతి కతల్ని విని
అదురులేక అడవంతా నాదిలా తిరిగిన
లేడిపిల్లల్ని చూసి ఎంత సంబర పడ్డావురా !
ఇప్పుడు మన అడవినంతా
దెయ్యాలు చుట్టుముట్టినాయిరా
ఈ అడివి కెవరో నిప్పెట్టారురా
అడవిని కాచే వెన్నెల దేవుడై రా రా!

ఓ నా దేవుడా!
మనోల్లందరూ మాటనుకున్నారు
నువ్వు సౌన్ లోక మెల్లొద్దని
పందిరి దేవుడు చూడకుండా
ఈ లోకానికి వచ్చేయ్యిరా
నీ కోసమని
మనోళ్ళు దీపాలు వెలిగించలా
అగ్గిపుల్లలు అంటించలా
బొగ్గులు రాజేయలా
పువ్వులు పరచలేదురా
మన మన్నుని ముద్దాడుతావని
నువ్వు మాతోనే వుంటావని!

ప్రత్యామ్నాయ సాహితీ, సాంస్కృతిక ఉద్యమాలపట్ల ఆసక్తి. తత్వశాస్త్ర అధ్యాపకుడు. "దళిత ఉద్యమం, వెలుగునీడలు" (వ్యాససంపుటి), "పొలిటికల్ ఫిలాసఫీ ఆఫ్ అంబేద్కర్," థీయరిటికల్ అండర్ స్టాండింగ్ ఆఫ్ దళిత్ మూవుమెంట్" రచయిత. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తుంటాడు.

2 thoughts on “దుఃఖ ధ్వని

Leave a Reply