ఇదేదో చావు ఋతువులా వుంది!
సామూహిక మరణ శాసనమేదో
అమలవుతున్నట్లే వున్నది
సముద్రాల మీద జలాల్ని
భూమ్మీద మట్టిని
కత్తులతోనో ఫిరంగులతోనో
చీలుస్తూ ఏర్పడ్డ దేశాలు –
వర్గంగానో వర్ణంగానో మతంగానో కులంగానో
మనుషుల్ని పవిత్ర గ్రంధాలతో విడదీస్తూ
ఏర్పడ్డ సమాజాలు
బహు సూక్ష్మంగా అల్లిన వలలో చిక్కుకొని
గిలగిల్లాడుతున్నట్లే వున్నది
ఏ దేశమైనా సమాజమైనా
హంతకులంటూ వున్నాక హతులూ వుంటారు
ఇప్పుడు మాత్రం
హంతకులు కూడా హతులవుతున్నట్లు
భయం, దుఃఖం నటిస్తున్న సందర్భం
గ్రీన్ రూంలో మేకప్ మెన్లు
విషపు కోరల్ని దాచిపెట్టిన పెట్టుడుగడ్డాలను
మృదువుగా దువ్వుతుండగా
ఓ విశ్వ నాటకానికి తెరలేచింది
రాజ్యమెప్పుడూ హంతకుల శిబిరమే
***
పుట్టుకలోనే చావు విత్తనం వుండటం
న్యాయం కావొచ్చు
దేహం ఎదుగుదలలోనే
నశించే గుణం ఇమిడి వుండొచ్చు
ఆరోగ్యానికి రోగం
సమాంతర లక్షణమే కావొచ్చు
జీవితానికి చావు
తర్కబద్ధమైన ముగింపే కావొచ్చు
ఒక జీవి మరణం కోసం
మరొక జీవి సృష్టించబడటం సహజమే కావొచ్చు
కానీ చావు నన్ను వెతుక్కుంటూ వచ్చే లోపు
ముందుగానే దాని కౌగిట్లోకి బలవంతంగా తోసేయటం
హత్య కాక మరేమిటి?
మన బతుకులకి విలువ ఇవ్వనివాళ్లు
మనల్ని చావు గుమ్మం ముందు
తాళ్లతో కట్టేసి పడేసే వాళ్లు-
చావుని తీసుకొచ్చి మన ఇంటి పైకప్పులకి
కత్తుల్లా వేలాడ తీసేవాళ్లు
ఖచ్చితంగా మన హంతకులే
***
నగరాలు నిర్మించిన వాళ్లు
నాగరికతలకు గోడలై నిలబడ్డవాళ్లు
తాము నిలబడ్డ నేల
గోరీలు తవ్వుతున్నదన్న భయంతో
గాభరాగా పరుగెడుతుంటే-
దారంతా ఏదో వాసనేస్తున్నది. ఏమిటది?
మనిషిప్పుడు నిరాశతో కాలిపోతున్నాడులే
ఏదో చప్పుడవుతున్నది. ఏమిటది?
మనిషి ఓ భయ కంకాళమై పేలిపోతున్నాడులే
ఎందుకీ దుఃఖం?
రోడ్లంతా గుండెలు కూలిపోతున్నాయిలే
ప్రాణం లేని కణం
ప్రాణ భయం నిరూపిస్తున్నది నిజమే కానీ
అసలు ఎందుకిలా జరుగుతున్నది?
ఎందుకంటే… చావు కన్నా బతుకే
ఎక్కువ చావు వాసన కొడుతున్నది
చావు కన్నా బతకటమే పెద్ద భయమైనప్పుడు
ఎవరి శవాల్ని వాళ్లే మోసుకుపోతున్నట్లు
దిగులు దిగులుగా అయినా
ఎటో అటు కదిలే కాలం కదా ఇది
చావు కన్నా బతుకే
ఎందుకు స్మశానాల వాసనలేస్తుంది సామీ?
రాజ్యం కాటి కాపరి పాత్ర పోషిస్తున్నప్పుడు
సమాజం మొత్తం స్మశానం వాసన వేస్తుంది
***
మాంసం బాబూ మాంసం
కోడి కన్నా మేక కన్నా సునాయాసంగా
దొరుకుతున్న మనిషి మాంసం బాబూ
ఏ కబేళాలలోనో నరకబడ్డ మాంసం కాదు బాబూ
ఏ కత్తి గాటు పడకుండానే
రహదార్ల మీద వడగళ్ల వానలా కురిసిన
మనిషి మాంసం ముక్కలు బాబూ
చావు భయంతో కాక బతుకు భయంతో
పరుగులెత్తుతున్న వెచ్చని నెత్తుటి మనుషుల
చల్లటి మాంసం బాబూ
మీరు నిర్బంధ విలాసాల్లో విసుగ్గా దొర్లుతున్నప్పుడు
రైలు పట్టాల మీద ఎగిసిపడ్డ మాంసం ముద్దలు బాబూ
చడీ చప్పుడు లేకుండా దూసుకొస్తున్న చావుతో
తరమబడ్డ మనుషుల పచ్చి మాంసం నాయనా!
తిరుగుబాటు చేయటం తెలియక తిరుగుబాట పట్టిన
మీ అంతటి మనుషుల మాంసం బాబూ
కనిపించని సూక్ష్మక్రిమిని హంతకుడిగా చూపించి
ముసుగేసుకున్న అసలైన వేటగాడెవడో
కనబడకుండానే విసిరిన బాణాలు చీల్చిన గుండెల్లోంచి
చివ్వుమని తన్నుకొచ్చిన రక్తంలో తడిసిన మాంసం బాబూ
అరి కాళ్లను మంటల్లోకి కట్టెల్లా నెట్టినట్లు
మండుతున్న రోడ్ల మీద అడుగడుగూ వేసుకుంటూ
వాళ్లు వెళుతున్నది చావు నుండి పారిపోటానికి కాదు బాబూ!
వాళ్ల నడకని ఓ ఎరుక నడిపిస్తున్నది
ఎగిరొచ్చిన వలస పక్షి
చస్తే తన చావు పడకని
పుట్టిన గూటిలోనే ఏర్పాటు చేసుకోవాలనుకొని
కార్చిచ్చుల పాలైన అడవుల నుండి
వెనక్కి తిరిగి ఎగురుతూ వెళ్లినట్లు
వాళ్లు ఇంటి బాట నడుస్తున్నారు
జాతి నిర్మాణానికి దేహాల్ని పనిముట్లుగా ఉపయోగించి
తమ కంకాళల్ని తీసి పునాదుల్లో భద్రపరిచిన
వాళ్ల చేతుల్లో పంటలా పెరిగిన దేశం
వాళ్ల కాలి పిక్కల గట్టిదనంతో బలపడ్డ దేశం
వాళ్ల భుజాల మీదగా ఎదిగిన దేశం
వాళ్ల కండల్ని కరగతీసి
పరిశ్రమలై భవంతులై విరగబడి నవ్విన దేశం
ముఖానికి ముసుగులు తొడుక్కొని
భయం భయంగా నిర్దాక్షిణ్యంగా
వాళ్ల వీపుల మీద కత్తులు దించింది
సంపదల్ని సృష్టించిన వాళ్లు కాందిశీకులై
తరమబడుతున్నారు బాబూ!
అంతేలే బాబూ అంతేలే
ఇది చేతులకి నెత్తురంటని
హంతకుల యొక్క హంతకుల కొరకు హంతకులచే తీర్చిదిద్దబడ్డ రాజ్యం కదా!
కన్నెర్ర చేయకు బాబూ
బాధ్యతల్లేని పాలక బాబులందరూ హంతకులే కదా!
***
చరవాణిలో సందేశ శబ్దం మోగగానే
తన మరణవార్తేనేమోనని
ఉలిక్కిపడుతున్న కాలంలో
రోజూ కనిపించే పెరట్లో తులసి కోట కూడా
సమాధిలానే భయపెడుతుంది
పెనవేసుకున్న సాహచర్యం గుడ్ల నీళ్లు కక్కుతుంటే
ఆస్పత్రిలో వెంటిలేటర్ల బీప్ చప్పుళ్లు నీరసించిపోతున్న గుండెకి
నిస్సహాయంగా ఊపిర్లూదుతూ సొమ్మసిల్లిపోతున్నాయి
మండుటెండ వేళ ఎండిన చెట్టు నుండి
హఠత్తుగా రాలిపడ్డ పక్షి కళేబరంలా
స్త్రెచర్ల మీద ప్రాణాలు రాలిపడుతున్నాయి
ఆసుపత్రి గేట్లకి సెలైన్ సీసాల్లా
వేలాడుతున్న అయినవాళ్ల ఏడుపుల్తో
వార్డులన్నీ మార్చురీలవుతున్నాయి
ఇళ్లకు ఇళ్లు మనుషుల్ని పోగొట్టుకొని
అనాధలవుతున్నాయి
అదేమిటి తండ్రీ!
అందంగా ఆరోగ్యంగా గొప్ప హుషారుగా పరిమళిస్తూ
అమ్మానాన్నల్ని భుజానికెత్తుకున్న బలమైన చేతులు
హఠత్తుగా నిర్జీవంగా వాలిపోతున్నాయి?
మొన్ననే నవ్వుతూ నాలుగు కబుర్లు చెప్పిన మిత్రుడు
హఠాత్తుగా చావు వార్తై నిద్ర లేపుతున్నాడు?
తొలిపొద్దు కిరణాల్లా చురుకైన
ఆ చిర్నవ్వులెలా నల్లబడి మరణిస్తున్నాయసలు?
తళుక్కున మెరిస్తూ పలకరించే
ఆ కళ్లు సగం తెరుచుకొని
అలా నిశ్చలంగా గుండె మీద రంపపు గాటు పెడుతూ
అలా ఎలా చూస్తాయి?
అలాయి బలాయి ఇచ్చిన ఆ బలమైన భుజాలు
తెల్లని గాజుగుడ్డ కింద అలా నిర్జీవంగా ఎలా పడి వుంటాయి?
రోజూ కనబడుతూ పెనవేసుకునే వాళ్లు
ఉన్నట్లుండి జ్ఞాపకాల జాబితాలోకి మారటం
ఎంత కర్కశం!
బకాసురుడికి రోజుకో
నాలుగు వేల పీనుగలు కావాలి
బావుల్లో చెరువుల్లో విషం కలిపిన నీళ్లు తాగినట్లు
ఆకాశం నుండి గుండిగలతో
మనుషుల గుండెకాయలు మాంసఖండాలు గుమ్మరిస్తున్నట్లు
ఎంత భయానకం ఈ వాస్తవం?
అంబులెన్సుల ఆక్రందనలతో రోడ్లు హడలెత్తుతున్నాయి
పౌరులు ఊపిర్లు ఖాళీ అవుతున్న ఆక్సిజన్ సిలండర్లై
ఆస్పత్రుల ముందు దొర్లుతూ బిగ్గరగా రోదిస్తున్న దేశం నాది
మనిషి హఠాత్తుగా స్మశానానికి చేరువవుతున్నందుకు
సమాజమే స్మశానమయ్యాక
మనుషులు శవాలవటానికి
శవాలు తగలబడ్డానికీ క్యూ ఏర్పడుతుంది!
చెత్త బుట్టలో చిత్తు కాగితాలు విసిరినంత తేలిగ్గా
సమాధి గోతుల్లోకి విసిరేయబడుతున్న వాళ్ల దేహాలకేం తెలుసు
తమని నిర్లక్ష్యమనే కత్తులతో
కుర్చీల మీద కూలబడ్డ హంతకులు హత్య చేసారని!
వాళ్ల గుండె కొట్టుకోకపోతేనేం?
శరీరంలో నరాలు నిస్తేజమై పోయి
రక్తనాళాలు చచ్చుబడి నెత్తురు ప్రవహించక పోతేనేం?
ఇప్పుడు శవాలయితేనేం?
వాళ్లూ మాజీ మనుషులేగా!
నిన్నటి వరకు భర్తలో భార్యలో నాన్నలో అమ్మలో
ప్రియుళ్లో ప్రియురాళ్లో కొడుకులో కూతుళ్లో!
బాధ్యతగా సాటి మనిషిని దగ్గరకు తీసుకొనుండొచ్చు
మనిషి జాతి నీడ భూమ్మీద కొనసాగటానికి
వాళ్లూ కారణమే కదా
నిర్జీవులైతేనేం
వాళ్లకీ ప్రేమపూర్వక గౌరవనీయ స్పర్శలవసరం
తెల్లటి మూటలుగా చితి మీద విసిరేయటం ఏమిటి?
అనాచ్ఛాదితంగా గంగలో పారేయటమేమిటి?
***
ఆకాశం నిండా కమ్ముకుంటున్న కన్నీరు
భూమి పగుళ్ల నుండి పొర్లుకొస్తున్న కన్నీరు
మహా పర్వతాల్ని ముంచేస్తూ కరిగించేస్తున్న వెచ్చని కన్నీరు
ఇది వర్గాంతరాల ఆదిమ దుఃఖం
నన్నిప్పుడు వేరెవరూ ఓదార్చలేరు
సర్వ మానవ సంబంధాల విషాదాన్ని
ఇప్పుడు నా గుండె మోస్తున్నది
కింద ఫ్లాట్ ఆనందకుమార్
పక్క సీటు సుధా మేడం
యూనియన్ కామ్రేడ్ నాగభూషణం
పాన్ డబ్బా సుబ్బారావు
ఆటో డ్రైవర్ డేవిడ్
నన్ను ఎన్నోసార్లు కదిలించి కుదిపేసి
నా గుండెని ఆక్రమించిన
కళాకారులు చిత్రకారులు గాయకులు….
ఈ భూమ్మీద నుండి ఇంతమంది అనూహ్య ఆకస్మిక మాయానికి
ఒక్క సూక్ష్మక్రిమే కారణమా?
***
న్యాయం నక్షత్రాల్లా మెరిసే ఆసుపత్రి భవంతుల
నేల మీద చలువరాళ్ల కింద సమాధి చేయబడ్డ ఈ సందర్భంలో
మనం భగవంతుడు గురించి శోధించాలి
అతగాడెక్కడున్నా పట్టుకు తీసుకురావాలి
బోనులో నుంచోబెట్టాలి
“ఇందుగలడందులేడని సందేహంబు వలదం”టూ
గార్దభాండ పురాణాలు వల్లించొద్దు
మనల్ని పుట్టించాడని
ఏ రేనాల్డ్ పెన్నుతోనో మన నుదుటి రాత రాశాడని
చెప్పబడుతున్న ఆ దేవుడిని ఎక్కడున్నా ఈడ్చుకురావాలి
నన్ను చంపేస్తే అతగాడి లీల అని
నేను చచ్చి బతికితే అతగాడి కరుణ అని
దగుల్బాజీ మాటలు మాట్లాడే
ఆ శాలువాగాడి నోటిలో మైలతుత్తం కూరాలి
ఆకలిలా మండుతున్న ఎర్రటి ఎండల వేళ
పరివారాల్ని భుజాల మీదేసుకొని
రహదార్ల మీద మైళ్లకు మైళ్లు నడిచొచ్చిన దారుల గుండా
వెనక్కెనక్కి రక్తాలోడుస్తూ వెళ్లిపోతున్నవాళ్ల ముందు
సంకెళ్లు వేసి నించోబెట్టాలి
***
ఈ రెండవ రాకడ ఏ దేవుడిదీ కాదు తండ్రీ
ఈ రెండవ రాకడ
నడిచొచ్చిన దారంతా కపాలాలు పెళపెళలాడించుకుంటూ
జానపద మాంత్రికుడి విషపు నవ్వుల కర్కశత్వంతో
ఎకాఎకీ సింహాసనం మీదకి ఎగబాకిన పాపిష్టివాడిది
ప్రజల నెత్తురుతో వీధుల్లో ఇళ్ల ముందు
దేవుళ్ల ముగ్గులు వేసిన వాడి
రెండవ రాకడ ఫలితం ఇది బాబూ
ఇటుక రాళ్ల కోసం
నీ జేబులు వలిచి నువ్వో దేశభక్తుడివని
విషమద్దిన ధృవపత్రాన్ని నీ ఇంటి గుమ్మానికి
అతికించిన వేటగాడిదే బాబూ ఈ రెండవ రాకడ
వాడిని ఇప్పటివరకు ఎంతగానో మోహించాం
నాలికలు చాస్తున్న వాడి నెత్తుటి కాంక్ష
మన కడుపు నింపటానికేనని
మీసాలు మెలేసీ చీర కొంగులు బిగించీ ఉద్రేకపడ్డాం
భుజాల మీద ప్రేమగా వేసుకోవాల్సిన దోస్తుల చేతుల్ని
కటువుగా నరికేస్తుంటే అదంతా మన పట్ల బాధ్యతేనని
స్వార్ధంగా చిర్నవ్వులు నవ్వుకున్నాం
పురాతన రావిచెట్టు మీద
అనాదిగా నివాసముండే రకరకాల పక్షుల్లో
చిన్నచిన్న పిట్టల్ని వాడు వేరు చేసి దూరంగా తరిమేస్తుంటే
మనకేదో గండభేరుండ రెక్కల శక్తేదో వచ్చినట్లు విర్రవీగాం
చావు సూక్ష్మ రూపంతో కణం కణం మీద దాడి చేస్తున్నప్పుడు
పంటచేల మీద యాసిడ్ వర్షాల్లాంటి ఎన్నికల్ని
బరబరా ఈడ్చుకొచ్చి మన బతుకుల మీద కప్పితే
కనీసం కన్నెర్ర చేయలేని దైన్యం మనది
హఠాత్తుగా ఏదో సామూహిక హత్యలకు గురైనట్లు
మనుషులిలా చచ్చిపోతున్నారేమిటి?
అవును! ఒక దేశం మొత్తం మెల్లమెల్లగా
హత్యకు గురవుతున్నది
ఆసుపత్రుల్లోనే కాదు రోడ్ల మీద కూడా చావు భయమే
స్మశానాల్లోనే కాదు ఇంట్లో కూడా చావు వాసనలే
పంచదార కబుర్లు పోసి
మనల్ని చీమల్లా ర్యాలీల్లో దగ్గరకు లాక్కున్నవాడు
మన బతుకుల్ని నదుల మేళాల్లో ముంచినవాడు
మన చావు బతుకులు పట్టనివాడు
వాడికి మనం బతికుంటే ఓటర్లం
చస్తే ఓ గణాంకం!
చితిమంటల్లో సగం కాలిన కట్టెల్లా పార్ధివ దేహాలు
జీవనదుల్లో ప్రవహిస్తున్నాయి
నోరు మూసుకొని ఏ గంగలో దూకమంటే
ఆ గంగలో మనుషుల్లా దూకి
ఒడ్డుకి కొట్టుకొచ్చిన శవాల నుదుట మీద బైట పడుతున్న
నరహంతకుల తలరాత చదవాలిప్పుడు మనం!
***
ఇదిదో ఇది నా ఇల్లైతనేం!
యుద్ధ భూమిలో నిలబడి వున్నాను
చావు బతుకుల యుద్ధంలో నేనూ క్షతగాత్రుడినే
తెరచాటున వున్న చావుదేవుడెవరో
హఠాత్తుగా గుండెల మీద మోకాలితో నొక్కిపెట్టి
నిర్వికారంగా చూస్తున్నట్లు పీడకలలు
ఉలిక్కిపడి లేచినప్పుడు
ఏ సంక్షోభ జ్ఞానమూ లేని నాలుగు పావురాళ్లు
రోజూ వేసే జొన్న గింజల కోసం
పొద్దున్నే నా గది కిటికీ అద్దాల్ని పొడుస్తున్న చప్పుడుకి
నేనెంతో ప్రాణభయంతో నీరసంగా మూలుగుతూనే లేచి
కిటికీ తలుపులు తెరిచినప్పుడు ప్రతిసారీ పలకరించే
సూర్యరశ్మి తాజాతాజాగానే వున్నది
బహుశా నాకోసమేనేమో!
దూరంగా కనబడే గుట్టల వరకూ
విరగబడి హుందాగా గాలికి ఊగే చెట్ల మధ్య
మెల్లగా నవ్వుకునే పిచ్చిమొక్కలూ
నాకు భరోసా ఇస్తున్నట్లే వున్నది
ఇప్పుడు స్థిరంగా నిలబడి
నాకు నేనే నాలుగు మంచి మాటలు చెప్పుకోగలను
ఈ దుఃఖం ఎడతెగనిది కాదు
నిత్య జీవితంలో స్మశాన కల్లోలం అనంతం కాదు
ఈ ప్రాణాంతక క్రిమి చిరాయువు కాదు
సముద్రాల మీద చీకట్లు శాశ్వతం కాదు
ఈ చీకట్లు కరుగుతాయి
క్రిములు నశిస్తాయి
తన గర్భం నుండి తన్నుకొచ్చిన విషాల్ని ప్రకృతే నిర్మూలించి
మనకో శుభ్రభూమిని తాజా వాయువుల్ని అందిస్తుంది
జ్ఞానాన్ని చైతన్యాన్ని
దేశం మూలమూలలా పిచికారీ చేస్తూ
మనం తుడిచిపెట్టాల్సింది
క్రిముల్ని దేశమంతా వెదజల్లి పెంచి పోషించిన నరహంతకుల్ని కూడా!