అంధకారంలో చూపునిచ్చిన అధ్యాపకురాలు – ది మిరాకిల్ వర్కర్

ది మిరాకిల్ వర్కర్ 1962 లో వచ్చిన సినిమా. ఇన్ని సంవత్సరాల తరువాత కూడా ఆ సినిమాని ఇలా గుర్తు చేసుకోవడానికి కారణం, కొన్ని కళా రూపాలకు కాలంతో పాటు విలువ పెరుగుతుంది. హెలెన్ కెల్లర్ జీవిత పోరాటాన్ని అభిమానించే మనందరికీ ఆమె విజయాల వెనుక, ధైర్యం వెనుక ఒక అధ్యాపకురాలు ఉందని తెలుసు. కాని ఎటువంటి ప్రతికూల పరిస్థితులలో ఆమె హెలెన్ కు చేరువై ఆమె జీవితాన్ని నిర్మించిందో చాలా తక్కువ మందికి తెలుసు. విద్యను నేర్పించడం అంటే ఒక జీవితాన్ని చక్కదిద్దడం అని ఎక్కడా ఎవరి ప్రలోభాలకు లొంగకుండా స్వలాభాపేక్ష గురించి ఆశించకుండా తన జీవితాన్ని ఒక శిష్యురాలి బాగు కోసం సమర్పించిన ఆనీ సల్లివన్ జీవితం గురించి తెలుకుకోకపోతే హెలెన్ కెలర్ అర్ధం కారు. ఆమె జీవితాన్నీ అంతే గొప్పగా తెరకెక్కించిన సినిమా ఇది. ప్రపంచ సినిమాలో ఒక గొప్ప సినిమాగా దీన్ని పరిగణించవచ్చు. ఆర్ధర్ పెన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అద్భుతమైన స్క్రీన్ ప్లే తో ఎందరో ప్రశంసలు పొందింది. ఐదు అకాడమీ అవార్డులకు నామినేట్ అయిన ఈ చిత్రం రెండు అవార్డులు సంపాదించుకుంది. ఇందులో ప్రధాన పాత్రలలో నటించిన ఆనీ బాంక్రాప్ట్ ఉత్తమ నటి అవార్డు పొందితే సహాయక నటి కాటగిరిలో పాటి డ్యూక్ అవార్డు సొంతం చేసుకుంది. దీనికి స్క్రీన్ ప్లే కోసం విల్యం గిబ్సన్ అప్పట్లో ప్రాచుర్యం పొందిన ‘ది మిరాకిల్ వర్కర్” నాటకాన్ని, హెలెన్ కెలర్ ఆత్మ కథ “ది స్టోరీ ఆఫ్ మై లైఫ్” ని అధారం చేసుకున్నారు.

ఉన్నత కుటుంబంలో పుట్టిన హెలెన్ చిన్నప్పుడు వచ్చిన జ్వరంతో చూపును వినికిడిని పోగొట్టుకుంటుంది. పెరిగే కొద్దీ తోటి వారితో సంభాషణ జరపలేక ఎవరికీ అర్ధం కాని మానసిక సమస్యలతో బాధపడుతుంటుంది. ఆ చిన్న బిడ్డ అవసరాలు తీర్చలేక తల్లి తండ్రులు బాధపడుతూ ఉంటారు. ఆమెతో ఎలా మాట్లాడాలో ఎలా విషయాలు నేర్పించాలో, ఎలా జీవించడానికి ధైర్యం అందజేయాలో తెలియక తల్లి చాలా యాతన పడుతుంది. అప్పటికే హెలెన్ పిచ్చి వాళ్ళలా ప్రవర్తిస్తూ ఉంటుంది. విపరీతమైన కోపంతో రగిలిపోతూ తన దగ్గరకు వచ్చిన వారిని గాయపరుస్తూ ఉంటుంది. ఆమెను మానసిక చికిత్సాలయంలో చేర్చాలని కుటుంబం నిర్ణయించుకోవలసిన పరిస్థితి. కాని ఆశ చావని తల్లి మరొక్క ప్రయత్నం చేయాలని అనుకుని పర్కిన్స్ అంధ పాఠశాలకు హోమ్ ట్యూటర్ కావాలని రాస్తుంది. అక్కడ నుండి ఆనీ టిచర్ గా హెలెన్ కోసం ఆ ఇంటికి వస్తుంది. సినిమా లో కథ చాలా మందికి తెలిసినా ప్రమాద స్థితిలో ఉన్న ఒక విద్యార్ధి పరిస్థితి తెలుసుకుని ఆమెతో కనెక్ట్ కావడాని ఆనీ చూపించే మొండితనం, అందరినీ ఎదిరించిన విధానాన్ని చిత్రించిన తీరు అద్భుతం. ఆమె పద్ధతులు ఆ ఇంటి వారికి అర్ధం కావు. చాలా కఠినంగా హెలెన్ తో ప్రవర్తించే ఆమె అంటే ఇంట్లో అందరికీ విముఖత ఏర్పడుతుంది. తల్లి తండ్రుల ప్రేమ, హెలెన్ పట్ల జాలి ఆమెకు మేలు చేయవని తెలుసుకుని ఆనీ పూర్తిగా హెలెన్ ను తన ఆధీనంలో ఉంచుకుంటుంది. తాను ఏం చేసినా తల్లి తండ్రులు జోక్యం చేసుకోరాదని కోరుతుంది. బిడ్డ పరిస్థితి అర్ధం చేసుకున్న హెలెన్ తల్లికి ఆనీ ఒక్కతే ఆమె బిడ్డ జీవితంలోని చివరి ఆశగా తోస్తుంది. అందుకనే గుండె రాయి చేసుకుని తమ ఇంటి తోటలో ఒక చిన్న ఇంట్లో ఆనీ, హెలెన్ ఉండడానికి ఏర్పాట్లు చేస్తుంది. హెలెన్ ఆనీ చేతిలో మారకపోతే ఆమెను మానసిక రోగిగా చూడాల్సి వస్తుందన్న భయం ఆ తల్లిని వెంటాడుతూ ఉంటుంది. అందుకే ఆమె ఆనీ చెప్పినట్లు వినాలని నిశ్చయించుకుంటుంది. కొన్ని సందర్భాలలో తన భర్తను కూడా ఎదిరించి ఆనీకి హెలెన్ తో కావల్సిన ప్రైవసీ ని సమకూరుస్తుంది.

తన శారీరిక లోపాలను అర్ధం చేసుకునే వయసు లేని హెలెన్ చాలా మొండిగా ప్రవర్తిస్తుంటుంది. తనకు కావాలసినవి తన దగ్గరకు రాకపోతే విపరీతంగా ప్రవర్తించడం ఆమెకు అలవాటు. ఆమెతో ఆనీ అంతే మొండిగా ప్రవర్తిస్తుంటుంది. తాను అనుకున్నట్లు హెలెన్ ప్రవర్తించకపోతే ఆమెను ఆనీ శిక్షించే విధానం ప్రస్తుత ఆధునిక ఉపాధ్యాయులు, విద్యను మానసిక శాస్త్రంతో జోడించే పండితులెవ్వరూ మెచ్చరు. ఆనీ ఎంతో కర్కశంగా హెలెన్ తో ప్రవర్తిస్తుంటుంది. జంతువులా తిండి తినే హెలెన్ అందరి అవహేళనకు గురి అవుతున్నప్పుడు, ఆమెకు భోజనం చేసే విధానాన్ని నేర్పించడానికి డైనింగ్ హాల్ లో ఒక సీన్ లో ఆ ఇద్దరు నటులు పోటీపడి నటించారు. ఒక తొమ్మిది నిముషాల పాటు హెలెన్, ఆనీల మధ్య నడిచే యుద్ధం ఆ సందర్భంలో పగిలిన వస్తువులు, ఇద్దరు ఒకరిని ఒకరు గాయపరుచుకోవడం, ఈ సీన్ ఐదు రోజులు పట్టిందట తీయడానికి. అంటే ఆ ఇద్దరు నటులు ఎంత కష్టపడి ఉంటారో అర్ధం చేసుకోవచ్చు. దాని వెనుక ఎన్ని రిహార్సల్లు జరిగాయో తెలుస్తుంది స్క్రీన్ పై ఆ సీన్ పండిన విధానం చూస్తే. భీభత్సంగా ఇద్దరి మధ్య పోరులో ఆనీ ఎక్కడా హెలెన్ కు లొంగకుండా ఆమె చిన్న పిల్ల అనో లేదా అంధురాలనో జాలి తలచకుండా తనకు కావల్సిన విధంగా ఆమెలో మార్పు రావడానికి చూపే మొండితనం లో హెలెన్ భవిష్యత్తు పట్ల ఆమె పడే తపన కనిపిస్తుంది. కాని అది అర్ధం కావడానికి ముందుగా ఆనీ లోని ఒక మొండి క్రూర స్వభావం గల స్త్రీ ప్రేక్షకులకు కనిపించి తీరుతుంది. ఇతరుల సానుభూతి ఆ చిన్న ప్రాణాన్ని ఇంకా కష్టాలలోకి నెడుతుందని ఆమె జీవితాన్ని పూర్తిగా పరుల ఆధీనం చేస్తుందని, అది జరగకుండా ఉండడానికి కర్కశంగా ఆమెలో మార్పు కోసం ప్రయత్నించే ఆనీ లోని పట్టుదల, దీక్ష తరువాత మనలను ఆశ్చర్యపరుస్తాయి.

చివరికి మరో దారిలేక ఆనీ చెప్పినట్లు నడుచుకోవలసిన పరిస్థితిలో మొట్టమొదటి సారి హెలెన్ భాషను నేర్చుకునే ప్రయత్నం చేస్తుంది. తాను నేర్చుకుని అర్ధం చేసుకున్న ఆ మొదటి పదాలు హెలెన్ లో ఆలోచన కలగజేస్తాయి. ఇన్ని రోజులుగా రాక్షసంగా ప్రవర్తించే తన టీచర్ తనతో ఏం చెప్పాలనుకుంటుందో అప్పుడు అర్ధం అయి, తనలోని ఆలోచనలను, భావాలను ఇతరులతో పంచుకునే మార్గం ఒకటి ఉందని హెలెన్ కు అర్ధం అవుతుంది. ఆ విషయం ఆమెకు అర్ధం అయిన మరు క్షణం తన టీచర్ తప్ప తనను ప్రపంచానికి పరిచయం చేయగలిగిన వ్యక్తి మరొకరి లేరని అర్ధం అవుతుంది. అప్పుడు ఆ శిష్యురాలు టీచర్ ను చేరి స్పర్శతో తన ఆనందాన్ని వ్యక్తీకరించే సీన్ చాలా అద్భుతంగా పండించారు ఇద్దరు కూడా. ఈ ఇద్దరు నటులు కాకుండా తల్లి పాత్రలో అసహాయతతో నలిగిపోతున్నట్లు అద్భుతంగా నటించిన ఇన్గా స్వెన్ సన్ నటన కూడా ఆకట్టుకుంటుంది.

ఆనీ కూడా క్రమంగా చూపు కోల్పోతూ ఉంటుంది. చూపు లేని కారణంగా బాధపడే పిల్లలను, ఆ స్థితికి చేరువవుతున్న తన జీవితాన్ని అర్ధం చేసుకుంటూ ఈ స్థితిలో ఉన్న వ్యక్తులకు కావల్సింది సానుభూతి సహకారాలు కాదని, తమ కాళ్ళ మీద తాము బ్రతకడానికి శక్తిని సమకూర్చగల పరిస్థితులని, ఆ పరిస్థితులని ఎవరికి వారే నిర్మించుకోవాలని నమ్మి ఆ నమ్మకాన్ని తన శిష్యురాలిలో కలగ జేసే ప్రయత్నం చేస్తుంది. కొన్ని సార్లు ఆత్మీయుల ప్రేమ, జాలి మనిషిని బలహీనం చేస్తాయని, పరిస్థితులతో పోరాడే శక్తి ప్రతికూల వాతావరణంలోనే వస్తుందని ఆ దిశగా పని చేస్తూ హెలెన్ తో ఒక నియంతలా ప్రవర్తిస్తూ చివరకు హెలెన్ ను ఒక సంపూర్ణ వ్యక్తిగా మార్చడానికి ఆమె వేసే పునాది ని అర్ధం చేసుకుంటే ఆమె దీక్షకు అబ్బుర పడతాం. హెలెన్ మొదట ఆనీని అసహ్యించుకుంటుంది. ఆమెను విపరీతంగా ద్వేషిస్తుంది. కాని ఆ ద్వేషమే ఆమెలో జ్ఞానాన్ని రగిలిస్తుంది. తాత్కాలిక ప్రయోజనాలకన్నా దీర్ఘకాలిక ప్రయోజనాలపై దృష్టి పెట్టగలిగినప్పుడే వ్యక్తి కి నిజమైన మేలు జరుగుతుందని, ఆ దిశగా విద్యను అందజేసే వారు ప్రయత్నించాలని చెప్పే గొప్ప చిత్రం ఇది. బ్లాక అండ్ వైట్ లో తీసిన ఈ సినిమా లో ప్రతి ఒక్కరూ అసామాన్యంగా నటించారు. అందుకే విదేశీ సినిమాలలో ఇది ఒక అద్భుత చిత్రం అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందరో పేరున్న నటీమణులను ఆనీ పాత్రకు ప్రతిపాదించినా దర్శకులు పట్టుబట్టి ఈ పాత్రకు ఆనీ బాంక్రాఫ్ట్ ను తీసుకోవడం వెనుక ఆ నటి పట్ల వారికున్న నమ్మకం కనిపిస్తుంది. ఆమె తప్ప మరొకరు ఈ పాత్రకు అంత న్యాయం చేయలేరు అన్న విధంగా నటించింది ఆ నటి. అమెరికా దేశం నిర్మించిన చిత్రాలలో ఒక గొప్ప చిత్రంగా నేటికీ పరిగణించబడుతున్న ఈ సినిమాను సినీ ప్రేమికులందరూ చూడవలసిందే…

పుట్టిన ఊరు సికింద్రాబాద్. రచయిత్రి, అధ్యాపకురాలు. హిందీ సాహిత్యంలో పీహెచ్డీ చేశారు. ఆసక్తి: పుస్తకాలు, సినిమాలు. తార్నాకలోని Spreading light అనే బుక్ క్లబ్ లో ఎనిమిదేళ్లుగా  ప్రతి శనివారం పుస్తక పరిచయాలు నిర్వహిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో 'నచ్చిన పుస్తకం', 'నచ్చిన సినిమా' గ్రూపుల్లో 1000 పుస్తకాలు, 1500 పైగా సినిమాలను పరిచయం చేశారు. రైల్వే జూనియర్ కాలేజీ(తార్నాక)లో హిందీ లెక్చరర్ గా పనిచేస్తున్నారు.

 

 

 

Leave a Reply