దింపుడుగల్లం అమృత ఘడియల్లో…

ఎన్నెన్నేళ్లుగా
ఎంతెంతెత్తున
జాతి విముక్తి
వర్ణ పతాకాలు
ఎగిరెగిరి రెపరెపలాడినా..

మానవత్వపు అంశగా
సగటు మనిషిగా
కల్లా కపటం
ఎరుగని జీవిగా
మనిషికి బతికే
చోటే దిక్కడ..

ఎదనిండా నవ్వులతో
అలుపెరుగని ఆటలతో
చెదరని ఆశ్వాసాలు
అలలు అలలుగా
పురివిప్పుకు వికసించే
పురుటి కలల
మనో సాగర వనాలు
చిగురులు తొడిగే
జానెడంటే జానెడు
నేలెక్కడుందిక్కడ..

లే రెక్కల రెప రెపల
కిలకిలా రావాలు
కళ్ళల్లో దాచుకుని
అమ్మ రెక్కలకింది
వెచ్చదనాన్ని
వాగ్దానం చేసే
చెట్టొకటైనా
కొమ్మొకటైనా
మిగిలుందా ఇక్కడ..

ఆ హృదయాలకు
అండగ ఉండే జాగ
వొక ఆకంతైనా
అడుగంతైనా
ఏడుందిక్కడ..

భద్రతకూ..
భయరాహిత్యానికీ
నెలువైన రెక్కలకింద
గాఢంగా ఎద హత్తుకుని
విహరించే చోటేది
బిడ్డలూ మీకిక్కడ లేదని

ఎదురొచ్చే రైలుకు
ఎదపరిచితివి తల్లీ
మము క్షమించు..!

ఇన్నాళ్ల భ్రమలో
మగ్గి మురిగిన
మము దహించు..!!

నేరం
నాదెంత మాత్రం కాదని
వాదించగలదు రాజ్యం..

అదే నిజమని
కితాబివ్వగలదు న్యాయం..

పురాణ గాధల
పుణ్య సీతమ్మ తల్లులో..
లెక్కకందని
నవీన ఘోషల
శ్వాస లొదిలిన
నిన్న మొన్నటి
విజయమ్మలో..

కనుమరుగైపోతున్న
కన్న తల్లులకైనా..

కన్నీటి వెతల
వాళ్ళ కలలు
సాకారం చేసే
ఆ మురిపాల
ముద్దు బిడ్డలకైనా..

కగారులై
కాంతులీనబోతున్న
గణతంత్రపు
దింపుడు గల్లం
అమృత ఘడియల్లో..

ఇంతకన్నా
ఏమివ్వగలం..??!!

పుట్టిన ఊరు కొల్లాపూర్ - వరిదేలవీధి(1960లో), ఇప్పటి నాగర్ కర్నూల్ జిల్లా. నేపథ్యం: దోయబడ్డ బాల్యం, కష్టాలు కన్నీళ్లు, ఆకలి అవమానాలే తోబుట్టువులు. చెమట సౌరభాల మడి అమ్మవడే బడిగా... తలాపున నల్లమల అడవే ఆట మైదానంగా... ఎలుగెత్తి పారే కృష్ణా నది చేతికందే దూరంలో ఉండీ గొంతు తడవని దాహంతో ఏళ్లకేళ్లు కురవని మేఘాలతో పరుగు తీసే మేకలతో, చెట్టు పుట్టలతోచెట్టా పట్టాలేసుకు సాగిన సాహచర్యం. వృత్తి: న్యాయవాదం. ప్రవృత్తి : సాహిత్య అధ్యయనం. 1978 నుండి కవిత్వం, పాట, వ్యాసం, కథా, చిత్ర, నాటిక రచన, నటన. రచనలు : 1. 'స్పందన'( కవితా సంకలనం) 1985 గద్వాల్ విరసం రాష్ట్ర సభల్లో ఆవిష్కరణ. 2. 'సేద్యం' (కవితా సంకలనం), 3. 'కఫన్' (కథా సంకలనం), 4. సాంగ్ ఆఫ్ ఫర్రోస్ (కవిత్వం) ( ఆంగ్లానువాదం: అర్విణి రాజేంద్రబాబు గారిచే), 5. 'రాహేc', 6. 'జాబిలి ఖైదు', 7. 'దగ్ధ స్వప్నం' (కవితా సంకలనాలు ప్రచురించారు.)

Leave a Reply