అన్నా!
దేవున్ని చూడటానికి
ఇప్పుడు మనం తిరుపతి కాశీలకే కాదు
ఏ ఊరికీ పోవలసిన అవసరం లేదు
దేవుళ్ళే మన వాడలకొస్తున్నరు
ఐదువేల గుళ్ళట మన వాడల్లో
మనకు బడి లేకుంటేనేం
దవాఖాన లేకపోతేనేం
మనకు ఉద్యోగాల్లేకపొతేనేం
మన కోసం మన గౌర్నమెంటోల్లు
వేలకువేల గుళ్ళు కడుతుండ్రు
ఒంటికి బట్ట లేకపోయినా
కడుపుకు తిండి లేకపోయినా
మనసుల దేవుని మీద భక్తుండాలన్నా
భగవంతుడే అన్ని కష్టాలు తీరుస్తడు
అదేదో పథకం కింద మనకు
ఊరి మధ్యల కాకుండా
ఊరవతల ఇండ్లు కట్టిచ్చినట్లు
మిగులు భూముల పేర
తొండలు గుడ్లుపెట్టని భూములు మనకిచ్చి
మంచి మాగాణి భూములన్ని
దొరలకు వదిలేసినట్లు!
ఊరవతల ఇండ్లు కడితేనేం
ఆ ఇండ్ల మధ్యన గుళ్ళు కడితేనేం
దళితులందరు ఒక్క దగ్గర
ఒక్కతీరుగ ఒక్క జాగల ఉండాలె
పెద్ద కులపోల్లందరు ఒక్క జాగలుండాలె
లేకపోతే చూసేటోల్లకు
దళితులెవరో పెద్దకులపోల్లెవ్వరో
ఎట్లా తెలుస్తది
బవుశా,మన వాడల్లోని గుళ్ళల్లో
మనల్నే పూజారులుగ పెడుతరనుకుంట
లేకపోతే దళితవాడల్లోని గుళ్ళల్లో
బాపనోల్లు పూజారితనం ఎట్ల జేత్తరు
తిరుపతి కాశీల ఉన్న గుళ్ళల్లో
దళితులు పూజారులుగ ఉన్నరా ఏంది
పాపం!
మన గౌర్నమెంటోల్లకు ఎంత భయమంటే
మనమెక్కడ హిందూమతమొదిలేసి
ఏ కిరస్తానీ మతంలోకి మారిపోతామేమోనని
వాళ్ళకు భయం మరి
అందుకే
దళితుల ఇండ్లు వేరుగున్నా
దళితుల గుళ్ళు వేరుగున్నా
మనం దళితులుగానే ఉండాలి
కానీ
హిందూ మతంలో మాత్రమే ఉండాలి
పెద్ద కులపోల్ల గుళ్ళల్లకు పోకుండ
మన గుళ్ళల్లకు మనం మాత్రమే పోవాలి
అదన్నా! అసలు కిటుకూ!