అనువాదం: మమత కొడిదెల
దల్లీ రాఝరాకు వెళ్లేదారేది అని
ఒక చాయ్ వాలాను అడుగు
ఉచితంగా ఓ కప్పు ఎర్రని చాయ్ నీకు అందించి చెప్తాడు:
నేరుగా వెళ్లి ఎడమవైపుకి తిరుగు
దల్లీ రాఝరాకు వెళ్లేదారేది అని
ఒక కార్మికుడిని అడుగు
మరోప్రపంచాన్ని నీకు గుర్తుచేసే
పాట ఒకటి పాడతాడు నీకోసం
దల్లీ రాఝరాకు వెళ్లేదారేది అని
ఒక రైతును అడుగు
ఆ రోజు నువ్వు ఆకలితో అలమటించకుండా
నీకు కొంచం ధాన్యం ఇస్తాడు
దల్లీ రాఝరాకు వెళ్లేదారేది అని
ఒక ఆదివాసిని అడుగు
అతను నిన్ను తన ఇంటికి అహ్వానించి
మహువా మత్తులో నిద్రపుచ్చుతాడు
దల్లీ రాఝరాకు వెళ్లేదారేది అని
ఒక సంచారిని అడుగు
అతను నీకు ఒక టికెట్ అందిస్తాడు
ఎంత పురాతనమైనదంటే, దాని ట్రైన్ వెళ్లిపోయి చాలా కాలమైంది
దల్లీ రాఝరాకు వెళ్లేదారేది అని
ఒక ఫాసిస్టును అడుగు
అలాంటిదేదీ లేదు పొమ్మని
నిన్ను తుపాకీతో అదిలిస్తాడు
దల్లీ రాఝరాకు వెళ్లేదారేది అని
ఒక యూనియన్ వ్యక్తిని అడుగు
పోరాడేందుకు పనిముట్లు అందిస్తాడు
నీకు నువ్వే వెళ్లి, కనుక్కో అని చెబుతాడు
దల్లీ రాఝరాకు వెళ్లేదారేది అని
ఒక కవిని అడుగు
అరుదైన పసుపుపచ్చ పువ్వులను చూపించి
అదిగో అది నీ గుండెలోనే ఉందని అంటాడు