పల్లవి : ధనధన తుపాకి మోతల నడుమా
దండకారణ్యం – అదిగో దండకారణ్యం
ఆదివాసుల బతుకులపైనా
కగార్ అంటూ యుద్ధం అడవిని కాజేసే యుద్ధం
ఈ యుద్ధం ఆపేద్దాం
అడవి బిడ్డలను రక్షిద్దాం ||ధనధన||
ఎందుకు బార్డర్ పోలీసంతా
గూడాలను చుట్టు ముట్టినయ్
అడుగడుగునా బేస్ క్యాంపులతో
దండయాత్రనే తలపించినయ్
పక్షుల బదులు ఎంతటి వింతా
డ్రోన్లు గద్దలై ఎగురుతున్నయి
వెలుగుల బదులు నెత్తుటి ముద్దలు
విషాదంగా ఉదయిస్తున్నయి
బిడ్డను గుర్తు పట్టని తల్లుల
గుండెలు పగిలాయా – అరణ్య రోదన అయ్యాయా ||ధనధన||
ఎందుకు హస్దేవ్ అడవులు మనకు
ప్రాణ వాయువును పంచొద్దంటూ
చెట్లను నరికి బొగ్గుబావులను
అదాని కంపెనికివ్వాలంటా
అడవిని తొవ్విన ఖనిజ సంపదా
కార్పొరేట్లకే చెందాలంటా
కాదనిచెప్పి ఎదురు తిర్గితే
కాల్చిచంపడమే మార్గమంటా
అది మారీచుల మాయలేడని
చెబితే తప్పంటా- చేదునిజాలు వద్దంటా ||ధనధన||
ఎందుకు రాజ్యాంగానికి తూట్లు
అటవీ చట్టం అమలవ్వదులే
గ్రామసభలకే అధికారాలనె
పెసా చట్టం కానరాదులే
శాంతి చర్చలకు తయారంటునే
పాలకులెవ్వరు ముందుకు రారు
పర్యావరణం తియ్యటి మాటలు
పాలపొంగులై పోతాయిలే
ప్రజలపైనే యుద్ధం చేస్తే
ఆకలి పోతుందా – అడవి మారిపోతుందా
ధనధన పోలీస్ తుపాకి మోతలు
ఆగిపోవాలి శాంతికి బాటలు వేయాలి
చెదిరిపోయిన గూడెం ప్రజలు
గూటికి చేరాలి – పనిపాటలు సాగాలి
జల్ జంగల్ జమీన్ మీదా
ఆదివాసులకే హక్కులుండాలి
(‘ఆపరేషన్ కగార్’ నిలిపివేయాలంటూ 18మే, 3024న హైదరాబాద్ లో పౌరహక్కుల సంఘం, సిడిఆర్ఓ సంస్థలు నిర్వహిస్తున్న సభ సందర్భంగా…)