తేలు కుడుతుంది

1.
తేలు కుడుతుంది
వెళ్లిపోవాలనుకుంటాం
తప్పిపోతేనైనా గుర్తుపడతారని ఆశ పడతాం

కంటి తెరల మీది మనుషుల్ని
హృదయం ఒడిసిపట్టుకోలేని కాలం కదా ఇది

తీరా అదృశ్యమయ్యాక
మరణించినట్టు కూడా గుర్తించరేమోనన్న ఊహ
మనిషిని ఒక గుంజను చేసి పాతుతుంది

2.
ఉండిపోయినవాళ్లలో కొందరు
వెళ్లిపోబోయిన వాళ్లే అనడానికి ఒకటే సాక్ష్యం
ధైర్యం కోసం ఒక జతకళ్లు
రెండునదుల్ని మోస్తాయి
అందుకే
ఎప్పుడైనా అనబుద్దవుతుంది
కన్నీళ్ళున్నంతవరకూ మనుషులుంటారని
కాలాన్ని కడుపులో దాచుకుంటారని

3.
ఇక్కడున్న వాళ్లంతా తప్పిపోయిన వాళ్లే అవడం
తప్పిపోయిన వాళ్లంతా ఇక్కడే ఉండటం
రహస్యమేంటో ఎప్పటికీ అంతుచిక్కదు

చప్పుడేమీ ఉండదు కానీ
అందరూ గుక్కపట్టి ఏడుస్తున్న వాళ్లే
కళ్లముందున్నా కన్నీళ్లనెవరూ గుర్తుపట్టలేరు
ఎవరి ముంతలో వారి దుఃఖం ఉండిపోవడమే సూచిక

4.
కాలం అందరి మీదా ఒకేలా కురుస్తున్నా
ఎవరి చేతిగడియారాల్లో వాళ్ళు తప్పిపోవడం
దేనికీ ప్రతీక కాదు

కర్తలూ, కర్మలూ తారుమారవుతాయి
గాయాలు మాత్రం స్థిరంగా ఉంటాయి
అటూ ఇటూ కదలకుండా గుండె అక్కడే నిలబడ్డట్టు

5.
ఏ ఒడ్డునున్న గవ్వనైనా
అల ఒకేలా గుద్దుతుంది

నీళ్ళూ నీళ్ళూ మాట్లాడుకున్నట్టు
గవ్వలూ గవ్వలూ కూడబలుక్కోలేవు
అందుకే మనుషులు వొట్టి గవ్వలు

6.
ఇంత విశ్వంలో
జీవించి ఉన్నామనడానికి
ఏ కొలమానమూ లేకపోవడమే
మరణానికి ప్రతీక

7.
ఏక కాలంలో వేరువేరు ఋతువుల్లా ఉండే మనుషులు
ప్రత్యేక సందర్భంలో ఒకే పట్టికలోకి చేరిపోతారు
అప్పుడు… జీవించడమూ, మరణించడమూ
రెండు వేరువేరు క్రియలు కాదు

8.
పిడికెడు మట్టిని పట్టుకున్నట్టూ
గుక్కెడు నీళ్లని చూపెట్టినట్టూ
ఇంత గాలిని అనుభవించినట్టూ
మనుషులకు ఏ విశేషణమూ లేకపోవడం కదా విషాదం

ఎవరికి వాళ్లు నీటి గుణం కలిగిన వాళ్లే అయినా
కలిసి ప్రవహించకపోవడమే పలచబరుస్తుంది
చిక్కబడ్డదాన్ని చీకటన్న నోటితోనే
పలచబడ్డ వాణ్ని మనిషనబుద్దవ్వదు

9.
ఒకేలాంటి వాళ్ళు
ఒకరినొకరు గుర్తించలేకపోవడం
కొత్త జబ్బేమీ కాదు
నేల తొలి మానవుణ్ని ఎత్తుకున్నప్పటి నుంచీ ఇదే పాట

అప్పుడప్పుడూ వింతలు జరుగుతుంటాయి
బతకడం రాకపోవడాన్ని
చావడం చేతకాకపోవడమే బతికించినట్టు

10.
అందరూ…
పళ్ళ బిగువన పెట్టుకోవాల్సిన రోజు కోసం
పళ్ళ బిగువున పెట్టుకున్న రోజుని దాటుతున్న వాళ్లే అయినా
ఎవరి దుఃఖాన్ని వారే మోయాల్సి రావడమే విషాదం

11.
వెళ్తుండే వాళ్లూ, వస్తుండే వాళ్లూ బోలెడు మంది
ప్రాథమిక సూత్రం మాత్రం ఒక్కటే

వెళ్తూ వెళ్తూ
కన్నీళ్లను తీసుకెళ్లిన వాళ్ళు
వస్తూ వస్తూ
కన్నీళ్ళతోనే వస్తారు

వెళ్లిపోయిన మనుషుల కోసం
బెత్తడు ఖాళీని ఉంచడం
తిరుగొస్తారన్న నమ్మకంతో కాదు
తిరిగొచ్చిన మనుషులకి
ఇంత నమ్మకం మిగల్చటం కోసం

12.
గుక్కపట్టి ఏడుస్తున్న లోకానికి
చనుబాలు తాపించే కాలాన్ని తోలే వాళ్లుంటారు
గుర్తుపడతానంటే చెప్తాను
హత్తుకున్న ప్రతిసారీ మెత్తగా తగిలే మనుషులు వాళ్లు

13.
జీవించడాన్నీ మరణించడాన్నీ వేరు చేసేది
స్వప్నించడమే అని తెలిసాక
కొత్త సూర్యుడి కోసం ఒక ఊహ చేస్తావు చూడూ
అదీ నువ్వు
అదే బతుకు

14.
కన్నీళ్ల వేళ్లు పట్టుకుని నడుస్తున్న వాళ్లే
కాలానికి దారి చూపిస్తారు
మనుషుల్నీ మనుషుల్నీ కలిపి
నది గుణాన్ని అద్దిపోతారు …

15.
పూర్తిగా అర్థం కాకపోతే
మళ్లీ మొదలు పెడతాను
ఈ సారి
మనిషి మీది నెపాన్ని తేలు మీదకి తోయను.

జ‌న‌నం: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణం. క‌వి, జ‌ర్న‌లిస్టు. 2013లో బీటెక్ పూర్తి చేశాడు. 2015 నుంచి కవిత్వం రాస్తున్నాడు. 2018లో 'ఒక...' పేరుతో కవిత్వ సంకలనం తెచ్చాడు. 2016లో ప్రజాశక్తి జర్నలిజం స్కూల్లో ట్రైనింగ్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఏడాదిన్నర పాటు 'జీవన' పేరుతో నడిచే ప్రజాశక్తి ఫ్యామిలీ పేజీకి ఫీచర్స్ రాశాడు. ఇప్పుడు మోజో టీవీలో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఒక దీర్ఘకవితను తీసుకొచ్చే పనిలో ఉన్నాడు.

3 thoughts on “తేలు కుడుతుంది

  1. “ధైర్యం కోసం ఒక జత కళ్ళు..రెండు నదుల్ని మోసుకెళ్తాయి..”
    అందుకే అనుకుంటాను కన్నీళ్లు ఉన్నంత వరకూ మనుషులు ఉంటారని.

Leave a Reply