వరాల్రెడ్డి వొయసు అరవై యేండ్లకు యా మాత్రం తక్కవుండదు. అయితే ఆయనిప్పుడు పసి పిలగోడి లెక్కన పరిగెత్తతా ఉండాడు. అంతెత్తు నించి లెక్కలేకుండా దూకతా ఉండాడు.
ఆయని ఆనందానికి అంతూ పొంతూ లేదు దానికి కారణం ఆయనీమద్దెన బోరేస్తే నాలుగించల నీళ్ళొచ్చినాయి. ఒక రైతు అనందానికి ఇంతకు మించి కావాల్సిందేముండాది.
అయితే అప్పుజేసి బోరేసేది ఆయనికేమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే పాత అప్పులట్టనే తన్నుకోనుండాయి. అదిప్పుడు వొడ్డీల్తో కలుపుకొని వొపినంతై పొయ్యుండాది. మల్లీ కొత్తప్పులకు యాడబొయ్యేది. అయినా ఈ వొంకాయలబ్బ యాడ ఊరికా ఉండాడు. “వరాల్రెడ్డీ! అయిదెకరాల భూమి పెట్టుకోని దాన్ని బీడెందుకు పెట్టుకుంటావు, అప్పో సప్పో జేసి బోరేసి పైరు గియురు పెట్టుకుంటే పస్తులేకుండా తినచ్చు గదా” అని ఉపకనెత్తినాడు.
“ఇప్పడే అప్పలై పొయ్యుంటే మల్లా యాడ అప్పుజేసేది వంకాలబ్బా” అన్నాడు వరాల్రెడ్డి.
“అపుజెయ్యకుండానే ఆస్తెట్టొస్తింది అప్పు అదానీలకు లేదా అంభానీలకు లేదా అంతెందుకు మన దేశం పెపంచ బ్యాంకి నించి అప్పు తెచ్చుకోలేదా అని బోరెయ్యమని ఒకే సటాన సత పోరినాడు వంకాయలబ్బ.
వరాల్రెడ్డి బోరెయ్యకా తప్పింది గాదు. అప్పయితే అయ్యింది గాని నీళ్ళయితే ఎల్లావుగా వొచ్చినాయి. పచ్చాపల్లం పాయకట్లో ఏ నలుగురు ఉడ్డజేరినా వరాల్రెడ్డి గురించి మాట్లాడేది మొదులు పెట్టినారు. సిత్తూరు జిల్లాలో అదీ ఆ మిట్ట పదేశంలో బోరేస్తే అన్ని నీళ్ళాని అరుసోద పోయ్యినారు. కారణం కరువులో అన్ని నీళ్ళు జనం సూసి ఎన్ని రోజులైయ్యిందో.
ఆ వార్త సుట్టు పక్కలే గాక మండలాఫీసుకూ పాకింది. వరాల్రెడ్డి అదురుష్టం జూసి వాళ్ళూ ముక్కున ఏలేసుకున్నారు. అప్పటికప్పుడే ఆదర్శ రైతుగా ప్రకటించేసి అన్ని పేపర్లకు గూడా ఇచ్చేసినారు.
ఆ పొద్దు వరాల్రెడ్డి నిద్దర్లేసేది కొంచెం లేటయ్యింది. వంకాయలబ్బ ఈనాడు పేపరొకటి తీసి సంకలో పెట్టు కొని ఆయనింటికొచ్చి ఆయన బారీ భూశమ్మనడిగినాడు “వొదినా! వొదినా! అన్నేడని.
ఆయమ్మ “నిద్ర పోతా ఉండాడు ఉండు” లేపతానని పొయ్యి ఊపి ఊపి లేపింది వొంకాయలబ్బ వొచ్చుండాడు సూడే” ని.
వరాల్రెడ్డి లేసి ఆవుళిస్తా “బంగారట్టా కల సెడగొట్టి నావు గదే!” అని తిట్టుకుంటా లేసినాడు.
ఆ పగటి కలలకేం తక్కవ లేదు గాని ఏంకలబ్బా బంగారట్టా కల అనింది బూశమ్మ
“అయ్యి పగటి కలలు గాదే నిజంగా బంగారట్టా కలే. మన అయిదెకరాల నేలలో మొత్తం వొరిపైరు నాట్నట్టు, లెక్కలేనన్ని వొడ్లు పండినట్టు, వాటినన్నీ అమ్మి కారు కొన్నట్టు, నేను తోలుకొని తిరప్తి గాంధీ రోడమ్మిటా పొయ్యినట్టు, కొండ మిందుండే ఎంగటేశ్పుడు ఏనుగొకటి ఎదురొచ్చి నట్టు, కారు పక్కన బెట్టి ఆ ఏనుగుమింద పోయేవోడిని నేను సున్నమడిగినట్డు, నాకు కలొచ్చింది అందుకే లేటయ్యింది” అంటా వొంకాయలబ్బతో గూడా కల్సి ఈదిలోకి పొయ్యినాడు వరాల్రెడ్డి.
మల్ల కొంచేపుటికంతా ఆ పేపరు తీసుకొని ఇంట్లొకొచ్చి మీసం మెలేస్తా బూశమ్మకు సూపించి, “సూస్తివా మన పేరు పేపర్లో ఏసుండారు ఈ పాయకట్లోనే మనకొచ్చి నన్ని నీళ్ళు ఎవురికి రాలేదంట” అన్నాడు.
ఆయమ్మ ఎటకారంగా ఇంతకు ముందెన్ని బోర్లేసింది, ఎంత అప్పు జేసింది, ఇప్పుడు మనకుండే అయిదెకరాలమ్మినా సాలదని గూడా ఏసుంటే బాగుండునని మొగుణ్ణి దెప్పి పొడిసింది బూశమ్మ.
అదొక అప్పా సెద్దిం జేసుకొనే దానికి నీళ్ళుండాల గాని మన అయిదెకరాల నేలలో రాజనాల పంటలు పండించనూ అప్పుడీ అప్పంతా ఈ ఎంటికతో సమామే” నని మీసంలో ఒక ఎంటిక సూపించి ఈదిలోకి ఎళ్ళిపొయ్యినాడు.
వరాల్రెడ్డి మొత్తం తడిపి దుక్కి దున్నినాడు గవురు మెంటోళ్ళిచ్చిన యిత్తనాలు తెచ్చి భూవెమ్మ కడుపులో ఏసినాడు వాళ్ళు సెప్పిన ఎరువులంతా తెచ్చి సల్లినాడు సెప్పిన పురుగు మందులంతా తెచ్చి కొట్టినాడు. రెయ్యనకా పగులనకా నీళ్ళు పారించి నాడు. కాని ఏం లాభం మూడో నెలకంతా సెట్టు మోకాటెత్తు పెరిగిందే గాని పెరికి సూస్తే కాయల్లేవు సెట్టుకు ఒకటి రెండుకు తప్ప. పెరికి వొబ్బిడి సేస్తే అయ్యింది పది మూట్ల సెనక్కాయలే.
అమ్మాలంటే అడివి కొందామంటే కొరివన్నట్టు మనం కొనేటప్పుడుండే రేటు అమ్మేటప్పుడుండదు. అమ్మి లెక్కజూసు కొంటే దాని దుడ్లు దానికే సాల్లేదు. భూమ్మింద యిత్తనం ఏసి నప్పుట్నించి అంతా అప్పే గదా! దక్కు దున్ని నోళ్ళకు అప్పు, విత్తనాల గింజల్ది అప్పు, ఎరువులు, పురుగు మందులు, కలుపు తీసినోళ్ళకి, పెరికొనోళ్ళకి, వొలినోళ్ళకి, అప్పు అప్పు అప్పు మొత్తం అప్పే గదా!
రైతు కడుపులో పుట్టి సేద్దిం సెయ్యాలనుకున్నప్పుడు. అపుజెయ్యక తప్పదు. అయితే ఆయప్పు తీసుకునేటప్పుడు సీమంతే కనబడితింది. తిరిగి ఇచ్చేటప్పుడు గదా! తెలిస్తింది అది ఏనుగంతై పోయ్యిందని.
పల్తెమొచ్చిందని తెలిస్తే సాలు అప్పులోళ్ళంతా వొచ్చి ఇంటి కాడ కీ గట్టే దానికి పెట్టుకుంటారు. అయినా వాళ్ళను కాళ్ళో గడ్డాలో పట్టుకొని రేపు మాపని వాయిదాలేసి తప్పించుకొంటాం కాని పెరిగే వొడ్డీలు నించి తప్పించుకొనేది ఎవురితరం. పోయే బస్సును సెయ్యడ్డంబెట్టి కొంసేపు ఆపొచ్చు, పరిగెత్తే రైలును ఎర్రజెండా సూపించి ఆపొచ్చు. అంతెందుకు ఇప్పుడు పోయే పేణాల్ని డాకట్రనుకొంటే కొంసేపు ఆపొచ్చు. కాని పెరిగే వొడ్డీలు, సెక్రవొడ్డీలు, బారువొడ్డీలు, వొడ్డీలకు వొడ్డీలు ఆపడం ఎవురితరం.
పైగా అపిచ్చినోడు కుదురుగా ఉంటాడా? అంటే ఉండడు ఉంటే వొసూలు కాదనే సంగతి వాడికి తెలుసు. అందుకని రకరకాలుగా మాటాడతాడు తీసుకునేటప్పుడుండే మునాసు తిరిగిచ్చేటప్పుడుండ దంటాడు. తీసుకోని పొయ్యినప్పుడు శోభనం పెండ్లి కొడుకు మాదిరిగా వొచ్చి తీసక పోతివే తిరిగ ఇయ్య మంటే మాత్రం పాడెక్కిన పీనిగ మాదిరిగా అయిపోతివే అంటాడు. ఇట్ట నానా రకాల మాటల్తో ఇసిగిస్తారు.
మడిసనేవోడు ఎన్నెన్నో కలలు గంటాడు కాయితాల మింద లెక్కలేస్తాడు గాల్లో మేడలు కడతాడు.అయ్యన్నీ నిలబడతాయా చీటాకులతో కట్టిన మేడల మాదిరిగా కుప్ప కూలి పోతాయి. అట్ట వరాల్రెడ్డి మనకు నీళ్ళుండాయి గదాని ఎన్నన్నో కలలు గన్నాడు. కాని యేమయ్యింది నిజ జీతితంలోకొచ్చే కొద్దికి ఆ కలలన్నీ కల్లలు గానే మిగిలి పొయ్యినాయి.
అపుజేస్తానే ఉండాడు భూమ్మింద పైరు పెడతానే ఉండాడు. ఎలకబుర్రడు జెల్లితే మంగ బుర్రడొచ్చినాయని పండి ఇంటికొచ్చి నాక జూసుకొంటే చేతికి సిల్లి గవ్వ గూడా మిగల్దు అప్పులోళ్ళు మల్లా ఇంటి ముందర కీగడతా ఉంటారు.
దీంతో వరాల్రెడ్డి తీరు మారింది అపులోళ్ళు పెట్టే బాదలకు తాగుడుకు మరిగినాడు. ఎవసాయాన్ని ఎండ గట్టేసి నాడు బాయి బొందైనా శాస్పితం గాని బోరు శాస్పితం గాదని తేలి పొయ్యింది బోర్లో నీళ్ళు గూడా వొట్టిపొయ్యినాయి.
భూవమ్మి అప్పలోళ్ళ సేతల్లో పోసేది తప్ప వరాల్రెడ్డికి ఏరే దారిదిక్కు తోచలేదు ఆయని పెండ్లాం గూడా అప్పలోళ్ళు పెట్టే బాదలు సూల్లేక అమ్మే దానికి సరే ననేసింది.
బేరసారాలు గూడా అయినాయి తీరా రిజిస్త్రాపీసుకు పొయ్యి ఇసి తీసి సూస్తే గదా తెలిసింది పిలకాయలికి మైనార్టీ తీరేదాకా అంటే వాళ్ళు యావార్దశకొచ్చే దాకా అమ్మే అక్కు లేదని.
వరాల్రెడ్డి నాయన కనకారెడ్డి సచ్చినోడు సావకుండా పోతా పోతా ఉండిన ఆస్తంతా పిలకాయల మింద రాసేసి పొయ్యినాడు పెద్దైతే ఈడు ఆస్తి పెట్టుకొని బతకతాడో లేదోనని.
అప్పులోళ్ళకు ఈ సంగతి తెలిస్తే ఇంకేమన్నా ఉందా అందుకే ఎవరికీ తెలియనిచ్చినోడు కాదు సివరికి పెండ్లానికి గూడా సెప్పలేదు. అప్పులోళ్ళు నిలుకు లేకుండా తిరగతానే ఉండారు. వరాల్రెడ్డి అద్దో ఇద్దని వాయిదాలేస్తా ఉండాడు.
ఒకనాడు తిరప్తికి పొయ్యోస్తానని పొయ్యినాడు సందేళ కంతా వొచ్చేస్తానని కాని కూటేళయినా రాలేదు మాటు మణిగినా రాలేదు ఆయని పెండ్లా దోవకల్ల ఎదురు సూస్తానే ఉంది ఇంగా వస్తాడు ఇంగా వస్తాడని సూసీ సూసీ కోడికి ఆమెకు తెల్లారిందే గాని వరాల్రెడ్డి మాత్రం రాలేదు. తరవాత నిమ్మళం సేసుకొంది యాడనో ఉండి తెల్లార్తో వస్తాడని.
ఆమెకు సద్దిపొద్దెక్కి నాక తెల్సింది ఆయన పురుగులు మందు తాగి చేనికాడొచ్చి సచ్చి పొయ్యినాడని. అప్పుజేసి అరిసెంద్రుడు ఆలిబిడ్డల్ని అమ్మితే సాచ్చాత్తు కొండమిందుండే ఎంగటేసుడు గుగ్గళ్ళ ముసిలామెకు అప్పుబడి ఆ సందులోకొచ్చేదే సాలించుకొంటే సేద్దిం సేసి పది మందికి కూడు బెట్టిన వరాల్రెడ్డి పేణాలే తీసుకున్నాడు.
తేనెలో పడిన ఈగ ఆ తేనె తాగి బతికింది లేదు సాలె గూట్లో చిక్కకొన్న ఈగ ఆ పోగుల మింద ఊగి ఆనందించిందీ లేదు అప్పుల ఊబిలో చిక్కుకొన్న అన్న దాత బతికి బట్ట కట్టిందీ అర్దు.
మా గోవిందు అన్న గారు రాసిన కథ లో రైతు కన్నీళ్లు అక్షరాలు గా అగుపిస్తాయి…అన్న దాత జీవన విధానం కు నిదర్శనం ఈ కథ…అన్న గారికి అభినందనలు తెలుపుతున్నాను
మీ చిట్టీ ముని ప్రసాద్