తేనెతుట్టెల తెగువ

అన్నలు కాదు
మాగుండె చప్పుళ్ళ
అలలు వాళ్ళు..

అంతమవుదురా..
అణిచేకొద్దీ
అనంత మవుదురా…

అవిశ్రాంత విస్ఫోటనల
సముద్ర తరంగాల
సజీవ ప్రతీకలు…

అలలే కదా..
అవును
అలలే కదా…

అంతోటెత్తుకు
ఎగిసెగిసిపడే
ఎట్టి పొంగులనుకోకు…

అంతులేకుండా
కడలి కంటున్న
కళ చెదరని కలలవి…

అదిమేయగలవా..
ఆపేసి
చెరిపేయగలవా…

చిటికెలో..
చిదిమేస్తానని
తిథులను తీర్మానిస్తావా…

నిత్యం పరిభ్రమిస్తున్న
భూగోళానికి పూసిన
చలనాల పూరెమ్మలవి…

విశ్వానికే
ఊపిరులూదిన
వాయులీనములవి…

పాలపుంతలకు
చనుబాలు తాపి
వొడిన సాదిన అమ్మలవి…

నరికేకొద్దీ విస్తరించే
చైతన్యం పురివిప్పిన
సావెరగని అడవులవి…

ఏదీ..
ఏంటదీ..
మళ్ళీ చెప్పూ…

అంతం
చేసేస్తావా
అంటుక బూడిదవుతావా…

ముట్టి
చూశానని
మురిసి పోకు…

తెలివితో
తడిమి
తరిమితిననుకోకు…

విరిగి
విరుసుకుపడి
దిగజారిన నురగల్ని…

వొరుసుకు పట్టి
ముల్లె గట్టే భ్రమల్లో
తేలియాడే భడవా…

నెత్తుర్లు
పొంగించి
చితులు పేర్చితినని…

తెగ మిడిసిపడే
మిడిమాల
మను ద్రోహ నియంతా…

దేశ దేశాల
దగుల్బాజీ లెల్లా
ఏకమైఎత్తిన గావు కేకా…

అంతమైపోతున్న
భయంలోచి
పెట్రేగిన డ్రోను దొంగదాడీ…

రాసిగారే
గాయాల్లోంచి
లేసొస్తున్నవివేవో పసిగట్టూ…

అరుణిమలీనే
లేచిగురుల
పురివిప్పిన ఆ చూపుల…

పతాక
రెప రెపలు
జర జూడూ…

గుండె
ఆగి
సచ్చేవు…

అలవిగాని
ఆపరేషనులకు
పరేషాను పరుగులు…

పెట్టిస్తూ..
దట్టిస్తూ
దడ పుట్టిస్తున్న…

కందిరీగల
జంగు నాదం
హోరు వినూ…

రెక్కలిప్పిన
తేనెతుట్టెల
తెగువ గాంచు…

Leave a Reply