తెలుసు

వాళ్ళు
ఎక్కడ నుండో వస్తారు
గాలి వచ్చినట్టు, నీరు కదిలినట్టు
అలా వస్తారు
ఓ చెట్టు కింద గుంపుగా చేరతారు
మూడు రాళ్లు పెట్టి
ఆకలిని మండిస్తారు
వెంట ఉన్న రేడియోలో
‘తరలిరాద తనే వసంతం’ పాట
ప్రసారం అవుతుంటే
ఓ వనంలా వింటారు
తాజాగా వేటాడిన రెండు
జెముడు కాకులుంటాయ్
ఎర్రమూతి కోతి ఒకటి
ఒకడి భుజం మీద కూర్చొని
లోకాన్ని చదువుతుంటుంది
పురిటిబిడ్డ ఒకడు ఒళ్ళో ఉంటాడు
మరో ప్రాణం ఊయల్లో ఉంటుంది
పదేళ్ళ కుర్రాడు క్యాడ్బాల్ గురిపెట్టి
పిచ్చుకునో, కాకినో టార్గెట్ చేస్తాడు
సాయంత్రానికి నిద్ర
ఎలాంటి దిగులు,భయము లేకుండా
వాళ్ళ కోసం ఎదురుచూస్తుంది
వాళ్ళు
కాశ్మీర్ విభజన గురించి చర్చించరు
అమరావతి పై దిగులు కూడా చెందరు
వాళ్ళకి బాగా తెలుసు
లక్ష గొడ్లను తిన్న రాబందు
ఒక్క గాలివానకు చస్తుందని
వాళ్లకు తెలుసు
ఇక్కడ ఏది శాశ్వతం కాదనీ
వాళ్లకు స్వప్నాల్లేవ్
బతుకును బతకడమే తెలుసు
బతకడమే తెలుసు
అవును
బతకడమే తెలుసు

పుట్టింది నెల్లూరు జిల్లా, ఓజిలి, రాచపాలెం. కాకినాడలోని పిఠాపురం రాజా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖాధిపతి. 'నీటిపూలవాన', 'గోరువంకల గానం' అనే రెండు పిల్లల కవితా సంకలనాలు వేశారు. ఎక్సరే, తానా, రంజని, కుందుర్తి వంటి పురస్కారాలు పొంది ఉన్నారు. రాధేయ కవితా పురస్కార నిర్వాహకులలో ఒకరు.

13 thoughts on “తెలుసు

  1. చాలా అద్భుతమైన కవితా శిల్పం
    చక్కగా చిక్కగా నిజమైన కవిత్వం
    గోపాల్ గారు

  2. తెలుసు నాకు ఏమి తెలియదని….వారికి బతకడం తెలుసు’వారికి బతకడానికి భజన చేయడం తెలియదు…. అమాయకత్వంలోని ఆనందం అది

  3. తీసుకున్న ఏ వస్తువుఐన అద్భుతమైన శిల్పంతో ఉంటుంది అన్న మీ కవిత్వంలో.శ్రమజీవుల బతుకును చెబుతూ ఇప్పటి రాజకీయాలమీద అద్భుతంగ మాట్లాడారు.

  4. ‘ఆధునిక’ పిచ్చుకలపై గురిపెట్టబడిన
    మిత్రుని కవితా క్యాట్బాల్

    అల్లాడి వేణుగోపాల్

  5. మా తరానికి మీరే శివారెడ్డి

  6. “మూడు రాళ్ళు పెట్టే ఆకలిని మండీస్తారూ ” అద్బుతం sir

Leave a Reply