కాలానికి ఏక ముఖ చలనం మాత్రమే ఉంటుందని విజ్ఞాన శాస్త్రం చెపుతుంది. టైమ్ మెషిన్లు తయారు చేసుకుని కాలంలో వెనక్కి వెళ్లడమూ, అనేక కాంతి సంవత్సరాల దూరంలోని నక్షత్రాల మీదికి వెళ్లి అక్కడి నుంచి భూమిని చూసి పాత ఘటనలూ పరిణామాలూ కళ్ల ముందు దర్శించడమూ అన్నీ కల్పనలోనే, ఊహలోనే గాని వాస్తవం కావు. కాని ఈ భౌతిక శాస్త్ర నియమాన్ని తెలుగు సమాజ సాహిత్యాలు తిరగరాస్తున్నట్టున్నాయి. ఇక్కడ మనం కాలంలో చాల ముందుకు నడిచి, అక్కడ సకారణంగానో నిష్కారణంగానో ఆగిపోయి, మలుపు తిరిగి, వెనక్కి నడవడం కూడ ప్రారంభించినట్టున్నాం. అరవై, డెబ్బై ఏళ్ల కింద మరిచిపోయిన విషయాలకు మళ్లీ పెద్ద పీట వేస్తున్నట్టున్నాం. ఆరేడు దశాబ్దాల కింద సకారణంగా, ఉత్తేజభరితంగా, ఉధృత ఉద్వేగాలతో తోసివేసిన విలువలనూ విశ్వాసాలనూ ఇవాళ మరొకసారి గాఢంగా ఆలింగనం చేసుకుంటున్నట్టున్నాం.
ఇవేవో నిరాశాపూరిత నిర్ధారణలు కావు, కళ్ల ముందరి వాస్తవాలను చూసి కలుగుతున్న ఆవేదనలు. ఒక ఉజ్వల వాతావరణంలో పుట్టి బుద్ధెరిగి, కళ్లు తెరిచి, ఊహలు విచ్చుకుని, ఆ మహత్తర ఊరేగింపులో కలిసి నడిచి, ఇవాళ ఆ ఉజ్వలత్వం కనబడని మసక చీకట్లలో కళ్లు పొడుచుకుని చూస్తూ పడుతున్న తపనలు.
సమాజ సాహిత్య సంబంధాల చరిత్ర విద్యార్థిగా గత కొద్ది కాలంగా వేధిస్తున్న ఈ ప్రశ్నలకు, ఈ ఆవేదనలకు, ఈ తపనలకు అక్షరరూపం ఇవ్వడం ఇంకా నిరాశ పెంచుతుందా అని కూడ ఉంది. కాని ఏదైనా రాయమనీ, ధారావాహికంగా రాయమనీ కొలిమి అడిగినప్పుడు, ఇటువంటి వేదనలను, గత వర్తమానాల, ఆశ నిరాశల, ఉత్తేజ నిస్తేజాల సంభాషణను నలుగురితో పంచుకుంటే, ఇటువంటి ఆవేదనే అనవసరమని చెప్పేవాళ్లూ, లేదా ఇటువంటి ఆవేధనలనే అనుభవిస్తున్నవాళ్లూ ఒక సంభాషణ జరిపితే కనీసం కొన్ని చర్చనీయాంశాలనైనా వేదిక మీదికి తేగలుగుతామా అనిపించింది. ఎక్కువలో ఎక్కువ జరపగలిగింది సంభాషణే, చర్చే. ఇప్పటికిప్పుడు ఏదో మారిపోతుందనే ఆశ ఏమీ లేదు. ఆశ నిరాశల పొలిమేరలో ఆవులిస్తున్న ప్రశ్నలకు జవాబులు వెతికే ప్రయత్నం ఇది.
సమాజమే సర్వస్వం, సమాజ హితం కోసమే వ్యక్తి, సామాజిక పురోగమన మార్గంలో వ్యక్తులు ఏమైపోయినా ఫర్వాలేదు అనుకున్న చోటి నుంచి చాలా దూరం వచ్చినట్టున్నాం. సమాజం ఏమైపోయినా సరే నా చిన్ని బొజ్జకు శ్రీరామరక్ష అనుకునే స్వార్థం, అసాంఘికత్వం పెరిగిపోతున్నాయి. భవిష్యత్తు ఎంత అంధకారమయంగా కనబడుతున్నా సరే మనవంతు చిరుదీపం వెలిగించాలనే బాధ్యత ఎంతమాత్రం కనబడని నిర్లిప్తత వ్యాపిస్తున్నది. కళ్ల ముందర కనబడే దోపిడీనీ పీడననూ హింసనూ అసమానతనూ గుర్తించని అంధత్వం కమ్ముకుంటున్నది. ప్రపంచీకరణ విధానాలకు ముందే ప్రారంభమయిన శకలీకరణ, ప్రతి శకలమూ తానే సర్వజ్ఞురాలిననీ, సర్వవ్యాపిననీ అనుకోవడం, మరొక శకలాన్నో, వ్యక్తినో గుర్తించని తనం ఈ మూడు దశాబ్దాలలో మరింత మరింతగా పెరిగిపోతున్నట్టున్నాయి.
ఈ వర్తమాన దృశ్యాన్ని చూస్తుంటే కాలం నిలిచిపోయిండా, లేక వెనక్కి నడవడం కూడ మొదలయిందా అనిపిస్తున్నది. కులాన్ని గుర్తించకుండా, పట్టించుకోకుండా లెక్కచెయ్యకుండా మనసు మాత్రమే, అభిరుచులు మాత్రమే, అభిప్రాయాలు మాత్రమే ప్రధానమని సహజీవనం ప్రారంభించిన దంపతుల పిల్లలు తప్పనిసరిగా కులంలోనే – ఎక్కువగా తండ్రి కులం లోనే – పెళ్లి చేసుకుంటున్నారు. నలుగురిని పిలిచి చాయ్ బిస్కట్ ఇవ్వడం లాంటి వేడుక చేసుకోవడమే ఆడంబరమూ తప్పూ అనుకున్నంత చాదస్తంలో నిరాడంబరంగా తమ సహజీవనాన్ని, వివాహాన్ని ప్రకటించిన జంటల కొడుకులూ కూతుళ్లూ లక్షలు ఖర్చు పెట్టించే మూడు రోజుల, ఐదు రోజుల, ఏడు రోజుల, గమ్యస్థానాల, ఐదు నక్షత్రాల వివాహ మహోత్సవాలకు మోజు పడుతున్నారు. ఒకప్పుడు సూత్రబద్ధమైన జీవితాలు జీవించినవాళ్లు, సైద్ధాంతిక ఆదర్శాల ప్రమాణాలతో జీవించినవాళ్లు ఇవాళ రాజీలకూ, నిర్లిప్తతకూ, చివరికి పూర్తిగా వ్యతిరేకమైన పద్ధతికీ దిగజారి బతుకులీడుస్తున్నారు. కొందరైతే ఈ పతనమే విజయం అన్నట్టుగా కూడా ప్రవర్తిస్తున్నారు.
కుల మతాల పాత్ర బహుశా దశాబ్దాల కిందటికీ ఇప్పటికీ పెరుగుతున్నట్టున్నది. కుల వివక్ష, అసమానత, అస్పృశ్యత ఎప్పుడూ ఉన్నవే గాని, అవి ఉంటూనే కులాల మధ్య సంబంధాలు కూడా ఉండిన స్థితి నుంచి ఎవరి కులంలో వాళ్లే సంబంధాలు పెట్టుకునే, ఒకప్పటి కొన్ని ఘెట్టోల స్థానం నుంచి ఇప్పుడు ఘెట్టోలే సర్వ వ్యాపితం అయిన కాలానికి ప్రయాణిస్తున్నట్టున్నాం. మతం అన్నది కూడా మరొక కులంలా అనిపించిన చోటి నుంచి అదే సకల అంశాల నిర్ణాయక శక్తి అయిన స్థితికి చేరుకుంటున్నట్టున్నాం. పాలకవర్గాల రాజకీయాలలో కూడా ఎక్కడో ఒకచోట మంచివాళ్లకు స్థానం ఉండే చోటు నుంచి మంచితనానికీ రాజకీయాలకూ చుక్కెదురు అనే స్థితికి చేరుతున్నట్టున్నాం. డబ్బు ఉండడం సిగ్గుగా, అవమానంగా, ప్రదర్శించనక్కర లేనిదిగా ఉన్న స్థితి నుంచి గర్వంగా, ఆడంబరంగా ప్రదర్శించవలసిన స్థితికి చేరుకుంటున్నట్టున్నాం.
ఇటువంటి సామాజిక మార్పులు కొన్నిడజన్లు మనందరికీ నిత్యం అనుభవంలోకి వస్తున్నవే. ఈ సామాజిక మార్పులకు అనుగుణంగానే సాహిత్యంలోనూ మార్పులు వస్తున్నట్టున్నాయి. సాహిత్యంలో సమాజం ఉండడం ఏమిటి అని నేరుగా ప్రశ్నించే స్వరాలు క్రమక్రమంగా తీవ్రస్థాయికి చేరుతున్నాయి. సామాజిక సంస్కరణకూ, పరివర్తనకూ సాహిత్యం సాధనం అని ఆధునిక సాహిత్య ధార అంతా చెపుతుండగా, ఈ మాటలు వినబడుతున్నాయంటే కాలం నిలిచిపోయినట్టా, వెనక్కి నడుస్తున్నట్టా?