మట్టిని ముట్టకుండా
మట్టి మనిషిని పలవరించడం
ఎంత తేలికైన పని!
ముసలి తల్లికి యింత అన్నం పెట్టకుండా
ఆమెపై కొండంత ప్రేమని
అక్షరాల్లో ఒలకబోయడం
ఎంత హాయి!
పశువు మొహాన నాలుగు పరకలు
గడ్డి యిదరాల్చకుండా
దానికి పూజలు చెయ్యడం
ఎంత సుఖం!
దేశానికి అన్నం పెట్టే
రైతు మెడకు
ఒకపక్క వురితాడు పేనుతూ
ఈ వ్యవసాయదేశంలో
రైతే రాజని
పదే పదే చెప్పడం
ఎంత ఆదర్శం!
అమూర్త మానవుల్ని
అగోచర వస్తువుల్ని
కలవరించినట్టు
ఎదురొచ్చి నిలబడే నిజాల్ని
చూడలేనితనం కన్నా
అతిపెద్ద వంచనా శిల్పం
లోకంలో ఏముంది!
నేల ఓరిమి నశిస్తే
అది రోగాల కాపు కాయక
ఏమి చేస్తుంది మరి!
పాలుతాగిన
రొమ్ము గుద్దడాన్ని
అమ్మమాత్రం ఎన్నాళ్ళు ఓర్చుకుంటుంది!
ఆరుగాలం మట్టి పిసికి
దేశం గరిసెలు నింపే
అన్నదాత గుండె రగలకుండా
ఎంతకాలం వుంటుంది!
అందుకే నాటకానికి
తెరపడింది
తనని తాకడానికి
నామర్దాపడే చేతిని
మట్టి గల్లా పట్టుకుని నిలదీస్తుంది
నీమాటలో తడి శాతం ఎంతో చెప్పమని!
పాపం పిచ్చిది!
బిడ్డల కపట ప్రేమ సంగతి
యిప్పుడు అమ్మకి కూడా తెల్సిపోయింది
ఇంతకాలం తలొంచుకుని
భూమికి
తన చెమటను, రక్తాన్ని ఎరువేసి
పచ్చని వన్నెలు తీర్చిన
సేద్యగాడు కూడా కళ్ళు తెరిచాడు
యిప్పుడతన్ని ఎదుర్కోవడం
రిపబ్లిక్ డే ఉపన్యాసంలో
‘జై కిసాన్’
అన్నంత సులువుకాదు
నాటకం ముగిసింది
ప్రేక్షకుడు మేలుకున్నాడు
యిప్పుడు
నటీనటుల గొంతు తడారిపోతుంది
బియ్యం చెట్టు బిక్కమొహం వేస్తుంది
( 23. 01. 2021 )