తెరలు

ఒకే మంచం మీద
అతడూ
ఆమే
కూర్చుంటారు
లేదా పడుకుంటారు

ఇద్దరి మధ్యా
కొన్ని వేల నీలి కెరటాలు
పారదర్శకమైనవీ నిగూఢమైనవీ
స్పర్శకందనివీ గాఢంగా అలుముకునేవీ

అతిశీతలంగా నులివెచ్చగా
అనేకానేక తెరలు
దూరాల్ని పెంచేవీ
అతి దగ్గర చేసేవీ
ఒడ్డున నిలబెట్టెవీ
నిలువునా ముంచేవీ

వాళ్ళిద్దరి మధ్యా
మంచంమీద
లోతైన నదులు ప్రవహిస్తుంటాయి
ఒడ్డులు లేని నదులు
లోతుతెలియని సముద్రాలు
గుసగుసలాడుతుంటాయి
వినిపించని మాటలు తేలుతుంటాయి
కనిపించని దృశ్యాలు కదులుతుంటాయి

ఎప్పటివో స్పర్శలు మునిగిపోతుంటాయి
ఇప్పటివే అనుభూతులు రాలిపోతుంటాయి

మంచం మీద
అటు ఇటూ అతడూ ఆమె
మధ్య గాఢంగా చీకటి తెరలు
జ్ఞాపకాలు ఇరుక్కున్న దోమ తెరలు
సంభాషణలు మాయమైన ఇనుపతెరలు

ఒకానొక తెర మీద చూపుడు వేలుతో ఏదో రాస్తుంది ఆమె
ఒక తెర మీద మునిపెదవితో ముద్దుపెట్టుకుంటాడు అతడు

తెరలు
కొన్ని సార్లు కదులుతాయి
కొన్నిసార్లు గడ్డకట్టుకుపోతాయి
కొన్ని సార్లు సుడిగాలిలో విలవిలలాడుతాయి

తెరల వెనకానుండి అతడు పిలిచే పిలుపుఎక్కడో దేశాలకవతల నుండి వినబడుతుంది

ఇప్పుడు
ఒకరికి అభిముఖంగా ఇంకొకరు కూర్చుంటారు

ఒక్కొక్క తెరనూ దాటుకొచూసే
వాళ్ళ చూపులు పడవలు
తెరచాపా చుక్కాని లేని పడవలు
నడిసముద్రం లో ఎక్కడో ఊగే పడవలు
పడవ ఇటునుండి అటు ప్రయాణించే సరికి ఒక జీవితకాలం దాటుతుంది

అతడు పిలిచిన పిలుపు
ఆమెకందడానికి
ఆమె విడిచిన ఊపిరి
అతనికి తగలడానికి
కొన్ని కాంతిసంవత్సరాల
దూరం

మునిగిపోయే చూపులకూ
కరిగిపోయే మాటలకూ
ఇగిరిపోయే స్పర్శలకు
తెలుసా
వాళ్ళ మధ్య దూరం నిజానికి
ఒక
లిప్తపాటే అని?

పుట్టింది సిద్ధిపేట‌, చదివింది జిల్లా ప‌రిష‌త్‌ హై స్కూల్ లచ్చపేట, స‌ర్వేల్‌, హైద‌రాబాద్‌ పబ్లిక్ స్కూల్, జేఎన్‌టీయూ, ఓ యూ. వాసవి ఇంజినీరింగ్ కాలేజీలో పదకొండేళ్లు అధ్యాపకునిగా, అమెరికాలో గత 20 ఏండ్లుగా ఐటీలో, 14 ఏండ్లు విరసం సభ్యుడు. మూడు కవితా సంకలనాలు 'కల్లోల కలల మేఘం', 'సందుక', 'వానొస్తదా'?,  ఒక కవితా ప్రయాణ జ్ఞాపకాలు 'నడిసొచ్చిన తొవ్వ' – ఇప్పటిదాకా ప్రచురణలు. 'ప్రజాకళ', 'ప్రాణహిత'లతో సన్నిహిత సంబంధం.

Leave a Reply