2019 నవంబర్ న కడప నుండి పులివెందుల వెళ్ళే రోడ్డెక్కి వేముల మండలం దారి పట్టగానే ఎటుచూసినా పచ్చదనం… అరటి తోటాలు… తెల్లగా పచ్చగా పర్చుకున్న చామంతి తోటాలు చూపరూను ఆశ్చర్యానందాలకు గురిచేస్తుంటే వేముల మండలంలోని గ్రామం భూమయ్యగారి పల్లె చేరుకునే ముందు మైళ్ళ దూరం వ్యాపించి ఉన్న గుట్టలు, పచ్చని అరటితోటలు ఎక్కడా ఎండుగడ్డైనా కనిపించలేదు. భూమయ్యగారిగారి పల్లె, మబ్బుచింతుపల్లె, కె.కె. కొట్టాల గ్రామాలు, కనంపల్లి-తుమ్మలపల్లిలోని యురేనియం తవ్వకాల బేసిన్ చుట్టూ ఉన్న గ్రామాలు. మొదట భూమయ్యగారి పల్లెలో అడుగుపెట్టగానే ఊడలు దిగిన ఒక పెద్ద చెట్టు, దాని చుట్టూ కట్టిన గద్దె (రచ్చబండ) దగ్గరికి చేరుకుని చుట్టూ పరికించి చూస్తే… అప్రయత్నంగా మనసుకు తోచిన పదాలు “కొండల పైనా కోనలలోన గోగులు పూచే జాబిలి. నీ వెండి చలువతో బండలు కుడా వెన్నముద్దలవుతాయీ…” ఈ పాటలోని పదాలను వాస్తవికంగా ఆస్వాదిస్తుండగానే అసలు మేము చూస్తున్నది రాయలసీమ ప్రాంతమేనా అనిపిస్తుంటే ఇంత పచ్చని ఈ ప్రకృతి అచ్చంగా మాకు ఆగస్టు నెలలో నల్లమల అడవి చుట్టూ ఉన్న అమ్రాబాద్ మండలంలోని పల్లెలు, చెంచు పెంటలు (పేటలు) చూస్తున్నట్టుగా, అక్టోబర్ నెలలో నల్లగొండ జిల్లా సంభాపురం (లంబాపూర్), పెద్దగట్టూ, బూడిదగట్టూ లాంటి నాగార్జునసాగర్ శివారు (బ్యాక్ వాటర్) ను ఆనుకొని ఉన్న గుట్టలూ, గ్రామాలూ చూస్తున్నట్టు అనిపించింది. అటు మహబూబ్ నగర్, నల్లగొండ, ఇటు కడప జిల్లాలు ఒకే విధంగా అనిపించడానికి కారణం ప్రకృతి భౌగోళికత.
ఈ ప్రాంతాలలో అంత అద్భుతంగా అడవూలు, గుట్టలు, తోటలు, నీళ్ళు, వనరులతో పచ్చగా ఉన్నది కాబట్టే అక్కడ యురేనియం బేసిన్లు ఏర్పాటు చేసి వేల ఫీట్ల పాతాళానికి పెద్దబోర్లు తవ్వి అక్కడ యురేనియం నిల్వలు ఉన్నాయనీ తవ్వకాలకు అనుకూలమనీ నిర్ధారించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు తీసుకొని తవ్వకాల కోసం వ్యవస్థలను ఏర్పాటు చేసుకొని పని ప్రారంభించారు UCIL (Uranium Corporation of India Limited) కంపెనీవాళ్ళు .
ప్రస్తుతం కడప జిల్లా తుమ్మలపల్లి యురేనియం బేసిన్లో నిరాఘాటంగా తవ్వకాల పని జరుగుతున్నది. దీని పేరు తుమ్మలపల్లి ప్రాజెక్టు. Under Section (30) Atomic Energy Act-1962, Under Section-2, Sub-Section (8), Part C&D of Official Secret Act-1923 అనే బోర్డు పెట్టుకొని UCIL ఈ పనిని వేల మంది ఉద్యోగులతో కొనసాగిస్తున్నది. నిజానికి అంతా సవ్యంగా ఉంటే ఇదొక దర్శనీయ స్థలం పర్యాటకులకు. కానీ ఇది నిషేధిత ప్రాంతం ఇప్పుడు. కంపెనీ భద్రత కోసం అక్కడ లోపలికి ఎవరినీ అనుమతించరు. అక్కడ జరిగే తవ్వకాల పనిని బయిటివాళ్ళు ఎవ్వరూ చూసేందుకు అనుమతి ఉండదు. బి.టెక్., యం.టెక్. చదివిన యువకులు సుమారు వెయ్యిమందికి కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉద్యోగాలిచ్చారు.
పులివెందుల, వేముల మండలాలు, చుట్టుపక్కల గ్రామాలకూ పంటలకు సాగునీటి, తాగునీటి సౌకర్యం లేదు. నిజానికి ఇక్కడ చిత్రావతి నది నీళ్ళను అందించాల్సి ఉండగా UCIL కు మాత్రం 30 టి.ఎం.సి. ల నీళ్ళు ఇస్తున్నారని ఒక రైతు ఆవేదనతో చెప్పాడు.
మళ్ళీ భూమయ్యగారి పల్లెలో కొద్దాం… రచ్చబండ చుట్టూ ముసురుకున్న ఊరి జనం మేమూ మమ్ములను అనుసరించి వచ్చిన పోలీసులూ… ఒక్కో రైతు తన గోడు వినిపిస్తున్నాడు… సుమారు 1800 నుండా 2000 జనాభా ఉన్న ఆ ఊరు పచ్చపచ్చగా ఆకుపచ్చని సందమామ తీరున… గుట్టల నడుమ గుట్టల మీద ఉన్నది… ఆ కొండల కోనల నడుమ గోగుపూల తోటలాంటి ఊరు… పగటివేళ జాబిలిలా కనిపించే ఊరు… అక్కడ రెడ్ల సంఖ్య ఎక్కువ… ఆ ఊరు చుట్టూ రెండేండ్ల కాలంలో 200 బోర్లు ఎండిపోయినవి. వారి ప్రధాన వృత్తి వ్యవసాయం… అరటి, శెనగ పంటలు ఎక్కువగా పండిస్తారు.
గంగిరెడ్డి అనే రైతుకు జరిగిన నష్టం, వచ్చిన కష్టం విన్న తరువాత రెండు వందల మేకల కొట్టం యజమాని చెన్నకృష్ణారెడ్డి గొర్ల కొట్టం చేరుకున్నాం. ఒకప్పుడు 200 మేకలున్న ఆ కొట్టంలో ఇప్పుడు ఐదారు మేక పిల్లలున్నాయి. అక్కడ మేకలకు ముందు మచ్చలు తేలి బొచ్చు ఊడిపోయి, తరువాత లోపల కుళ్ళిపోయి మేకలు చచ్చిపోతున్నాయి. ఆ రోగంతో 170 మేకలు చచ్చిపోయాయి. కొన్ని బెంగుళూరు వాళ్ళకు తెగనమ్ముకున్నారు. అవి బతికిపోయాయట. ఇప్పుడు ఆ కొట్టంలో ఉన్న నాలుగు మేకలూ మమ్మల్ని చూసి బెదిరిపోయి తప్పించుకుంటూ హృదయవిదారకంగా అరుస్తున్నాయి. ఆ అరుపులు వాటి నిస్సహాయ రోదనలు బాధిస్తున్నాయి. ఆ దృశ్యం… ఆ రోదనలు… ఆ విషాద గాథ వింటూ క్షణం పాటైనా అక్కడ ఉండాలనిపించలేదు… నోరూ… కసీ… ఆవేదనా ఉన్న మనుషులు చెప్పుకుంటారు… చెప్పుకుంటున్నారు… కానీ ఈ మూగజీవాలకు తమకు జరుగుతున్నదేమిటో ఎందుకో తెలియదు… క్రూరమైన… చికిత్సలేని రోగానపడి చచ్చిపోతున్నాయి… చేయని వైద్యం లేదు… మేకలు చివరికి బొచ్చూడి నక్కల్లా మారిపోతున్నాయి… కడుపులో గడ్డలు పుడ్తాయి… అంతేకాక జరిగేది చావు జాతరే… అంతేకాదు మాకు కనిపించిన ఊరి కుక్కల పరిస్థితి కూడా అదే.
తమ పొలాలు, తోటల్లోని బోర్లలో నీళ్ళింకిన రైతులు పక్కపక్కనే బోర్లు వేస్తున్నారు… వాటిల్లోనూ నీళ్ళు పడటం లేదు… ఏ ఒక్క రైతూ ఒక్క బోరుతో ఆగిపోలేదు… వేస్తూనే ఉన్నారు. ఒక్కో బోరుకు లక్ష రూపాయాల వరకు ఖర్చు అంటున్నారు. అంకిరెడ్డి అనే రైతు సుమారు 25 బోర్ల దాకా వేసాడంటే కళ్ళు తిరుగుతాయి.
యురేనియం ప్లాంట్ పెడితే నీళ్ళకు ఇబ్బందేమీ ఉండదు… మీకూ, పిల్లలకూ ఉద్యోగాలొస్తాయన్నారు కానీ జరుగుతున్న కథ ఇదీ అని చెప్పారు ఊరి రైతూలు…
ఎర్రపరెడ్డి ఎడమకాలు చర్మంపై బొబ్బలు తేలి పుండు పడింది. లక్షన్నర ఖర్చుతో వైద్యం చేయించుకున్నాడు కానీ పుండు మానలేదు, ఫలితం లేదు. అతని 3 ఎకరాల అరటితోట బీడుపడింది.
భూమిరెడ్డి ఓబుల్ రెడ్డి బోరులో నీళ్ళు ఇంకితే లోతు పెంచుతూ 12 బోర్లు వేసాడట. అతనిది 20 ఎకరాల వ్యవసాయం. తవ్వి తవ్వి మా భూమి చివరికి వాళ్ళకు పోతుంది అంటూ నిస్సహాయంగా చేతులెత్తేసాడు.
ఓబుల్ రెడ్డి రాజారెడ్డి అనే రైతు UCIL వచ్చిన తరువాత అంటే 2009 నుండి బోరు నీళ్ళు జిడ్డుగా ఎర్రగా వస్తున్నాయని చెప్పాడు. అతను తన 15 ఎకరాల భూమిలో దాదాపు 20 బోర్లు వేసాడు… ఫలితం శూన్యం. అప్పే మిగిలింది.
ఈ ఊరిలో మీదిపల్లె రూట్ దగ్గర దగ్గరగా కొన్ని గజాల స్థలంలోనే 26 బోర్లు వేసారు… అంతా దండగే అయ్యింది.
ఇట్లాంటి ఘటనలు వింటూ మేల మెల్లగా కదలలేక కదలలేక ఆ ఊరినుండి మబ్బుచింతుపల్లి దారిపట్టాము… పోతూ పోతూ ఆ ఊరిని వెనకకు తిరిగి చూస్తే ఆ ఊరిప్పుడు శిథిలమైన చందమామలా కనిపించింది. ఎర్రగా జిడ్డుగా నేల రాలుతున్న వెన్నెల తెరల మధ్య ఆ ఊరు మసకబారిపోయినట్లు కనిపించింది.
అయ్యో! ఏం ఘోష? ఏం గతి ఇది? “మామవు నీవని మంచివాడవని / పసిడి గిన్నెలో పాలే కలవని/ నమ్మిన పాపను నవ్వించి/ నీ నల్లని మచ్చలు మరిపించు…” అని చంద్రున్ని కోరుకుంటూ… వేడుకుంటూ మబ్బుచింతుపల్లి గ్రామం చేరుకున్నాము. అక్కడా అవే దీనగాథలు… మానవ విషాదాలు ఎదురయ్యాయి.
UCIL కంపెనీ ఉద్యోగూలు నలుగురి ఇళ్ళలో పనిచేస్తుంది ఊరి శివారులో ఉన్న నీలావతి… ఆమె దవడమీద పెద్ద గడ్డ పుట్టింది. భర్త తాగి తాగి చనిపోయాడు. కూతురు పులివెందుల ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నది… చిన్న గూడులాంటి ఇల్లు… పక్కా ఇల్లు లేదు. ఏ ఆర్థిక ఆసరా లేదామెకు… పైగా ఈ రోగం. పల్లెలోకి రచ్చబండ దగ్గరికి పోగానే నిరాశా నిస్పృహతో మాట్లాడే ఊరి జనం గుమికూడారు. చిన్న బడ్డీ కొట్టు ఇంటిముందు గద్దెపైన పెట్టుకొని నడుపుతున్న జేబున్నిసాకు 60 ఏళ్ళు… ఆమె ముఖం నిండా చిన్న గడ్డలు. ఆమెకు చిన్నప్పటి నుండి చెమటకాయలు, మొటిమలు లాంటివి కూడా తెలియదు. దురద మాత్రలు తింటున్నది. ఆ ఊరిలో సుమారు 1500 మంది ఉన్నారు. తమ బోరులో నీళ్ళు తెట్టుగడ్తున్నాయని చెప్పారు.
యువ రైతులు మహేశ్వర్ రెడ్డి, అతని అన్న సోమేశ్వర్ రెడ్డిలు 6 ఎకరాల అరటితోటను 3 ఏళ్ళుగా బీడుబెట్టారు. ఇద్దరన్నదమ్ములు అరటిపంట తీసేవాళ్ళు… 2017 మే నెలలో మొట్టమొదట బోరు నీళ్ళు ఇంకడంతో, మరో బోరు వేస్తే 10 రోజుల్లో చేతికి అందబోయిన పంట కాస్తా వేర్లు కుంకి మురిగిపోవడం ఇతనికే జరిగింది. నేల చౌడయిపోయింది. అన్ని శాఖల వాళ్ళూ వచ్చి భూమిని పరీక్షించిపోయారు. ఏమీ చేయలేదు. అయిన అప్పు తీర్చడానికి, కడుపుకింత తిండికీ వీళ్ళిప్పుడు మట్టి ఎత్తే పనికి కులికి పోతున్నారు… ఎన్నిసార్లు UCIL కార్యాలయానికి వెళ్ళినా… వాళ్ళు ఇతన్ని కుక్కకంటే హీనంగా చూస్తూ వెళ్ళగొట్టారు అని చెప్పాడు. UCIL ఉద్యోగులంతా యురేనియంకి సపోర్టుగా ఉంటారని చెప్పారు. ఇంకా దారుణమేమిటంటే ఇప్పుడతని సంవత్సరం వయసున్న కూతురు ఒంటి మీద మచ్చలు లేచాయి. ఇతని బోరుబావి నీళ్ళనే ఊర్లో వాళ్ళందరూ వాడకానికి తీసుకుపోయేవాళ్ళట… నీళ్ళు పుల్లగ, మంటగ అనిపించి అందరూ నీళ్ళు తీసుకుపోయేందుకు జంకారు… అటు వ్యవసాయం… భూమీ రెండూ చెడుపోయి బతుకును చెడగొట్టాయి. అతను నిరాశా నిస్పృహల్లో పడి పదేపదే ఆత్మహత్య చేసుకుంటాను అని వాపోతుంటాడు.
చావు మబ్బులు కమ్ముకున్న మబ్బుచింతలపల్లి గ్రామస్తులను వారి మానాన వారిని వొదిలేసి తుమ్మలపల్లి యురేనియం ప్రాజెక్టు ఏరియాకి పోయాము… సాయంత్రం వెళ్ళి ఫ్యాక్టరీ గేట్ల ముందు నిలబడి లోపలికి పోయేవాళ్ళనూ బయటికి వచ్చేవాళ్ళేనూ చూసాము… గేటు-1లోకి కాంట్రాక్టు ఉద్యోగులూ, గేటు-2లోకి పర్మనెంట్ ఉద్యోగులూ వెళతారు. మొత్తం 2000 మంది ఉద్యోగులుంటారని చెప్పారు… లోపల జోరుగా సాగుతున్న తవ్వకాల పనిని గురించి మాట్లాడుకుంటూ కెకె కొట్టాల
గ్రామం చేరుకున్నాము… రచ్చబండ కాడ చేరినవాళ్ళూ మేమూ గోలగోలగా… అక్కడికి తుమ్మలపల్లి బేసిన్ చాలా దగ్గరనే అనుకోవాలి. దారి పొడుగునా మంచినీళ్ళు, కలుషిత నీళ్ళ పైపూలు కనిపిస్తూనే ఉంటాయి.
75 ఏళ్ళ నరసింహులుకు 2 సంవత్సరాల నుండి 2 థైరాయిడ్ గడ్డలు తేలాయి. ఈ ఊర్లో ఇట్లాంటివాళ్ళు 10 మంది వరకు ఉన్నారట. అంజనమ్మకు తలమీద, ముక్కుమీద ట్యూమర్లు. యాలపు గంగమ్మ ఒళ్ళంతా చర్మంపై మచ్చలు. పులివెందులలో డిగ్రీ చదువుతున్న సునీల్ ఒక నెల రోజూలు కొట్టాలలో ఉన్నాడు. అతని వీపు పైనా, డొక్కల పైనా మచ్చలు. నాగప్ప-మునమ్మలు దిక్కులేని ముసలి రోగపు పక్షులు. వాళ్ళకూ గడ్డలు, మచ్చలు లాంటి రోగాలు చేరాయి. ఊరివాళ్ళే వాళ్ళకింత తిండి పెడుతున్నారు. దయతో ఒక వ్యక్తి ఇచ్చిన అతి చిన్న గదిలో ఉంటున్నారు. అక్కడంతా మెత్తటి వొదులు నేల కాబట్టి వర్షపు నీళ్ళతో కలిసి యురేనియం వ్యర్థాలు ఇంకి బోర్లలోకి వస్తున్నాయనీ… స్తోమత ఉన్నవాళ్ళు మినరల్ వాటర్ కొనుక్కుంటున్నారు, లేనివాళ్ళు ఇట్లా రోగాల పాలబడుతున్నారని సర్పంచ్ లింగేశ్వరయ్య చెప్పాడు. భూమూలు చాలా వరకు బీళ్ళుపడ్డాయి అనేది మామూలు విషయమే అక్కడ.
UCIL తరపున ప్రతి శుక్రవారం ముగ్గురు వైద్య సిబ్బంది ఊర్లోకి వస్తారు. ప్రతి జబ్బుకు ఒకటే రకం మాత్రలు ఇస్తారు. ఊరి జనం ఇక మాత్రలను పట్టించుకోవడం లేదు. అవి Gelucil, antibiotics, B-Complex మాత్రలని చెప్పారు.
పచ్చని గుట్టల నడుమ పరుచుకున్న అరటి తోటల నడుమ బీడుపడ్డ భూమూలు సాగదీసుకుపోయి ఆ ఊర్లన్నీ మచ్చలతో మసకేసిన చంద్రులవలె వికృతంగా మారిపోయాయి. పసిడి గిన్నెల్లో కాకపోయినా ప్రకృతి ఇచ్చిన ఆకు గిన్నెల్లో కమ్మని జున్నుపాలు తాగిన ఊర్లు… పాపల్లా నవ్వుతూ పంటలు తీసిన ఊర్లు నల్లమచ్చల చావు ముసుగుల్లో పడి గిలగిల్లాడుతున్నాయి.
Human disaster జరగడం మొదలయ్యింది… ఆ డిజాస్టర్ వల్ల పాడైన అక్కిడి నేల సారం, నీటి ఎద్దడి, విషపు నీళ్ళు, మురిగిపోతున్న పంటలు, బీళ్ళుగా మారిన భూములను చూసి నమ్మవలసి వస్తున్నది. ఇదేగాక ఆడవాళ్ళను పలకరిస్తే వాళ్ళు పునరుత్పత్తికి సంబంధించిన వికృతాలూ, విషాదాలూ జరుగుతున్నాయని చెప్పారు.
ప్రజలు నిరాశా నిస్పృహల్లో దిగబడిపోయి ఉన్నారు… ఎవరిలోనూ చలనం కనిపించడం లేదు. వాళ్ళకు శాంతీ లేదు సుఖమూ లేదు. అట్లాగని వాళ్ళలో కోపం, కసీ లేదు. పోరాడాలన్న తపనా లేదు. అన్నీ అణచుకున్నారో, అణచబడ్డాయో… పాలకుల పలకరింపూలు లేవు, గతంలో ఇచ్చిన వాగ్దానాలు… నమ్మజెప్పిన మాటాలు, ఇవ్వజూపిన ఆశలూ ఏవీ కనుచూపుమేరలో కానరావు. పట్టించుకునే నాథుడే లేడు. వీళ్ళలో తిరబడే శక్తీ లేదు అనిపించింది. వాళ్ళ పక్షాన ఎవరైనా పోరాడాలని ఆశిస్తున్నారు.
6 నెలల కిందట గత ప్రభుత్వం ఉన్నప్పుడు ధర్నాకు కూర్చుంటే మామీద కేసులు పెట్టారని కొట్టాల గ్రామపు పూజలమ్మ, లక్ష్మమ్మ, ఆదెమ్మలు విచారంగా చెప్పారు.
విధ్వంసాలున్నచోట తిరుగుబాట్లు, వినాశాలున్నచోట్ల నిరసనలు చరిత్ర పొడుగునా రక్తాక్షరాలతో లిఖించబడి ఉన్నాయి. పదేళ్ళ క్రితం నుండీ నిరసనలు జరిగాయి. తవ్వకాల పనులు ఆపేసారు తాత్కాలికంగా. కాని జరిగేది జరుగుతూనే ఉన్నది. ఇప్పుడు జనాల్లో యురేనియం భయం కన్నా పాలకులంటేనే భయం. వాళ్ళ నిశ్శబ్దం నిరాశల వెనుక పొంచివున్న ప్రమాదం కొందరు వ్యక్తులంటేనే – ఆ వ్యక్తుల కూటమి అయిన కుటుంబాలు అంటేనే – పట్టించుకోని అధికారమెక్కిన పాలకులంటేనే – పరిహసింపబడుతున్న ప్రజాస్వామ్యమంటేనే – అన్నీ పాడుబడాుపోతున్నయి – మట్టీ, సారం, నీళ్ళూ, చెట్లూ, పంటలూ, గాలీ, పశువులూ, ప్రాణాలు వెరసి పల్లెలు – ఇంకేం మిగిలింది – ఇంకేం మిగులుతుంది. It is a cruel game of politics in the name of development.
మరణ మృదంగాలు శోక రాగాలు తీస్తున్న ఆ ప్రాంతాలూ, పల్లెల ప్రజల మౌనం బద్దలయ్యేందుకు ఏం చెయ్యగలం? వాళ్ళ కోసం మనమున్నాం కానీ వాళ్ళూ మనమూ కలిస్తే ఒకటే కదా. ఇప్పటికీ దుఃఖంతో తోసుకొచ్చే ప్రశ్న ఏమిటంటే… చరిత్రలో ప్రాణులు, జీవసృష్టీ విధ్వంసంలోనే అభివృద్ధి దాగి ఉంటుందని పాలకులూ, కార్పోరేటు కంపెనీలూ నమ్మినట్లు మనమూ నమ్మేదెట్లా అని? అదేం అభివృద్ధి అని? Destructive అభివృద్ధి తప్ప గత్యంతరమే లేదా అని?
- అనిశెట్టి రజిత (ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక)