రాత్రి ఎలా ధ్యానం చేస్తోందో వానగా!
శతాబ్దాల చీకటిని చినుకుల చప్పుడుగా
వేల గొంగళి పురుగులు చీల్చుకు వచ్చిన సీతాకోకచిలుకలుగా,
లక్షల చిమ్మెటలు చేసే చిరు చప్పుళ్ళలా
మేఘానికెందుకో ఈ కక్ష?
ఏకధాటిగా ముంచెత్తే ఉప్పెన.
గాలికి తోడైన వాన, పాత జ్ఞాపకాల చెట్టును వేళ్ళతో పెరికేందుకు సిద్ధమౌతోంది.
తుఫాను తీరం దాటేందుకు సందేహపడుతుంది.
భూ కబ్జా కు బయలుదేరిన సంద్రానికి,
ఈదురు గాలుల నేపధ్య సంగీతం.
ఇదిప్పట్లో తెమిలే సమస్య కాదు.
ఏ ఏటికా ఏడు జనాన్ని కరువు, ఊళ్ళని వరద
పంచుకుని ఆరగిస్తాయి.
కన్నీళ్ల ఉప్పదనం ఇగిరేంతలో,
మరునాడు వెతుక్కునే మెతుకులా ఆకలి చిటికెలో ఎదుగుతుంది.
ఇరుకు గదుల్లో జీవితం రేయి తెల్లారాకనే చూడాలి.
వాయుగుండం కౌగలింతకు ఊపిరాడని పల్లె,
అల ఈడ్చిన తెరచాపలా చిరిగి పీలికలౌతుంది.
పసి గుడ్డు నిదురించే ఎద, కన్నీటితో నానిపోయింది.
పొయ్యి ఆనవాలు లేదు, ఇల్లు జలమయం,
జారిపోయే గోడ జాడ తెలియరాలేదు.
ఇపుడాకాశం విదిల్చే పెరుగన్నం మూటలు
వడిలో కొట్టుకెళ్ళిన కుండని వెతుక్కుంటాయి.
వణుకుతున్న చేను రైతు గుండె
చెదిరిపోయిన గూడు ఆ ఇల్లాలి నిట్టూర్పు.
నదీతీరాన తవ్వి తెచ్చిన మోసం
మేడ మీద మేడ గా ఎదుగుతుంటే,
దగా పడిన ఊరికి చిరునామా దొరకదు.
మీ గొంతు దగాపడుతున్న వాళ్ళపక్షం మోగుతోంది ……
Thanks కవి గారు.
గుండె బద్దలు కొట్టుకుని వాస్తవం వెలికి వచ్చింది. తుఫాను కొడవలి కోతకు ఉరి గొంతు నెత్తురోడింది.
Wonderful mam
అద్భుతమైన వాక్యాలతో ఆవేదనకు అద్దం పట్టారు..