తుఫాను కాలం 1

ఇవాళ ఆకాశం మబ్బేసిందెందుకని
అడిగింది పాప
వానొస్తుందో ముసురే పడుతుందో
వానగట్టుని తెంపేసే ముంపే వస్తుందో
ఏం చెప్పాల్లో తెలియని నిస్సహాయతలో
నేను
ఇవాళ ఊరంతా ఇళ్లల్లో ముడుక్కుందెందుకని
అడిగింది పాప

తుఫాను కాలం 2

ఇన్నాళ్లకు
ముసురు వదిలింది
నేలముఖం పచ్చబారింది
ఎక్కడో ఒక మొలక
మొలిచిన చప్పుడు
ఎక్కడో ఒక పిట్ట
ఎగిరిన చప్పుడు
ఇక్కడే నా అరచేతుల్లో
నీళ్లు ప్రవహిస్తున్న చప్పుడు

నది ఒడ్డు
ఇంత మట్టిని తీసి
బిడ్డని దీవించినట్టు
ఊరిని దీవిస్తుంది పురిటితల్లి

ఇన్నాళ్లకు
ముసురు వదిలింది
ఊరు
నదిలో ముఖం చూసుకుంటుంది

పోరాం, విజయనగరం జిల్లా. ఉపాధ్యాయుడు. బడన్నా పిల్లలన్నా కవిత్వమన్నా ఇష్టం. బతుకును బతుకులా ప్రేమించటమంటే ఇంకా ఇష్టం. 'ఎగ‌రాల్సిన స‌మ‌యం'(2014), 'ఆకు క‌ద‌ల‌ని చోట'(2016) క‌వితా సంక‌ల‌నాలు ప్ర‌చురించారు.

Leave a Reply