మాంసం బాబూ మాంసం
కోడి కన్నా మేక కన్నా సునాయాసంగా
దొరుకుతున్న మనిషి మాంసం బాబూ
ఏ కబేళాలలోనో నరకబడ్డ మాంసం కాదు బాబూ
ఏ కత్తి గాటు పడకుండానే
రహదార్ల మీద వడగళ్ల వానలా కురిసిన
మనిషి మాంసం ముక్కలు బాబూ
చావు భయంతో కాక బతుకు భయంతో
పరుగులెత్తుతున్న వెచ్చని నెత్తుటి మనుషుల
చల్లటి మాంసం బాబూ
మీరు నిర్బంధ విలాసాల్లో విసుగ్గా దొర్లుతున్నప్పుడు
రైలు పట్టాల మీద ఎగిసిపడ్డ మాంసం ముద్దలు బాబూ
చడీ చప్పుడు లేకుండా దూసుకొస్తున్న చావుతో
తరమబడ్డ మనుషుల పచ్చి మాంసం నాయనా!
తిరుగుబాటు చేయటం తెలియక తిరుగుబాట పట్టిన
మీ అంతటి మనుషుల మాంసం బాబూ
కనిపించని సూక్ష్మక్రిమిని హంతకుడిగా చూపించి
ముసుగేసుకున్న అసలైన వేటగాడెవడో
కనబడకుండానే విసిరిన బాణాలు చీల్చిన గుండెల్లోంచి
చివ్వుమని తన్నుకొచ్చిన రక్తంలో తడిసిన మాంసం బాబూ
అరి కాళ్లను మంటల్లోకి కట్టెల్లా నెట్టినట్లు
మండుతున్న రోడ్ల మీద అడుగడుగూ వేసుకుంటూ
వాళ్లు వెళుతున్నది చావు నుండి పారిపోటానికి కాదు బాబూ!
వాళ్ల నడకని ఓ ఎరుక నడిపిస్తున్నది
ఎగిరొచ్చిన వలస పక్షి
చస్తే తన చావు పడకని పుట్టిన గూటిలోనే ఏర్పాటు చేసుకోవాలనుకొని
కార్చిచ్చుల పాలైన అడవుల నుండి వెనక్కి తిరిగి ఎగురుతూ వెళ్లినట్లు
వాళ్లు ఇంటి బాట పట్టిన సిద్ధార్థుల్లా నడుస్తున్నారు
***
జాతి నిర్మాణానికి దేహాల్ని పనిముట్లుగా ఉపయోగించి
తమ కంకాళల్ని తీసి పునాదుల్లో భద్రపరిచిన వాళ్ల చేతుల్లో
పంటలా పెరిగిన దేశం
వాళ్ల కాలి పిక్కల గట్టిదనంతో బలపడ్డ దేశం
వాళ్ల భుజాల మీదగా ఎదిగిన దేశం
వాళ్ల కండల్ని కరగతీసి పరిశ్రమలై భవంతులై విరగబడి నవ్విన దేశం
ముఖానికి ముసుగులు తొడుక్కొని
భయం భయంగా నిర్దాక్షిణ్యంగా వాళ్ల వీపుల మీద కత్తులు దించింది
సంపదల్ని సృష్టించిన వాళ్లు కాందిశీకులై తరమబడుతున్నారు బాబూ
అంతేలే బాబూ అంతేలే
ఇది చేతులకి నెత్తురంటని
హంతకుల యొక్క హంతకుల కొరకు హంతకులచే తీర్చిదిద్దబడ్డ రాజ్యం కదా!
కన్నెర్ర చేయకు బాబూ
బాధ్యతల్లేని పాలకులందరూ హంతకులే కదా!
Wonderful poem.
గొంతు పూర్తిగా గుండల్లోంచి పుట్టుకొస్తే…మాట ఆఖరి వాక్యమంత పదునౌతుంది.