అరుణాక్షర అద్భుతం – 05
దిగంబర కవుల మూడో సంపుటం తర్వాత, సాహిత్యంలో వర్గపోరాటం ఉధృతం కావడానికి, అరుణాక్షర ఆవిష్కరణ జరగడానికి చిట్టచివరి అడుగు, ఉష్ణోగ్రత తొంబై తొమ్మిదో డిగ్రీకి చేరడం, గుణాత్మక మార్పుకు ముందరి క్షణం 1969లో వేగవంతమైంది. అప్పటికే నక్సల్బరీ ప్రజ్వలన జరిగి రెండు సంవత్సరాలు. శ్రీకాకుళంలో 1967 అక్టోబర్ 31 కోరన్న, మంగన్న అమరత్వం, తత్ఫలితంగా 1968 నవంబర్ 25న సాయుధ పోరాట ప్రారంభానికి పిలుపునివ్వడం అప్పటికే జరిగి ఉన్నాయి. ఆ సామాజిక పరిణామ క్రమంలో నిర్దిష్టంగా సాహిత్యరంగ పరిణామానికి తక్షణ ప్రధాన ఉత్ప్రేరకాలుగా పనిచేసిన నాలుగు సందర్భాలు సృజన ఆధునిక సాహిత్య వేదిక, విద్యుల్లత మాసపత్రిక, తిరుగబడు కవితా సంకలనం, 1970 ఫిబ్రవరిలో జరిగిన శ్రీశ్రీ షష్టిపూర్తి సన్మానం.
“పదునుపెట్టిన కత్తి అంచుల మీద
రక్తాక్షరాలు
ఆహ్వానం అందుకో
ఇరవయ్యేళ్ల అవమానంలో కాలి కాలి
ప్రేలుటకు సిద్ధంగా ఉన్నాను
ట్రిగర్ మీద వేళ్లతో – రా
….
ఈసారి నీ సమాధానం
అరిగిన మాటల్లో కాదు
విరిగిన వెకిలి నవ్వులో కాదు
ట్రిగర్ మీద పరుగెత్తే వేళ్లలోంచి
మండే కనుల్లోంచి
మరిగే గుండెలోంచి’
తుపానుల శ్వాసలోంచి
పరాభూతమైన ప్రతి అణువులోంచి
బులెట్ శబ్దంలోంచి రావాలి
మానవత్వం పలికే నీ రక్తంతో
కొత్త చరిత్ర రాయాలి
అందుకే అంటున్నా
మరో మాట వద్దు
వేరే బాట వద్దు
బయనెట్ పాయింట్ మీద మాట్లాడమంటున్నా
ట్రిగర్ మీద వేళ్లతో రమ్మంటున్నా”
అని ‘సాహితీమిత్రులు’ నిర్వహణలో వరంగల్ నుంచి 1966 నవంబర్ లో ప్రారంభమైన సృజన ఆధునిక సాహిత్య వేదిక 1969 ఫిబ్రవరిలో వెలువడిన పదో సంచిక ముఖచిత్రం మీద లోచన్ రాసిన ‘ట్రిగర్ మీద వేళ్లతో’ అనే కవితా శీర్షికను ప్రచురించి, లోపల పూర్తి కవితను ప్రచురించి యుద్ధసన్నద్ధ యుగస్వభావాన్ని ప్రకటించింది.
అలాగే 1969 ఆగస్ట్ లో కరీంనగర్ సాహితీమిత్రమండలి నిర్వహణలో యువ సాహిత్య మాసపత్రికగా ప్రారంభమైన విద్యుల్లత ఆ కాలపు యువస్వరాల వేదికగా కళపెళ ఉడుకుతున్న సమాజానికి అద్దం పట్టింది. “యువతరం కొత్త బలాన్ని పుంజుకొని సమాజం యెడ తన బాధ్యత స్వీకరించి సమకాలీన జీవిత ప్రతిబింబాన్ని కవితతో వెలుతురులోకి తీసుకొని గొప్ప సంచలనంతో పురోగమించాల”ని ఆశించింది.
మరి నాలుగు నెలలు గడిచేసరికి, 1969 డిసెంబర్ లో వరంగల్ నుంచి స్వేచ్ఛాసాహితి ప్రచురణగా వెలువడిన ‘తిరుగబడు’ కవితా సంకలనం “తిరుగుబాటు తత్వం మానవ స్వభావంలో వున్నది. ఈనాడు మేల్కొంటున్న ఈ దేశంలో అక్కడక్కడా రాజుకుంటున్న ప్రజా పోరాటాలే అందుకు నిదర్శనాలు. ప్రజలు గెలుస్తారు. పరిపాలకులు తమ బూజుపట్టిన సాలెగూళ్లలో చస్తారు. ఏ శక్తీ జనశక్తిని ఎదిరించలేదు. ఏ యుక్తీ యువరక్తాన్ని ఎంతో కాలం చల్లార్చలేదు. అరణ్యాల్లో, కొండకోనల్లో, చెట్లల్లో, పొదల్లో కార్చిచ్చులా రాజుకుంటున్న యీ జ్వాలల్ని పంచడానికే మా యీ తిరుగుబాటు హస్తాలను అందిస్తున్నాం. మాతో పాటు యీ దేశంలో విప్లవం రావాలని నిజాయితీగా భావిస్తున్న వెన్నెముకా ముందుచూపూ గల యువకులందరినీ అందుకే తిరగబడుదాం రమ్మంటున్నాం. పదను పెట్టిన కత్తి అంచుమీద రక్తాక్షరాలతో ఇదే మా పిలుపు. అందుకొని కదలండి” అంటూ పేరు చెప్పకుండానే శ్రీకాకుళ రైతాంగ పోరాటానికి స్నేహ హస్తాలు అందిస్తున్నాం అని స్పష్టంగా, నిర్ద్వంద్వంగా ప్రకటించింది.
ఆ మరుసటి నెల (జనవరి 1-2, 1970) జరగవలసి ఉండి, ఆర్థిక కారణాల వల్ల నెల వాయిదా పడి ఫిబ్రవరి 1-2 తేదీల్లో విశాఖపట్నంలో జరిగిన శ్రీశ్రీ షష్టిపూర్తి సన్మాన సభ ఈ పరిణామాలన్నిటినీ శిఖర స్థితికి తీసుకువెళ్లింది. శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటంతో, ప్రత్యేకించి సుబ్బారావు పాణిగ్రాహి అమరత్వంతో ప్రభావితులైన విద్యార్థులు రచయితల సామాజిక బాధ్యత గురించి తీవ్రమైన ప్రశ్నలతో ఒక కరపత్రం వేసి అక్కడ సభలో పంచడం, ఆ ప్రశ్నలకు జవాబు ఇవ్వడంలో రచయితలు రెండు శిబిరాలుగా విడిపోవడం తెలుగునాట అరుణాక్షర ఆవిష్కరణకు రంగాన్ని సిద్ధం చేసింది. ప్రజల సాయుధ పోరాటాన్ని గానం చేసే ఒక రచయితల సంఘం, అరుణాక్షర సంఘటన ఆవిర్భావానికి దారి తీసింది.
ఈ నాలుగు సందర్భాలు కూడ హఠాత్తుగా ఆకాశం లోంచో శూన్యం లోంచో ఊడిపడినవి కావు. నేపథ్యంలోని సామాజిక రాజకీయార్థిక సాంస్కృతిక పరిణామాలు ఒక కారణమైతే ప్రత్యేకంగా ఈ నాలుగు సందర్భాల పరిణామ క్రమాలు రూపొందించిన కారణాలను కూడ పరిశీలించవలసి ఉంటుంది.
అప్పటికి మూడు సంవత్సరాలుగా వెలువడుతున్న సృజన పరిణామ క్రమాన్ని చూస్తే, అంతర్జాతీయ కోపోద్రిక్త దశాబ్దపు, చైనా శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవపు వాతావరణం నుంచీ, నక్సల్బరీ శ్రీకాకుళ ప్రజా ప్రజ్వలనాల యుగస్వభావం నుంచీ సృజన పుట్టుక, పెరుగుదలలను వేరు చేసి చూడడం సాధ్యం కాదు. వేణుముద్దల నరసింహారెడ్డి, నవీన్ అనే కలం పేరుతో రాస్తున్న డొంగరి మల్లయ్య, రామన్నగా ప్రఖ్యాతమైన గంట రామిరెడ్డి, వరవరరావు అనే నలుగురు వరంగల్ మిత్రులు ‘సాహితీమిత్రులు’గా ప్రారంభించిన పత్రిక సృజన. వీరిలో నరసింహారెడ్డి, వరవరరావు తెలుగు పట్టభద్రులు కాగా, నవీన్ అర్థశాస్త్రంలో, రామన్న తత్వశాస్త్రంలో పట్టభద్రులు. నలుగురిలో ముగ్గురు కళాశాలల అధ్యాపకులు కాగా, రామన్న పాఠశాల ఉపాధ్యాయులుగా స్థిరపడ్డారు. వీరిలో వరవరరావు హైదరాబాద్ లో సెవెన్ స్టార్స్ సిండికేట్ తరఫున కేవలం కవిత్వం కోసమే 1963లో ప్రారంభమైన నవత పత్రిక నిర్వహణలో భాగస్వామి. ఆ పత్రికకు గౌరవ సంపాదకుడుగా శ్రీశ్రీని ఒప్పించినది వరవరరావే. శిష్టా జగన్నాథం, బి ఎ వి శాండిల్య వంటి ఇతర నిర్వాహకులు ఆ పత్రిక ప్రకటించుకున్న శాస్త్రీయ దృక్పథం, సమసమాజ దృష్టి అవగాహనను వదిలివేస్తున్నారనే ఆలోచనతో 1965 నాటికే వరవరరావు ఆ పత్రికకు దూరమయ్యారు. ఆ తర్వాత ఈ నలుగురూ 1966 మేలో హనుమకొండలో వే. నరసింహారెడ్డి ఇంట్లో సమావేశమై ఆధునిక సాహిత్య వేదికగా ఒక పత్రిక తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. అలా ఒక ఆధునిక సాహిత్య వేదిక కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపి కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ ప్రోత్సాహాన్ని కూడ సంపాదించారు గాని ఆయన మరణించడంతో, ఆయన స్మృతిలోనే 1966 నవంబర్ లో తొలిసంచిక వెలువరించారు.
ఈ పత్రికను, అసలు మొదట పత్రికగా క్రమం తప్పకుండా తేగలుగుతామా లేదా అని అనుమానంతో, కనీసం మూడు నెలలకొక సంచిక తేవాలన్న సంకల్పం తో ఒక “ప్రయోగం”గా మాత్రమే భావిస్తూ ప్రారంభించారు. అప్పటికింకా నక్సల్బరీ శ్రీకాకుళాలు లేవు. భారత కమ్యూనిస్టు పార్టీలో చీలిక జరిగింది గాని కొత్తగా ఏర్పడిన భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) విప్లవాచరణలోకి దిగుతుందో లేదో తేలలేదు. భవిష్యత్తు నక్సల్బరీ నేత చారు మజుందార్ అప్పటికే తన ఎనిమిది దస్తావేజుల రచన ప్రారంభించారు గాని తెలుగు సీమలోకి వాటి సమాచారం వచ్చిందనే దాఖలాలు లేవు. చైనా శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవం ప్రారంభమైంది గాని దాని సమాచారం కూడ తెలుగు ఆలోచనాపరులకు ఎంత తెలుసునో తెలియదు. అయితే ఇవన్నీ స్పష్టంగా, నిర్దిష్టంగా తెలియకపోయినా, యువతరంలోని అసంతృప్తి, కొత్త మార్గాల కోసం అన్వేషణ, నెహ్రూ సోషలిజం పట్ల భ్రమలు, ఆశాభంగాలు, వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలో సాగుతున్న ఆందోళనలు, నల్లజాతి ఉద్యమాలు వంటి పరిణామాల ప్రభావం ఉండే ఉంటుంది.
“ఆధునిక సాహిత్యానికి ఒక పత్రిక లేదనే ఆరాటం చాలా రోజులుగా చాల మందిని బాధిస్తూనే ఉన్నది.
ఆధునిక సాహిత్యమంటే – శాస్త్రీయ దృక్పథం, హేతువాదం, సమకాలీన సమాజం – వీని ప్రభావం వ్యక్తి జీవితంలోని అన్ని అంశాల మీద కొద్దో గొప్పో ఉన్నదని గుర్తించడం. ఈ గుర్తింపు ఉన్న రచనని ఆధునిక సాహిత్యంగా నిర్వచించవచ్చు. ఇతరమైన విలువల్ని కూడా విస్మరించకుండా.
ఇది ఒక సాహస ప్రయోగం. ఇది పత్రికా? కాదు; మారుతున్న కాలాన్నీ విస్తృతమౌతున్న జాగృతినీ, ప్రతిబింబించే అనువదించే ఒక ఫోరమ్. దీనికి సంపాదకుడు లేడు, సాధకులే తప్ప. ప్రయోగశీలత్వం, సృజనాత్మక శక్తి, ఆధునిక దృక్పథం ఈ ఫోరమ్ పునాదులు” అని సృజన తొలి సంచిక సంపాదకీయంగా రాసిన ‘ప్రయోగం’లో రాశారు.
సృజన నూరవ సంచిక (ఫిబ్రవరి – మే 1980) లో రాసినట్టు “సృజన ప్రారంభమైన నాటికి తెలుగులో ఆధునిక సాహిత్యానికి పత్రిక లేదు. కవిత్వానికి సంబంధించినంతవరకు ‘నవత’ తొక్కిన కొత్తదారి ఉంది. కాని ఆ దారికి కూడ రూపం, ప్రయోగం విషయంలో ఉన్న ఆసక్తి వస్తువు విషయంలో లేదు. సృజన మొదటి నుంచీ ఆధునిక సాహిత్యమంటే ప్రయోగశీలత్వం మాత్రమే కాదు, శాస్త్రీయ దృక్పథమూ, సామాజిక సృహ కూడ కలిగి ఉండడమని అర్థం చెప్పుకున్నది….
అయితే ఇవాళ వెనక్కి తిరిగి చూస్తే అర్థం అవుతున్నదేమంటే స్పష్టాస్పష్టంగా, వ్యక్తావ్యక్తంగా, చేతనాచేతనంగా సృజన పుట్టుకలోనే తొమ్మిది రాష్ట్రాల్లో కాంగ్రెస్ కుటుంబపాలన నిరాకరణ భావన ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా అసంతృప్త కోపోద్రేక యువతనం నిరసన, తిరుగుబాటు ఉంది. నక్సల్బరీ పురిటి నొప్పుల చప్పుడు, నెత్తుటి గుడ్డు సృజనలో అప్పుడు సాహితీమిత్రులు, పాఠకులు పోల్చుకున్నా పోల్చుకోకున్నా ఇవాళ సృజన నక్సల్బరీ సృజన అని మెప్పుకైనా, నిరాకరణకైనా అందరూ అంగీకరిస్తారు, చాలమందికివాళ నక్సల్బరీ ‘బరీ’ (ఆవాసం) అయినందుకే సృజన ఇష్టమైతే, అట్లా అవడం దురదృష్టకరం, ఇది నిష్పాక్షికమైన, శుద్ధమైన ఆధునిక సాహిత్య పదార్థంగా తన ప్రత్యేకతను నిలుపుకుంటే బాగుండునన్న అవేదనా, విచారమూ కొందరికి మిగిలాయి”.
అలా సృజన ఒక అస్పష్టత నుంచి, అవ్యక్తత నుంచి, అచేతన నుంచి క్రమక్రమంగా ప్రజారాజకీయాల అన్వేషణలోకి, స్పష్టతలోకి, ప్రజారాజకీయాల నిబద్ధతలోకి, ప్రజారాజకీయ గళంగా నిలిచే స్థితికి సాగి వచ్చింది. ఆ క్రమంలోనే 1969 నాటికి సాగిన ఎనిమిది సంచికల ప్రయాణంలో అటు పాత అస్పష్టతా కనబడుతుంది. సమాజ సాహిత్య సంబంధాలలో ఇంకా పూర్తి సమగ్ర అవగాహన లేని స్థితీ కనబడుతుంది. అసంకల్పితంగానే సమాజ చలనాన్ని గ్రహిస్తున్న సీస్మోగ్రాఫ్ కూడ కనబడుతుంది. సమాజంలో విస్తరిస్తున్న స్పష్టతను ప్రతిబింబించడమూ ప్రతిఫలించడమూ కూడ కనబడతాయి.
సృజన మూడో సంచిక (1967 మే – జూలై) నాటికే ముఖపత్ర కవితగా ప్రచురించిన ‘రక్త చలన సంగీత శ్రుతి’లో
“నీతి ధర్మాల వ్రణాలపై
దోమలు ముసిరి
విసురుకోలేనంత
అసహాయయై మూల్గుతోంది
సంఘం.
నాలోని వెలుగుతో
ఈ నీడ చెరిపి
నా నెత్తుటి వాడితో
ఈ వ్రణము చీల్చి
రక్త చలన సంగీత శ్రుతి
రేపు వినిపిస్తాను
నేను భవిష్యత్తు మనిషిని
రేపు కనిపిస్తాను” అనే స్పష్టత వైపు ప్రయాణం ప్రారంభమైంది. ఆరో సంచికలో కె వి రమణారెడ్డి రాసిన ‘మేధావులూ వారి నైతిక బాధ్యతలూ’, ఏడో సంచిక చలం ప్రత్యేక సంచిక, తొమ్మిదో సంచిక భారతీయ సాహిత్య పరామర్శగా వివిధ భారతీయ భాషల్లోని తిరుగుబాటు ధోరణుల కవిత్వానువాదాలు వంటి ఎన్నో రచనలు 1969కి రంగం సిద్ధం చేసి పెట్టాయి. అలా సృజన పాఠకులుగా ఉన్న ఆధునిక తెలుగు సాహిత్య పాఠకుల, సాహిత్యకారుల ఆలోచనలు 1970లో జరగనున్న అరుణాక్షర ఆవిష్కారానికి సిద్ధపడ్డాయి.
సరిగ్గా ఇదే సమయంలో పుట్టింది సాహితీ మిత్ర మండలి, కరీంనగర్ నిర్వహించిన యువ సాహిత్య మాసపత్రిక విద్యుల్లత. భాగ్యనగర్ విజయ్ కుమార్, గోపు లింగారెడ్డి సంపాదకులుగా, వుమెంతల వెంకటరెడ్డి, నరెడ్ల ప్రభాకర్ రావు నిర్వాహకులుగా మే 1969లో పరిచయ సంచిక వెలువడిన విద్యుల్లత ఆగస్ట్ 1969 సంచికను ప్రారంభ సంచికగా ప్రకటించింది. విద్యుల్లత అప్రకటిత సంపాదకుడు, చోదకశక్తి అప్పటికి జమ్మికుంట ఆదర్శ కళాశాలలో తెలుగు అధ్యాపకుడుగా పనిచేస్తున్న ఎం వి తిరుపతయ్య. ఈ పత్రిక కరీంనగర్ జిల్లా విద్యార్థి యువజనులలో ఆధునిక, అభ్యుదయ, విప్లవ భావాలు వ్యాపించడానికి అసాధారణమైన కృషి చేసింది. విద్యుల్లత నిర్వాహకులలో విజయ్ కుమార్, లింగారెడ్డి ఇద్దరూ ఆ తర్వాత విప్లవ రచయితల సంఘం లోకి వచ్చారు. మిగిలిన ముగ్గురూ విప్లవోద్యమానికి, విప్లవ సాహిత్యోద్యమానికి సన్నిహితంగా ఉన్నారు. కాళోజీ, వరవరరావు, సివి కృష్ణారావు, టంకశాల అశోక్, రాజలోచన్, నవీన్, అట్లూరి రంగారావు, కె శివారెడ్డి, ఎన్ కె, వేగుంట మోహన్ ప్రసాద్, పాములపర్తి సదాశివరావు, అద్దేపల్లి రామమోహన్ రావు, త్రిపురనేని మధుసూదనరావు, జగన్ మోహన్ సి ఎ వంటి వారి రచనలను ఈ పత్రిక ప్రచురించింది. ముప్పాళ నరసింహారావు (తర్వాత గణపతిగా సుప్రసిద్ధుడైన ముప్పాళ లక్ష్మణ రావు అన్న), ఎం వి తిరుపతయ్య, తాడిగిరి పోతరాజు వంటి తొలితరం విప్లవకథకుల కథలు ఈ పత్రికలోనే మొదటిసారి అచ్చయ్యాయి.
విద్యుల్లత డిసెంబర్ 1969-జనవరి 1970 సంచికలో దినకర్ రాసిన ‘విప్లవాన్ని సృష్టిస్తాను’ కవిత ఆ కాలపు యువస్వరాన్ని ప్రతిధ్వనించింది:
తొలకరి అమృతపు జల్లుల కోసం
నిరీక్షిస్తూ వున్న
బీడుపడిన నా గుండె మాగాణిపై….
అశ్రుధారా వర్షం!
తూరుపు తలుపును తెరచుకొని, అవనికి అరుదెంచే
ఉషస్సుందరిని సందర్శించడం కోసం
పూర్తిగా విచ్చుకొనిన నా సులోచనాలపై…
చీకటి కత్తిపోట్లు!
అడవులనూ, లోయలనూ, ఎడారులనూ దాటి
సమున్నత మానవతా శిఖరాగ్రాన్ని
చేరుకోవడానికి నిరంతరం యత్నిస్తూ వున్న
నాకాళ్లకు…. బలమైన బంధాలు!
మంచులాంటి మంచితనంతో ప్రగతిని సాధించలేను!
తప్పదు మరి, విప్లవాగ్ని జ్వాలను సృష్టిస్తాను నేను!!
సృజన, విద్యుల్లతలలో క్రియాశీలంగా ఉన్న, రాస్తున్న పది మంది కవులు స్వేచ్ఛాసాహితి ప్రచురణగా 1969 డిసెంబర్ లో ‘తిరుగబడు’ కవితా సంకలనం ప్రచురించారు. ఈ పది మంది వరవర రావు, లోచన్, అశోక్, సంజీవరావు, సుధాకర్, యాదగిరిరావు, కిషన్, సుదర్శన్, ఎక్స్-రే, ఐ. ముప్పై ఎనిమిది కవితలున్న ఈ సంకలనంలో వరవర రావు, లోచన్, సంజీవరావు, సుధాకర్, యాదగిరిరావు, సుదర్శన్ లవి తలా నాలుగు కవితలు, అశోక్ వి ఐదు కవితలు, కిషన్, ఎక్స్ రే, ఐ లవి తలా మూడు కవితలు ఉన్నాయి.
స్వచ్ఛంద కవితా సంచలనం అని స్వయంగా చెప్పుకున్న ఈ సంకలనానికి కచ్చితంగా యాబై సంవత్సరాల కింద రాసిన నాలుగు పేజీల ముందుమాటలో ప్రతి పదమూ వాక్యమూ ఇవాళ్టికీ తాజాగా, ప్రాసంగికంగా కనబడుతుంది. “విషం కలిపిన పాయసం మన స్వరాజ్యం. డబ్బున్న భడవా పోషించే ఉంపుడుగత్తె మన ప్రజాస్వామ్యం. మన ప్రణాళికలూ తీర్మానాలూ వాగ్దానాలూ రేడియో పత్రికలూ సినిమాలూ సాహిత్యమూ ఒకటేమిటి అన్ని రంగాలూ ఇరవయ్యేళ్లకే పడుపుకూడు తిని రాగూడని రోగాలు తెచ్చుకొని ముసలిదైన దీని విలాసాల్ని వర్ణించడానికే ఖర్చయిపోతున్నాయి. ఇంత నవయవ్వనంలో ఎంతో ఆరోగ్యవంతంగా ఎంతో బలంగా ఉండాల్సిన ఈ దేశం ఎందుకిట్లా అయింది….” అని ప్రారంభించి, “ఈ నిజాన్ని పీడిత, తాడితులకు తెలిపి వారిని గాఢనిద్రనుంచి మేల్కొల్పి చైతన్యవంతులుగా చేయటం ఈరోజు అభ్యుదయవాదుల కర్తవ్యం. మనిషిని మనిషి దోచుకునే ఈ వ్యవస్థ పుచ్చిపోయిన సమాధుల్ని నిర్మూలించి సామ్యవాద సమాజాన్ని నిర్మించాలి. ఈ వ్యవస్థను శస్త్రచికిత్స చేసి కొత్త వ్యవస్థను నిర్మించటానికి త్యాగాలూ బలిదానాలూ తప్పవు. విప్లవం వర్ధిల్లాలని పోరాడే యోధుని చావు ఓటమి కాదు. ఆకలితో రోజూ చచ్చేవారు తమ న్యాయమైన హక్కులకొరకు జరిగే పోరాటంలో చావడానికి సిద్ధపడాలి. త్యాగాలు లేకుండా ఫలితాలు రావు. స్వాతంత్ర్యం ఆకాశం నుంచి ఊడిపడదు. పోరాటం ద్వారానే లభిస్తుంది. ఇది చరిత్ర చెప్పిన సత్యం.” అని ఆ ముందుమాట స్పష్టంగా ప్రకటించింది.
దిగంబరకవులు మూడో సంపుటం సమాజ దుస్థితిని అసహ్యంతో, ఆగ్రహంతో వివరించి, విమర్శించగా, జుగుప్స ప్రకటించగా, ఏడాది తర్వాత వెలువడిన తిరుగబడు కొంతవరకు ఆ భాష వాడుతూనే, ఆ సమాజ దుస్థితిని మార్చడానికి ప్రజలు పోరాడుతున్నారని గుర్తించింది. సమాజ దుస్థితి మారాలని కోరుకునే బుద్ధిజీవులు ఆ పోరాటాలకు స్నేహ హస్తాన్ని అందించాలనీ నిర్దేశించింది. సమాజంలో సాగుతున్న పోరాటాలను చిత్రించడం, ప్రతిఫలించడం, సమర్థించడం, విస్తరించడానికి ప్రయత్నించడం కవులూ సాహిత్యకారులూ బుద్ధిజీవులూ చేయవలసిన పని అని తిరుగబడు కవులు స్పష్టంగా ప్రకటించారు.
అంటే, ఆ బాధ్యతను గుర్తించిన కవులూ సాహిత్యకారులూ బుద్ధిజీవులూ ఆ పని చేయడానికి సంఘటితం కావాలని, ఒక సమష్టి నిర్మాణరూపం ధరించాలని ఆలోచించడం మరొక్క అడుగు. లేదా మరొక్క అంగుళం. ఆ అంగుళం ముందుకు కదలడానికి అవకాశం ఇచ్చినది విశాఖపట్నంలో జరిగిన శ్రీశ్రీ షష్టిపూర్తి సన్మాన సందర్భం. అప్పటికి శ్రీశ్రీ పుట్టినరోజు జనవరి 2 అనే పొరపాటు అభిప్రాయమే ఉండింది గనుక 1970 జనవరి 2 శ్రీశ్రీ షష్టిపూర్తితో కలిసివచ్చేట్టుగా విశాఖపట్నంలో 1970 జనవరి 1-2 తేదీల్లో సన్మానం జరపాలని, శ్రీశ్రీ రచనలన్నీ సంపుటాలుగా తేవాలని 1969 జూలైలోనే తెన్నేటి విశ్వనాథం గౌరవ అధ్యక్షుడుగా, పురిపండా అప్పలస్వామి అధ్యక్షులుగా, రాచకొండ విశ్వనాథశాస్త్రి ఉపాధ్యక్షులుగా, తూమాటి దొణప్ప, కాళీపట్నం రామారావు కార్యదర్శులుగా, విన్నకోట రామమూర్తి గుప్త, చలసాని ప్రసాద్ కోశాధికారులుగా ఒక సన్మాన సంఘం ఏర్పాటయింది. ఆ సన్మాన సభలు నెల వాయిదా పడి ఫిబ్రవరి 1-2 తేదీల్లో జరిగాయి.
సన్మాన కార్యక్రమాల గురించి వివరాలు ఇక్కడ అవసరం లేదు గాని, ఆ సభల్లో మొదటి రోజు, ఫిబ్రవరి 1న ఉదయం 9 గంటలకు పానగల్ బిల్డింగ్స్ లో తూమాటి దొణప్ప గారి అధ్యక్షతన ‘సమాజం – సాహిత్యం’ అనే అంశం మీద చర్చాగోష్టి మొదలైంది. వెల్చేరు నారాయణ రావు సభికులకు స్వాగతం చెప్పారు. దొణప్ప అధ్యక్షోపన్యాసం తర్వాత తాపీ ధర్మారావు, కొడవటిగంటి కుటుంబరావు, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి ప్రసంగించారు. హనుమచ్ఛాస్త్రి ఉపన్యాసం అయిపోగానే మల్లంపల్లి కృష్ణారావు అనే ఆంధ్ర విశ్వవిద్యాలయ వైద్య విద్యార్థి వేదిక ఎక్కి ‘విశాఖ విద్యార్థులు’ ప్రచురించిన నాలుగు పేజీల కరపత్రం చదివారు. ఆ కరపత్రాన్ని సభలో పంచారు.
ఆ కరపత్రం తెలుగు సమాజ సాహిత్య చరిత్రను మలుపు తిప్పిన ఒక మహత్తర చారిత్రక పత్రం. ఆ పత్రం ఆ రోజూ, మర్నాడూ విశాఖ సభల్లో తీవ్రమైన వాదవివాదాలకూ చర్చలకూ అమోదాలకూ ఘర్షణలకూ భూమిక కావడం మాత్రమే కాదు ఆ తర్వాత నాలుగు నెలలకు ఏర్పడిన విప్లవ రచయితల సంఘానికి, ఆ నాలుగు నెలల్లో జరిగిన అనేకానేక అనుకూల ప్రతికూల ప్రయత్నాలకు కూడ కారణమైంది.