తిరిగి తిరిగొచ్చే కాలం

కాలానికి ఏకముఖ చలనం మాత్రమే ఉందనే విజ్ఞానశాస్త్రపు అవగాహనను సంపూర్ణంగా అంగీకరిస్తూనే, అది ప్రకృతిలో ఎంత నిజమో సమాజంలో అంత నిజం కాకపోవచ్చునని కూడా గుర్తించాలి. సమాజంలో నిలిచిపోయిన కాలం గురించో, వెనక్కి నడిచే కాలం గురించో మాట్లాడుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ, ఒక మినహాయింపు కూడా ఉందని గుర్తించాలి. కాలానికి తిరిగి తిరిగి వచ్చే, కొత్త ఆశలు మోసుకొచ్చే, కొత్త మోసులు వికసింపజేసే లక్షణం కూడా ఉన్నది. కాకపోతే పాతకాలమే యథాతథంగా తిరిగిరాకపోవచ్చు. అటువంటి కాలమే తిరిగి వచ్చిందని అనిపిస్తుంది గాని, ఆ కాలంలోని ప్రధానాంశాలు మరింత అభివృద్ధి చెంది తిరిగి రావచ్చు. చరిత్ర గమనాన్ని అంతకంతకూ పైకి వెళ్లే గ్రాఫ్ లాగా చూసినప్పుడు, ఆ గ్రాఫ్ ఎన్ని సార్లు లోయల్లోకి పడిపోయినప్పటికీ, మరెన్ని సార్లు శిఖరాలకు ఎగబాకినప్పటికీ, గుర్తించవలసిన నియమం ప్రతి కొత్త లోయా, పాత శిఖరం కన్నా పై ఎత్తున ఉండడమే అన్నాడు గార్డన్ చైల్డ్.

మరొక మాటల్లో చెప్పాలంటే గత కాలం యథాతథంగా తిరిగి రాకపోవచ్చు గాని పాతకాలపు ప్రగతిశీల అంశాలు కొత్త చిగుళ్లు వేసే కొత్త కాలం వస్తుంది. పాతకాలపు విత్తనాలు మొలకలెత్తే కొత్త కాలం వస్తుంది. పాతకాలపు నిప్పురవ్వలు దావానలమయ్యే కొత్త కాలం వస్తుంది. ఈ కొత్త కాలాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే ఆ పాత కాలపు బీజాలను స్మరించుకోవాలి.

కాలానికి ఏకముఖ చలనం మాత్రమే ఉందని తెలియని రోజుల్లో బహుశా మనుషులు రాత్రిందివాల పరిణామాన్నీ, రాశిచక్రగతులనూ చూసి, ప్రకృతిలో కాలానికి చక్రగతి ఉందనుకున్నారు. వచ్చిన ఉదయమే మళ్లీ వచ్చినట్టు, నిన్నటి రాత్రే ఇవాళ మళ్లీ వచ్చినట్టు, రుతువులు మళ్లీ మళ్లీ వచ్చినట్టు కాలం కూడా వృత్తాకారంలో తిరుగుతుందేమో అనుకున్నారు. అందుకే చాలా ప్రాచీన నాగరికతలలో కాలపు కొలమానానికి తిరిగి వచ్చే పేర్లున్నాయి. మన అరవై ఏళ్ల సంవత్సర చక్రం లాగా, చైనీయుల పన్నెండేళ్ల సంవత్సర చక్రం లాగా ఆ పేర్లు చక్రభ్రమణంలో ఉన్నాయి. భారత, చైనా కాలమానాలలో తిరిగిరాని అంకెల పద్ధతి కూడా ఉంది గాని, అది సంపూర్ణంగా ప్రపంచమంతా అమలయినది ఆధునిక కాలంలోనే. ఇందులో ఒక సంవత్సరాన్ని, ఒక కాలాన్ని ఒకసారి దాటామంటే మళ్లీ ఎన్నటికీ తిరిగి చేరలేం.

నిజంగానే గడిచిపోయిన కాలం తిరిగి రాదా?

మనకు తెలిసి చరిత్రలో కోపోద్రిక్త దశాబ్దం అనే ఒక ఆంగ్రీ సిక్స్టీస్ కాలం ఉంది. యువతరం లేచి నిలిచి, ధిక్కారాన్ని ప్రకటించిన కాలం. కొనసాగుతున్న ఎన్నో అక్రమాలను ఇంకానా ఇకపై చెల్లదు అని ప్రకటించిన కాలం. ఆ దందహ్యమాన దశాబ్దంలో యువతరపు ఆగ్రహ జ్వాలలు ప్రపంచమంతా వ్యాపించాయి. ఆయా దేశాలలో వేరువేరు వ్యక్తీకరణలతో శాఖోపశాఖలుగా ఉద్యమాలు విస్తరించాయి. అమెరికా, ఫ్రాన్స్, మెక్సికో విద్యార్థి ఉద్యమాలు, ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాలలో వలస వ్యతిరేక జాతీయోద్యమాలు, లాటిన్ అమెరికాలో విప్లవోద్యమాలు, అమెరికాలో వియత్నాం యుద్ధ వ్యతిరేక ఉద్యమం, నల్లజాతి ఉద్యమం, పౌరహక్కుల ఉద్యమం, మహిళా ఉద్యమం, పర్యావరణ ఉద్యమం, చైనాలో శ్రామిక వర్గ సాంస్కృతిక విప్లవం, భారతదేశంలో నక్సల్బరీ వంటి లెక్కలేనన్ని ఉద్యమాలలో కోపోద్రిక్త యువతరం తనను తాను వ్యక్తం చేసుకున్న దశాబ్దం అది.

ఆ ఆగ్రహ దశాబ్దం ప్రపంచాన్ని తలకిందులు చేసిన తర్వాత, కొద్ది చోట్ల ఆ విధ్వంసం నిర్మాణాలకూ దారి తీసిన తర్వాత, క్రమక్రమంగా లోకం చల్లబడి ఆరు దశాబ్దాలు గడిచిపోయాయి. ఆనాటి కోపోద్రిక్త యువతరం కనబడకుండా పోయింది. యువతరం ముందర అనేకానేక ఆకర్షణలు వచ్చాయి. మత్తులో, భ్రమలో, అబద్ధంలో మునిగిపోయే అవకాశాలు వచ్చాయి. కొత్త కొత్త అలవాట్లు మప్పే, పక్కదారి పట్టించే అత్యాధునిక ప్రవర్తనాసరళులూ విషవలయాలూ పాలనారీతులూ పుట్టుకొచ్చాయి. సమాజాన్ని ఎంతమాత్రం పట్టించుకోకుండా నా చిన్ని బొజ్జకూ శ్రీరామరక్ష అని స్వార్థంలో ముంచడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు జరిగాయి. “ఇక యువతరం సమాజం గురించీ, సమాజ పరివర్తన గురించీ, విప్లవం గురించీ ఆలోచించదు, ఆ పాడు కాలం సమసిపోయింది, చరిత్ర అంతమైపోయింది” అని పాలకవర్గ పండితులు రాసిన శిలాశాసనాల ప్రతిష్ఠాపన కూడా జరిగిపోయింది.

కాని ఈ ఆరు దశాబ్దాల్లో కూడా, ఆ ఆగ్రహ దశాబ్దిలో జరిగినంత పెద్ద ఎత్తున కాకపోయినా యువతరం సమాజం గురించి ఆలోచిస్తూనే ఉంది. చెదురుమదురుగానైనా అప్పుడప్పుడు, అక్కడక్కడ కొందరిలోనైనా ఆ భావాలూ, ఆ ఆచరణా వ్యక్తమవుతూనే ఉన్నాయి. అది సమాజమంతా వ్యాపించకపోవచ్చు, ప్రధాన స్రవంతి ప్రచార సాధనాలకు ఎక్కకపోవచ్చు. దాని గురించి సమాజమంతా చర్చ జరుగుతుండకపోవచ్చు. గత శతాబ్ది అరవైల దశకంలో పెల్లుబికినంత విస్తారమైన ధిక్కారం వినిపించి ఉండకపోవచ్చు. కాలం నిలిచిపోయిందనీ అనిపించి ఉండవచ్చు. కాని నెత్తురు మండే శక్తులు నిండే యువతరంలో ఒక చిన్న భాగమైనా అదను ఇదే కదిలి రమ్ము అనే పిలుపుకు స్పందిస్తూనే ఉంది. తన సామాజిక బాధ్యతను నెరవేరుస్తూనే ఉంది. మన నేలలోనే అలా తిరిగి వచ్చిన కాలానికి నిదర్శనం చూపాలంటే, విద్యార్థులు కెరీరిజానికీ, పరీక్షలకూ బలి అయిపోయారని శవపరీక్షలు చేయడానికి ఎందరో ప్రయత్నిస్తున్న వేళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో విద్యార్థి సంచలనం పెనుతుపాను అయింది.

అటువంటి మినహాయింపులు ఉన్నప్పటికీ, సాధారణంగా ఒక నిర్లిప్తత, స్తబ్దత, యథాస్థితి కొనసాగుతుండగా, పాలకవర్గాల బండి నడక నల్లేరు మీద సజావుగా సాగిపోతుండగా 2020ల దశకం వచ్చింది. ఈ దశకం ప్రారంభంలోనే అగ్రశ్రేణి ద్రవ్య పెట్టుబడి పత్రిక ఎకనామిస్ట్ ఈ దశకం ఆకటి దశకంగా ఉండబోతున్నదని, బహుశా ఆ ఆకలి నుంచే రేగే ఆగ్రహ దశకంగా కూడా మారవచ్చునని ఊహాగానం చేసింది. నిజానికి ఇరవయో శతాబ్ది చరిత్రలో ఒక ఆకటి దశాబ్దమూ ఉంది, ఒక ఆగ్రహ దశాబ్దమూ వేరువేరుగా ఉన్నాయి. ఒకటి 1930లదైతే, మరొకటి 1960లది. ఆ రెండిటికీ మధ్య ముప్పై సంవత్సరాలు గడిచాయి. కాని ఈ శతాబ్దిలో రెండూ కలిసి ఒకే దశాబ్దంలో రాగల పరిస్థితులున్నాయని ఎకనామిస్ట్ రాసింది. ఎక్కువ కాలం గడవకుండానే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సందర్భంగా ఆక్స్ ఫామ్ విడుదల చేసిన నివేదిక కూడా ఇది అంతరాల దశాబ్దం అనీ, చరిత్రలో ఎన్నడూ ఎరగని ఆర్థిక అంతరాల విభజనల దశాబ్దంగా, అంటే విస్ఫోటక దశాబ్దంగా కనబడుతున్నదని రాసింది.

అంతగా ఆర్థిక, సామాజిక సంక్షోభాలు కళ్ల ముందర కనబడుతున్నప్పుడు, లేదా కనబడకపోయినా గాలిలో వ్యాపిస్తున్నప్పుడు ఆ సంక్షోభం మనుషులను ప్రభావితం చేయకుండా ఉండజాలదు. హృదయం ఉన్నవారు కదలక మానరు. ఆలోచించగలవారు ఆలోచించక మానరు. ప్రతి మనిషికీ హృదయమూ మేధా ఉంటాయి గనుక ఈ స్పందనలు తరతమ భేదాలతో ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక స్థాయిలో కనబడతాయి. అంటే నిలిచిపోయిందనుకున్న కాలం కదలబారుతుంది. నిలువనీటి గుంటలో పడిన ఒక చిన్న రాయి సంఖ్యానేక సుడిగుండాలను సృష్టిస్తుంది.

మరి నిలువనీటి గుంటలోకి రాయి విసిరి అనేకానేక సంచలనాలు సృష్టించే శిశువులెవరు? ప్రతి హృదయంలోనూ అంతర్గతంగా, స్వాభావికంగా, సహజంగా, నైసర్గికంగా న్యాయభావన అనేదొకటి ఉంటుంది. దాన్ని తొలగించడానికి, మరుగుపరచడానికి, కత్తిరించడానికి అనేక ప్రయత్నాలు జరిగి ఉండవచ్చు. అది వెంటనే వ్యక్తం కాకపోవచ్చు. డబ్బు, అధికారం, ఆధిపత్య మతం, ఆధిపత్య కులం, లింగం, భాష, నివసిస్తున్న స్థలం, చివరికి చర్మపు రంగు, శరీర ఆకృతి వంటి ఎన్నెన్నో పలుచటివీ, దళసరివీ పొరలూ సంకెళ్లూ ఆ న్యాయభావన మీద కమ్ముకొని ఉండవచ్చు. కాని చరిత్రలో, సమాజంలో, ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడో ఒక కీలక క్షణం వస్తుంది. ఆ పొరలూ సంకెళ్లూ పెటిల్లున పగిలిపోయి, పర్రున చిరిగిపోయి అంతరాంతరాలలోని న్యాయభావన విస్ఫోటనం జరుగుతుంది. అప్పుడు ఎన్ని ఆకర్షణలూ ఆంక్షలూ నిర్బంధాలూ ఆ న్యాయభావన వ్యక్తీకరణను ఆపలేవు.

గాజాలో తొమ్మిది నెలలకు పైగా జాతి హననం జరుగుతున్నది. దుర్మార్గం తాండవ నృత్యమాడుతున్నది. చిన్నారి పసి పిల్లలు వేలాదిగా బలి అయిపోయారు. వారి తల్లిదండ్రులూ అన్నలూ అక్కలూ మరెన్నో వేలమంది యూదు జాతీయోన్మాద బాంబు దాడులలో మృత్యువాత పడ్డారు. విద్యాసంస్థలూ, ఆసుపత్రులూ, ప్రచారసాధనాల కార్యాలయాలూ, జనావాసాలూ అన్నీ బాంబుదాడులలో భస్మీపటలమయ్యాయి, ధ్వంసమైపోయాయి. తన మానవ హృదయం, తన మానవీయ స్పందనలు ఏమయిపోయాయని ప్రపంచం తనను తాను అడుక్కొంటున్నది. జోర్డాన్ నది నుంచి మధ్యధరా సముద్రం దాకా వ్యాపించిన ఆ శాంతి చిహ్నాపు ఆలివ్ వనాల దేశంలో ఇంత రక్తపాతం, ఇంత మారణకాండ, ఇంత జనహననం, ఇంత దురన్యాయం సాగిపోతుంటే కళ్లూ చెవులూ నోరూ మూసుకుని కూచున్న ప్రపంచాన్ని చూసి మనిషన్నవారు కన్నీరు కార్చవలసి ఉంది, సిగ్గు పడవలసి ఉంది, ఆగ్రహ పడవలసి ఉంది. ఆ కన్నీరూ సిగ్గూ ఆగ్రహమూ కలిగిన మనిషిలోని సహజమైన, నైసర్గికమైన న్యాయభావన విస్ఫోటన చెందడానికి సరైన కాలం అదే. ఎట్లాగైతే 1960ల ఆగ్రహ దశాబ్దపు కాలం ఒక న్యాయ భావన విస్ఫోటనను చూసిందో, అటువంటి న్యాయ భావన విస్ఫోటనే 2020ల ఆగ్రహ ప్రజ్వలనకు దారి చూపుతున్నది.

అందుకే కాలం తిరిగి వచ్చిందని అనిపిస్తున్నది. అమెరికన్ విశ్వవిద్యాలయాలన్నీ, విశ్వవిద్యాలయాల కాన్వొకేషన్ ఉత్సవాలన్నీ న్యాయభావనా ప్రకటన వేదికలయ్యాయి. ప్రపంచ ప్రగతిశీల శక్తులన్నిటికీ కనుల పండుగగా విద్యార్థులు, ఇంకా ఇరవైల్లో ఉన్న చిన్నారులు, ఇప్పుడిప్పుడే ప్రపంచానికి కళ్లు తెరుస్తున్న పసి పిల్లలు, ఇంకా ఐదారు దశాబ్దాలు ప్రపంచాన్ని నడిపించేవాళ్లు, పిడికిలి బిగించారు. బాధితుల పక్షాన నిలబడ్డారు. పీడకులను, హింసారాధకులను ఎదిరించారు. స్వేచ్ఛా పతాకాలు ఎగురవేశారు. స్వాతంత్ర్య కాంక్షను నినదించారు. సంఘీభావాన్ని ప్రకటించారు. యుద్ధాన్ని ఆపమని గర్జించారు. ఎంత అద్భుత దృశ్యమది! అరవైలు తిరిగివచ్చిన ఇరవైలు!

అది ఒక్క అమెరికన్ విశ్వవిద్యాలయాలకు పరిమితం కాలేదు. యూరప్ కూ, ఆస్ట్రేలియాకూ, ఆసియాకూ వ్యాపించింది. హార్వర్డ్ విశ్వవిద్యాలయ వేదిక మీది నుంచి శ్రుతి కుమార్ మాటలు ప్రపంచమంతా ప్రతిధ్వనించాయి. అది ఒక పూల పరిమళంలా, జల ప్రవాహంలా ప్రపంచమంతా వ్యాపించింది. ఆ యుగస్వరం చివరికి మన మద్రాసు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోనూ ధనంజయ్ బాలకృష్ణన్ గొంతులో మార్మోగింది. తెలుగు నాట నలబైల్లోనూ, ఆ పైనా ఉన్న కవుల, రచయితల స్పందన, సరే, ఇరవైల్లో ఉన్న కవులు కనీసం ముప్పై మంది పాలస్తీనా పట్ల మాత్రమే కాదు, అరుంధతీ రాయ్ మీద జరుగుతున్న దాడి పట్ల కూడా, పాలక దుర్మార్గాల పట్ల తమ గొంతు ఎత్తారు, ఎత్తుతున్నారు.

సరిగ్గా ఆరు దశాబ్దాల కిందటి లాగనే మళ్లీ ఒకసారి ప్రపంచం ఆగ్రహ వ్యాకరణాన్ని నేర్చుకోబోతున్నదా, నేర్పబోతున్నదా అనిపిస్తున్నది. కాలం తిరిగి తిరిగి వస్తున్నది. అసంపూర్ణంగా మిగిలిపోయిన లక్ష్యాలను సాధించడానికి, దారి లేదన్నచోట కొత్త దారి తెరవడానికి, అణచివేతల ఆనకట్టల వెనుక దాగిన దుఃఖరాశిని వెల్లువగా మార్చడానికి.

ప్రకృతిలో కాల చలనం ఏకముఖమేనేమో గాని, సమాజంలో కాల చలనం వెనుకకూ ముందుకూ పైకీ కిందికీ నలుదిశలా.

పుట్టింది వరంగల్ జిల్లా రాజారం. కవి, సాహిత్య విమర్శకుడు, అనువాదకుడు, పత్రికా రచయిత, వక్త, రాజకీయార్థిక శాస్త్ర విద్యార్థి, తెలుగు రాజకీయార్థిక, సామాజిక మాసపత్రిక వీక్షణం సంపాదకుడు.
ర‌చ‌న‌లు: 'స‌మాచార సామ్రాజ్య‌వాదం', 'క‌ల్లోల కాలంలో మేధావులు - బాల‌గోపాల్ ఉదాహ‌ర‌ణ‌', 'అమ్మ‌కానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌', 'క‌థా సంద‌ర్భం', 'క‌డ‌లి త‌ర‌గ‌', 'పావురం', తెలంగాణ నుండి తెలంగాణ దాకా, విచ్ఛిన‌మ‌వుతున్న వ్య‌క్తిత్వం, 'పోస్ట్‌మాడ‌ర్నిజం', 'న‌వ‌లా స‌మ‌యం', 'రాబందు నీడ‌', 'క‌ళ్ల‌ముంద‌టి చ‌రిత్ర‌', 'ప‌రిచ‌యాలు', 'తెలంగాణ‌ - స‌మైక్యాంధ్ర భ్ర‌మ‌లు, అబ‌ద్ధాలు, వాస్త‌వాలు', 'శ్రీశ్రీ అన్వేష‌ణ‌', 'లేచి నిలిచిన తెలంగాణ‌', 'ప్ర‌తి అక్ష‌రం ప్ర‌జాద్రోహం - శ్రీకృష్ణ క‌మిటీ నివేదిక‌', 'రాబందు వాలిన నేల‌', 'ఊరి దారి- గ్రామ అధ్య‌య‌న ప‌రిచ‌యం', 'విద్వేష‌మే ధ్యేయంగా విశాలాంధ్ర మ‌హార‌భ‌స‌', 'క‌విత్వంతో ములాఖాత్‌', 'సమాజ చలనపు సవ్వడి', 'కాషాయ సారం', 'విద్వేషాపు విశ్వగురు', 20కి పైగా అనువాదాలు.
సంపాద‌క‌త్వం: 'Fifty Years of Andhrapradesh 1956-2006', 'Telangana, The State of Affairs', '24గంట‌లు', 'హైద‌రాబాద్ స్వాతంత్య్ర సంరంభం', 'జ‌న హృద‌యం జ‌నార్ద‌న్‌', 'స‌మ‌గ్ర తెలంగాణ' పుస్త‌కాల‌కు సంపాద‌క‌త్వం వ‌హించారు.

One thought on “తిరిగి తిరిగొచ్చే కాలం

  1. About GAZA situation how many people are thinking -showing sympathy -and empathy in India
    Venu garu —(including writers and medhavulu )USA SUPPORT AND us foreign policy main reason for
    This mess —
    Country needs REAL LEADER-LEADERS —right now corrupt C.M s— family ruling nethalu unnantha
    Kalam—NO CHANGE —NOTHING HAPPENS—??

Leave a Reply