“భారత విశ్వవిద్యాలయాలు వందలాది నైపుణ్యం లేని నిరుద్యోగ యువతను తయారు చేసే కార్మాగరాలు” – గున్నార్ మిర్డాల్.
తెలంగాణ కోసం గర్జించిన విద్యార్థి లోకం అదే రాష్ట్రంలో విద్యార్థి ఆత్మహత్యలు తెలంగాణ సమాజాన్ని, బుద్ధిజీవులనూ కలవర పెట్టిస్తోంది. రాష్ట్రం కోసం ముఖ్య భూమిక పోషించిన ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ లాంటి విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగం కోసం ఆత్మహత్యలు జరగడం అంటే రాష్ట్రం ఏర్పడితే వచ్చే ఉద్యోగలపై తెలంగాణ విద్యార్థిలోకం ఎంత ఆశపడి కృంగిపోతుందో మన చదువు, మన కొలువులు మనకే అనే నినాదంపై ఏర్పడిన ప్రభుత్వానికి కళ్ళు కనిపించడం లేదా?
ఉన్నత చదువుల కోసం యూనివర్సిటీలకు వచ్చి డాక్టరేట్ పట్టాలు అందిపుచుకున్నా, విద్యార్థులు తమ నూతన అలోచనలతో పరిశీలించి కొత్త కొత్త అవిష్కరణలతో తమ తమ శక్తితో రాష్ట్రాన్నీ, దేశాన్ని, ప్రగతి పథంలో నడిపించాల్సిన యువత నేడు ఉద్యోగాలు లేక, ఉపాధి అవకాశాలు లేక జీవితం అస్థవ్యస్థంగా మారుతోన్నది. భారత విద్యా విధానం సాంకేతిక విద్యనూ, వృత్తి విద్యను అందించేదిగా లేదు. సరైన మావన వనరులు కల్పించే, వినియోగించే ప్రణాళికలు లేవు.
అనేక ఆవిష్కరణలను చేయటానికి సిద్ధంగా వున్న దేశ పౌరులను వినియోగించుకోక పోవడం వలన నేటికీ సగం కంటే ఎక్కువ మంది వ్యవసాయంపైన ఆధారపడి జీవిస్తున్నారు. అంటే ఉపాధి కల్పించడంలో మన పాలకులు ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్ధం అవుతున్నది.
దేశంలో మోడీ అధికారంలోకి వచ్చాక నూతన ఆవిష్కరణల పేరుతో ఉపాధి కల్పన పేరుతో ‘మేడిన్ ఇండియా – మేకిన్ ఇండియా’ పేరుతో జర్మనీ, జపాన్ దేశాల సరసన పోటీ పడే దేశంగా మారబోతుంది అనే మాటాలు బలంగా నమ్మిన ప్రజానీకం ఆశలు తలకిందులు అయ్యాయి. పేరుకే మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియాలు. సారంలో దేశ సంపదను స్వదేశీ, విదేశీ కార్పోరేట్లకు అప్పజెప్పడమే లక్ష్యం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి కల్పించడంలో మానవ వనరులను వినియోగించడంలో విఫలం అయిన మూలంగా చదువుకున్న వారు వ్యవసాయ కూలీలుగా మారారి. అక్కడ సరైన ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
రాష్ట్రంలో ఇప్పటికే వంద ఏళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియాలో పిహెచ్డి పూర్తి చేసుకున్న విద్యార్ధి 2019 సంవత్సరంలో చనిపోగా, అనేక మంది డిగ్రీలు, పీజీలు పూర్తి చేసుకొని ఉద్యోగ వేటలో నిరుద్యోగులు, యూనివర్సిటీల కేంద్రంగా చనిపోవడం అంటే తెలంగాణ సమాజం తలదించుకుంటుంది. Center for Monitoring Indian Economy (CMIE) సర్వే ప్రకారం తెలంగాణలో సంవత్సరానికి సరాసరిన 3.88 లక్షల మంది పట్టభద్రులు నిరుద్యోగులుగా మిగిలి పోతున్నారు. నిరుద్యోగ రేటులో తెలంగాన 8వ స్థానంలో వుంది. పాలకుల అనాలోచిత, అశాస్త్రీయ విధానాల మూలంగా తెలంగాణాలో నిరుద్యోగ రేటు 28.6% నుండి 34.8%కి పెరిగింది. నిరుద్యోగ నిర్మూలనకు ఎన్నో నివేదికలు సలహాలు, సూచనలు ఇచ్చినప్పటికి అచరణలో శూన్యం.
కోటి ఆశలతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణాలో ఉద్యోగుల పీఆర్సీ, వయోపరిమితి పెంచితే వాళ్లు ముఖ్యమంత్రిగారికి పాలాభిషేకం చేసి వుండవచ్చు. అదే అసెంబ్లీ సాక్షిగా అర్ధంతరాంగా మూసివేసిన స్కూల్స్, కళాశాలలు, ప్రైవేటు అధ్యాపకుల ఆర్థనాదాలు పట్టకపాయె . ఉద్యోగాలకై అసెంబ్లీని ముట్టడించిన నిరుద్యోగుల గోడు ఎవ్వరు వినలే. ఈ సభ ఏమి నమ్మకం ఇస్తుంది విద్యార్థి, నిరుద్యోగులకి ఇదే అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగాలు లేవు అని మాట్లాడుతుంటే నిరాశకు గురియ్యారు. దీనితో దుబ్బాక ఎలక్షనకు ముందు నిరుద్యోగుల, ప్రజల వ్యతిరేకత రెండు కలగలిసేసరికి అధికార పార్టీకి ఓటమి ఎదురయ్యాక కేటిఆర్ ఎంఎల్సీ ఎన్నికలకన్న ముందు ఈ యేడేళ్ల పాలనలో లక్ష 30 వేల ఉ ద్యోగాలు కల్పించామని మాట్లాడారు. కానీ, నిరుద్యోగులు మాత్రం టిఎస్ పి ఎస్ సి ద్వారా 30వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసారు. వాటిలో ఎక్కువ శాతం కానిస్టేబుల్ ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసారని వాదించారు. ఈ నిరసన ఇలాగే కొనసాగితే ప్రభుత్వ మనుగడ కష్టమని భావించి కేసీఆర్ మొన్న జరిగిన అసెంబ్లీలో 50 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నదని చెప్పినా ఉద్యోగులకు పీఆర్సీ, వయోపరిమితి పెంచాడే తప్ప ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించలేదు. దీనితో ఆగ్రహించిన నిరుద్యోగులు వయోపరిమితి విషయంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ వ్యతిరేకత తీవ్రతరం అయ్యే సరికి కరోనా సాకుతో హడాహుడిగా విశ్వవిద్యాలయాలను మూసివేసారు. దీనితో బోడ సునిల్ నాయక్ తీవ్ర మనస్తాపానికి గురై, చదువుకున్నా ఉపాధి లేక ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘోరాన్ని విన్న తల్లిదండ్రులు ఉద్యోగంతో వస్తావనుకుంటే “కొడుకా.. శవమై వచ్చినవా” అని వాళ్ల రోదనలు తెలంగాణ సమాజాన్ని కలిచివేసింది. బోడ సునీల్ మాత్రం తన చావు కన్నా ముందు తను తీసుకున్న వీడియోలో మొత్తం తన అసహానాన్ని కేసీఆర్ పై వెళ్లగక్కాడు. సాధించుకున్న తెలంగాణాలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కాలేదు. నా చావే చివరిది కావలని , నిరుద్యోగులంతా కేసీఆర్ ని వదలద్దు అంటూ చనిపోయాడంటే సమస్య తీవ్రత అర్ధం చేసుకోవచ్చు. ఏర్పడిన తెలంగాణలో ఒక్కరోజు కూడా రొడ్డెక్కనివాళ్లు, నినాదించని వాళ్లు అధికారంలో భాగమై కోట్ల రూపాయలు దండుకుంటూ తెలంగాణ అస్తిత్వం కోసం కొట్లాడిన ప్రొ॥ కోదండరాం లాంటి వాళ్లు నేడు ప్రజల పక్షాన మాట్లాడుతుంటే ముందు వెనకా పోలీసులతో బయటకి రాకుండా, మాట్లడకుండా గొంతునొక్కుతున్నారు. ఇంతటి నియంతృత్వ ప్రభుత్వం ఏర్పడుతుందని తెలంగాణ అస్తిత్వం కోసం నిలబడిన వాళ్లు ఉహించలేదు. తెలంగాణ ఏర్పాటు కోసం అనేక మంది తల్లుల కడుపుకోత ఈ పాలక వర్గం మరిచిపోయింది. మళ్లీ అదే కడుపుకోతలు రాష్ట్రంలో ఉద్యోగాల కోసం జరగడం అంటే నీళ్లు, నిధులు ఉద్యోగాలు ఒక్క కేసీఆర్ కుటుంబానికే పరిమితం అయ్యాయి. కనుక, నేడు రెక్కాడితే కని డొక్కాడని మట్టి తల్లులకు ఈ కడుపుకోత.
నిరుద్యోగులారా! స్వరాష్ట్రంలో ఉద్యోగం కోసం ఎదురుచూసిన మీకు చదివి చదివి ఆవేశం, ఆక్రోశం తెప్పించి వుండవచ్చు. పాలకుల అధికార మదం చూసి మీ గుండెలు రగిలిపోవచ్చు. ఈ అన్యాయంపై మీ మనస్సు కలత చెందవచ్చు లేదా అత్మహత్యలవైపు పురిగొల్పవచ్చు. కానీ, అదే పరిష్కారం కాదు. ఈ నిరుద్యోగ సమస్య మీ ఒక్కరిదే కాదు. దేశంలో, రాష్ట్రంలో యావత్తు నిరుద్యోగులది. కలత చెందకండి! ఎంత నియంతృత్వమైన ఎప్పటికైనా ఇదే ప్రజలచే కూలిపోక తప్పదు కనుక చదువులని చదువుతూనే ప్రజలను చైతన్యం చేద్దాం! పాలక వర్గాన్ని ప్రశ్నిద్దాం. ఒక కవి అంటాడు. “ఒక్క నక్క ప్రమాణ స్వీకారం చేసిందట ఇంకా ఎవ్వరిని మోసగించనని, ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట తోటి జంతువులను సంహరించినందుకు. ఈ కట్టు కధ విని గొర్రెలింక పుర్రెలూపుతూనే వున్నాయి”. సమయం కోసం వేచి చూద్దాం. నిరుద్యోగులు విజ్ఞానవంతులు గనుక సమాజాన్ని చైతన్య పరుస్తూ ప్రశ్నిస్తూనే వుండాలి, ఈ కట్టుకథలకు కాలం చెల్లే వరకు.