అమ్మలు…
యెర్రటి మందారాల్ని…
వెలుతురు పరిచే ప్రభాతాల్ని…
విచ్చుకునే చుక్కల్ని…
అన్నపు పొంగు సువాసనని…
పరిచయం చేస్తారు పదే పదే…
అమ్మలు…
సముద్రపు వుప్పదనాన్ని…
సెలయేటి వుత్సుకతని…
కొమ్మల ఛాయని…
వేర్ల చేదు వగరుని…
వస పూసి అక్షరాలు దిద్దించి
పగలూ రాత్రీ నిద్ర కాచి పెంచి
పిల్లలు తమ తమ మార్గాల్ని యెంచుకున్న సమయాన
కన్నపేగు హృదయంలో యేమేమీ కదలాడతాయో
అమ్మలకు మాత్రమే యెరుక
కానీ…
‘సల్లగా బతుకు బిడ్డా’…
‘నూరేళ్ళు బతుకు నాయనా’ అని ఆశీర్వదిస్తుంటారని…
ప్రతీ గుండె సవ్వడికీ యెరుకే…
కిక్కిరిసిన గ్లోబల్ విలేజ్ అంతటా యుద్ధ సునామి
నిరవధిక అగ్ని గుండాల్లో అనామక పసినక్షత్రాలు…
సరిహద్దు తీరాల యెగిసిన కమ్ముకున్న
శిధిల సుడిగుండల పిగిలిపోయిన సూర్యకాంతి
దట్టమైన ఆకుపచ్చని అడివిలో
సాహసం విషాదపు యెర్రని వానై…
కోకిలలు దుఃఖ రాగమై
దివారాత్రులు మనసు రెక్కపై ఆరని చెమ్మ
వెక్కిళ్ళ ఆలింగనంలో వులిక్కి పడే జోలపాటలు
తల్లుల వెండి కురులపై వెన్నెల వోదార్పు
తాము సృష్టించిన ప్రాణ శ్వాసని
కంటికి కనిపించకుండా అదృశ్యం చేసినప్పుడు
అమ్మలు గుండె నీరు చేసుకుంటారని అనుకోవద్దు
తరలి వచ్చే ప్రతి మనిషి కంటి చుక్కలో
వినిపించాలని తపన పడే జనగాథలలో
త్యాగాలు చిన్నబోయే ధన్యతల్లో
బిడ్డను తెలుసుకుంటారు
కొడుకును కలుసుకుంటారు
ఆషాఢ మేఘపు తొలివానలో
కాలపు పాదముద్రల్ని లెక్కించే మౌనభూమి
తుదకు వొక మాట చెబుతుంది–
‘తల్లులు వుండగా పిల్లలు మట్టి ముద్దలు, బూడిదలు, చితాభస్మాలు… కాలేరు’
Magnificient