1
కంట్లో చందమామను దాచుకున్నట్టు
నన్ను గుండెల్లో దాచుకున్నదానా!
కొంగు చివర
అవ్వ చిల్లర పైసలు కట్టుకున్నట్టు
నన్ను పేగు కొసన కట్టుకున్నదానా
నా యజమానీ!
వెళ్ళొస్తాను
నా కోసం
ఒక్క ఉదుటున అలల్లోకి దూకి
గబాలున ఒక ఉదయాన్ని తెచ్చి
చేతుల్లో పెట్టేవాడా..
మిత్రుడా! వెళ్ళొస్తాను
2.
మళ్ళీ వచ్చేసరికి
పుడక లేరుకుంటున్న
పసుపు ముక్కు పిట్టలు
గూడు కట్టుకొనుంటాయా?
కడుపుతో ఉన్న
నల్ల మచ్చల మేక
పిల్లలతో సహా ఎదురొస్తుందా?
అమ్మ బొజ్జలో ఊపిరి పోసుకుంటున్న చంటిది
నాన్నను గుర్తుపట్టి నవ్వుతుందా?
ఒక వేళ నేనెక్కడో
ఓ దారంలా పుటుక్కున తెగిపోతే
ఈ మట్టిలోకి
సజావుగా చేరుకుంటానా?
3.
సగం దేహంతో
సగం నీడా సగం ఎడారిగా
ఊర్నుండి కాలు బయటపెట్టే ప్రతిసారీ
మా కాళ్ళూ చేతులకు
సరిపడా గుడ్డను కప్పలేని
దేశాన్ని
వీధిలో నిలబెట్టి కడిగేయాలనుంది
4.
పగటినిద్రకు పూసిన
వలస కలని
పురోగమన నడకగా చిత్రిస్తున్న
అతివృష్టి ముఖాల మీద
మా అమ్మ దిగులు బొమ్మను గీయాలి
అడ్డంగా విరిగి మూలుగుతున్న
మా ఊరి రెక్కల్ని
చెదలు పట్టిన కళ్ళ ద్వారాలకి
వేలాడగట్టాలి
కోరికతో కాలిన రాత్రుల
నిట్టూర్పు చిత్రాలతో
గోడలన్నీ నింపేయాలి
వలస అగ్గితెగులు సోకి
నుసిబారిన పల్లెల్ని చూపించి
అభివృద్ధి పాటకు
చరణాల్ని ఇక్కడే తవ్వుకోమనాలి
చితికిన పాదాల చివర ప్రాణాల్ని కట్టుకుని
దారుల్ని మోసుకుంటూ నడిచేప్పుడు
పగిలిన కలల రక్తంతో
దేశపటాన్ని గీసి గుమ్మానికి వేలాడగట్టాలి