దేశంలో ప్రతి పౌరునికి సామాజిక, ఆర్థిక, రాజకీయ అవకాశాల్లో సమానత్వం కల్పించాలన్న అంతస్సూత్రంపై రూపుదాల్చిన భారత రాజ్యాంగం అన్నింటా అందరికి సమన్యాయం, సమ ధర్మాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్దేశించింది. సామాజిక న్యాయాన్ని అందరికి అందించడం, విస్తృతంగా ఉన్న అసమానతల్ని తొలగించడం పాలకుల బాధ్యత. ప్రజల ఆర్థికాభివృద్ధికి పాటుపడటం వారి తక్షణ కర్తవ్యం. తల్బిన్నంగా మేడిపండును తలపిస్తున్న నేటి పెట్టుబడిదారీ సమాజం నిత్యం అభివృద్ధి మంత్రం జపిస్తూ, ఆ అభివృద్ధి ఫలాలను కుబేరుల బొక్కసానికి చేర్చే విధానాలు రూపొందించటం, అమలు చేయటం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలకు పరిపాటిగా మారింది. అటువంటి దేశాల్లో మనదీ ఒకటి.
ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్యుఇఎఫ్) 50వ వార్షిక సమావేశం దావోస్‌లో జనవరి 20న ప్రారంభం కావటానికి ముందు, ‘శ్రద్ధ చూపాల్సిన తరుణం’ పేరుతో యునైటెడ్ కింగ్డమ్ నుండి పనిచేసే హక్కుల బృందం ఆక్స్‌ఫాం విడుదల చేసిన అధ్యయన నివేదిక ప్రపంచ దేశాల్లో పెరుగుతున్న అసమానతలను, ఆర్థిక దోపిడీని, అందుకు హేతువవుతున్న ప్రభుత్వాల సంపన్న శ్రేష్ఠుల అనుకూల విధానాలను కళ్లకు కట్టింది. అయితే వాస్తవాలను అంగీకరించటానికి సిద్ధంగా లేని సంపన్నులు ఆ నివేదికను ‘సమస్యల అతిశయం’గా విమర్శించగా, క్రెడిట్ సూయిస్సీ గ్లోబల్ వెల్త్ (ప్రపంచ సంపద) నివేదిక ఆధారంగా రూపొందించిన తన అధ్యయనాన్ని ఆక్స్పం గట్టిగా సమర్థించుకుంది. సూయిస్సీ నివేదికలో ప్రమాణాలు లోపభూయిష్టంగా ఉన్నందున అది సంపద అసమానతలను తక్కువ అంచనా వేసి ఉండవచ్చునని కూడ వ్యాఖ్యానించింది.
ఆక్స్పం అధ్యయనం ప్రపంచ నాయకుల ప్రచారానికి, వాస్తవాలకు మధ్యనున్న పెద్ద అగాధాన్ని బట్టబయలు చేసింది. దిగ్ర్భాంతి గొలిపే ఈ గణాంకాలు దావోస్‌లో సమావేశమైన పెట్టుబడిదారీ నాయకులకు రుచించకపోయినా, అసమానతలు, అక్రమాలు, అన్యాయాలకు వ్యతిరేకంగా, జీవితాల మెరుగుదల కొరకు పోరాటాలు చేస్తున్న ప్రజలకు ఏది భ్రమో, ఏది యధార్థమో కనువిప్పు కలిగించేవిగా ఉన్నాయి. అది వెల్లడించిన గణాంకాల్లో కొన్ని భారతదేశంలో ఒక శాతంగా ఉన్న అత్యంత సంపన్నులు దేశ జనాభాలో దిగువ 70 శాతంగా ఉన్న 95 కోట్ల 30 లక్షల మంది కలిగి ఉన్న సంపదకు నాలుగు రెట్లకు పైగా కలిగి ఉన్నారు. 63 మంది భారత కుబేరుల (బిలియనీర్లు) ఉమ్మడి సంపద 2018-19 ఆర్థిక సంవత్సర కేంద్ర బడ్జెట్ (రూ.24,42,200 కోట్లు) కన్నా ఎక్కువ.
మన దేశంలో మహిళలు, బాలికల శ్రమదోపిడీని ఎత్తిచూపుతూ ఇంట్లో వంట, పరిశుభ్రత, పిల్లలు, వృద్ధుల పోషణ వంటి పనులకు వారు అనునిత్యం 326 కోట్ల గంటల సమయం వెచ్చిస్తున్నారు. చెల్లింపులు లేని ఆ శ్రమ విలువ సంవత్సరానికి కనీసం రూ. 19 లక్షల కోట్లు. అది 2019లో భారతదేశ విద్యా బడ్జెట్ (రూ. 93వేల కోట్లు) కన్నా 20 రెట్లు ఎక్కువ. ఒక టెక్నాలజీ కంపెనీ సిఇఒ సంవత్సర కాల ఆర్జనను ఒక మహిళా గృహ శ్రామికురాలు ఆర్జించాలంటే ఆమెకు 22,277 సంవత్సరాలు పడుతుంది. టెక్ సిఇఒ సెకనుకు రూ. 106 ఆర్జిస్తున్నందున అతడు 10 నిమిషాల్లో ఒక గృహ శ్రమజీవి సంవత్సరం సంపాదనను మించిపోతున్నాడు.
ఆర్థిక, లింగ అసమానతలపై కేంద్రీకరించిన ఆక్సఫాం అధ్యయనం ప్రపంచవ్యాప్త పరిస్థితిని ఇలా తెలియజేసింది. ప్రపంచంలో అత్యంత సంపన్నులుగా ఉన్న 1 శాతం మంది మిగతా మొత్తం మానవాళి సంపదకు రెండురెట్లు పైగా కలిగి ఉన్నారు. ప్రపంచం మొత్తం మీద 2,153 బిలియనీర్లుండగా, వారి సంపద ప్రపంచ జనాభాలో 60 శాతంగా ఉన్న 460 కోట్ల మంది సంపాదనకన్నా ఎక్కువ వారి చేతుల్లో ఉంది. వారిలో అతి కుబేరులైన 22 మంది చేతిలో ఆఫ్రికా ఖండంలోని మహిళలందరు కలిగి ఉన్న సంపదను మించిన సంపద కేంద్రీకృతమై ఉంది. వేతనం లేకుండా శ్రమించే గృహిణులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సాలీనా 108 లక్షల కోట్ల డాలర్లు దోహదం చేస్తున్నట్లు అంచనా వేసింది. అది ప్రపంచ టెక్ పరిశ్రమ పరిమాణానికి మూడు రెట్లు. 2000-2019 సంవత్సరాల మధ్యకాలంలో సంపద అసమానత మనదేశంలో 45 శాతం పెరిగింది.
ఒకవైపు కుబేరులు అవసర కుబేరులుగా మారుతుంటే, మరోవైపు కోటానుకోట్ల పేదలు కటిక దరిద్రులుగా మారుతున్నారు. వర్తమాన ప్రపంచంలో సంపద సృష్టికర్తలైన అసంఖ్యాక కార్మికులు, కర్షకులు, శ్రామికులు పేదరికంలో మగ్గుతూ ఉంటే, వారిని నిత్యం జలగల్లా పీల్చే పీడకవర్గాలు ఎన్ని తరాలు తిన్నా తరగని ఆస్తులను సంపాదిస్తున్నాయి. ఆర్థిక మాంద్యం తీవ్రతరమవుతున్నా వీరి సంపదలు రాకెట్ స్పీడో దూసుకుపోతున్నాయి. శ్రమ తప్ప మరే ఆధారం లేని కష్టజీవులు నిత్యం ఆకలి, అవిద్య, రోగాలు, కడగండ్లతో నానా అవస్థలు పడుతున్నారు. పౌష్టికాహార లేమి వల్ల వీరి సగటు ఆయుః ప్రమాణాలు పడిపోతున్నాయి. సంపన్న వర్గాల మహిళలతో పోల్చితే నిరుపేద మహిళల ఆయుఃప్రమాణం 15 ఏళ్లు తక్కువ అని పలు సర్వేలు ఢంకా బజాయించి చెబుతున్నాయి. ఈ విద్య, వైద్యం ఖరీదైపోవడంతో కష్టార్జితంలో సగానికి పైగా వీటికే పోతున్నది. మహిళలు రోజంతా చాకిరీ చేసినా ఆ శ్రమకు విలువ కట్టే పరిస్థితి లేదు. ఇటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో అత్యధిక సంఖ్యాకులు బతుకీడ్చుతున్నారు. సంపద ఉత్పత్తిలో వీరికి దక్కాల్సిన వాటా దక్కక పోవడం ఒక కారణమైతే, ఫీజులు, చార్జీలు, పన్నుల రూపంలో ప్రభుత్వాలు వీరిని మరింతగా పీడించుకు తింటున్నాయి. కష్టపడి సాధించుకున్న హక్కులపై దాడులు చేస్తున్నాయి. మరోవైపు కార్పొరేట్లకు, సంపన్నులకు భారీ రాయితీలు ఇస్తున్నాయి. పెద్దయెత్తున పన్ను ఎగవేసిన బడా బాబులకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం క్షమాభిక్ష పథకాన్ని (ఆమ్నెస్టీ స్కీమ్) తీసుకొచ్చింది. బంగారు బాతుల్లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా అమ్మేస్తూ, కార్పొరేట్లకు ఊడిగం చేస్తోంది. కుబేరుల వద్ద పోగుపడుతున్న ఈ సంపదంతా కార్మికుల శ్రమ దోపిడీ, ఆశ్రిత పెట్టుబడిదారీ రూటులో దండుకున్నదేనని ‘ఆక్సఫామ్’ తేల్చి చెప్పింది.
సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చిన ఈ మూడు దశాబ్దాల్లో ఈ దోపిడీ మరింత తీవ్రతరమైంది. నిరుద్యోగం గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ఆర్థిక సంస్కరణ వల్ల సంపద పెరుగుతుందని, పెరిగిన ఆ సంపదలో కొంత భాగం అట్టడుగు వర్గాలకు చేరుతుందని సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధాన సమర్థకులు ముందుకు తెచ్చిన ‘ట్రికిల్ డౌన్’ సిద్ధాంతం ఎంత బూటకమో ‘ఆ ఫామ్’ నివేదిక తేటతెల్లం చేసింది. భారతదేశంలో సామ్రాజ్యవాద ప్రపంచీకరణ కాలంలో సంపన్నులపై వేస్తున్న పన్నులకు గణనీయంగా తగ్గించారు. దానితో పెట్టుబడిదారుల పెట్టుబడులు పెరిగాయి. అది వారి సంపద పెరగటానికి దారితీసింది. దేశంలో సంపద అసమానత పెరగటానికి ఈ వాస్తవమే చాలావరకు కారణం.
1990 దశకం నుండి అమలుచేస్తున్న ప్రపంచీకరణ ఫలితంగా శత కోటీశ్వరల సంఖ్య పెరుగుతూ ఉండడం ఆర్థిక వ్యవస్థకు స్వచ్చత చేకూర్చేది కాదు. నిజానికి అది ఆర్థిక వ్యవస్థను రోగగ్రస్తం చేస్తుంది. మూడు వంతుల మంది శత కోటీశ్వరులకు సంపద వారసత్వంగా వచ్చింది. ఇంత పెద్ద ఎత్తున వారసత్వ సంపద ఒక పెద్ద ఉన్నత వర్గాన్ని సృష్టించి ప్రజాస్వామ్య ఆస్తిత్వానికి భంగం కలిగిస్తుంది. ఒకసారి సంపద కేంద్రీకృతం అయ్యాక సంపద పెరిగిపోతూనే ఉంటుంది. శత కోటీశ్వరులు తమ సంపదపై గత పదేళ్లలో సగటున 7.6 శాతం రాబడిని పొందారని ఆక్సఫామ్ అంచనా వేసింది. సంపన్నులపై పన్ను శాతం తగ్గడం, అలాగే చెల్లించాల్సిన పన్నును చెల్లించకుండా ఎగొట్టడం వారి సంపద పెరగడానికి కారణం అయ్యింది.
అయితే అసమానతలు పెరిగిపోవటానికి కారణాలేమిటి? వాటిని తగ్గించేందుకు ప్రభుత్వాలు ఏమి చేయాలో కూడా ఆక్సఫాం అధ్యయనం పేర్కొన్నది. ప్రభుత్వాలు సంపన్న వ్యక్తులు, కార్పొరేషన్లపై అతి తక్కువగా పన్నులు విధిస్తున్నాయి. ప్రజలకు సేవా కార్యక్రమాలకు నిధులు కోత పెడుతున్నాయి. (మోడీ ప్రభుత్వం ఇతర కార్పొరేట్ అనుకూల విధానాలకు తోడుగా, మందగమనం నుండి ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహం పేరుతో కార్పొరేట్ పన్నును దాదాపు 10 శాతం తగ్గించటం, అనేక ఇతర రాయితీలివ్వడం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం). అసమానతను తగ్గించే విధానాలను ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా చేపట్టకపోతే ధనికులు- పేదల మధ్య ఎన్నటికి వ్యత్యాసం పరిష్కారం కాదు. అయితే బహుకొద్ది ప్రభుత్వాలు మాత్రమే ఇందుకు నిబద్దమైనాయని ఆక్సఫాం ఇండియా సిఇఒ అమితాబ్ బెహర్ అన్నారు. అంతేగాక, ప్రజాసేవలపై, మహిళలు, బాలికల పనిభారం తగ్గించటానికి సహాయపడే మౌలిక వసతులపై ప్రభుత్వాలు తక్కువ ఖర్చు చేస్తున్నాయి. కుబేరుల సంపదపై వచ్చే పదేళ్లపాటు అదనంగా 0.5 శాతం పన్ను విధిస్తే వృద్ధులు, బాలల సంరక్షణ, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో 11 కోట్ల 70 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు సరిపోయే పెట్టుబడి లభిస్తుంది. భారతదేశానికి సంబంధించి, ప్రజల సంరక్షణ ఆర్థిక కార్యకలాపాలపై జిడిపిలో 2 శాతం ఖర్చు చేస్తే 1 కోటి 10 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయి, 2018లో కోల్పోయిన 1.10 లక్షల ఉద్యోగాలు పూడ్చుకోవచ్చు.
‘ప్రపంచంలోని సగం జనాభా రోజుకు 5.5 డాలర్లు లేదా అంతకన్నా తక్కువ డబ్బుతో బతుకుతున్నారని వరల్డ్ బ్యాంకు చెపుతున్నది. ఒకసారి ఆసుపత్రిలో చేరడం వల్ల లేదా పంట నష్టం జరగడం వల్ల లేదా కార్పొరేట్ కళాశాలలో తమ బిడ్డను చదివించడం వల్ల ఎంతో మంది పేదలుగా మారిపోతున్నారు. ఒక రూపాయిలో 27 పైసలు పైనున్న ఒక శాతం వారికి చెందితే కిందనున్న 50 శాతం ప్రజలకి రూపాయిలో పన్నెండు పైసలు మాత్రమే దక్కుతున్నాయి’ అని ఆక్సఫామ్ పేర్కొన్నది. ఇలాంటి విపరీతమైన ఆర్థిక అసమానతలు కొనసాగితే పేదరికాన్ని ఎన్నటికీ నిర్మూలించలేం. ప్రభుత్వాలు ఒక శాతంగా ఉన్న ధనవంతుల కోసం కాక 99 శాతంగా ఉన్న సాధారణ ప్రజల కోసం పని చేయాలి. దీనికి గాను ఒక మానవీయమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించాలి.
పని చేయగలిగే శక్తి ఉన్న వాళ్లందరికీ మంచి ఉద్యోగాలు, రోగాల పాలైతే పట్టించుకునే వ్యవస్థ, తమ బిడ్డకు ఉచిత ప్రమాణాలతో కూడిన విద్య అందుతుందనే నమ్మకం, యువతకు తమ సామర్థ్యాలు నిరూపించుకోగలిగే అవకాశాలను ప్రభుత్వాలు రూపొందించాలి. అయితే కార్పొరేట్ వ్యతిరేక విధానాలను రూపొందించగల ధైర్యం, వాటిని అమలుచేయగలిగే సత్తా ప్రభుత్వాలకు ఉండాలి. పౌర సమాజం సహకారంతో ముఖ్యంగా మహిళా హక్కుల సంఘాల చొరవతో జాతీయ సంరక్షణ వ్యవస్థను రూపొందించాలని ఆక్స్ఫమ్ ప్రపంచ దేశాల ప్రభుత్వాలకు సూచించింది. సాంఘిక భద్రతా వ్యవస్థను, ఉచిత పబ్లిక్ సర్వీసులను అలాగే ప్రగతిశీల పన్నుల వ్యవస్థను రూపొందించడం ద్వారా కార్పొరేషన్లు, అత్యంత ధనవంతుల జోక్యాన్ని, ప్రభావాలను తగ్గించాలని ఆక్స్ఫమ్ ప్రభుత్వాలకు సూచించింది. మానవీయ ఆర్థిక వ్యవస్థలో లింగ సమానత్వం, మహిళా అనుకూల విధానాలకు ప్రాధాన్యత ఉండాలి. వేతనాలు లేని లేదా అతి తక్కవ వేతనాలతో మహిళలు చేసే పనికి ప్రాముఖ్యం కలిగించేట్టుగా విధానాలు ఉండాలి. అప్పుడే ప్రపంచంలో అంతరాలను తగ్గించే అవకాశాలు ఉంటాయి.
పేదలు, ధనవంతుల మధ్య ఉన్న అంతరాలను తగ్గించడానికి, ‘సంరక్షణ’ బాధ్యతలలో ఉన్న వారి హక్కులను గుర్తించడానికి, సమాజానికి వారు అందిస్తున్న విశేషమైన పని ప్రాధాన్యతను తెలియజేయడానికి ఆరు పరిష్కారాలను ఆక్స్ఫమ్, ప్రభుత్వాలకు సూచించింది. రక్షిత మంచి నీటి సదుపాయం, పారిశుధ్యం, గృహ అవసరాలకు తగిన విద్యుత్ అందించాలి. శిశు, వృద్ధుల సంరక్షణకు ప్రభుత్వ పరంగా సదుపాయాలు కల్పించాలి. పన్నుల వ్యవస్థను సమూలంగా మార్చి అధిక సంపద, అధిక ఆదాయాలపై ఎక్కువ మొత్తంలో పన్నులు విధించాలి. దీనివల్ల సమకూరిన వనరులను సామాజిక సేవలను అందించడానికి వాడుకోవాలి. ‘సంరక్షణ’ పనిచేస్తున్న క్షేమానికి చట్టాలు వేయడం, వారికి జీవించడానికి కావలసిన వేతనాలు (లివింగ్ వేజ్) ఇవ్వాలి. ‘సంరక్షణ’ పనిలో ఉన్న వారిని, నిర్ణయాలు తీసుకోవడంలో భాగస్వాములను చేయాలి. ‘సంరక్షణ’ బాధ్యతలను మహిళలే చూసుకోవాలి అన్న సంప్రదాయాలు, మూఢాచారాల పట్ల సరైన అవగాహన కలిగించాలి. సామాజిక, ఆర్థిక వ్యవస్థలో లింగ సమానత్వం తీసుకురావాలి. వ్యాపార విధానాలు, పద్ధతుల్లో ‘సంరక్షణ’ బాధ్యతలకు తగిన విలువ ఇవ్వాలి. పనిచేసే ప్రదేశంలో క్రష్ సదుపాయాలు కలిగించటం, శిశు సంరక్షణకు ప్రత్యేక సెలవు ఇవ్వడం, అదనంగా ప్రోత్సాహకాలు ఇవ్వడం, సంరక్షణ కోసం పని వేళల్లో మార్పులు తీసుకురావడం వ్యాపార పద్దతులుగా ఉండాలి.
అయితే అసమాతలను ఎప్పటికప్పుడు వెల్లడిచేస్తున్న నివేదికలకు కొదువ లేదు. భారతదేశ సంపదలో 73 శాతం 1 శాతం కుబేరుల చేతిలో ఉన్నట్లు కొద్ది సంవత్సరాల క్రితం వెల్లడైంది. అయినా ప్రభుత్వ విధానాలు కార్పొరేట్లకే లబ్ది చేకూర్చుతున్నాయి. వీటిని కప్పిపుచ్చుకునేందుకై మోడీ ప్రభుత్వ భావోద్వేగ, విభజనవాద అంశాలపైకి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నది. అసమానతలు తగ్గాలంటే న్యాయంగా సంపద పునఃపంపిణీ జరగాలి. అందుకు ప్రభుత్వానికి సంకల్ప బలం కావాలి. సమాజంలోని కింది స్థాయి 70 శాతం మంది ఆదాయాలు పెరగకుండా వారి జీవితాలు మెరుగుకావు, ఆర్థిక వ్యవస్థ కోలుకోలేదు. మెరుగుదల స్థూల గణాంకాల్లో కాదు సామాన్య ప్రజల జీవనస్థితిలో కనిపించాలి. అదే అభివృద్ధికి నిజమైన అర్థం, పరమార్థం.
ఇప్పటికీ ఆయా దేశాల్లో ఆర్థిక మాంద్యం, సంక్షోభం పరిస్థితులు తప్పడం లేదు. అందువల్లనే ఆ ప్రాంతాల సామాన్య మధ్యతరగతి వర్గాలే పొరుగుదేశాలకు వలసబాటలు పట్టాల్సి వస్తోంది. దీనివల్ల ఆర్థిక అసమానతలు తొలగక పోగా దుర్భర దారిద్ర్యం నుంచి కూడా గట్టెక్కలేకపోతున్నారన్నది ఆర్థిక నిపుణుల వాదన. ఈ పరిస్థితులు గట్టెక్కాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములు చేయాలి. శ్రామికులకు పనికి తగ్గ వేతనం ముందు లభించాలి. సామాజిక సంక్షేమం, భద్రత పరంగా మరికొన్ని విప్లవాత్మక సంస్కరణలు రాకుంటే ఈ అసమానతలు రానురాను పోరాట బాట పట్టే ప్రమాదం పొంచి ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
స్వాతంత్య్రం వచ్చి 73 ఏళ్లు కావస్తున్నా పేదరికం, నిరుద్యోగం, భూ పంపిణీ వంటి మౌలిక సమస్యలను పరిష్కరించుకోవడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాలు అనుసరిస్తున్న చోటల్లా ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. ఈ అసమానతలు సామాజిక అశాంతికి దారి తీస్తున్నాయి. ఈ విధానాలకు వ్యతిరేకంగా చిలీ నుంచి భారత్ వరకు రైతాంగ, కార్మికోద్యమాలు ఊపందుకున్నాయి. సకల అనర్థాలకు మూలమైన సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాలకు చరమ గీతం పాడకుండా ఆర్థిక అసమానతలు తొలగించడం అసాధ్యం. సంపద అసమానత మరింత తీవ్రతరం కాకుండా ఆర్థిక వ్యవస్థను ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కించాలంటే ప్రభుత్వ వ్యయాన్ని పెంచాలి. అందుకోసం అయ్యే వ్యయాన్ని కార్పొరేట్ సంపదపై పన్ను విధించటం ద్వారా సమకూర్చుకోవాలి. పీడిత, పీడక వర్గాల, వైరుధ్యం మీద ఆధారపడిన ఈ సమాజాన్ని మార్చేందుకు కార్మిక, కర్షకులు, గ్రామీణ పేదలంతా కలసికట్టుగా ఉద్యమించాలి.