తప్పక మీరుండాలి….

నిశ్చలంగా ఉన్నాను గానీ….
లోపలoతా నదులు తెగిన దుఃఖం.
నరం నరం తెగుతున్న మృత్యువేదన
మీరు లేకుంటే అడవులూ, కొండలూ నిర్జీవమైన ఎండి పోవూ….
దళిత వాడలూ, ఆదివాసి గూడాలూ…
 బూడిద కుప్పలై రాలిపోవూ..

ఎంత దూరమైనా సరే పలకరించే జ్వాలలా తప్పక మీరుoడాలి.

ఇలా మౌనంగా ఉన్నాను గానీ…
లోపలoతా దింపుడు కల్లం ఆక్రందన.
పేగులు చుట్టుకున్న ఉక్కపోత
మీరే లేకుంటే తడిసిన కనులు
ఏ కలలు కంటాయి?
ఈ అర్ధాకలి దేశం ఏ ఆశతో విశ్రమిస్తుంది?

ఈ మృత్యు కుహర వర్తమానానికి బయట,
పొద్దుపొడిచే నాగరికతలా తప్పక మీరుండాలి.
చదును చేయబడ్డ నేలలా,
నివురు కప్పుకున్న అగ్నిలా
తాత్వికంగా మీరుoడాలి.
చదువుకూ సారానికి,
విద్యకు బోధనకు అంత:సూత్రమై
మీరే ఉండాలి.

ఇంత చీకటిలోనూ నడుస్తున్నాను గానీ..
అంతర్నేత్ర దీపాలై నడిపిస్తున్నదీ మీరే.
వణుకుతున్న కాలంలో ఇట్లా రాస్తున్నాను గానీ
వెన్నులోకి చొరబడ్డ వెచ్చదనమై నిలబెడుతున్నదీ మీరే.

ఎంత నిశ్శబ్దమైనా, ఎంత నిదానమైనా ప్రాణంలో పరిడవిల్లే పచ్చదనమై
తప్పక మీరుoడాలి.

ఇలా ధైర్యంగా ఉన్నాను గానీ
లోపలంతా కలలు కూలుతున్న ఉప్పెన..
నిప్పులా పొంగే నెత్తురు ఆరిపోతున్న
నిరాశ..
ఇది “కాని” కాలమనీ తెలుసు
ఎదురీతను ముంచే కష్టకాలమనీ తెలుసు…
మీరు తప్పా దిక్కేదీ లేని దేశమిది
మా దుఃఖానికి ప్రతీకారమై తప్పక మీరుండాలి.
మా దిగులుకు సమాధానంగా సాయుధమై మీరుండాలి..

ఎంత చీకటి కమ్మినా, ఎంత దారి లేకున్నా రేపటి స్వప్నమై స్థిరమవ్వాలి మీరు.
మా నిరాయుధ హృదయానికి
కవచమై తప్పక మీరుండాలి.

Leave a Reply