అతనొక మాంత్రికుడు
మాయ మాటల మంత్రం జపిస్తాడు
మతం మత్తు చల్లి
మనిషిని లొంగదీయజూస్తాడు
అయినా వెన్నెముక వంగకపోతే
మంత్రదండాన్ని కసిగా విసురుతాడు
అతను ప్రపంచ పగటేషగాడు
దేశానికో రూపమెత్తుతాడు
ప్రాంతానికో పావు కదుపుతాడు
తన పాట తానే పాడుకుంటాడు
భక్తులు వంత పాడుతుంటే
దేశభక్తిపై పేటెంటు ప్రకటించుకొని
“దేశద్రోహుల” వేటకు బయలుదేరుతాడు
అతను మెదళ్ళపై నిఘా పెడుతాడు
ఆలోచనలను కత్తిరిస్తూ
అఖండ భారతాన్ని కలగంటాడు
మనిషిని కుదించి
మూకస్వామ్యాన్ని పెంచిపోషిస్తాడు
కామధేనువును కవర్ గా చేసుకోని
కలలపై కాల్పులు జరుపుతాడు
అతను ఒక కుట్రదారుడు
కంప్యూటర్లలో మాల్వేర్ గా మాటేసి
తన మీద ‘కుట్ర’కు తానే కథ అల్లుతాడు
తాను అల్లిన కథను రోజంతా వల్లించే
పెట్టుబడి విషపుత్రికలకు
పెంపుడు తండ్రి అవుతాడు
అతనొక వ్యాపారి
కృత్రిమ విలువలను
హోల్ సేల్ గా అమ్మగల మోసకారి
మిధ్యకు సహితం గిరాకీ తేగల
మార్కెట్ మహమ్మారి
అతను ఒక డ్రామాజీవి
కలుపు చట్టాలు పీకేయాలనే రైతుల
గుండెల్లో మేకులు కొట్టి
రాబందు రాజకీయాల రక్తి కట్టించ
కెమరా కన్నులో కన్ను పెట్టి
ఒంటికన్నులో అరచుక్క
కన్నీరు ఒలికించగల నటుడు
ఎన్ని వేషాలు వేసినా
ఎన్ని రూపాలు మార్చినా
చరిత్రలోకి తొంగిచూస్తూ ప్రజలు
అతని నిజస్వరూపాన్ని పోల్చుకుంటున్నారు
నియంతకు చరమగీతం పాడ
ఏక కంఠమవుతున్నారు…
Superb
బాగుంది
చాలా బాగుంది మిత్రమా అభినందనలు మీ డాక్టర్ నెమిలేటి
Excellent depiction of the character. He is certainly a pagativeshgadu6s